ఫ్లైట్-149: ఇరాక్ దాడి చేసినప్పుడు ఈ బ్రిటిష్ విమానం కువైట్‌లో ఎందుకు ల్యాండైంది? రన్‌వేపైనే దీన్ని ఎందుకు ధ్వంసం చేశారు?

ప్రయాణికులు, సిబ్బంది దిగిన తరువాత ప్లైట్ 149ని రన్‌వేపైనే ధ్వంసం చేశారు

ఫొటో సోర్స్, COLIN DAVEY/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రయాణికులు, సిబ్బంది దిగిన తరువాత ప్లైట్-149ని రన్‌వేపైనే ధ్వంసం చేశారు
    • రచయిత, గార్డన్ కొరెరా
    • హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

1990లో ఇరాక్ దాడి చేసినప్పుడు కువైట్‌లో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఫ్లైట్-149 విమానం దిగడం చుట్టూ చాలాకాలంగా వివాదం, రహస్యం ముసురుకుని ఉంది.

1990 ఆగస్టు 1న సాయత్రం బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఫ్లైట్-149 లండన్ నుంచి ఆసియా వెళ్లేందుకు బయలుదేరింది. మార్గమధ్యలో అది కువైట్‌లో ఆగాల్సి ఉంది.

అయితే, అప్పటికే కువైట్‌పై ఇరాక్ దాడి మొదలైంది. దాంతో మిగతా అన్ని ఎయిర్‌లైన్స్ కువైట్‌ వెళ్లకుండా తమ విమానాలను దారి మళ్లించాయి.

కానీ ఫ్లైట్-149 మాత్రం ఆగస్ట్ 2 ఉదయం కువైట్‌లో దిగింది.

ఇరాక్ దాడి తరువాత కువైట్ విమానాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాక్ దాడి తరువాత కువైట్ విమానాశ్రయం

సీక్రెట్ మిషన్ కోసం వెళ్లిందా

బ్రిటన్ ప్రభుత్వం ఈ విమానాన్ని తన సీక్రెట్ మిషన్ కోసం ఉపయోగించుకుందనే వాదన ఒకటి ప్రచారంలో ఉంది.

బ్రిటన్ తన సీక్రెట్ మిషన్ కోసం ఆ విమానాన్ని వాడుకోవడం వల్ల అందులోని ప్రయాణికులు అయిదు నెలల పాటు బందీలుగా ఉండాల్సి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డారనే విమర్శలూ ఉన్నాయి.

బ్రిటిష్ ఎంబసీలో ఎం-16 ఆఫీసర్‌ పేరుతో అండర్‌కవర్ విధులు నిర్వహించిన ఆంథోనీ పైస్‌ను 1988లో కువైట్‌లో రాజకీయ నిఘా కోసం నియమించారు.

'అధికార రహస్యాల చట్టం' కారణంగా గతంలో తాను 'తప్పుడు ఆరోపణలు, అన్యాయాల'కు వ్యతిరేకంగా నోరెత్తలేకపోయానని.. కానీ, ఆనాటి ఘటన బాధితులకు సంఘీభావంగా ఇప్పుడు గళం విప్పుతానని ఆంథోనీ పైస్ ముందుకొచ్చారు.

వీడియో క్యాప్షన్, సీప్లేన్: ఏమిటిది? నీటి మీద ఈ విమానం ఎలా ప్రయాణిస్తుంది

'సైనిక నిఘా వ్యవహారాలలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్-149 బలైందని నాకు అర్థమైంది. అధికారులు ఎన్నిసార్లు ఖండించినా సరే ఇది మాత్రం జరిగింది'' అన్నారు పైస్.

'అక్కడ గూఢచారులను రంగంలోకి దించడానికి మిలటరీ, ప్రత్యేక బలగాలు హడావుడిగా చేసిన ప్రయత్నమని నా నమ్మకం. నాకు, అప్పటి రాయబారికి తెలియకుండానే ఇదంతా జరిగింది'' అని పైస్ బీబీసీతో చెప్పారు.

''నాకు కచ్చితంగా ఏమీ తెలియదు'' అన్నారాయన.

అయితే, ఈ వ్యవహారంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ను పైస్ తప్పుదోవ పట్టించారనే ఆరోపణలూ ఉన్నాయి.

ఫ్లైట్-149 దిగే పరిస్థితులు ఉన్నాయా లేవా అనే విషయంలో పైస్ తప్పుదోవ పట్టించారంటారు. కానీ, పైస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఇరాక్, కువైట్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో 1990 ఆగస్ట్ 1 సాయంత్రం బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రతినిధి ఒకరు తనతో మాట్లాడడం వాస్తవమేనని, అయితే, అప్పటికి ఇరాక్ దాడి మొదలుకాలేదని పైస్ చెప్పారు.

అయితే, ఏ క్షణమైనా దాడులు జరగొచ్చని తాను హెచ్చరించానని.. ముందు రోజు సాయంత్రం బయలుదేరిన విమానం మరునాడు వేకువన దిగాల్సి ఉండడంతో అప్పటికి దాడులు జరగొచ్చని హెచ్చరించినట్లు పైస్ తెలిపారు.

విమానం

మానవ కవచాలుగా

ఆ రోజు ఏం జరిగిందన్నది బ్రిటిష్ ఎయిర్‌వేస్ క్యాబిన్ సర్వీస్ డైరెక్టర్ క్లైవ్ ఎర్తీ గుర్తు చేసుకున్నారు.

