‘పంజ్‌షీర్ పోరాటంపై డ్రోన్లతో దాడి’.. పాకిస్తాన్‌ను ఇరాన్ ఎందుకు నిందిస్తోంది?

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ తర్వాత, పంజ్‌షీర్‌లో జరుగుతున్న యుద్ధంపై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
నేరుగా పాకిస్తాన్ పేరు ప్రస్తావించని ఇరాన్, అది విదేశీ భూభాగంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది.
నిజానికి ఇదంతా పంజ్‌షీర్ ప్రావిన్సులో తాలిబాన్, నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మొదలైంది.
తాలిబాన్ అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత, దేశంలో వారు ఇప్పటివరకూ పట్టు సాధించలేకపోయిన ఏకైక ప్రాంతం పంజ్ షీర్ మాత్రమే.
కానీ, తాము పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పుడు తాలిబాన్లు చెబుతున్నారు.
ఎన్ఆర్ఎఫ్ మాత్రం చాలా ప్రాంతాల్లో తాము ఇప్పటికీ ఎదురు నిలిచి పోరాడుతున్నామని చెబుతోంది.
మరోవైపు, పంజ్‌షీర్ యుద్ధంలో తాలిబాన్లకు పాకిస్తాన్ సాయం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
ఆదివారం అర్థరాత్రి పంజ్‌షీర్‌లో వైమానిక దాడులు జరిగాయని, దాడులు జరిపిన వాటిలో పాకిస్తాన్ డ్రోన్లు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, చాలా రిపోర్టుల్లో చెబుతున్నారు.

ఫొటో సోర్స్, IRAN FOREIGN MINISTRY
ఇరాన్ ఏమంటోంది?
ఈ ఆరోపణలు బయటికి రావడంతో ఇరాన్ మౌనం వీడింది. పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా తాము దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.
సోమవారం జరిగిన ఇరాన్ విదేశాంగ శాఖ వీక్లీ ప్రెస్ కాన్ఫరెన్సులో ఆ దేశ ప్రతినిధి సయీద్ ఖతీబ్‌జాదేహ్ ఆరోపిత డ్రోన్ దాడులను ఖండించారు.
"రాత్రి జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చెప్పినట్లు ఈ యుద్ధంలో విదేశీ జోక్యంపై కచ్చితంగా దర్యాప్తు జరగాలి" అని ఆయన ఒక విలేఖరి ప్రశ్నకు బదులిచ్చారు.
ఇంట్రా-అఫ్గాన్ చర్చలకు డిమాండ్ చేసిన ఆయన అంతర్జాతీయ చట్టాల ప్రకారం తాలిబాన్లు తమ బాధ్యతలు నిర్వహించాలని కోరారు.
"పంజ్‌షీర్ ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు, వారికి విద్యుత్, నీటి సరఫరా కట్ చేశారు. నిర్బంధిస్తున్నారు" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వివరణ ఇచ్చిన పాకిస్తాన్
తాము డ్రోన్ దాడులు చేశామని వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ ఆర్మీ సోమవారం స్పందించింది. అఫ్గానిస్తాన్ అంతర్గత అంశాలకూ తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
"అది పంజ్‌షీర్ అయినా, వేరే ఏ ప్రాంతం అయినా అఫ్గానిస్తాన్‌లో జరిగే ఏ ఘటనతోనూ పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు" అని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు.
సోషల్ మీడియాలో పంజ్‌షీర్ యుద్ధంలో పాకిస్తాన్ పాత్ర ఉందంటూ చెబుతున్న వాటిని ఆయన వదంతులుగా కొట్టిపారేశారు.
"ఇది పూర్తిగా అవాస్తవం, అర్థంలేని భారత్ ప్రాపగాండా. పాకిస్తాన్ దగ్గర సుదూర ప్రాంతాల్లో దాడులు జరిపే డ్రోన్ టెక్నాలజీ లేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
పాకిస్తాన్‌ను ఎందుకు లక్ష్యం చేసుకుంది
అఫ్గానిస్తాన్‌లో మారుతున్న పరిస్థితులపై మొత్తం ప్రపంచమంతా కన్నేసి ఉంచింది. ముఖ్యంగా ఆ దేశంతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్‌తో వారికి సన్నిహత సంబంధాలు ఉంటాయని, పాకిస్తాన్ దానికి చాలా ప్రయత్నాలు చేస్తోందని భావిస్తున్నారు.
ఇటీవల పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ చీఫ్ ఫైజ్ హమీద్ కాబుల్ వచ్చారు. తాలిబాన్ రాజకీయ చీఫ్ ముల్లా బరాదర్‌ను కూడా కలిసి చర్చలు జరిపారు.
మరోవైపు తాలిబాన్ వచ్చిన తర్వాత ఇరాన్ కూడా అఫ్గానిస్తాన్‌పై పట్టు సాధించాలని చూస్తోంది.
రెండు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ గ్యాస్, చమురు ఇరాన్ నుంచే కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇరాన్ ఆ దేశానికి చమురు, గ్యాస్ సరఫరా చేస్తోంది.
అందుకే అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అది తాలిబాన్ల గురించి నేరుగా ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
ఇప్పుడు పంజ్‌షీర్ యుద్ధం విషయంలో కూడా అది నేరుగా తాలిబాన్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పాకిస్తాన్‌ను మాత్రమే తన లక్ష్యంగా చేసుకుంది.

