తాలిబాన్ ప్రతినిధితో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ: ‘కశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపిస్తాం’

ఫొటో సోర్స్, SERGEI SAVOSTYANOV\TASS VIA GETTY IMAGES
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్ముకశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపించే హక్కు తమకు ఉందని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ అన్నారు.
బీబీసీకి జూమ్‌లో వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన సుహైల్ షాహీన్ అమెరికాతో జరిగిన దోహా ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ఏ దేశానికి వ్యతిరేకంగానైనా సాయుధ ఆపరేషన్లు నిర్వహించడం తమ విధానంలో భాగం కాదన్నారు.
"ఒక ముస్లింగా భారత్‌లోని కశ్మీర్ లేదా ఇతర దేశాల్లో ఉంటున్న ముస్లింల కోసం గళం వినిపించే హక్కు మాకు ఉంది" అని దోహా నుంచి మాట్లాడిన షాహీన్ అన్నారు.
"మేం మా గళం వినిపిస్తాం. ముస్లింలు మీ వారే, మీ దేశ పౌరులే, మీ చట్టం ప్రకారం వారు కూడా సమానమేనని చెబుతాం" అని ఆయన అన్నారు.
భారత్ కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో పతాక శీర్షికల్లో నిలుస్తోంది. 2014 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనాకాలంలో ముస్లింలపై విద్వేషాలు పెరిగాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కానీ బీజేపీ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.
జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు చేయాలనే భారత నిర్ణయం, దానిని అమలు చేసిన విధానంపై అక్కడ ఉంటున్న చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య వివాదాలకు గత నాలుగు దశాబ్దాలుగా కశ్మీర్ కేంద్రంగా మారింది. ఇప్పుడు పాకిస్తాన్ మద్దతున్న తాలిబాన్ అఫ్గానిస్తాన్‌పై నియంత్రణ సాధించడంతో తాలిబాన్‌లోని కొన్ని వర్గాల దృష్టి జమ్ము కశ్మీర్ మీద పడవచ్చని, వారికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తుల మద్దతు లభించవచ్చని భారత్‌లో చాలామంది భపడుతున్నారు.
పాకిస్తాన్ టీవీలో జరిగిన చర్చకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు జోరుగా షేర్ అవుతోంది. అందులో పాకిస్తాన్ అధికార పార్టీ పీటీఐ ప్రతినిధి నీలమ్ ఇర్షాద్ షేఖ్ "తాలిబాన్ మాకు అండగా ఉన్నారు, కశ్మీర్(విముక్తి కోసం) కోసం వారు మాకు సాయం చేస్తారు" అని చెప్పడం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, SERGEI SAVOSTYANOV\TASS VIA GETTY IMAGES
భారత్ కష్టాలు పెరుగుతాయా
అమెరికా నేతృత్వంలో దళాలు 2001లో తాలిబాన్‌ను అఫ్గానిస్తాన్ నుంచి తరిమికొట్టాయి. భారత్ ఆ దేశంలో నార్తర్న్ అలయన్స్‌కు మద్దతిచ్చింది. అది తాలిబాన్‌కు వ్యతిరేకం.
20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మద్దతున్న తాలిబాన్ అక్కడ మళ్లీ అధికారంలోకి రావడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఎందుకంటే, అంతకు ముందు అష్రఫ్ ఘనీ ప్రభుత్వంతో భారత్‌కు మంచి సంబంధాలే ఉండేవి.
అఫ్గానిస్తాన్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కోట్ల పెట్టుబడులు పెట్టిన భారత్ అక్కడ ఒక సాఫ్ట్ పవర్ ఉండాలని కోరుకుంది. కానీ, ఇప్పుడు తాలిబాన్ తిరిగి రావడంతో ఆ పెట్టుబడులన్నీ వృథా అవుతాయేమోనని భారత్‌లో భయం ఏర్పడింది.
భారత్ ఆగస్టు 31న తాలిబాన్‌లతో జరిపిన మొదటి అధికారిక చర్చల్లో తన ఆందోళనలను దోహా ఆఫీసులోని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్‌తో పంచుకుంది.
ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు కానీ ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలకు కానీ ఉపయోగించకూడదని భారత్ చెప్పింది.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES
భారత్‌కు అంత సులభం కాదు
అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు బహిరంగంగా తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నాయి. కానీ భారత అధికారులకు అదంత సులభం కాదు.