కువైట్ చేరగానే మిలటరీ యూనిఫాంలో ఉన్న బ్రిటిషర్ ఒకరు విమానం తలుపు వద్దకు వచ్చి పలకరించారని ఎర్తీ చెప్పారు.

హీత్రూ విమానాశ్రయంలో ఫ్లైట్-149 ఎక్కిన 10 మంది వ్యక్తులను తాను కలవాలి అని ఆయన అడిగారు.

దాంతో వారంతా ముందుకొచ్చి విమానం నుంచి దిగారు. ఆ తరువాత వారిని ఎన్నడూ మళ్లీ చూడలేదని ఎర్తీ తెలిపారు.

''ఆ 10 మందికి నేలపై అడుగుపెట్టడానికి తొలుత అవకాశమిచ్చారు. ఆ తరువాతే పిల్లలు, వృద్ధులు సహా మిగతా ప్రయాణికులకు అవకాశమిచ్చారు'' అని ఎర్తీ బీబీసీతో చెప్పారు.

ఆ తర్వాత విమానాన్ని రన్‌వేపైనే ధ్వంసం చేశారు.

అయితే, ఆ 10 మంది కాకుండా మిగతా ప్రయాణికులు, సిబ్బందిని ఇరాక్ దళాలు బందీలుగా పట్టుకున్నాయని, బందీలుగా పట్టుకున్న తరువాత వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎర్తీ అన్నారు.

''కొందరిని విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ, మరికొందరికి అనుచిత అనుభవాలు ఎదురయ్యాయి, ఇంకొందరు లైంగిక దాడులకు గురయ్యారు. మరికొందరు ఆకలితో మాడిపోయారు'' అన్నారు ఎర్తీ.

పాశ్చాత్య సేనల దాడుల నుంచి రక్షణ కోసం మానవ కవచాలుగా వీరిలో కొందరిని ఇరాక్ బలగాలు వాడుకుని ఉండొచ్చన్నారు ఎర్తీ.

అయితే, అయిదు నెలల తరువాత ఇరాక్ బలగాలు బందీలను విడిచిపెట్టాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

మరి, విమానంలోని ఆ ప్రత్యేకమైన 10 మంది ఎవరు?

'ఆపరేషన్ ట్రోజన్ హార్స్' పుస్తక రచయిత స్టీఫెన్ డేవిస్ తాను ఆ పదిమందిలో కొందరిని ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు.

నిఘా వర్గాలకు సమచారామిచ్చేందుకు గాను ప్రత్యేకమైన ఒక బృందాన్ని రంగంలోకి దించడమే ఆ మిషన్ లక్ష్యమని తాను భావిస్తున్నట్లు స్టీఫెన్ చెప్పారు.

అంత తొందరగా ఆ విమానాశ్రయాన్ని ఇరాక్ దళాలు వారి అధీనంలోకి తీసుకుంటాయని కూడా బ్రిటన్ అధికార వర్గాలు అనుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆ పదిమంది వ్యక్తులు అక్కడ దిగిన తరువాత విమానం తన గమ్యానికి వెళ్లగలుగుతుందని వారు అనుకున్నారని స్టీఫెన్ అన్నారు.

ఆ వ్యక్తుల విమాన టికెట్లకు మిలటరీ ఖాతాల నుంచే డబ్బులు చెల్లించారని, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు కూడా ఈ ఆపరేషన్ గురించి తెలుసన్నది తన నమ్మకమని చెప్పారాయన.

అయితే, బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ 2007లో ప్రతినిధుల సభలో ఆ దేశ ప్రభుత్వం ఇచ్చిన ఒక సమాధానాన్ని ప్రస్తావించింది.

''1990లో సైనిక సిబ్బంది కోసం ఫ్లైట్-149ని బ్రిటన్ ఏ రకంగానూ వాడుకోలేదని పార్లమెంటులో 2007లోనే స్పష్టం చేశారు'' అని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది.

బ్రిటిష్ ఎయిర్‌వేస్ దీనిపై ఏమీ స్పందించలేదు.

స్టీఫెన్ డేవిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టీఫెన్ డేవిస్

'ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాలి'

ఆ రోజు 18 ఏళ్ల జిన్నీ గిల్ తన సోదరితో కలిసి విమానం వెనుక సీట్లలో కూర్చున్నారు. ఆ రోజు తమ పక్కన కూర్చున్న ఇద్దరి గురించి ఆమె చెబుతూ వారు స్పెషల్ ఫోర్సెస్‌కు చెందినవారు అయ్యుంటారని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు.

విమానం దిగేటప్పటికి ఉన్న పరిస్థితులను ఆమె వివరించారు. గ్రౌండ్ స్టాఫ్ ఎవరూ కనిపించలేదని, సమీపంలో బాంబులు పడిన శబ్దం వినిపించిందని చెప్పారు.

''ఏదో తేడా జరిగిందని అర్థమైంది'' అన్నారామె బీబీసీతో.

''ఆ సమయంలో ఏం చేయాలో, ఎక్కడకు వెళ్లాలో కూడా అర్థం కాలేదు'' అన్నారామె.

''ఆనాటి పరిణామాలపై బాధిత ప్రయాణికులకు ఎవరికీ ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. వారికి క్షమాపణ చెప్పాల్సింది'' అన్నారు పైస్.

ఇవి కూడా చదవండి:

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)