అఫ్గానిస్తాన్‌: 'తాలిబాన్ల కొత్త ప్రభుత్వంతో పాక్‌కు విజయం, భారత్‌కు ఎదురుదెబ్బ' అంటున్న నిపుణులు

హిబ్తుల్లా అఖుంద్‌జాదా

ఫొటో సోర్స్, AFGHAN ISLAMIC PRESS

ఫొటో క్యాప్షన్, హిబ్తుల్లా అఖుంద్‌జాదా

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తమ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. దీనిపై పాకిస్తాన్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

‌అతివాద భావజాలమున్న రహ్‌బరీ-షురా కౌన్సిల్ అధినేత ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్‌ను ప్రధానమంత్రిగా తాలిబాన్లు ప్రకటించారు.

2001లో బామియాన్‌లో బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేయించింది ఈ మొహమ్మద్ హసనే. ఖతార్‌లో ఏర్పాటుచేసిన తాలిబాన్ల రాజకీయ కార్యాలయ అధిపతి అబ్దుల్ ఘనీ బరాదర్‌.. కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు బరాదర్ స్థానంలో మొహమ్మద్ హసన్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ప్రధానమంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలనే విషయంలో తాలిబాన్లలో మొదట ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ అధిపతి జనరల్ ఫైజ్ హమీద్ మూడు రోజులు కాబుల్‌లోనే ఉండి చర్చలు జరిపారు. అనంతరం కొత్త పాలక వర్గాన్ని తాలిబాన్ ప్రకటించింది.

తాలిబాన్ల ప్రకటన వెలువడిన వెంటనే, భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ ట్విటర్ వేదికగా స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘తాలిబాన్ల కొత్త ప్రభుత్వాన్ని.. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా గుర్తించిన, బామియాన్‌లో బుద్ధుడి విగ్రహాలను కూలదోసిన వ్యక్తి నడిపించబోతున్నాడు. మరోవైపు హోంమంత్రిగా కరడుగట్టిన హక్కానీ నెట్‌వర్క్‌ అధినేత సిరాజుద్దీన్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఎవరో తాలిబాన్లు మారిపోయారని చెప్పారు..’’ అని ఆయన ట్వీట్ చేశారు.

2020 సెప్టెంబరులో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో బరాదర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 సెప్టెంబరులో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో బరాదర్

భారత్‌కు ఎందుకు ఎదురుదెబ్బ?

తాలిబాన్ కొత్త ప్రభుత్వంపై పాకిస్తాన్ సైన్యం ప్రభావం గురించి ద ఇండియన్ ఇక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.

‘‘తాలిబాన్ కొత్త క్యాబినెట్‌లో కాందహార్‌కు చెందిన తాలిబాన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ల ఆధిపత్యం కనిపిస్తోంది. భారత్‌తోపాటు అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు జరిపిన, దోహా కేంద్రంగా పనిచేసిన తాలిబాన్లను పక్కన పెట్టేశారు. మొత్తంగా 33 మందివున్న క్యాబినెట్‌లో 20 మంది వరకు కాందహార్ తాలిబాన్లు, హక్కానీ నెట్‌వర్క్ ప్రతినిధులే ఉన్నారు’’ అని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

భారత్ ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, అఫ్గాన్ హోంమంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీ నియామకం.

అఫ్గాన్ కొత్త క్యాబినెట్‌పై పాకిస్తాన్ పత్రిక ‘‘ఇంటర్నేషనల్ ద న్యూస్’’ జర్నలిస్టు జియావుర్ రెహ్మాన్ ఒక ట్వీట్ చేశారు.

‘‘అఫ్గాన్ కొత్త క్యాబినెట్‌లో ఆరుగురు మంత్రులు పాకిస్తాన్‌లోని జామియా హక్కానియా సెమినరీ (అకోరా ఖట్టక్)‌లో చదువుకున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ప్రియతమ నాయకుల్లో సిరాజుద్దీన్ హక్కానీ ఒకరు. హక్కానీ నెట్‌వర్క్ అధిపతి అయిన సిరాజుద్దీన్‌పై 2008లో కాబుల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. 2009-10 మధ్య కాలంలో భారతీయులు, భారతీయుల సదుపాయాలపైనా హక్కానీ నెట్‌వర్క్ దాడులు చేసింది.

ప్రస్తుతం అఫ్గాన్ ప్రభుత్వంలో హక్కానీ నాయకులకు ముఖ్యమైన పదవులు దక్కడం భారత్‌కు ఎదురుదెబ్బగా నిపుణులు చెబుతున్నారు.

పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ అధిపతి జనరల్ ఫైజ్ హమీద్

ఫొటో సోర్స్, BBC URDU

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ అధిపతి జనరల్ ఫైజ్ హమీద్

ఇది పాక్ విజయమా?

