అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు

తాలిబాన్ విదేశాంగ మంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ సమాజంతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నట్లు తాలిబాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టఖి చెప్పారు

అమెరికా, తాలిబాన్ నాయకుల మధ్య దోహాలో జరిగిన సమావేశం ముగిసింది. అఫ్గానిస్తాన్ నుంచి ఆగస్టులో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత ఇరు దేశాల నాయకులు ప్రత్యక్షంగా భేటీ కావడం ఇదే తొలిసారి.

దోహా రాజధాని ఖతార్‌లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా పౌరుల తరలింపు, మానవతా సహాయం, తీవ్రవాదం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

ఈ చర్చలు 'సూటిగా, నిజాయతీగా, ప్రొఫెషనల్'గా జరిగాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు.

'తాలిబాన్లను అధికారికంగా గుర్తించడం' కోసం ఈ సమావేశం జరగలేదని అమెరికా స్పష్టం చేసింది.

వీడియో క్యాప్షన్, తాలిబాన్లు నల్లమందు సాగుతో వేల కోట్లు సంపాదిస్తున్నారా?

''అఫ్గానిస్తాన్‌కు మానవతా సహాయం అందించడం ప్రారంభించేందుకు అమెరికా అంగీకరించింది'' అని ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తాలిబాన్లు చెప్పారు.

''అఫ్గాన్లకు మానవతా సహాయం అందిస్తామని యూఎస్ ప్రతినిధులు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు వీలుగా... దేశంలోని ఇతర స్వచ్ఛంద సంస్థల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు వారు ముందుకు వచ్చారు''

''అర్హులైన అందరికీ మానవతా సహాయం అందించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలకు అమెరికా సహకారం అందిస్తుంది. విదేశీయలకు కూడా సహకరించనుంది'' అని తాలిబాన్లు పేర్కొన్నారు.

కానీ, ఈ అంశాలను అమెరికా ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

''అఫ్గాన్ ప్రజలకు, బలమైన మానవతా సహాయం అందించే అంశంపై ఇరు వర్గాలు చర్చించాయి'' అని అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఆయన సమావేశానికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు.

''అమెరికా ప్రతినిధుల బృందం... సెక్యూరిటీ-టెర్రరిజం ఆందోళనలు, అమెరికా పౌరులతో పాటు ఇతర విదేశీయుల సురక్షిత తరలింపు మార్గాలు, అమెరికాతో సంబంధాలున్న అఫ్గాన్ భాగస్వాముల రక్షణ, మానవ హక్కులు, అఫ్గాన్ సమాజంలో బాలికలు, మహిళల ప్రాతినిధ్యంపై సమావేశం దృష్టి సారించింది'' అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: ఐసిస్-కె ఏంటి? ఇది ఎందుకంత హింసాత్మకమైంది?

ఖోరాసన్ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్‌ను ఎదుర్కోవడంలో వాషింగ్టన్ సహకారం అవసరం లేదని తాలిబాన్లు చెప్పారు.

''మా ప్రభుత్వం స్వతంత్రంగా డాయేష్ గ్రూపులను సమర్థంగా ఎదుర్కొంది'' అని అసోసియేటెడ్ ప్రెస్‌తో ఖతర్‌లోని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు.

అఫ్గానిస్తాన్‌కు ఉత్తరాదిన ఉన్న కుందుజ్ నగరంలోని మసీదుపై, శుక్రవారం, ఐఎస్‌ఐఎస్-కె ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడటంతో కనీసం 50 మంది మరణించారు. అమెరికా బలగాలు, అఫ్గాన్ నుంచి వెళ్లిపోయాక జరిగిన తొలి దాడి ఇదే. ఈ సందర్భంగానే షాహిన్‌ పై విధంగా స్పందించారు.

అఫ్గాన్‌లో మైనారిటీ వర్గమైన 'షియా' కమ్యూనిటీ ఉపయోగించే ఈ అబాద్ మసీదుపై జరిగిన దాడిలో 100 మందికి పైగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)