అమెజాన్ వ్యాపార సామ్రాజ్యానికి అత్యధిక లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సూరజ్ షా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెజాన్ వ్యాపార సామ్రాజ్యానికి లాభాలు ప్రధానంగా ఏ విభాగం నుంచి వస్తాయి? దాన్ని ఎవరు నడిపిస్తారు?
అమెజాన్ లాభాల్లో అత్యధిక భాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) నుంచే వస్తున్నాయి. ఇటీవలి త్రైమాసికంలో అమెజాన్ లాభాల్లో 70 శాతం ఏడబ్ల్యూఎస్ నుంచే వచ్చాయి. ఏడబ్ల్యూఎస్‌కు సారథి ఆండీ జాసీ.
ఏడబ్ల్యూఎస్ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ సేవలు అందిస్తుంది. ఐటీ మౌలిక సదుపాయాలను సొంతంగా నిర్వహించుకోవడానికి మొగ్గు చూపని కంపెనీలు ఇలాంటి సంస్థల నుంచి ఈ సేవలు పొందుతాయి. ఈ వ్యాపారాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఈ వ్యాపారం వచ్చి 10-15 ఏళ్లు అయ్యింది. ఇది వేగంగా విస్తరిస్తోంది.
ఏడబ్ల్యూఎస్ ప్రారంభంలో ఎయిర్‌బీఎన్‌బీ, డెలివరూ, పింటరెస్ట్ లాంటి స్టార్టప్‌లకు సేవలు అందించిందని, ఇటీవలి సంవత్సరాల్లో పెద్ద సంస్థలు కూడా తమ వినియోగదారుల జాబితాలో చేరాయని బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాసీ తెలిపారు.
ఏడబ్ల్యూఎస్ వ్యాపారం విజయవంతంగా సాగుతున్నప్పటికీ, ఇది కొన్ని కఠిన పరీక్షలనూ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ నుంచి భీకరమైన పోటీ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ప్రభుత్వం-అమెజాన్ వివాదం
అమెరికా ప్రభుత్వం-అమెజాన్ మధ్య సంబంధాలు అంత బాగోలేవు.
రక్షణశాఖకు చెందిన వెయ్యి కోట్ల డాలర్ల భారీ కాంట్రాక్టును అమెరికా ప్రభుత్వం అక్టోబరులో మైక్రోసాప్ట్‌కు కట్టబెట్టింది. ఈ పరిణామంతో అమెజాన్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది.
'జాయింట్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(జేడీ)' అనే ఈ ప్రాజెక్టును ఏడబ్ల్యూఎస్ దక్కించుకోవచ్చని నిపుణులు భావించారు. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్‌కు అప్పగించిందని అమెజాన్ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తోంది.
జేడీ కాంట్రాక్ట్ అప్పగింతలో అమెరికా ప్రభుత్వ తీరును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో వివరిస్తూ ఏడబ్ల్యూఎస్ ఈ నెల్లో ఒక పత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచింది. రక్షణశాఖ బడ్జెట్‌ను అధ్యక్షుడు తన రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవడాన్ని అనుమతించాలా, వద్దా అనేదే తమ ప్రశ్న అని ఇందులో చెప్పింది.
రక్షణశాఖ పెద్ద తప్పు చేసిందని అమెజాన్ విమర్శిస్తోంది. అమెజాన్‌పై అధ్యక్షుడు ట్రంప్ తన అయిష్టతను పదే పదే వ్యక్తంచేశారని, అమెజాన్ పని పట్టాలని ఆయన అన్నారని, ట్రంప్ ప్రభావంతోనే రక్షణశాఖ ఈ నిర్ణయం తీసుకొందని ఆరోపిస్తోంది.
రక్షణశాఖ నిర్ణయం ప్రమాదకరమైనదని జాసీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ సదుపాయాల అత్యుత్తమ వ్యవస్థ అమెజాన్‌కే ఉందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలకు నిష్పాక్షిక మదింపే ప్రాతిపదిక కావాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం చాలా ప్రమాదకరమైన విధానమని ఆందోళన వ్యక్తంచేశారు.