ఫొటో సోర్స్, Reuters
ఆ దేశంలో జాతి సమూహాలే కారణమా
ఇరాన్ విదేశాంగ శాఖ వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సన్ అమిర్ అబ్దుల్లాహియాన్ శనివారం అఫ్గానిస్తాన్ మాజీ సీఈఓ అబ్దుల్లా అబ్దుల్లాతో మాట్లాడారు.
అఫ్గానిస్తాన్‌లోని వివిధ జాతులు, వర్గాలకు స్థానం కల్పించేలా సమీకృత ప్రభుత్వ ఏర్పాటుపై కూడా ఆయన చర్చించారు.
ఇరాన్ అక్కడ ఉన్న వివిధ జాతుల గురించి ఎందుకు అంత గట్టిగా చెబుతోందంటే, అఫ్గానిస్తాన్‌లోని నాలుగు కోట్ల జనాభాలో రెండో అతిపెద్ద జాతి తజిక్‌లదే. వారు దేశ జనాభాలో 25 శాతానికి పైనే ఉన్నారు.
తజిక్ ప్రజలు ఇరాన్ మూలాలు ఉన్నవారు. వారి భాష దరి. అది ఫార్శీకి చెందిన ఒక మాండలికం.
పంజ్‌షీర్, హేరాత్ మిగతా ఉత్తర ప్రాంతాలను తజిక్ సమాజం వారికి పట్టున్న ప్రాంతాలుగా చెబుతారు.
పంజ్‌షీర్ కూడా తజిక్ సమాజానికి పట్టున్న ప్రాంతం కావడంతో ఇరాన్.. పాకిస్తాన్ మీద ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు అప్గానిస్తాన్ పట్ల ఇరాన్ విధానంలో ఎలాంటి మార్పూ రాలేదని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
"పంజ్‌షీర్‌లో దాడుల గురించి ఇరాన్ చాలా ఆందోళనకు గురవుతోంది. కానీ, అఫ్గానిస్తాన్ పట్ల ఇరాన్ విధానం స్థిరంగా ఉంది" అని అల్ జజీరా సెంటర్ ఫర్ స్టడీస్ విశ్లేషకులు అలీ అక్బర్ దౌరానీ చెప్పారు.
"తాలిబాన్లు ఏం చేస్తారు, వారు తమ మాటకు ఎంత కట్టుబడి ఉంటారు అనేదానిపై ఇరాన్ ఇక ముందు ఏం చేస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది" అని ఆయన అన్నారు.
"ఇరాన్ భద్రత, రాజకీయ ప్రయోజనాలు ప్రమాదంలో పడితే ఇరాన్ చాలా భిన్నంగా, బలంగా దానికి సమాధానం ఇస్తుంది" అని కూడా దౌరానీ తెలిపారు.
"కానీ, తాలిబాన్లు తమ మాటకు కట్టుబడి ఉన్నంతవరకూ ఇరాన్ సైనిక చర్యలకు బదులు రాజకీయ చర్చలకే ప్రాధాన్యం ఇస్తుంది".
అయితే, పాకిస్తాన్‌తో పోలిస్తే అఫ్గానిస్తాన్‌కు దగ్గరవడానికి ఇరాన్ ఎలా ప్రయత్నిస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.
(కాపీ-మొహమ్మద్ షాహిద్)
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












