గుల్ ఆఘా షేర్జాయ్: ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్‌డోజర్‌' ఎలా అయ్యారు?

గుల్ ఆఘా షేర్జాయ్

ఫొటో సోర్స్, CHRIS HONDROS/GETTY IMAGES

    • రచయిత, ఖుదా-ఎ-నూర్ నాసిర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, అఫ్గానిస్తాన్

అఫ్గానిస్తాన్‌ పౌరులు లేదా గత 20 ఏళ్లుగా అఫ్గానిస్తాన్ రాజకీయాలు, అక్కడి పరిస్థితుల నుంచి బాగా తెలిసినవారికి 'ఆఫ్గానిస్తాన్ బుల్‌డోజర్' ఎవరో చాలా బాగా తెలుసు.

అయితే, ఇప్పుడు ఆ 'బుల్‌డోజర్' అఫ్గానిస్తాన్ వైపు లేదు, ఇస్లామిక్ ఎమిరేట్ అంటే.. 'తాలిబాన్ బుల్‌డోజర్‌'గా మారిపోయింది.

అఫ్గాన్ ప్రజలు బుల్‌డోజర్ అని పిలుచుకునే గుల్ ఆఘా షేర్జాయ్ సీఐఏ మాజీ ఏజెంట్, వార్‌లార్డ్‌. ఆయన కాందహార్‌, నంగర్‌హార్ ప్రాంతాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు.

తాలిబాన్ పట్ల విశ్వాసంతో ఉంటానని ఆయన ఆదివారం ప్రమాణం చేశారు. గుల్ ఆఘా షేర్జాయ్ తమ ప్రభుత్వంలో భాగం అవుతున్నట్లు తాలిబాన్ కూడా ప్రకటించింది.

2001లో నాటో బలగాలకు నేతృత్వం వహించిన అమెరికా.. తాలిబాన్‌ను తరిమికొట్టడానికి అఫ్గానిస్తాన్ మీద దాడులు చేసినప్పుడు గుల్ ఆఘా షేర్జాయ్ అమెరికాకు మద్దతిచ్చిన మొదటి వార్‌లార్డ్‌గా నిలిచారు.

వీడియో క్యాప్షన్, తాలిబాన్లకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు, భారీ ఎత్తున నిరసనలు

దక్షిణ ప్రావిన్స్ కాందహార్‌లో ఆయన సీఐఏతో కలిసి తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ మొదట అధికారంలోకి రాకముందు ఆయన కాందహార్ ప్రావిన్స్ గవర్నర్‌గా ఉన్నారు. 2001లో తాలిబాన్‌ అధికారం కోల్పోయేవరకూ షేర్జాయ్ కాందహార్ బయటే ఉన్నారు.

అఫ్గానిస్తాన్ నుంచి తాలిబాన్ వెళ్లిపోయిన తర్వాత ఆయన మళ్లీ కాందహార్ చేరుకుని గవర్నర్ పదవిలో కొనసాగారు.

సీఐఏకు, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌కు షేర్జాయ్ సన్నిహితులు. అందుకే అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం పతనం తర్వాత ఆయన 2003 వరకూ కాందహార్ ప్రావిన్సుకు గవర్నర్‌గా ఉన్నారు. తర్వాత నంగర్‌హార్ గవర్నర్ అయ్యారు.

గుల్ ఆఘా షేర్జాయ్

ఫొటో సోర్స్, BANARAS KHAN/AFP VIA GETTY IMAGES

బుల్‌డోజర్ అనే పేరెలా వచ్చింది

2005 నుంచి 2013 వరకూ షేర్జాయ్ గవర్నర్‌గా ఉన్న నంగర్‌హార్ ప్రాంతంలో ఆయన బుల్‌డోజర్ అనే పేరు సంపాదించారని ఆయన సన్నిహితులు చెప్పారు.

గవర్నర్‌గా ఉన్న సమయంలో గుల్ ఆఘా షేర్జాయ్ నంగర్‌హార్ ప్రావిన్సులోని మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించేవారు.