జేడీ ప్రాజెక్ట్ చేజారిన నేపథ్యంలో, ప్రభుత్వంతో ఏడబ్ల్యూఎస్ వ్యవహరించే తీరు మారుతుందా అని అడగ్గా- మారబోదని జాసీ స్పష్టంచేశారు.
మరి అమెరికా ప్రభుత్వం, అమెజాన్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయా? అలా జరగకపోవచ్చని పరిస్థితులు సూచిస్తున్నాయి.
ఎందుకంటే అమెజాన్‌పై తన వ్యతిరేకతను స్వయాన ట్రంపే స్పష్టంగా వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ తనకు వ్యతిరేకమైన పత్రికగా భావించే 'ద వాషింగ్టన్ పోస్ట్', అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నియంత్రణలో ఉండటం దీనికి ఒక కారణం.
మున్ముందు ప్రభుత్వ సంస్థలతో అమెజాన్ మరింతగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడొచ్చు.
పోటీతత్వానికి విరుద్ధమైన రీతిలో వ్యాపారం సాగిస్తోందా అనే విషయమై అమెజాన్ అనేక విచారణలను ఎదుర్కొంటోంది.
అమెజాన్‌పై తన విచారణ పరిధిని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) విస్తరింపజేసిందని, అమెజాన్ ఈ-వాణిజ్య కార్యకలాపాలనే కాకుండా ఏడబ్ల్యూఎస్‌ను దీని పరిధిలోకి తెచ్చేందుకు ఇలా చేసిందని 'బ్లూమ్‌బర్గ్' ఈ నెల్లో ఇంతకుముందు ఒక కథనంలో పేర్కొంది.
క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను తన నుంచి మాత్రమే పొందే కంపెనీలకు ప్రాధాన్యమిస్తూ, తనతోపాటు ఇతర సంస్థల నుంచి ఈ సేవలు పొందే కంపెనీలపై అమెజాన్ వివక్ష చూపిస్తోందా అనేదానిపై ఎఫ్‌టీసీ దర్యాప్తు జరుపుతోందని ఈ కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Amazon
ఫేసియల్ రికగ్నిషన్
అమెజాన్ ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ విక్రయాన్ని అధికార యంత్రాంగం నిశితంగా గమనిస్తోంది. అమెజాన్ ఈ టెక్నాలజీని 'రికగ్నిషన్(Rekognition)' అని పిలుస్తుంది.
ఇది అత్యంత ప్రమాదకరమైన నిఘా టెక్నాలజీ అని పౌరహక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అమెజాన్ ప్రత్యర్థి గూగుల్, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రముఖుల ముఖాల గుర్తింపు వరకే పరిమితం చేసింది. గూగుల్ క్లౌడ్ వ్యాపార విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ థామస్ కురియన్ బీబీసీతో మాట్లాడుతూ- అమెజాన్ 'రికగ్నిషన్' లాంటి శక్తిమంతమైన సేవలను తాము అందించడం లేదని, ఎందుకంటే కొన్ని దేశాల్లో వీటికి చట్టపరమైన అనుమతి లేదని వివరించారు.
ఈ టెక్నాలజీపై జాతీయస్థాయిలో నియంత్రణ విధానం లేకపోవడంతో గందరగోళం నెలకొని ఉందని జాసీ వ్యాఖ్యానించారు.
ప్రజలు చర్చించుకొంటున్న టెక్నాలజీ నియంత్రణకు సంబంధించి జాతీయ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే, 50 రాష్ట్రాల్లో 50 రకాల నిబంధనలు వస్తాయని, మున్సిపాలిటీల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆయన విచారం వ్యక్తంచేశారు.
ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఎన్నో మంచి ప్రయోజనాలకు వాడుతున్నారని జాసీ చెప్పారు.
"ఈ సాంకేతిక పరిజ్ఞానం కనిపించకుండాపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మనుషుల అక్రమ రవాణాను గుర్తించింది. భద్రతను, వ్యక్తులను గుర్తించే విధానాన్ని మెరుగుపరిచింది. సమాజంలో అన్ని రంగాల్లో ఇది ఉపయోగపడుతోంది" అని జాసీ వివరించారు.
ఈ టెక్నాలజీని తీసుకొచ్చి దాదాపు మూడేళ్లవుతోందని, చట్టాన్ని అమలు చేసే సంస్థలు దీనిని దుర్వినియోగం చేశాయనే దృష్టాంతాలేవీ లేవని ఆయన చెప్పారు.
