అఫ్గానిస్తాన్: తాలిబాన్ల వద్ద అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, అత్యాధునిక యుద్ధ వాహనాలు, రైఫిళ్లు

తాలిబాన్ ఫైటర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వికాస్ పాండే, షాదాబ్ నజ్మీ
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

సోషల్ మీడియాలో ఈమధ్య పోస్టయిన ఓ వీడియోలో తాలిబాన్ ఫైటర్లు కాందహార్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన 'బ్లాక్ హాక్' హెలికాప్టర్‌ను చూసుకుంటూ వెళ్లడం కనిపించింది.

నాలుగు రెక్కలున్న ఈ మల్టీపర్పజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌పోర్ట్‌లోని తారు రోడ్డు మీద వెళ్లడమే కనిపించినప్పటికీ ప్రపంచానికి మాత్రం స్పష్టంగా ఓ సందేశం పంపింది.

తాలిబాన్‌లు ఇక ఎంతమాత్రం డొక్కు పికప్ ట్రక్‌ల మీద కలష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లు పట్టుకుని తిరిగే మొరటు సాయుధులు కారని అది సూచించింది.

ఇంకోచోట తాలిబాన్‌లు అమెరికా తయారీ ఆయుధాలు, సైనిక వాహనాలు ప్రదర్శిస్తున్న చిత్రాలు కనిపించాయి.

ఇంకొన్ని ఫొటోలలో వారు తమ సంప్రదాయ గడ్డాలలో, సల్వార్ కమీజుల్లో తుప్పు పట్టిన తుపాకులు పట్టుకుని కాకుండా పూర్తిగా యుద్ధ దుస్తులలో ఇతర ప్రపంచ దేశాల సైనికుల మాదిరిగా కనిపించారు.

అఫ్గాన్ నేషనల్ డిఫెన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ ఒకదాని తరువాత ఒక నగరాన్ని వదులుకుంటుంటే తాలిబాన్‌లు పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో వైమానిక దళం ఉన్న ఏకైక తీవ్రవాద గ్రూప్ తాలిబాన్ అని సోషల్ మీడియాలో చాలామంది అభిప్రాయపడ్డారు.

తాలిబాన్‌ల దగ్గర ఎన్ని విమానాలున్నాయి?

2021 జూన్ నాటికి అఫ్గానిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర అటాక్ హెలికాప్టర్లు, ప్లేన్‌లు సహా మొత్తం 167 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండేవని 'స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫర్ అఫ్గానిస్తాన్ రీకనస్ట్రక్షన్ (సిగార్) వెల్లడించింది.

ఎయిర్‌క్రాఫ్ట్స్

అయితే, అందులో తాలిబాన్‌లు ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు స్వాధీనం చేసుకున్నారనేది స్పష్టంగా తెలియలేదు.

'ప్లానెట్ ల్యాబ్స్' బీబీసీకి ఇచ్చిన కాందహార్ ఎయిర్‌పోర్ట్‌ ఉపగ్రహ చిత్రాలలో చూస్తే కొన్ని మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్స్ అక్కడ నిలిపి ఉండడం కనిపించింది.

కాందహార్‌ను తాలిబాన్‌లు తమ అధీనంలోకి తీసుకున్న ఆరు రోజుల తరువాత తీసిన ఆ చిత్రంలో కనిపిస్తున్నవాటిలో రెండు ఎం-17 హెలికాప్టర్లు, రెండు బ్లాక్ హాక్స్ (యూహెచ్-60), మరో హెలికాప్టర్ కనిపించింది. ఆ అయిదో హెలికాప్టర్ కూడా యూహెచ్-60 కావొచ్చని దిల్లీ కేంద్రంగా పనిచేసే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన వైమానిక రంగ నిపుణుడు అంగద్ సింగ్ చెప్పారు.

కాందహార్ విమానాశ్రయం శాటిలైట్ చిత్రం

అయితే, జులై 16న నాటి శాటిలైట్ చిత్రంలో కాందహార్ ఎయిర్‌పోర్టులో మొత్తం 16 ఎయిర్‌క్రాఫ్ట్స్ కనిపించాయి. అందులో 9 బ్లాక్ హాక్స్, రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు, అయిదు ఫిక్స్‌డ్ వింగ్ ప్లేన్స్ కనిపించాయి.

