కాబుల్ చేరుకున్న తాలిబాన్ అగ్ర నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్

2020 సెప్టెంబరులో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోతో అబ్దుల్ ఘనీ బరాదర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 సెప్టెంబరులో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో అబ్దుల్ ఘనీ బరాదర్

తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ చేరుకున్నారు.

అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జిహాదీ నేతలను, రాజకీయ నేతలను బరాదర్ కలవనున్నట్లు తాలిబాన్ సీనియర్ అధికారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

దోహాలోని తాలిబాన్ల రాజకీయ కార్యాలయానికి కూడా చీఫ్ అయిన బరాదర్ మంగళవారం అఫ్గానిస్తాన్‌ వచ్చారు. ఆయన కాందహార్‌లో దిగారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న తాలిబాన్ నేతల్లో అత్యంత సీనియర్ ఈయనే.

తాలిబాన్ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రముఖ స్థానం పొందే అవకాశం ఉంది.

కాబుల్ విమానాశ్రయంలో ప్రయాణికులను అదుపు చేస్తున్న అమెరికా సైనికుడు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కాబుల్ విమానాశ్రయంలో ప్రయాణికులను అదుపు చేస్తున్న అమెరికా సైనికుడు

దేశం వదిలి వెళ్లిపోయేందుకు అఫ్గాన్ ప్రజల పాట్లు

మరోవైపు, కాబుల్ ఎయిర్‌పోర్ట్ బయట వేల మంది ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు.

ఆ దృశ్యాలను చిత్రీకరించకుండా తాలిబాన్లు బీబీసీ ప్రతినిధులను అడ్డుకున్నారు.

తమ పాలన నుంచి ఇంత మంది జనం పారిపోవడాన్ని ప్రపంచం చూడటం వారికి ఇష్టం లేదు.

సరైన పత్రాలు ఉన్నప్పటికీ కొందరు అఫ్గాన్లను ఎయిర్‌పోర్టులోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలను తాలిబాన్లు తిరస్కరించారు.

కానీ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ప్రజల్లో చాలా మందికి వీసా లేదు. అయినా ఏదో విధంగా దేశం నుంచి వెళ్లిపోవాలని వీరు ఆశిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, తమదైన శైలిలో జనాన్ని కంట్రోల్ చేస్తున్న తాలిబాన్లు

కాబుల్‌లో ఎక్కడికెళ్లినా సాయుధ తాలిబాన్లు కనిపిస్తున్నారు.

కానీ చాలా వరకు ప్రజలతో ఫ్రెండ్లీగానే ఉంటున్నారు.

ఈ వారం ప్రారంభంలో కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద కనిపించిన ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి.

కొందరు తమ పిల్లలను అమెరికా సైనికులకు అప్పగించారు.

కొద్ది రోజుల కిందట టేకాఫ్ అవుతున్న విమానానికి వేలాడుతూ కిందపడి చనిపోయిన వారిలో అఫ్గాన్ యువ ఫుట్‌బాలర్ ఉండటం మరింత విషాదాన్ని కలిస్తోంది.

అఫ్గాన్ నేషనల్ యూత్ టీంకు ఆడిన 19 ఏళ్ల జాకీ అన్వారీ, భవిష్యత్తు ఏమవుతుందో తెలియని అనిశ్చితిలో ఉన్న ఈ తరం అఫ్గాన్లలో ఒకరు.

అఫ్గాన్

ఫొటో సోర్స్, Getty Images

నిన్నటి అఫ్గానిస్తాన్ అప్డేట్స్ సంక్షిప్తంగా:

  • కాబుల్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. వేలాది మంది దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తుండడంతో విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
  • జర్మన్ న్యూస్ చానల్ డాయిష్ వెల్లె (డిడబ్ల్యు) తమ సంస్థలో పని చేసే జర్నలిస్టులలో ఒకరి బంధువును తాలిబాన్లు కాల్చి చంపారని తెలిపింది.
  • అఫ్గానిస్తాన్ గత ప్రభుత్వంలో, నాటో దళాల్లో పని చేసిన వారి కోసం తాలిబాన్లు వెతుకుతున్నారని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో హెచ్చరించింది.
  • హజారా మైనారిటీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని తాలిబాన్లు హింసించి, హత్య చేశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది.
కాబుల్

ఫొటో సోర్స్, AFP

ఆ విమానంలో ఉన్నది 640 మంది కాదు, 823 మంది

ఆదివారం నాడు కాబుల్ నుంచి ఖతార్‌కు బయలుదేరిన అమెరికా సైనిక విమానంలో 640 మంది ప్రయాణించినట్లు వార్తలు వచ్చాయి.

నిజానికి, ఆ విమానంలో మొత్తం 823 మంది ప్రయాణించారని అమెరికా మిలటరీ ఎయిర్ మొబిలిటీ కమాండ్ తెలిపింది. ముందు లెక్కించినప్పుడు 183 మంది పిల్లలను పరిగణనలోకి తీసుకోలేదని వారన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, AFP

తాలిబాన్లకు చిక్కని ఏకైక ప్రాంతం

అఫ్గానిస్తాన్‌ను దాదాపు పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబాన్లకు ఇంకా ఒక ప్రాంతం నుంచి మాత్రం ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. అదే పంజ్‌షీర్ లోయ.

పంజ్‌షీర్ లోయకు పోరాటాల గడ్డగా పేరుంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మాసూద్ సోవియట్-అఫ్గాన్ యుద్ధంలో ప్రత్యర్థిని తమ ప్రాంతంలోకి రాకుండా నిలువరించారు. ఆ తరువాత ప్రచ్ఛన్న యుద్ధంలో, తాలిబాన్లతో సాగిన పోరులో కూడా ఆయనదే పైచేయి అయింది. 2001లో ఆయన చనిపోయేంత వరకు పంజ్‌షీర్ ప్రాంతాన్ని ఎవరూ గెలవలేదు.

అయితే, తాలిబాన్లు పూర్తి స్థాయిలో దాడులకు దిగితే పంజ్‌షీర్ ఇప్పుడు తట్టుకోలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

'తాలిబాన్లతో క్రికెట్‌కు సమస్య లేదు, శ్రీలంక టూర్ ఉంటుంది'

అఫ్గాన్ క్రికెట్ జట్టు శ్రీలంకలో పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోందని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు హామిద్ షిన్‌వారీ అన్నారు.

కాబుల్‌లో తమ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉందన్న హామిద్, జట్టులో వాతావరణం ప్రస్తుతం కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, విమానసేవలు తిరిగి ప్రారంభమైన తరువాత శ్రీలంక టూర్ ఉంటుందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

ఈ విషయమై అధికారులతో మాట్లాడుతున్నామని, తాలిబాన్లతో క్రికెట్‌కు ఎలాంటి సమస్యలూ ఉండవని హామిద్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)