అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి. తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.
అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలు గత పది రోజుల్లో ఒక్కొక్కటిగా తాలిబాన్ల అధీనంలోకి వెళ్తుండడంతో ఘనీపై రాజీనామా చేయాలనే ఒత్తిడి తీవ్రమైంది.
కాబుల్ నగరంలో ఈ ఉదయం నుంచి పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. తాలిబాన్లు దేశ రాజధాని కాబుల్‌లోకి అన్ని వైపుల నుంచీ ప్రవేశించారు.
నగరాన్ని తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం తూపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఈ పేలుళ్ల శబ్దాలు వస్తున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
అధ్యక్ష భవనంలోకి తాలిబాన్లు
శాంతి, సుస్థిరత కోసమే కాబుల్‌లోకి తమ బలగాలు ప్రవేశించాయని తాలిబాన్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
కాబుల్‌లోని అధ్యక్ష భవనం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని రిపోర్టులు వస్తున్నాయి.
అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అనంతరం ఇక్కడ ఏం జరుగుతుందో స్పష్టతలేదు.
''భవంనలోని సిబ్బందిని బయటకు వెళ్లిపొమ్మని తాలిబాన్లు చెప్పారు. దీంతో భవనం ఖాళీ అయ్యింది. ఈ భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు''అని స్థానిక జర్నలిస్టు బిలాల్ సర్వారీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వియత్నాంతో పోల్చొద్దు.. ఇక్కడ మేం సఫలం అయ్యాం: అమెరికా
అఫ్గాన్‌లో పరిస్థితులను వియత్నాంతో పోల్చడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ మాట్లాడారు.
అఫ్గాన్‌లో తమ మిషన్ సఫలం అయిందని, వియత్నాంతో దీన్ని పోల్చొద్దని ఆయన అన్నారు.
వియత్నాంలోనూ ఇలానే హడావిడిగా తమ కార్యకలాపాలను అమెరికా ముగించాల్సి వచ్చింది.
అఫ్గాన్‌లోని దౌత్య కార్యాలయాన్ని మొత్తంగా ఖాళీ చేసినట్లు అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త మీడియాతో చెప్పారు. మొత్తం అందరినీ కాబూల్ విమానాశ్రయానికి తరలించామని వివరించారు.
మరోవైపు దౌత్య కార్యాలయంపై అమెరికా పతాకాన్ని కూడా తొలగించారు.

ఫొటో సోర్స్, EPA
అఫ్గాన్ ప్రజలపై తాము ఎలాంటి ప్రతీకారమూ తీర్చుకోబోమని తాలిబాన్ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
''అఫ్గాన్ ప్రజల ప్రాణాలు, వారి ఆస్తి హక్కులకు ఎలాంటి నష్టమూ కలగబోదని మేం హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా కాబుల్‌లోనూ ప్రజల భద్రతకు మేం అండగా నిలబడతాం''అని తాలిబాన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ చెప్పారు.
''మేం ప్రజల సేవలకులం. ఈ దేశానికి సేవ చేస్తాం''అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''మహిళల హక్కులను గౌరవిస్తాం''
మహిళల హక్కులు, మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి వివరించారు.
కేవలం దాదాపు పది రోజుల్లో భారీగా నగరాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడంపై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై మళ్లీ ఆంక్షలు విధిస్తారేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదివరకు 1996, 2002లో అఫ్గాన్‌తో తాలిబాన్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు, షరియా చట్టాలను అమలుచేశారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు రాళ్లతో కొట్టడం, దొంగతనం చేస్తే కాళ్లు, చేతులు నరికేయడం, 12ఏళ్లకుపైబడిన బాలికలు చదువుకోకుండా అడ్డుకోవడం తదితర విధానాలను వారు అమలుచేశారు.
మళ్లీ మహిళల విషయంలో ఇలాంటి విధానాలనే అమలుచేస్తారని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో తాజాగా తాలిబాన్ అధికార ప్రతినిధి స్పందించారు.
మహిళలు ఇంటి నుంచి బయటకు ఒంటరిగా రావొచ్చని చెప్పారు. చదువుకోవచ్చని, ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చని వివరించారు.
అయితే, ఇటీవల అఫ్గాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను తాలిబాన్లు అధికారంలోకి తీసుకున్నారు. అక్కడ ఓ బ్యాంకులో పనిచేస్తున్న మహిళలను ఉద్యోగాలకు రావొద్దని వారు సూచించారు. వారి స్థానంలో మగవారు వచ్చి విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. మరోవైపు మహిళలు బయటకు ఒంటరిగా రాకుండా అడ్డుకుంటున్నారని, బుర్ఖా తప్పకుండా వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా వ్యూహం ఏమైనా మారుతుందా?