అంటే వీటిలో కొన్ని ఆ తరువాత దేశం నుంచి వెళ్లడం కానీ, లేదంటే వేరే ఎయిర్‌బేస్‌కి తరలడం కానీ జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

కాగా తాలిబాన్‌లు కాందహార్‌తో పాటు మిగతా 9 ఎయిర్‌బేస్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆయా ఎయిర్‌బేస్‌లకు సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ అందుబాటులో లేకపోవడంతో తాలిబాన్‌లు ఇంకా ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్ స్వాధీనం చేసుకున్నారన్నది తేలలేదు.

కాందహార్, హేరత్, కుందుజ్, మజర్ ఇ షరీఫ్ తదితర ఎయిర్‌బేస్‌ల వద్ద తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నాయి. స్థానిక మీడియా, తాలిబాన్‌ ఫైటర్‌లు కూడా ఇలాంటివి షేర్ చేస్తున్నారు.

కొన్ని వెబ్‌సైట్‌లు కూడా వీటిలో కొన్నిటిని జియోలొకేట్ చేశాయి.

అయితే, ఆయా నగరాలు, ఎయిర్‌పోర్టులు తాలిబాన్‌ల పరం కాకమునుపే అక్కడి ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు తరలించినట్లుగానూ కొందరు చెబుతున్నారు.

ఉజ్బెకిస్తాన్‌లోని టెర్మజ్ ఎయిర్‌పోర్టులో ఆగస్ట్ 16న తీసిన ఫొటోలో ఎంఐ-17, ఎంఐ-25, బ్లాక్ హాక్స్ హెలికాప్టర్లు రెండు డజన్లకు పైగా కనిపించాయి. వాటితో పాటు ఏ-29 లైట్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్, సీ-208 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అనేకం కనిపించాయని పేరు చెప్పడానికి ఇష్టపడని దిల్లీకి చెందిన వైమానిక రంగ నిపుణుడొకరు చెప్పారు.

ఉజ్బెకిస్తాన్‌లో కనిపిస్తున్న విమానాలు, హెలికాప్టర్లన్నీ అఫ్గానిస్తాన్ వైమానిక దళానికి చెందినవే కావొచ్చని భద్రతారంగ మేధోసంస్థ సీఎస్ఐఎస్‌కు చెందిన నిపుణులు అంటున్నారు.

Termuz airport

తాలిబాన్‌లు ఇంకా ఏమేం యుద్ద సామగ్రి కైవసం చేసుకున్నారు?

అత్యాధునిక గన్‌లు, రైఫిళ్లు, వాహనాలను వాడిన అనుభవం తాలిబాన్‌‌లకు ఉందని నిపుణులు చెబుతున్నారు.

2003 నుంచి 2016 మధ్య అమెరికా భారీ ఎత్తున సైనిక సామగ్రిని అఫ్గానిస్తాన్‌కు పంపించింది.

3,58,530 రైఫిళ్లు, 64,000 మెషీన్ గన్స్, 25,327 గ్రనేడ్ లాంచర్లు, 22,174 హై మొబిలిటీ మల్టీపర్పజ్ వీల్డ్ వెహికల్స్(హెచ్ఎంఎండబ్ల్యూవీ) అఫ్గాన్‌కు పంపించినట్లు అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ రిపోర్టులో ఉంది.

2014లో నాటో దళాలు అఫ్గాన్‌లో తమ పోరాటాన్ని ఆపేసిన తరువాత దేశ భద్రత బాధ్యత మొత్తం అఫ్గాన్ సైన్యమే తీసుకుంది. అప్పుడు మళ్లీ అమెరికా మరిన్ని ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రి ఇచ్చింది. పాతబడిన సైనిక సామగ్రికి బదుల ఆధునిక సామగ్రి సరఫరా చేసింది.

ఒక్క 2017లోనే 20,000 ఎం-16 రైపిళ్లు ఇచ్చింది. 2017-2021 మధ్య 3,598 ఎం4 రైఫిళ్లు, 3012 హెచ్ఎంఎండబ్ల్యూవీలు ఇచ్చిందని సిగార్ తెలిపింది.

తాలిబాన్ ఫైటర్

కొత్తగా దొరికిన ఈ ఆయుధ నిధితో తాలిబాన్‌లు ఏం చేయబోతున్నారు?

ఎయిర్‌క్రాఫ్ట్స్ స్వాధీనం చేసుకోవడం తాలిబాన్‌లకు సులభమే కావొచ్చు కానీ వాటి వాడకం, నిర్వహణ మాత్రం వారికి అంత సులభం కాదని సీఎన్ఏ కన్సల్టింగ్ గ్రూప్ డైరెక్టర్, అఫ్గానిస్తాన్‌లోని అమెరికా సేనల మాజీ సలహాదారు అయిన డాక్టర్ జొనాథన్ స్క్రాడెన్ అన్నారు.

