అఫ్గానిస్తాన్: తాలిబాన్ల మొదటి నెల పాలన ఎలా ఉంది?

- రచయిత, సికందర్ కిర్మానీ
- హోదా, బీబీసీ న్యూస్, మజార్-ఈ-షరీఫ్
ఉజ్బెకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్ సరిహద్దు దగ్గర వంతెన మీదుగా కొత్త "ఇస్లామిక్ ఎమిరేట్"లోకి కార్గో రైలు దూసుకెళ్లింది. తాలిబాన్ తెలుపు, నలుపు జెండా, ఉజ్బెక్ జెండా పక్కనే రెపరెపలాడుతోంది. కొంతమంది వ్యాపారులు తాలిబాన్‌లు తిరిగి అధికారంలోకి రావడాన్ని స్వాగతించారు.
గతంలో చెక్ పాయింట్‌లు దాటినప్పుడల్లా అవినీతిపరులైన పోలీసు అధికారులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని గోధుమలను తీసుకెళ్తున్న ట్రక్కు డ్రైవర్ నాతో చెప్పారు.
"ఇప్పుడు, అలా కాదు. ఒక్క పైసా కూడా చెల్లించకుండానే, నేను కాబుల్ వరకు డ్రైవ్ చేయగలను" అని ఆ ట్రక్ డ్రైవర్ వివరించారు.
అఫ్గానిస్తాన్ తాలిబాన్ ఆధీనంలోకి వచ్చి సరిగ్గా ఒక నెల అవుతుంది. ఇప్పుడు అఫ్గాన్ వ్యాప్తంగా నగదు కొరత ఉంది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
దిగుమతిదారులు కొత్త వస్తువుల దిగుమతికి డబ్బు చెల్లించే స్థితిలో లేకపోవడంతో వాణిజ్యం గణనీయంగా పడిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు.
వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి తాలిబాన్ ప్రభుత్వం సుంకం రేట్లను తగ్గిస్తున్నట్లు, సంపన్న వ్యాపారులు దేశానికి తిరిగి వచ్చేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు హైరతాన్ పోర్టులో తాలిబాన్ కస్టమ్స్ హెడ్ మౌల్వీ సయీద్ మాతో చెప్పారు.
"దీనివల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఈ మేలు చేసినందుకు, వ్యాపారవేత్తలకు మరణానంతరం కూడా భగవంతుడి కృప ఉంటుంది" అని ఆయన చెప్పారు.
అక్కడి నుంచి ఒక గంట ప్రయాణిస్తే మజార్-ఎ-షరీఫ్ వస్తుంది. ఇది దేశంలో నాలుగో అతిపెద్ద నగరం. ఇక్కడ నివసిస్తున్న వారి జీవితం సాధారణంగానే కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నా, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు.
నగరానికి సాంస్కృతిక కేంద్రం లాంటి బ్లూ మసీదు వైపు వెళ్లాను. తాలిబాన్ల స్వాధీనాని కంటే కాస్త ముందు, ఆగస్టులో చివరిసారి ఇక్కడికి వచ్చాను. అప్పట్లో, ఖాళీ ప్రదేశాల్లో యువతీ యువకులు సెల్ఫీలకు ఫోజులివ్వడం కనిపించేది.

నిబంధనలు అమలు
ఇప్పుడు మాత్రం తాలిబాన్లు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక సందర్శన సమయాలను కేటాయించారు. మహిళలు ఉదయం, పురుషులు రోజులో ఖాళీ సమయాల్లో రావచ్చు. మేం ఇక్కడికి చేరుకున్నప్పుడు, చాలా మంది మహిళలు కనిపించారు. కానీ మునుపటితో పోల్చితే వీరి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
"అంతా బాగానే ఉంది. కానీ కొత్త ప్రభుత్వానికి అలవాటు పడటానికి ప్రజలకు ఇంకాస్తా సమయం కావాలి" అని ఓ మహిళ అన్నారు.
నేను ఈ ప్రాంతంలో కీలకమైన తాలిబాన్ నాయకుడు హాజీ హెక్మత్‌ను కలుసుకున్నాను. "మీరు భద్రతను కల్పించవచ్చు. కానీ, విమర్శకులు మీరు ఇక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నారని అంటున్నారు"అని అన్నాను.
"లేదు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం గత 20 ఏళ్లుగా ఇక్కడ ఉంది. అఫ్గానిస్తాన్ నియంత్రణ ఒక విదేశం చేతి నుండి మరొక దేశానికి మారి 40 సంవత్సరాలు వారి చేతిలో ఉంది. మేం మా సొంత సంప్రదాయాలు, విలువలను కోల్పోయాం. మేం మా సంస్కృతిని తిరిగి తీసుకువస్తున్నాం" అని ఆయన గట్టిగా సమాధానమిచ్చారు.
ఇస్లాం గురించి ఆయనకున్న అవగాహన ప్రకారం, పురుషులు, మహిళలు కలిసి పని చేయడం నిషేధం.