గత పది రోజుల్లో తాలిబాన్లు వేగంగా నగరాలు, పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్న తరుణంలో అమెరికా వ్యూహాలు ఏమైనా మారతాయా? అని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
దీనిపై అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడారు. తమ వ్యూహంలో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టంచేశారు.
తమ సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చేందుకు చేపడుతున్న ప్రయత్నాల్లో తాలిబాన్లు జోక్యం చేసుకుంటే తమ వ్యూహాలు మారొచ్చని అన్నారు. లేని పక్షంలో సెప్టెంబరు మధ్యనాటికి అఫ్గాన్ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తామని స్పష్టంచేశారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇటీవల ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. అఫ్గాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం పట్ల తాను ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయబోనని అన్నారు.
అఫ్గాన్ ప్రజలందరూ దేశంలోనే ఉండాలని, 'తాలిబాన్లకు అన్ని వర్గాల ప్రజలు' కావాలని, భవిష్యత్తులో బాధ్యత కలిగిన ప్రభుత్వంతో ఏర్పడే ఇస్లామిక్ వ్యవస్థలో అందరూ ఉండాలని కూడా వారు ఆ ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, కాబుల్‌లో అక్కడక్కడా కాల్పుల శబ్దాలు వినిపించాయని, తాలిబాన్ మిలిటెంట్లు జెండాలు పట్టుకుని నగర వీధుల్లో కనిపించారనే వార్తలు వస్తున్నాయి.
కాబుల్ శివార్లలోని బాగ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌ను, జైలును తమ అధీనంలోకి తీసుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు.
దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రాంతం తాలిబాన్లు, అల్ ఖైదాల వ్యతిరేక పోరాటాలకు కేంద్రంగా ఉండింది. అమెరికా సేనలు గత నెలలో రాత్రికి రాత్రి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 2001 డిసెంబర్‌లో ఇక్కడికి వచ్చిన అమెరికా నేతృత్వంలోని సైనిక బలగాలు బాగ్రామ్‌ను భారీ సైనిక స్థావరంగా మార్చాయి. ఇక్కడ దాదాపు 10,000 మంది సైనికులు ఉండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ స్థావరాన్ని జార్జ్ డబ్ల్యు. బుష్, బరాక్ ఒబామా, డోనల్డ్ ట్రంప్ ముగ్గురూ అమెరికా అధ్యక్ష హోదాలో సందర్శించారు.
బాగ్రామ్‌లోనే ఉన్న జైలులో దాదాపు 5,000 మంది తాలిబాన్లు ఖైదీలుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారందరినీ విడిచిపెట్టినట్లు తాలిబాన్ వర్గాలు చెబుతున్నాయి.
దీన్ని మొదట అమెరికన్లే నిర్మించారు. 2013లో అఫ్గాన్ ప్రభుత్వానికి అప్పగించారు.
అఫ్గానిస్తాన్ నుచి దశాబ్దానికి పైగా విస్తృతంగా వార్తలు అందిస్తున్న బీబీసీ ప్రతినిధి యాల్దా హకీమ్, రాజధాని కాబుల్ నగరంలో మిలిటెంట్లకు పెద్దగా ప్రతిఘటన కనిపించలేదని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అఫ్గానిస్తాన్ అధ్యక్ష కార్యాలయానికి చెందిన ట్విటర్ అకౌంట్‌లో కాసేపటి కిందట పోస్ట్ అయిన సమాచారం ప్రకారం, తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపింది.
కాబుల్‌లో అక్కడక్కడా కాల్పుల ఘటనలు జరిగాయని, కానీ, నగరం మీద దాడి జరగలేదని, దేశ రక్షణ దళాలు, అంతర్జాతీయ సేనల సమన్వయంతో నగరాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో ఉన్నాయని ఆ సందేశంలో తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని కూడా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, ప్రజలు రాజధాని నగరం నుంచి పారిపోయేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని కాబుల్‌లోని అఫ్గాన్ ఎంపీ ఫర్జానా కొచాయి బీబీసీతో చెప్పారు.