అఫ్గాన్ భద్రతా వ్యవహారాలను చూసుకునేది హోంమంత్రే. అంటే సిరాజుద్దీన్ హక్కానీనే. అంతేకాదు 34 ప్రావిన్స్‌లకు గవర్నర్లను కూడా ఈయనే నియమిస్తారు. అంటే ప్రావిన్స్‌ల గవర్నర్ల నియామకాల్లో ఐఎస్ఐకి కూడా పాత్ర ఉండబోతోంది. దీన్ని భారత్‌కు ఎదురుదెబ్బగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

సిరాజుద్దీన్ హక్కానీ పేరు ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఉంది. సిరాజుద్దీన్‌ను పట్టించేవారికి 5 మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. కాబుల్‌లోని ఓ హోటల్‌పై 2008లో జరిగిన దాడిలో సిరాజుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఆ దాడిలో ఒక అమెరికా పౌరుడు సహా ఆరుగురు మరణించారు. 2008లో అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్‌పై దాడి ఘటనలోనూ సిరాజుద్దీన్ పాత్ర ఉందని ఎఫ్‌బీఐ భావిస్తోంది.

మరోవైపు కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోబోయే ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ పేరు కూడా ఐరాస ఉగ్రవాదుల జాబితాలో ఉంది. కాందహార్‌కు చెందిన హసన్.. తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరు.

అతివాద సంస్థ రహ్‌బరీ-షురాకు 20ఏళ్లు అతను అధినేతగా పనిచేశాడు. తాలిబాన్ ప్రధాన నాయకుడు ముల్లా హిబ్తుల్లా అఖుండ్ జాదాకు ఇతడు సన్నిహితుడు. 1996 నుంచి 2001 మధ్య తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇతడు విదేశాంగ మంత్రిగా పనిచేశాడు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

'ముల్లా బరాదర్‌ను పాక్ నమ్మదు'

ముల్లా హసన్ తర్వాత ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది ముల్లా బరాదర్‌కే. ఉజ్బెక్ తెగకు చెందిన అబ్బుల్ సలాం హనఫీకి కూడా డిప్యూటీ ప్రధానమంత్రి పదవి దక్కింది.

తాలిబాన్‌ను స్థాపించిన వారిలో ముల్లా బరాదర్ ఒకరు. 2010లో కరాచీలో ఈయన్ను పాక్ గూఢచర్య సంస్థ అరెస్టు చేసింది.

అమెరికా సూచనలపై 2018లో బరాదర్‌ను జైలు నుంచి విడుదల చేశారు. ఆయన 2019 నుంచి ఖతార్‌లో ఏర్పాటు చేసిన తాలిబాన్ రాజకీయ కార్యాలయాల వ్యవహారాలను పర్యవేక్షించాడు. మార్చి 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడాడు. ఈ విషయాన్ని ఇటీవల ట్రంప్ కూడా అంగీకరించారు.

కొత్త ప్రభుత్వానికి ముల్లా బరాదర్ నేతృత్వం వహిస్తారని అంతా అనుకున్నారు. అయితే, ఆయనపై పాకిస్తాన్‌కు అంత నమ్మకం లేదు.

33 మంది సభ్యులున్న కొత్త క్యాబినెట్‌లో కేవలం ముగ్గురు మాత్రమే పష్తోన్‌యేతర నాయకులు ఉన్నారు. మరోవైపు ఇరాన్ తరహాలానే తాలిబాన్ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. అఫ్గాన్ అత్యున్నత నాయకుడిగా హిబ్తుల్లా అఖుండ్ జాదాను నియమించనున్నారు. తాజా క్యాబినెట్ నియామకాలపై ప్రకటన అనంతరం.. అఫ్గానిస్తాన్‌ను ఇస్లామిక్, షరియా చట్టాల ఆధారంగా నడిపిస్తామని అఖుండ్ జాదా తెలిపారు.

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

తాలిబాన్లు మారలేదా?

‘‘తాలిబాన్ ప్రభుత్వంలో 33 మంది ముల్లాలు ఉన్నారు. వీరిలో నలుగురిపై అమెరికా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఒక్క మహిళకు కూడా క్యాబినెట్‌లో చోటు కల్పించలేదు. ముల్లా ఒమర్ కుమారుడిని రక్షణ మంత్రిని చేశారు. ఎవరో చెప్పారు తాలిబాన్లు మారిపోయారని.. ఇదేనా ఆ మార్పు?’’అని సండే టైమ్స్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్రిస్టీనా లాంబ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు రక్షణ వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సారిన్ కూడా దీనిపై స్పందించారు.

‘‘ఉగ్రవాదంపై పోరాటం విషయంలో మోస్ట్ వాంటెడ్ సిరాజుద్దీన్ హక్కానీతో ఎఫ్‌బీఐ ఎలా కలిసి పనిచేస్తుందో చూడాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

సుశాంత్ ట్వీట్‌ను భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ రీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘‘నిజమే, ఉగ్రవాదంపై పోరాటంలో ఆయనతో ఎఫ్‌బీఐ ఎలా కలిసి పనిచేస్తుంది? ఎందుకంటే అతడి తలపైనే ఎఫ్‌బీఐ 5 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది. ఇది అమెరికా, బ్రిటన్‌లకు ఎదురుదెబ్బ లాంటిది. ఈ నియామకాలను ఐఎస్‌ఐ చేపట్టింది. తాలిబాన్లు మారారన్న మాట పచ్చి అబద్ధం’’ అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)