అఫ్గానిస్తాన్: కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
గురువారం నాటి బాంబు దాడుల తర్వాత కూడా కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రజల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఒకే ఒక ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని, ముందుగా అనుకున్నట్లు రెండు బాంబు దాడులు కాదని పెంటగాన్ ప్రకటించింది.
అమెరికా సైన్యం మేజర్ జనరల్ విలియం టేలర్ మాట్లాడుతూ, హోటల్ వద్ద రెండో పేలుడు జరిగినట్లు తాము భావించడం లేదని అన్నారు.
బాంబు పేలుడులో 90 మంది చనిపోయారు. వారిలో చాలా మంది అఫ్గాన్ పౌరులే. మరో 150 మందికి పైగా ప్రజలు ఈ పేలుడులో గాయపడ్డారు.
"ఇంకా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని మేం విశ్వసిస్తున్నాం" పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాతో అన్నారు.
ఈరోజు అఫ్గాన్‌లో ఏం జరిగింది?
- ఇప్పటికే తక్కువ సిబ్బందితో ఇబ్బందులు పడుతున్న ఆసుపత్రులలో ఒక్కసారిగా బాధితుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పేలుళ్ల తర్వాత కనిపించకుండా తమ వారి కోసం బంధువులు ఆందోళనతో వెతుక్కుంటున్నారు.
- మరోవైపు జర్మనీలో రెమ్‌స్టెయిన్ ఎయిర్ బేస్‌కు చేరుకుంటున్న వారిలో తమ కుటుంబాల నుంచి విడివడిన వాళ్లు పలువురు కనిపిస్తున్నారు. వీరిలో డజనుకు పైగా చిన్నారులు కూడా ఉన్నారు.
- బ్రిటిష్ దళాలు దేశం విడిచి వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్‌లను బయటకు పంపే ఏర్పాట్లను దాదాపు చివరి దశకు తీసుకొచ్చాయి.
- విదేశాలకు వెళ్లడానికి అర్హత ఉన్న అఫ్గానీలలో ఇంకా సుమారు 800 నుంచి 1100 మంది వరకు మాత్రమే మిగిలి ఉన్నారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. సుమారు 100 నుంచి 150 మంది వరకు బ్రిటీష్ జాతీయులు కూడా అఫ్గానిస్తాన్‌లో ఉన్నారు. అయితే, వారిలో కొందరు అఫ్గానిస్తాన్‌లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
- దాడులను నివారించడానికి అమెరికా సైన్యం కాబుల్ ఎయిర్‌పోర్ట్ మరికొంత భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని అమెరికాకు చెందిన కౌంటర్ టెర్రరిజం నిపుణుడొకరు సూచించారు.
- గురువారం నాటి దాడులకు కారకులైన వారిని వేటాడతామని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా, ఈ దాడులకు బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ ప్రకటించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు పేలుడులో 90 మంది మృతి
కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన అబే గేట్ వద్ద జరిగిన రెండు పేలుళ్లలో 90 మంది మరణించారని అఫ్గాన్ వైద్యాధికారులు బీబీసీకి తెలిపారు. అయితే, మృతులు 28 మంది అని తాలిబాన్ చెబుతోంది. 150 మందికి గాయాలయ్యాయి.
మృతుల్లో 13మంది అమెరికా సైనికులు ఉన్నారని పెంటగాన్ ధృవీకరించింది.
ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో 1000 మందికి పైగా అమెరికా పౌరులన్నారని, దాడి జరిగినా, వారందరినీ స్వదేశానికి తరలించే కార్యక్రమం కొనసాగిస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారి జనరల్ కెన్నెత్ మెకంజీ వెల్లడించారు.
ఎయిర్‌పోర్టు ముందు రెండు పేలుళ్లు జరిగాయని, ఇవి ఆత్మాహుతి దాడులేనని మెకంజీ స్పష్టం చేశారు. ఈ దాడి ఇస్లామిక్ గ్రూప్ పనేనని ఆయన అన్నారు. ‘‘ఐసిస్ మీద అనుమానాలున్నాయి. ఇలాంటి దాడులను మేం ఊహించాం. ముందు ముందు కూడా జరిగే అవకాశం ఉంది’’ అని మెకంజీ అన్నారు.