"వాళ్లు ఎక్కడికి వెళ్లగలరో తెలియడం లేదు. వాళ్లు ఇప్పుడు ఎక్కడికీ పోలేరు. కాబుల్ నుంచి ఈరోజు బయలుదేరుతున్న విమానాలన్నీ నిండిపోయాయి. కొంతమంది భారతదేశానికి వెళ్తున్నామని చెప్పారు. మరికొందరు పొరుగు దేశాలకు వెళ్తున్నామన్నారు" అని ఫర్జానా చెప్పారు.
తాలిబాన్ల అధీనంలోకి వెళ్లిపోయిన ఇతర ప్రాంతాల్లోని మహిళలు ఇకపై తాము ఏ పనీ చేయలేమని, స్కూలుకు వెళ్లలేమని తనతో చెప్పారని ఫర్జానా వివరించారు.
"మహిళల పరిస్థితి ఊహించిన దానికన్నా మరీ దారుణంగా ఉంది. ఇక వాళ్లు గృహ నిర్బంధంలో ఉండాల్సిందే. ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి ఇదే. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో?' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికే ప్రధాన నగరాలు తాలిబాన్ల చేతుల్లో...
ఉత్తర అఫ్గానిస్తాన్‌లో చాలా ప్రాంతాలు శనివారం నాటికే తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రాంతీయ రాజధానుల్లో సగానికిపైగా వారి ఆధీనంలోనే ఉన్నాయి.
ప్రజలను ఉద్దేశించి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రసంగించారు. యుద్ధ ప్రభావం ప్రజలపై పడనివ్వమని, మరిన్ని మరణాలు సంభవించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. అయితే, తమ ప్రణాళికలు ఏమిటో వెల్లడించలేదు.
దేశ రాజధాని కాబూల్‌కు తాలిబాన్లు సమీపంలోకి వచ్చేశారు. కాబూల్‌కు 40 కి.మీ. దూరంలోని మైదాన్ షార్ ప్రాంతంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు కాబూల్‌కు కేవలం ఏడు మైళ్ల దూరంలోని చార్ అస్యబ్ జిల్లాలోనూ తాలిబాన్లు పోరాడుతున్నారని ఏపీ వార్తా సంస్థకు చట్టసభ సభ్యుడొకరు తెలిపారు.
ఉత్తర అఫ్గాన్‌లోని ప్రభుత్వ ఆధీనంలోనున్న ఏకైక ప్రధాన నగరం మజర్-ఏ-షరీఫ్‌లోనూ భీకర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
తమ దేశ పౌరులను తమ దౌత్య కార్యాలయాల నుంచి సురక్షితంగా తీసుకెళ్లేందుకు అమెరికా దళాలు వస్తున్నాయి. మరోవైపు 600 మంది బ్రిటిష్ సిబ్బంది కూడా తమ పౌరులను తీసుకెళ్లేందుకు వస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
కేవలం ఏడు మైళ్ల దూరంలో..
దేశ రాజధాని కాబూల్‌కు కేవలం ఏడు మైళ్ల దూరంలోని చార్ అస్యబ్ జిల్లాకు తాలిబన్ల చేరుకున్నారని స్థానిక చట్టసభ సభ్యుడు శనివారం నాడు వార్తా సంస్థ ఏపీతో చెప్పారు.
ఈ విషయాన్ని బీబీసీ ధ్రువీకరించలేదు.
ఒకవేళ ఇదే నిజమైతే, ప్రభుత్వానికి తాలిబాన్లు అత్యంత సమీపంలోకి వచ్చినట్లే. అఫ్గాన్ భద్రతా బలగాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో ఏమైంది?
1996లోనూ ఇలానే భద్రతా బలగాలతో పోరాడి కాబూల్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాలుగేళ్లపాటు అంతర్యుద్ధం కొనసాగిన అనంతరం దేశ రాజధాని తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లింది.
నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను తాలిబాన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగిరాయి.
ఆ తర్వాత అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ నజీబుల్లాను తాలిబాన్లు బహిరంగంగా ఉరితీశారు.
ఆ తర్వాత తాలిబాన్లు తమ సొంత విధానాలతో పాలనను మొదలుపెట్టారు. బాలికలు పాఠశాలకు వెళ్లడంపై ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు వస్తే, మహిళలు బుర్ఖా తప్పకుండా వేసుకోవాలని, మగవారు పక్కన ఉంటేనే బయటకు రావాలనే నిబంధనలు తీసుకొచ్చారు.
మరణ శిక్షలు, చేతులు కాళ్లు నరికేయడం తదితర కఠిన శిక్షలను తాలిబాన్లు అమలు చేసేవారు.