స్థానికులు ఆయనను తమకు రోడ్లు కావాలని ఒకే ఒక కోరిక కోరేవారు. రోడ్లు లేకపోవడం, లేదా మూతపడడంతో ఎదురయ్యే కష్టాలను చెప్పుకునేవారు.

దాంతో షేర్జాయ్ వారి సమస్య తీరుస్తానని హామీ ఇవ్వడమే కాదు, వెంటనే ఆయా ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేవారు.

అఫ్గాన్ మారుమూల ప్రాంతాల్లో పర్యటించినపుడు గవర్నర్ షేర్జాయ్ తరచూ గ్రామాల్లోవారికి నగదు, మెషిన్లు ఇచ్చేవారు. రోడ్డు కావాలని అడగగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుల్‌డోజర్, మిగతా యంత్రాలను అక్కడకు రప్పించి రోడ్ల పనులు ప్రారంభించేవారు.

గుల్ ఆఘా షేర్జాయ్‌కు ఒక ప్రైవేటు కన్‌స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉండేది. ఆయన రోడ్లు వేయించడానికి తరచూ తన కంపెనీకి చెందిన బుల్‌డోజర్ మిగతా భారీ వాహనాలు ఉపయోగించేవారని ఆయన స్నేహితులు చెప్పారు. దాంతో దేశంలో అందరూ ఆయనను 'బుల్‌డోజర్' అని పిలుచుకోవడం మొదలైంది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది. గుల్ ఆఘా షేర్జాయ్ కూడా తనను బుల్‌డోజర్ అని చెప్పుకోడానికి ఏమాత్రం సిగ్గుపడేవారు కాదు. అఫ్గానిస్తాన్‌లో 2014 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల గుర్తు కూడా బుల్‌డోజరే.

వీడియో క్యాప్షన్, తమదైన శైలిలో జనాన్ని కంట్రోల్ చేస్తున్న తాలిబాన్లు

ఎత్తుగా, దృఢంగా ఉండే గుల్ ఆఘా షేర్జాయ్‌ను ఒకప్పుడు టైమ్స్ పత్రిక 'జబ్బా ద హట్'(స్టార్‌ వార్ సిరీస్‌లో అత్యంత బలమైన గాంగ్‌స్టర్) అనే పేరుతో వర్ణించింది.

కాందహార్ గవర్నర్‌ పనిచేసిన తర్వాత ఆయన చాలా కాలంపాటు తనకు హేరాత్, కాందహార్, నంగర్‌హార్ గవర్నర్ పదవులు ఇవ్వాలని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ను డిమాండ్ చేస్తూనే వచ్చారు. తనను ఏదో ఒక ప్రావిన్స్‌కు గవర్నర్‌గా చేయాలని కూడా ఆయన కర్జాయ్‌ను అడిగేవారు.

ఆయనకు ఆ మూడు ప్రావిన్సుల మీద అంత ఆసక్తి ఎందుకు అనేది ఆయన స్నేహితులు వివరించారు.

ఇరాన్, పాకిస్తాన్‌లకు ఉన్న వాణిజ్య మార్గాలు ఆ మూడు ప్రాంతాల నుంచే వెళ్తుంటాయి. ఆ మార్గాల్లో చాలా డబ్బు సంపాదించవచ్చు కాబట్టే ఆయన ఆ మూడు ప్రావిన్సుల గవర్నర్ పదవిపై చాలా ఆసక్తి చూపేవారు.

తాలిబాన్ బద్ధ శత్రువుల్లో గుల్ ఆఘా షేర్జాయ్ ఒకరు. ఆయన్ను 'తాలిబాన్ కసాయి' అని కూడా పిలిచేవారు. 2001లో తాలిబాన్‌ను దేశం నుంచి తరిమికొట్టినపుడు ఆయన ఎంతోమంది తాలిబాన్, అల్ ఖైదా ఫైటర్లను చంపించారు.

గుల్ ఆఘా షేర్జాయ్

ఫొటో సోర్స్, WAKIL KOHSAR/AFP VIA GETTY IMAGES

సంగీతం అంటే ఇష్టం

అఫ్గానిస్తాన్ బుల్‌డోజర్‌గా పాపులర్ అయిన ఆఘా షేర్జాయ్‌కు సంగీతం అంటే కూడా చాలా ఇష్టమని, ఆయన చాలా సార్లు పాటలు కూడా పాడేవారని ఆయన సన్నిహితులు చెప్పారు.