ప్రజలు నమ్ముతున్నారా?
ప్రజల మద్దతును తాలిబాన్లు ఆనందిస్తారని హాజీ హెక్మత్ నిజాయితీగా అంగీకరించినట్టు కనిపిస్తోంది. అయితే, ఆయనకు వినిపించకుండా ఓ మహిళా సందర్శకురాలు తన సహోద్యోగితో, "వీళ్లు మంచి వ్యక్తులు కాదు" అని గుసగుసలాడారు.
ఇస్లాం గురించి తాలిబాన్లు ఇచ్చే వివరణకు గ్రామీణ ప్రాంతాలలో పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చు. కానీ అఫ్గాన్ పెద్ద నగరాలలో, చాలా మంది ప్రజలకు తాలిబాన్లపై అనుమానాలు ఉన్నాయి.
హాజీ హెక్మత్ ఈ ఆరోపణ కొన్నేళ్లుగా జరుగుతున్న దుష్ప్రచారమని కొట్టిపారేశారు. కానీ పట్టణ ప్రాంతాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు, హత్యల చరిత్ర కూడా ఈ అనుమానం తలెత్తడానికి కారణమే.
మేం బ్లూ మసీదుకు దూరంగా వెళ్లాక, ప్రధాన రహదారి వద్ద ఉత్సాహంగా ఉన్న భారీ జన సమూహాన్నిచూశాం. బుల్లెట్ గాయాలతో ఉన్న నాలుగు మృతదేహాలను అక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఒకరిపై ఒక చిన్న నోట్ ఉంది. అది వారు కిడ్నాపర్లని చెబుతోంది. ఇతర నేరస్తులకు ఇలాంటి శిక్షే ఉంటుందని అది హెచ్చరించింది.
మండుతున్న ఎండలో మృతదేహాల నుంచి వాసన వస్తున్నప్పటికీ, అక్కడి వారు వాటితో ఫొటోలు దిగడానికి ప్రయత్నిస్తున్నారు. అఫ్గానిస్తాన్ పెద్ద నగరాలలో హింసాత్మక నేరాలు చాలా కాలంగా ఓ ప్రధాన సమస్యగా ఉన్నాయి. విమర్శకులు సైతం భద్రతను మెరుగుపరిచినందుకు తాలిబాన్లను పొగుడుతున్నారు.
"వారు కిడ్నాపర్లు అయితే అలా చేయడం మంచిదే. ఇది నేరస్తులకు ఒక గుణపాఠం అవుతుంది" అని గుంపులోని ఒక వ్యక్తి మాతో అన్నారు.
కానీ నగరంలో చాలా మంది సురక్షితంగా లేరు. "నేను నా ఇంటి నుండి బయటకు వచ్చిన ప్రతిసారీ, తాలిబాన్లను చూసినప్పుడు, భయంతో వణికిపోతాను" అని న్యాయ విద్యార్థిని ఫర్జానా అన్నారు.

కో ఎడ్యుకేషన్‌లో నిబంధనల తెరలు
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తెరిచే ఉన్నాయి. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నవి ప్రస్తుతానికి మూసివేశారు. తాలిబాన్ల పాలనలో, ఒకే తరగతి గదిలో చదువుతున్న యువతి, యువకుల మధ్య తప్పనిసరిగా కర్టన్ అడ్డు ఉండాలి.
ఫర్జానాకు అది ప్రాధాన్యత కాదు. తాలిబాన్లు మహిళలను పని చేయడానికి అనుమతించకపోవచ్చని ఆమె ఆందోళన చెందుతున్నారు. దీన్ని తాలిబాన్లు ఇప్పటికే ఖండించారు.
అయితే, ప్రస్తుతానికి, అఫ్గానిస్తాన్‌లో టీచర్లు లేదా డాక్టర్లుగా పని చేస్తున్న మహిళలు మినహా మిగతా వారందరూ భద్రత కోసం ఇంట్లోనే ఉండాలని సూచనలిచ్చారు.
"ప్రస్తుతం నేను నిస్సహాయురాలిని" అని ఫర్జానా అన్నారు."అయితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉండటానికి నేను నా వంతు కృషి చేస్తున్నాను" అన్నారామె.
చివరిసారిగా తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతాని కంటే చాలా నిర్బంధ చర్యలను ప్రవేశపెట్టారు.
ఉదాహరణకు మగ తోడు లేకుండా మహిళలు ఇంటి నుండి బయటకు రాకుండా నిషేధించారు. ఇలాంటి చట్టాలు మళ్లీ వస్తాయని ఈ రోజు అఫ్గాన్ ప్రధాన నగరాలు చాలా భయపడుతున్నాయి.
తాలిబాన్లు దేశంపై గట్టి పట్టు సంపాదించినా వారు అఫ్గాన్ల హృదయాలను గెలుచుకోవాల్సి ఉంది.
"దేశాన్ని సైనికపరంగా స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం. అయితే చట్టాలను అమలు చేయడం, వాటిని పరిరక్షించడం మరింత కష్టం" అని హాజీ హెక్మత్ అంగీకరించారు.
( మాలిక్ ముదాసిర్, షామ్స్ అహ్మద్జాయ్ అదనపు సమాచారం అందించారు.)
ఇవి కూడా చదవండి:
- భారత్‌లోనే అత్యంత ఘాటైన రాజా మిర్చి కథ ఇది
- సాంబారు పుట్టినిల్లు తమిళనాడా.. మహారాష్ట్రా
- భారత్‌లో పోషకాహార లోపం పెరుగుతోంది... ఎందుకు?
- తాటితాండ్ర, తాటిగారెలు ఎలా తయారు చేస్తారు?
- బెల్లం: ఆహారమా... ఔషధమా
- ఒక్క భోజనం 40 వేల రూపాయలు.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు... ఏంటి దీని ప్రత్యేకత
- తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'
- ‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్.. చనిపోయే దాకా ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతానంటున్న కమలాత్తాళ్
- బ్రిటన్‌లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ
- 'ఈ నత్తలను తింటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది... చలికాలం పున్నమి రోజుల్లో మాత్రమే వీటిని వేటాడాలి'
- ఆహారం వృథా: ఏటా 90 కోట్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