దేశ అధ్యక్షుడు ఏం అన్నారు?

ఫొటో సోర్స్, AJJAD HUSSAIN/AFP via Getty Images
అఫ్గానిస్తాన్‌పై తాలిబాన్ల పట్టు బిగుస్తున్న సమయంలో దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘హింసతోపాటు పరిస్థితులు మరింత దిగజారకుండా అడ్డుకోవడమే అధ్యక్షుడిగా నా తొలి ప్రాధాన్యం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస పోతున్న ప్రజలకు అండగా నిలుస్తాం’’అని అఫ్గాన్ ప్రజలకు ఘనీ భరోసా ఇచ్చారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా బలగాలను ఒక చోటకు సమీకరించడంపై మేం దృష్టి సారిస్తున్నాం. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నాం’’అని ఆయన చెప్పారు.
‘‘ఈ యుద్ధం భారం ప్రజలపై పడినివ్వం. మరిన్ని మరణాలు సంభవించకుండా అడ్డుకుంటాం’’అని ఘనీ అన్నారు. నగరాల్లో తాలిబాన్లతో ధైర్యంగా పోరాడుతున్న భద్రతా బలగాలను ఆయన ప్రశంసించారు.
రాజీనామా చేస్తారనే వార్తల నడుమ, ఘనీ ప్రజల ముందుకొచ్చి ప్రసంగించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాబూల్‌కు ఎంత దూరంలో ఉన్నారు?
చాలా ప్రాంతాల్లో భీకర కాల్పుల నడుమ సురక్షితమైన రాజధాని నగరం కాబూల్‌కు ప్రజలు పరుగులు తీస్తున్నారు. మరోవైపు తాలిబాన్లు ఒకటి తర్వాత ఒకటిగా అన్ని నగరాలపై పట్టు సాధిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్‌కు కూడా వారు చేరువలోనే ఉన్నారు.
కాబూల్ ప్రావిన్స్ ప్రధాన గేట్ల దగ్గర తాలిబాన్లపై అమెరికా సేనలు వైమానిక దాడులు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
కాబూల్ నగరంపై మరో 30 రోజుల్లో తాలిబాన్లు పట్టు సాధించే అవకాశముందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత వారంలో అఫ్గాన్‌లోని చాలా ప్రధాన నగరాలు వరసగా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోతూ వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
శుక్రవారం రాత్రి కూడా లోఘార్ ప్రావిన్స్ రాజధాని పుల్-ఏ-ఆలం నగరాన్ని తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది కాబూల్‌కు కేవలం 80 కి.మీ. దూరంలో ఉంది.
కాబూల్‌కు 40 కిమీ. దూరంలోని మైదాన్ షార్ నగరంలోనూ విధ్వంసకర ఘర్షణలు చెలరేగుతున్నాయి.
సగానికిపైగా ప్రావిన్స్‌లలోని రాజధానులు ఇప్పటికే తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా తాలిబన్ నగరాల జాబితాలో చేరిపోయింది.
అఫ్గాన్‌లో పరిస్థితులు చేజారిపోతున్నాయని, దీని భారం ప్రజలపై పడుతోందని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వస్తే మళ్లీ షరియా చట్టాన్ని అమలు చేస్తామని తాలిబన్ కమాండర్లు బీబీసీతో చెప్పారు. అక్రమ సంబంధాల జోలికి వెళ్తే రాళ్లతో కొట్టడం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం, 12ఏళ్లకుపైబడిన అమ్మాయిలను పాఠశాలలకు వెళ్లకుండా అడ్డుకోవడం తదితర నిబంధనలను వారు ఇదివరకు అమలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఘనీ రాజీనామా చేయరు’’
తాజా ప్రసంగం అనంతరం ఘనీకి రాజీనామా చేసే ఆలోచన లేదని తెలుస్తోందని అఫ్గాన్‌లోని బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ అన్నారు.
‘‘తాలిబాన్లపై పోరాటానికి భద్రతా బలగాలను మళ్లీ సమీకరించడంపై ఆయన మాట్లాడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అర్థంకావడం లేదు.’’
‘‘కాబూల్‌లో చాలా మంది తాలిబన్లను వ్యతిరేకిస్తున్నారు. అయితే తాలిబాన్ల చేతుల్లోకి కాబూల్ వెళ్లిపోవడం కంటే, ఇక్కడ జరిగే యుద్ధం గురించే ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు’’అని కిర్మానీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












