అఫ్గానిస్తాన్ శరణార్థులు రాకుండా సరిహద్దుల్లో కంచె వేసిన పాకిస్తాన్

తోర్ఖామ్‌లో పక్కపక్కనే నిలబడిన తాలిబాన్ ఫైటర్లు, పాక్ జవాన్
ఫొటో క్యాప్షన్, తోర్ఖామ్‌లో పక్కపక్కనే నిలబడిన తాలిబాన్ ఫైటర్లు, పాక్ జవాన్
    • రచయిత, సారా అతిక్
    • హోదా, బీబీసీ న్యూస్

అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో పైకి చూడటానికి అంతా సవ్యంగానే కనిపిస్తోంది. అయితే, జాగ్రత్తగా పరిశీలిస్తేనే ఇక్కడ పరిస్థితులు ఎలా మారాయో తెలుస్తుంది.

సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల దగ్గర రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ జెండాలను తొలగించారు. ఇక్కడ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌కు చెందిన తెల్ల జెండాలు ఎగురుతున్నాయి.

అఫ్గాన్ భద్రతా బలగాలు పహారా కాసేచోట నేడు తుపాకులతో తాలిబాన్ మిలిటెంట్లు కనిపిస్తున్నారు.

పాకిస్తాన్‌తో సరిహద్దుల్లోని అత్యంత రద్దీగా ఉండే తోర్ఖామ్ చెక్‌పోస్టు ప్రస్తుతం తాలిబాన్ల ఆధీనంలో ఉంది.

కొన్ని రోజుల క్రితం ఇక్కడ వందల మంది ప్రజలు గుమిగూడారు. సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లేందుకు వారు రోజుల తరబడి ఎదురుచూశారు.

ఇక్కడ తక్కువ సంఖ్యలోనున్న భద్రతా బలగాలు తాలిబాన్ల ఎదుట లొంగిపోయాయి.

చేతిలో బిడ్డతో పాక్‌లోకి అడుగుపెట్టిన అఫ్గాన్ పౌరుడు
ఫొటో క్యాప్షన్, చేతిలో బిడ్డతో పాక్‌లోకి అడుగుపెట్టిన అఫ్గాన్ పౌరుడు

ముందే మూసేశారు...

ఇక్కడ భీకర కాల్పులు జరుగుతాయనే ఆందోళనల నడుమ, తాలిబాన్లు అధికారంలోకి రాకముందే పాక్ సరిహద్దులను మూసివేసింది.

అయితే, ఆ తర్వాత మళ్లీ వాణిజ్య అవసరాల కోసం దీన్ని తెరిచిపెట్టింది. సరైన అనుమతులతో వచ్చే కొంతమందిని కూడా పాక్‌లో అడుగుపెట్టేందుకు అనుమతిస్తున్నారు.

సాధారణంగా ఈ రెండు దేశాల మధ్య రోజుకు 6,000 నుంచి 7,000 మంది అటూఇటూ వెళ్తుంటారు. ఇప్పుడైతే అఫ్గాన్ వైపు నుంచి పాక్‌లోకి అడుగుపెడుతున్న వారి సంఖ్య 50లోపే ఉంటోంది.

మరోవైపు పాక్‌లోకి అడుగుపెట్టేందుకు మునుపటి కంటే చాలా ఎక్కువ సమయం పడుతోంది. పౌరుల పేరుతో మిలిటెంట్లు తమ భూభాగంలోకి అడుగుపెట్టకుండా చూస్తున్నామని పాక్ భద్రతా అధికారి తెలిపారు. అందుకే సరిహద్దుల్లో తనిఖీల ప్రక్రియను ముమ్మరం చేశామని వివరించారు.

దశాబ్దాల పాటు తోర్ఖామ్ చెక్‌పోస్టు నుంచి చాలా మంది శరణార్థులు పాక్‌లోకి ప్రవేశిస్తూ వచ్చారు.

ఇప్పుడు పాక్‌లో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది.

