అఫ్గానిస్తాన్, తాలిబన్, అమెరికా: రెండు దశాబ్దాల యుద్ధంలో 10 ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, AFP
ఇరవై ఏళ్ల పాటు సాగిన యుద్దం తర్వాత అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంది. అమెరికా, దాని మిత్ర దేశాలకు బగ్రామ్ వైమానిక స్థావరం కీలకమైన ప్రాంతంగా ఉండేది. విదేశీ సేనలు ఇప్పుడు ఆ స్థావరాన్ని ఖాళీ చేశాయి.
ఇప్పుడు తాలిబన్ దళాలు దేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమిస్తున్నాయి.
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు 2001 డిసెంబర్‌లో అఫ్గానిస్తాన్‌లో ప్రవేశించాయి. బగ్రామ్ ఎయిర్ బేస్‌ను 10 వేలమంది సైనికులతో తమ స్థావరంగా మార్చుకున్నాయి.
కానీ, తాము సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన తర్వాత ఈ ప్రాంతం ఖాళీ అవుతోంది.
విదేశీ సైన్యాలు వెళ్లిపోవడంతో తాలిబన్‌లు మళ్లీ విస్తరించే పని ప్రారంభించారు. అఫ్గానిస్తాన్‌లోని అనేక ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు.
ఈ యుద్ధం వల్ల అటు డబ్బుకు, ఇటు ప్రాణాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అసలు, ఈ 20 ఏళ్ల యుద్ధానికి కారణమేంటి? అమెరికా తాను అనుకున్నది సాధించిందా?
ఈ సుదీర్ఘ పోరాటంలోని 10 ముఖ్యాంశాలు:

ఫొటో సోర్స్, Getty Images
1. అమెరికా ఎందుకు అఫ్గానిస్తాన్ వచ్చింది?
అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రవాద దాడుల్లో సుమారు మూడు వేల మంది మరణించారు.
ఈ దాడుల కోసం ఉగ్రవాదులు విమానాలను ఉపయోగించారు. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై విమానాలతో దాడి చేశారు. పెన్సిల్వేనియాలో ఒక విమానం కూలిపోయింది.
ఈ దాడులు తామే చేశామని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ప్రకటించారు.
అప్పట్లో అఫ్గానిస్తాన్ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ 'తాలిబన్'ల పాలనలో ఉండేది. తాలిబన్‌లు అల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను పోషించారు. లాడెన్‌ను అమెరికాకు అప్పగించడానికి తాలిబన్‌లు నిరాకరించారు.
ఈ పరిస్థితులో సెప్టెంబర్ 11 దాడులకు కారణమైన రెండు ఉగ్రవాద గ్రూపులు అల్-ఖైదా, తాలిబన్‌లను తుద ముట్టించడానికి అమెరికా యుద్ధం మొదలు పెట్టింది.

ఫొటో సోర్స్, AFP
2. అఫ్గాన్‌లో 2004లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు
అమెరికా, దాని మిత్రదేశాలు, అఫ్గానిస్తాన్ మిత్ర దేశాలు వైమానిక దాడులతో కేవలం రెండు నెలల్లోనే తాలిబన్‌లను ఓడించాయి. చాలామంది తాలిబన్, అల్-ఖైదా గ్రూపులకు చెందిన మిలిటెంట్లు పాకిస్తాన్ పారిపోయారు
అయితే, కొన్నాళ్ల తర్వాత మళ్లీ వారంతా అఫ్గానిస్తాన్‌కు వచ్చారు. డ్రగ్స్, మైనింగ్, పన్నుల రూపంలో తాలిబన్‌లు మిలియన్ డాలర్లు డబ్బు సంపాదించారు.
2004లో, అఫ్గానిస్తాన్‌లో అమెరికా మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ఆ సమయంలో కూడా తాలిబన్‌ల నుంచి ప్రతిఘటన కొనసాగింది. అనేక చోట్ల దాడులు జరిగాయి.
అఫ్గానిస్తాన్, అమెరికా దళాలతో కలిసి పోరాడుతున్న అంతర్జాతీయ సైన్యాలకు తాలిబన్‌లతో వ్యవహరించడం కష్టంగా మారింది. ఈ యుద్ధంలో అనేకమంది అఫ్గాన్ పౌరులు, సైనికులు మరణించారు.