షేర్జాయ్ పాడిన "రాకా జామ్ రాకా జామ్" అనే ఒక పష్తో పాట కొన్నేళ్ల క్రితం విపరీతంగా వైరల్ కూడా అయ్యింది.

ఈ పష్తో పాట చాలా మందికి ఫేవరెట్. అయితే, షేర్జాయ్ నంగర్‌హార్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో కలిసి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాను కూడా లాంగ్ డ్రైవ్ వెళ్లేవాడినని, ఆయన ఆ పాట పాడుతూ ‘నేనెలా పాడుతున్నాను’ అని తమను అడిగేవారని ఆయన సన్నిహత మిత్రుడు ఒకరు చెప్పారు.

"ఒకసారి మేం వెళ్తున్నప్పుడు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఒక కూలీ రోడ్డు పక్కన మట్టిని ఇసుకలో కలపడం షేర్జాయ్ చూశారు. వెంటనే అతడి దగ్గరికెళ్లి తన చొక్కా పట్టుకుని మట్టి కలిపినందుకు చాలా తిట్టారు. అప్పుడే ఆయన కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఇన్‌ఛార్జ్ అయిన చైనా వ్యక్తి అక్కడకు వచ్చాడు. షేర్జాయ్ ఆయన్ను కూడా మెడ పట్టుకుని చడామడా తిట్టారు" అని స్నేహితుడు చెప్పారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల రాకతో భారత్‌కు కొత్త చిక్కులు తప్పవా?

తాలిబాన్ బుల్‌డోజర్ అయ్యారు

తాలిబాన్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో.. తాలిబాన్ నేత ఖలీలుర్ రహమాన్ హక్కానీ పట్ల విశ్వాసంతో ఉంటానని గుల్ ఆఘా షేర్జాయ్ ప్రమాణం చేస్తూ కనిపిస్తున్నారు.

అంతకు ముందు తాలిబాన్ కాబుల్ ఆక్రమించినపుడు ఒక వీడియో ద్వారా తాలిబాన్‌కు శుభాకాంక్షలు తెలిపిన గుల్ ఆఘా షేర్జాయ్ వారికి స్వాగతం పలికారు.

తాలిబాన్ విడుదల చేసిన ఒక వీడియోలో ముఫ్తీ జకీర్‌ ఆయనతో ప్రమాణం చేయించిన తర్వాత నినాదాలు చేస్తారు. షేర్జాయ్‌ను అఫ్గానిస్తాన్ బుల్‌డోజర్‌ అని చెబుతారు. సమాధానంగా షేర్జాయ్ అవును అంటారు. తర్వాత ముఫ్తీ ఇప్పుడు కూడా ఆయన బుల్‌డోజర్‌గానే ఉంటారు అని చెబుతారు.

"ఇప్పుడు నేను చెప్పేది ఒకటే. ఆయన మనందరికీ, అంటే ఇస్లామ్ ఎమిరేట్, అమీర్-ఉల్-మొమీనిన్ తరఫున మొత్తం అఫ్గానిస్తాన్‌ను నిర్మించే బుల్‌డోజర్ అవుతారు" అని తర్వాత ముఫ్తీ జకీర్ అన్నారు.

ఆ తర్వాత గుల్ ఆఘా షేర్జాయ్, ఖలీలుర్ రహమాన్ హక్కానీ, మిగతా అందరూ ఇన్షా అల్లా అంటూ కనిపిస్తారు.

ప్రస్తుతం తమకు ఏ రాజకీయ నేతలతో ఎలాంటి శత్రుత్వంలేదని, అఫ్గాన్ రాజకీయ నాయకులందరినీ క్షమించామని తాలిబాన్ నేతలు ప్రకటించారు.

అయితే తమకు లొంగిపోయిన ఎంతోమంది నేతలను తాలిబాన్ హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాలిబాన్ నేతలు మాత్రం అదంతా దుష్ప్రచారం అని కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)