ముఖ్యంగా తాలిబాన్లు ఎవరినీ బయటకు వెళ్లనివ్వడం లేదు. కేవలం వ్యాపారులు, తగిన ప్రయాణ అనుమతులు ఉన్నవారిని మాత్రమే సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తున్నారు.

పాక్‌లోకి అడుగుపెట్టేందుకు వేచి చూస్తున్న అఫ్గాన్‌వాసులు
ఫొటో క్యాప్షన్, పాక్‌లోకి అడుగుపెట్టేందుకు వేచి చూస్తున్న అఫ్గాన్‌వాసులు

ఎందుకు వెళ్లడం లేదు?

శరణార్థులు పాక్‌వైపు వెళ్లేందుకు సిద్ధంగా లేకపోవడానికి ఇది మాత్రమే కారణం కాదు.

ఇటీవల కాలంలో హింస చెలరేగడంతో అఫ్గానిస్తాన్ వెంబడి సరిహద్దులను పటిష్ఠమైన కంచెలతో పాక్ దిగ్బంధించింది. నేడు సరిహద్దుల్లో చెక్‌పోస్టుల దగ్గర భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. దీంతో ప్రభుత్వ అనుమతి లేకుండా అఫ్గాన్ శరణార్థులు పాక్‌లో అడుగుపెట్టడం దాదాపు అసాధ్యంగా మారింది.

సరిహద్దుకు కేవలం కొన్ని మీటర్ల దూరంలో 56ఏళ్ల ఆషాన్ ఖాన్ తన లగేజీని ట్యాక్సీ నుంచి తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆయన అఫ్గాన్ నగరం జలాలాబాద్‌ నుంచి వస్తున్నారు.

‘‘ఈ సరిహద్దుల గుండా చిన్నప్పటి నుంచీ నేను ప్రయాణిస్తున్నాను. ఎలాంటి చెకింగ్‌లు లేకుండా మేం ఒకప్పుడు జలాలాబాద్‌కు వెళ్లేవాళ్లం’’అని ఖాన్ వివరించారు.

జూన్ 2016 నుంచి పాక్‌లోకి అడుగుపెట్టే అఫ్గాన్ వాసులకు పాస్‌పోర్టు, వీసా తప్పనిసరి చేస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సరిహద్దుల్లో అఫ్గాన్ వాసులు

ఫొటో సోర్స్, Getty Images

‘‘ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న శరణార్థులు ఈ సరిహద్దులకు ఎలా వస్తారు. చదువుకోని, పేద అఫ్గాన్ వాసులు ఈ సమయంలో పాస్‌పోర్టు, వీసాలను ఎలా తీసుకురాగలరు?’’అని ఖాన్ ప్రశ్నించారు.

తోర్ఖామ్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని పాక్‌లో ఓ చిన్న మార్కెట్‌లో అఫ్గాన్ వాసులు ఎక్కువగా కనిపిస్తుంటారు.

ఒవైద్ అలీకి ఇక్కడ ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఉంది. అయితే, తాలిబాన్ల ఆక్రమణ అనంతరం ఈ మార్కెట్‌లో అఫ్గాన్ శరణార్థులు కనిపించడంలేదని ఆయన వివరించారు.

‘‘కొన్ని రోజుల క్రితం, ప్రధాన నగరాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నప్పుడు, వారి పాలన కింద జీవించడంపై కొంతమంది అఫ్గాన్‌వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడు వారు ఎలా జీవిస్తున్నారో ఏమో’’అని అలీ అన్నారు.

దాదాపు 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు పాక్‌లో జీవిస్తున్నారు. వీరిలో సగం మంది రిజిస్ట్రేషన్‌లేని శరణార్థులే.

అయితే, ఇప్పటికే తాము పరిమితికి మించి శరణార్థులను తీసుకున్నామని పాక్ ప్రభుత్వం చెబుతోంది. ఐక్యరాజ్యసమితి పదేపదే అభ్యర్థిస్తున్నప్పటికీ, ఇకపై తాము శరణార్థులను తీసుకోలేమని పాక్ వివరిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)