మెకంజీ ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఆ సంస్థ తన టెలీగ్రామ్ గ్రూప్‌లో ఈ విషయం వెల్లడించింది. తాలిబాన్, అమెరికా దళాలే లక్ష్యంగా తాము ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని తెలిపింది.
బాంబు పేలుళ్ల తర్వాత గన్‌మాన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, ఈ సందర్భంగానే అమెరికా సైనికులు మరణించారని మెకంజీ వెల్లడించారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిని అమెరికా కచ్చితంగా శిక్షించి తీరుతుందని మెకంజీ అన్నారు.
పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉందని, విస్ఫోటనం జరిగిన ప్రాంతంలో కనీసం 400, 500 మంది గుమిగూడి ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
అనేకమంది క్షతగాత్రులను తరలించే ప్రయత్నం చేశామని, ఈ సందర్భంగా తన దుస్తులు రక్తంతో తడిచి పోయినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
‘‘పేలుళ్లు జరిగిన ప్రాంతం ప్రళయం ముంచుకొస్తున్న దృశ్యాన్ని తలపించింది. ఎటు చూసినా క్షతగాత్రులే కనిపిస్తున్నారు. ముఖం మీద, ఒంటి మీద రక్తంతో ప్రజలు పరుగులు పెడుతున్నారు’’ అని యూకే దళానికి చెందిన మాజీ దుబాసీ ఒకరు తనతో చెప్పినట్లు స్కైన్యూస్ విదేశీ వ్యవహారాల ఎడిటర్ డెబోరా హేన్స్ వెల్లడించారు.
అంతకు ముందు 11 మంది మరణించినట్లు తాలిబాన్లు ప్రకటించారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలతోపాటు కొందరు తాలిబాన్ గార్డులు కూడా ఉన్నారని తాలిబాన్ ప్రతినిధి వెల్లడించారు.
ఒళ్లంతా రక్తంతో కొందరు పరుగులు పెడుతున్న దృశ్యాలు, క్షతగాత్రులను తోపుడు బండ్ల మీద నెట్టుకుంటూ వెళుతున్న దృశ్యాలను టోలో న్యూస్ ట్విటర్‌లో షేర్ చేసింది. వీరంతా పేలుడు తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోతున్నట్లుగా చెబుతున్నారని టోలో న్యూస్ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వీసా కోసం వేలమంది అఫ్గాన్‌లు దరఖాస్తులు ఫారాలు నింపుతున్న ప్రాంతంలో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని అఫ్గానిస్తాన్ కు చెందిన జర్నలిస్టు బిలాల్ సర్వారీ ట్వీట్ చేశారు. ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోగానే, మరో సభ్యుడు తుపాకీతో కాల్పులు జరిపాడని సర్వారీ వెల్లడించారు. బిలాల్ సర్వారీ కొద్ది రోజుల కిందట దేశం విడిచి వెళ్లిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరోవైపు ఎయిర్‌పోర్ట్ కు సమీపంలోనే ఉన్న బ్యారన్ హోటల్ దగ్గర కూడా ఒక పేలుడు సంభవించినట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ కిర్బీ పేర్కొన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.
విదేశీయులను సొంత దేశాలకు పంపేందుకు వీసాలు ఇచ్చే ప్రక్రియ బ్యారన్ హోటల్ సమీపంలో జరుగుతోంది. ఈ పేలుడులో పలువురు గాయపడ్డారని యూకే విదేశీ వ్యవహారాల భద్రతా కమిటీకి చెందిన అలీసా కీర్న్స్ వెల్లడించారు. బ్యారన్ హోటల్ వద్ద జరిగిన పేలుళ్లను పెంటగాన్ కమాండర్ మెకంజీ కూడా ధృవీకరించారు.

ఫొటో సోర్స్, Reuters
పేలుడు సంభవించిన అబే గేట్ ప్రాంతంలోనే బ్రిటీష్ దళాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న మూడు గేట్లు బాంబు దాడుల అనుమానాలతో మూసివేశారు.