భారత విధానాలపై కార్నెగీ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్ హక్కానీ గ్రూప్ కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంతోపాటూ భారత ప్రాపర్టీలన్నిటిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.
ఐఎస్ఐ, హక్కానీ గ్రూప్ మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా హక్కానీ గ్రూప్ మళ్లీ భారత వ్యతిరేక అజెండాను కొనసాగించవచ్చని అనిపిస్తోంది అని ఆ నివేదికలో చెప్పారు.
అయితే, హక్కానీలపై వస్తున్న విమర్శలన్నీ ఆరోపణలు మాత్రమేనని షాహీన్ అన్నారు. "హక్కానీ అనేది గ్రూప్ కాదు. అది అఫ్గానిస్తాన్ ఇస్లాం ఎమిరేట్‌లో భాగం. వారు అఫ్గానిస్తాన్ ఇస్లాం ఎమిరేట్" అన్నారు.
దిల్లీ నుంచి కఠ్‌మాండూ వెళ్తున్న విమానం హైజాక్ కావడంలో తాలిబాన్‌ల పాత్ర భారతీయుల మనసులో ఇప్పటికీ మెదులుతోంది. అప్పుడు ఆ విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నారు.
కార్నెగీ తన రిపోర్ట్‌లో "1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ చేసింది తాలిబాన్లే" అని చెప్పింది.
కానీ, షాహీన్ మాత్రం అప్పటి హైజాక్‌లో తాలిబాన్‌కు ఎలాంటి పాత్రా లేదని చెబుతున్నారు. తమ వైపు నుంచి తాము ఎంతో సాయం చేశామని, భారత ప్రభుత్వం అందుకు కృతజ్ఞతతో ఉండాలని అన్నారు.
"భారత్ మమ్మల్ని సాయం కోరింది. ఎందుకంటే, అప్పుడు ఆ విమానంలో ఇంధనం తక్కువగా ఉంది. మేం బంధీలను విడిపించడానికి కూడా సాయం చేశాం" అని షాహీన్ చెప్పారు.
భారత మీడియా తమపై దుష్ప్రచారం చేస్తోందని షాహీన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY/GETTY
దానిష్ సిద్దిఖీ హత్య
భారత జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ హత్యకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచార లేదని తాలిబాన్ ప్రతినిధి చెప్పారు.
"ఆయన ఎవరి కాల్పుల్లో చనిపోయారో మాకు తెలీదు. అది ఒక ఘర్షణ. అక్కడ కాల్పులు జరిగాయి" అని షాహీన్ అన్నారు.
పులిట్జర్ విజేత సిద్దిఖీ రాయిటర్స్ కోసం పనిచేసేవారు. ఆయన ఒక అఫ్గానిస్తాన్ సైనిక దళంతో ఉన్నప్పుడు వారిపై దాడి జరిగింది.
"ఆ రోజు దానిష్ శవాన్ని తాలిబాన్ ఫైటర్లు చుట్టుముట్టారు. మేం ఒక భారత గూఢచారిని పట్టుకుని చంపామని చెప్పారు. వాళ్లు ఇప్పుడు కూడా అలాగే చెబుతున్నారు" అని దానిష్ హత్య జరిగిన కొన్ని రోజులకు ఒక పౌరుడు బీబీసీకి చెప్పారు.
ఆ ఆరోపణలను షాహీన్ తోసిపుచ్చారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
దానిష్ హత్య దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీడియాతో షేర్ చేసుకుంటామని కూడా ఆయన చెప్పారు.
సుహైల్ షాహీన్ పంజ్‌షీర్ లోయలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్నారు. అక్కడ అఫ్గానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలే నాయకత్వంలో తాలిబాన్ వ్యతిరేక వర్గం దేశంలో అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌తో పోరాడాలని నిర్ణయించారు.
తాలిబాన్ ఇంటింటికీ వెళ్లి తాము లక్ష్యంగా చేసుకున్న వారిని వెతుకుతున్నారని, వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని వస్తున్న వార్తలను కూడా షాహీన్ తోసిపుచ్చారు. తమకు అసలు ఎలాంటి హిట్ లిస్ట్ లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్‌ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








