అఫ్గానిస్తాన్‌లో పట్టు బిగిస్తున్న తాలిబన్లు, హేల్‌మంద్ రాజధానిపై ఆధిపత్యం కోసం భీకర పోరాటం

అఫ్గాన్ దళాలు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా, అఫ్గానిస్తాన్ దళాలు వరుస వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ, తాలిబన్ ఫైటర్లు హేల్‌మంద్ ప్రావిన్స్ రాజధాని లష్కర్ గాహ్‌లో అడుగుపెట్టారు.

తాలిబన్లు ఒక టీవీ స్టేషన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

"ఇక్కడ నలువైపులా యుద్ధం జరుగుతోంది" అని నగరంలోని ఒక ఆస్పత్రిలో డాక్టర్ బీబీసీతో చెప్పారు.

హేల్‌మంద్ ప్రావిన్స్ మొదటి నుంచి అమెరికా-బ్రిటన్ సైనిక ఆపరేషన్లకు కేంద్రంగా ఉంది.

ఇప్పుడు దాని రాజధాని లష్కర్ గాహ్ మీద తాలిబన్లు పట్టు సాధిస్తే, అది అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అవుతుంది.

లష్కర్ గాహ్ తాలిబన్ల అదుపులోకి వస్తే 2016 తర్వాత వారి నియంత్రణలోకి వచ్చిన ఒక ప్రావిన్స్ రాజధాని నగరం ఇదే అవుతుంది.

అఫ్గాన్ దళాలు

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

రేడియో, టీవీ చానళ్ల ప్రసారాలకు బ్రేక్

తాలిబన్ల దాడులు, బెదిరింపులతో హేల్‌మంద్‌లోని 11 రేడియో, నాలుగు టీవీ చానళ్లు ప్రసారాలు నిలిపివేశాయని సోమవారం అఫ్గానిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పింది.

సెప్టెంబర్ నాటికి విదేశీ సైనిక బలగాలు వెనక్కు వెళ్లిపోతాయని ప్రకటించినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్ల ఆక్రమణ వేగంగా పెరిగింది.

ఇక్కడ మానవతా సంక్షోభం భయంతోపాటూ ప్రభుత్వ బలగాలు ఎన్నిరోజులు వారిని ఎదురొడ్డి నిలుస్తాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

అఫ్గానిస్తాన్‌లో యుద్ధం

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ విశ్లేషణ

తాలిబన్ల మొత్తం ఫోకస్ అఫ్గానిస్తాన్‌లోని నగరాలపైనే ఉంది.

పరిస్థితులు మారుతున్నాయి. కానీ ఎంతోమంది అమెరికన్లు, బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన హేల్‌మంద్ ప్రాంత రాజధాని లష్కర్ గాహ్ ఇప్పుడు అత్యంత బలహీన స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్లు.. పలు రాష్ట్రాల్లో చెలరేగిన హింస

నగరం మధ్యలో తాలిబన్ ఫైటర్లు తిరుగుతున్న వీడియోలను వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

"తాలిబన్లను వెనక్కు తరిమికొట్టడానికి సాయం కోసం అఫ్గాన్ ప్రత్యేక బలగాలను పంపించారు. అయినా వాళ్లు ముందుకు చొచ్చుకు రావడం వారి బలాన్ని చూపిస్తోంది" అని ఒక స్థానికుడు మాకు చెప్పారు.

తాలిబన్ మిలిటెంట్లు సామాన్యుల ఇళ్లలో ఆశ్రయం పొందినట్లు చెబుతున్నారు. దాంతో వారిని ఎదుర్కోవడం కష్టమవుతోంది. ముందు ముందు యుద్ధం మరింత రక్తసిక్తం అయ్యేలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)