తమ సైనికులు గాయపడినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని యూకే రక్షణ శాఖ కార్యాలయం వెల్లడించింది. మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అఫ్గాన్ పరిస్థితిపై రక్షణ శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారని పీఎం ఆఫీస్ వెల్లడించింది.
అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి అదుపు తప్పుతోందని ఫ్రాన్స్ ప్రధాని ఇమ్యాన్యుయేల్ మేక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాబుల్ ఎయిర్ పోర్ట్ మీద బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు హెచ్చరికలు చేసిన కొద్దిగంటల్లోనే ఈ పేలుళ్లు జరిగాయి.

ఫొటో సోర్స్, Reuters
ఎయిర్ పోర్ట్ వద్ద ఉగ్రదాడి ముప్పు
అఫ్గానిస్తాన్‌లోని కాబుల్ విమానాశ్రయానికి ఉగ్రవాద దాడి ముప్పు చాలా ఎక్కువగా ఉందని పలు దేశాలు హెచ్చరించాయి. విమానాశ్రయం దరిదాపుల్లోకి వెళ్లకూడదని తమ దేశ పౌరులకు సూచించాయి.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తమ దేశాల ప్రజలకు ఈ హెచ్చరిక జారీ చేశాయి. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఎయిర్‌పోర్ట్ బయట ఉన్న వారికి సూచించాయి.
కాబుల్ తాలిబాన్ల వశమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు సుమారు 82వేల మందిని అఫ్గాన్ నుంచి తరలించారు.
తాలిబాన్లు విధించిన ఆగస్ట్ 31 డెడ్‌లైన్‌లోగా తమ పౌరులను అక్కడినుంచి తరలించేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
వేలాది మంది ప్రజలు విమానాశ్రయం లోపల, బయట అఫ్గాన్ వదిలి వెళ్లేందుకు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
అఫ్గానిస్తాన్‌పై అఖిలపక్షంలో భారత ప్రభుత్వం ఏం చెప్పింది?
అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అక్కడున్న భారతీయులను స్వదేశానికి తరలించడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని ఇవాళ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో జయశంకర్ అన్నారు.
అమెరికాతో దోహాలో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను తాలిబాన్లు ఉల్లంఘిస్తున్నారని జైశంకర్ వ్యాఖ్యానించినట్లు పీటీఐ పేర్కొంది.
అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపడితే ప్రజాస్వామ్యయుతంగా పాలిస్తామని, దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, పౌరుల మత స్వేచ్ఛను కాపాడతామని తాలిబాన్ వర్గాలు హామీ ఇచ్చాయి.
జైశంకర్ అధ్యక్షతన ఇవాళ జరిగిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రధాన పక్షాలు పాల్గొన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
డెడ్ లైన్ పై పట్టుదల
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చెప్పిన దాని ప్రకారం డెడ్‌లైన్ పొడిగించేందుకు తాలిబాన్లు నిరాకరించారు. కానీ దేశం వదిలి వెళ్లేందుకు విదేశీయులకు, అఫ్గాన్ ప్రజలకు ఆగస్ట్ 31 తర్వాత కూడా అవకాశం ఇస్తామని వారు హామీ ఇచ్చారు.
'అక్కడ (కాబుల్ విమానాశ్రయం) ఉగ్రవాద దాడి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది' అని గురువారం ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరిసే అన్నారు.
విమానాశ్రయం అబ్బే గేట్, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ దగ్గర ఎదురుచూస్తున్న ప్రజలందరూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించిన కొన్ని గంటల తర్వాత ఆస్ట్రేలియా ఈ ప్రకటన చేసింది.
బ్రిటన్ కూడా తమ దేశ పౌరులకు ఇలాంటి సూచనే చేసింది. అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాలని, తదుపరి సూచనలు ఇచ్చే వరకు అక్కడే వెయిట్ చేయాలని చెప్పింది.
అఫ్గానిస్తాన్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఇప్పటికీ అస్థిరంగానే ఉందని బ్రిటన్ విదేశాంగ శాఖ పేర్కొంది. 'ఉగ్రవాద దాడి జరిగే ముప్పు ఎక్కువగా ఉంద'ని ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, ఏ దేశం కూడా దాడికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు.