ఈ టెక్నాలజీ వినియోగంపై ఆ సంస్థలకు నిర్దిష్టమైన మార్గనిర్దేశం చేశామని, 99 శాతం లేదా అంతకంటే ఎక్కువ కచ్చితత్వం ఉందనిపిస్తేనే దీనిపై ఆధారపడ్డ అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పామని, దర్యాప్తులో కేవలం ఒక్క ఆధారంగా మాత్రమే దీనిని వాడాలని స్పష్టంచేశామని వివరించారు.
ఈ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తీరును ప్రభుత్వం మరింతగా నియంత్రించాలని, మరింత మార్గనిర్దేశం చేయాలని జాసీ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AWS
వాతావరణ మార్పులు: క్లౌడ్ పాత్ర ఏమిటి?
క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలు డేటాను సొంత డేటా సెంటర్లో నిల్వ చేస్తాయి. ఈ కేంద్రాలకు విద్యుత్ పెద్దయెత్తున అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో దాదాపు రెండు శాతాన్ని ఇవే వాడుతున్నాయి. అంతర్జాతీయ కర్బన ఉద్గారాల్లో డేటా సెంటర్ల వాటా 0.3 శాతంగా ఉందని 'నేచర్' తెలిపింది.
వాతావరణ మార్పుల నియంత్రణకు తాము చర్యలు చేపడతామని అమెజాన్ లోగడ ప్రతినబూనింది. 2014 నాటికి తమ మొత్తం వ్యాపారానికి అవసరమైన ఇంధనంలో 80 శాతాన్ని ప్రత్యామ్నాయ వనరుల నుంచే పొందుతామని హామీ ఇచ్చింది. 2030 నాటికి వంద శాతం ఇంధనాన్ని ప్రత్యామ్నాయ వనరుల నుంచే పొందుతామని చెప్పింది.
భూమి భవిష్యత్తు, భావితరాలకు భూమిని నివాసయోగ్యంగా ఉంచేందుకు పర్యావరణాన్ని పరిరక్షించాల్సి ఉందని జాసీ చెప్పారు. ఈ దిశగా అమెజాన్ చాలా పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొందని తెలిపారు.
తమ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను నడిపించే ఏడబ్ల్యూఎస్ యూరోపియన్ డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తాము అందిస్తామని బీపీ(బ్రిటిష్ పెట్రోలియం) గత వారం ప్రకటించింది.
చమురు సంస్థలైన బీపీ, షెల్- ఏడబ్ల్యూఎస్ వినియోగదారులు. వీటికి అమెజాన్ సేవలు అందించడంపై విమర్శలు వస్తున్నాయి. అమెజాన్ ఉద్యోగులూ విమర్శలు చేశారు. చమురు పరిశ్రమతో కలసి పనిచేయొద్దనే లేఖపై ఏప్రిల్లో వేల మంది అమెజాన్ ఉద్యోగులు సంతకాలు చేశారు.
భూగోళం వేడెక్కడానికి కార్యకలాపాలకు వీలు కల్పించేది క్లౌడ్ కంప్యూటింగ్ కాదని జాసీ వ్యాఖ్యానించారు. క్లౌడ్ ప్రొవైడర్లు ఇంధన కంపెనీలకు సేవలు నిలిపివేస్తే, వారి ప్రస్తుత కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోవని చెప్పారు. చమురు సంస్థల ఐటీ మౌలిక సదుపాయాలతో పోలిస్తే వాటి క్లౌడ్ కంప్యూటింగ్‌కు తక్కువ విద్యుత్ ఖర్చవుతుందన్నారు. తాము పరిష్కారంలో భాగం కావాలనుకుంటామని జాసీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరుగుతోంది?
- బోరిస్ జాన్సన్: ఒక జర్నలిస్టు.. బ్రిటన్ ప్రధాని ఎలా అయ్యారు?
- మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?
- స్టాకర్వేర్: భార్యాభర్తల పరస్పర నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- వెంకీమామ సినిమా రివ్యూ: వెంకటేష్, నాగచైతన్య కలిసి హిట్టు కొట్టారా?
- మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