వీటికి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేస్తుండాలని, కొన్నికొన్నిసార్లు పార్టులు మార్చాల్సి ఉంటుందని.. సాధారణం వైమానిక దళాలు ఇందుకోసం సాంకేతిక నిపుణుల బృందంపై ఆధారపడతాయని చెప్పారు.

వీటి నిర్వహణ చూసే అమెరికాకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు తాలిబాన్ల దాడి మొదలు కావడానికి ముందే అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయారని జొనాథన్ చెప్పారు.

యుద్ధ విమానాలను నిర్వహించిన అనుభవం తాలిబాన్‌లకు లేదని, కాబట్టి ఆందోలన చెందాల్సిన అవసరం లేదని జార్జిటౌన్ యూనివర్సిటీలో గ్లోబల్ పాలిటిక్స్, సెక్యూరిటీ విభాగ ప్రొఫెసర్ జోడా విటోరీ చెప్పారు. ఆమె గతంలో అఫ్గానిస్తాన్‌లో పనిచేసిన అమెరికా వైమానిక బృందంలో కూడా ఉన్నారు.

అంతేకాకుండా విమానాశ్రయాలు తాలిబాన్ల పరం కావడానికి ముందే ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను పాక్షికంగా పనిచేయకుండా చేసి ఉండొచ్చనీ ఆమె చెబుతున్నారు.

అయితే, అఫ్గానిస్తాన్‌కు చెందిన ఒకప్పటి పైలట్లను బెదిరించి వాడుకుని తాలిబాన్లు వీటిని వినియోగంలోకి తెచ్చినా తేవచ్చని రాండ్ కార్పొరేషన్‌కు చెందిన జేసన్ కాంప్‌బెల్ అన్నారు.

మరోవైపు రష్యా తయారీ ఎంఐ-17 హెలికాప్టర్లను తాలిబాన్లు వినియోగించే అవకాశాలున్నాయని, మిగతా ఎయిర్‌క్రాఫ్ట్‌ల విషయంలో మాత్రం వారు తమకు సహకరించే దేశాల వైపు చూస్తారని కాంప్‌బెల్ అభిప్రాయపడ్డారు.

తాలిబాన్ ఫైటర్

ఎయిర్‌క్రాఫ్ట్‌లను మినహాయిస్తే మిగతా ఆయుధాలు, సైనిక సామగ్రిని వాడుకోవడం తాలిబాన్లకు పెద్ద విషయం కాదని.. గతంలో సైనిక పోస్టులు వంటివి స్వాధీనం చేసుకున్న తాలిబాన్లకు ఇలాంటి ఆయుధాలతో పరిచయం ఉందని చెప్పారు.

ఈ ఆయుధాలన్నీ వారికి చిక్కడమనేది కేవలం అఫ్గానిస్తాన్‌కే కాకుండా ప్రపంచానికంతటికీ ముప్పేనని వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మన్ అన్నారు.

తాలిబాన్‌లకు దొరికిన ఆయుధాలు వారి నుంచి నల్లబజారుకు కానీ, ఇతర దేశల్లోని తీవ్ర వాద గ్రూపులకు కానీ చేరితే ప్రమాదమన్నారు.

మరోవైపు జోడీ వెటోరీ దీనిపై మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ప్రమాదం కనిపించకపోయినా మరికొద్ది నెలలో ఈ ఆయుధాల సప్లయ్ చైన్ మొదలవుతుందని... ఇలాంటి ముప్పును ఆపాల్సిన బాధ్యత అఫ్గానిస్తాన్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, రష్యాలపై ఉందని అన్నారు.

తాలిబాన్‌లలోనూ చీలిక గ్రూపులు ఏర్పడి ఈ ఆయుధాలను ఎత్తుకెళ్లొచ్చని.. ఇలాంటి పరిణామలన్నిటినీ తాలిబాన్లు ఎలా డీల్ చేస్తారనేది వారి నాయకత్వం గ్రూపును ఏకతాటిపై ఉంచడంపై ఆధారపడి ఉంటుందని విటోరీ అన్నారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ పాప్ స్టార్ అరియానా కాబుల్ నుంచి ఎలా బయటపడ్డారంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)