ఇస్లామిక్ స్టేట్ నుంచి ముప్పు పొంచి ఉన్నందున తాము కాబుల్‌లో చేపడుతున్న తరలింపు ప్రక్రియ త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మంగళవారం చెప్పారు.
గత 24 గంటల్లో అమెరికా సారథ్యంలోని విమానాల్లో 19వేల మందిని తరలించినట్లు నిన్న బ్లింకెన్ చెప్పారు.
ఈ నెల చివరి నాటికి కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి తమ ఆపరేషన్లను పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ స్థాయిలో ఇలాంటి ఆపరేషన్లను అమెరికా మాత్రమే చేయగలదని బ్లింకెన్ వాషింగ్టన్‌లో చెప్పారు.
డెడ్‌లైన్ ముగిసిన తర్వాత కూడా అఫ్గాన్ వదిలి వెళ్లేందుకు అమెరికన్లకు అవకాశం ఇస్తామని తాలిబాన్లు హామీ ఇచ్చారు. కానీ ఆగస్ట్ 31 తర్వాత మిగతా దేశాల పౌరులు, అఫ్గాన్ ప్రజలకు ఇబ్బందులు రావొచ్చు అని ఆయన అన్నారు.
అయితే, అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి కాబుల్‌లో తమ తరలింపు మిషన్ ముగిసిన తర్వాత కూడా ప్రతిరోజూ సాయం చేస్తామని బ్లింకెన్ హామీ ఇచ్చారు.
అఫ్గాన్‌లో ఇప్పటికీ 1500 మంది వరకు అమెరికన్లు ఉండొచ్చని, వారిని ట్రేస్ చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని యూఎస్ విదేశాంగ మంత్రి చెప్పారు.
కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా విమానాల్లో తరలి వెళ్లేందుకు ఇంకా పది వేల మంది ఎదురుచూస్తున్నారని పెంటగాన్ వెల్లడించింది.
దేశం వదిలి వెళ్లాలని వేలాది మంది అఫ్గాన్లకు ఉన్నప్పటికీ వారు కాబుల్ విమానాశ్రయం చేరుకోలేకపోతున్నారని తెలిపింది. వారి పట్ల తమకు ఆందోళనగా ఉందని చెప్పింది.
ఎయిర్‌పోర్ట్ గేట్ల దగ్గర తాలిబాన్లు వెనక్కి పంపిస్తున్న అఫ్గాన్ల దగ్గర సరైన ప్రయాణ పత్రాలు ఉన్నట్లు అనిపిస్తోందని బీబీసీ ప్రతినిధి చెప్పారు.
అమెరికన్లను, సాయం చేసిన అఫ్గాన్ ప్రజలను సురక్షితంగా తరలించేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలను తాము తీసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

తరలింపు ప్రక్రియ వేగవంతమైందని బ్రిటన్ వెల్లడించింది. బుధవారం సుమారు 1200 మందిని తరలించామని తెలిపింది.
బ్రిటన్ పౌరులు, అర్హత ఉన్న అఫ్గాన్లను సురక్షితంగా తరలించేందుకు డెడ్‌లైన్‌లోపు అందుబాటులో ఉన్న ప్రతి గంట, ప్రతి రోజును సద్వినియోగం చేసుకుంటామని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ చెప్పారు.
5800 మంది అమెరికా సైనికులు, 1000 మంది బ్రిటన్ సైనికులు కాబుల్ ఎయిర్‌పోర్టుకు ప్రస్తుతం భద్రత కల్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు డ్రగ్స్‌తో ఎంత సంపాదిస్తున్నారు, ఇక్కడ ఓపియం ఎంత పండుతుంది? - BBC RealityCheck
- మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుంచి బురఖాలో బందీ అయినంతవరకు
- సొరాయా: అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం కృషిచేసిన ఈ రాణి చివరికి ఇటలీ ఎందుకు పారిపోయారు
- ‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’
- ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్డోజర్' ఎలా అయ్యారు?
- ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