3. అఫ్గానిస్తాన్ వివాదం 2001లోనే మొదలైందా?
దీనికి కచ్చితమైన సమాధానం లేదు. అమెరికా అఫ్గానిస్తాన్‌లో అడుగు పెట్టక ముందే ఆ దేశం దాదాపు రెండు దశాబ్దాలుగా నిరంతరం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
1970ల చివరలో సోవియట్ దళాలు అఫ్గానిస్తాన్‌పై దాడి చేశాయి. తమ కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, సరిహద్దుల్లో స్నేహపూర్వకంగా ఉండే సోషలిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే ఈ దాడుల లక్ష్యం.
అమెరికా, పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియా సహా అనేక దేశాల మద్దతు ఉన్న ముజాహిదీన్లపై రష్యా అప్పట్లో యుద్ధం చేసింది.
సోవియట్ దళాలు 1989లో అఫ్గానిస్తాన్ నుంచి వైదొలిగాయి. అయితే, ఆ దేశంలో అంతర్యుద్ధం మాత్రం కొనసాగింది. ఈ సమయంలోనే తాలిబన్‌లకు బలం పెంచుకునే అవకాశం లభించింది.

4. తాలిబన్లు ఇంత శక్తిమంతంగా ఎలా ఎదిగారు?
తాలిబన్ అంటే హిందీలో విద్యార్ధి అని అర్ధం. 1990ల ప్రారంభంలో ఉత్తర పాకిస్తాన్, నైరుతి అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో తాలిబన్‌లు ప్రాబల్యం సంపాదించుకున్నారు.
అవినీతిపై పోరాడతామని, అఫ్గాన్‌లను కాపాడుతామని వాళ్లు హామీలు ఇచ్చేవారు. అప్పట్లో అంతర్యుద్ధం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. భద్రత వారికి పెద్ద సమస్యగా మారింది.
తాలిబన్‌లు తమ ప్రభావాన్ని వేగంగా విస్తరించి షరియా చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించారు.
ఇస్లాం చట్టం ప్రకారం హత్య, వ్యభిచారం చేసిన నిందితులకు బహిరంగంగా ఉరి తీయడం లాంటి తీవ్రమైన శిక్షలు విధించడం ప్రారంభించారు.
పురుషులు గడ్డం పెంచడాన్ని, మహిళలు బురఖా ధరించడం తప్పనిసరి చేశారు.
టీవీ, సంగీతం, సినిమాలను తాలిబన్‌లు నిషేధించారు. 10 ఏళ్లు దాటిన బాలికలు స్కూళ్లకు రాకుండా నిషేధం విధించారు.
5. తాలిబన్లు ఎప్పుడైనా వెనక్కి వెళ్లారా?
రెండు దశాబ్దాల యుద్ధంలో తాలిబన్లు వెనక్కి తగ్గారు. కానీ, ఎన్నడూ పూర్తిగా తిరోగమన బాట పట్టలేదు. అత్యంత రక్తపాత సంవత్సరంగా భావించిన 2014 తరువాత అంతర్జాతీయ సేనలు అక్కడ నిరవధికంగా ఉండడం గురించి పునరాలోచనలో పడ్డాయి.
తాలిబన్లతో పోరాటాన్ని అఫ్గాన్ సేనలకు వదిలి వారు తమ మిషన్‌ను ముగించారు. అదే అదనుగా తాలిబన్లు మళ్లీ తమ దాడులు పెంచారు. కొన్ని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. 2018 నాటికి తాలిబన్లు అఫ్గానిస్తాన్‌లోని 70 శాతం భూభాగంలో చురుగ్గా ఉన్నారని బీబీసీకి సమాచారం లభించింది.

ఫొటో సోర్స్, SCOTT OLSON
6. యుద్ధానికి ఎంత ఖర్చయింది?
ఈ యుద్ధంలో సుమారు 2,300 మంది అమెరికన్ సైనికులు మరణించారు. 20 వేలమందికి పైగా గాయపడ్డారు. వీరితోపాటు, 450మంది బ్రిటిష్ సైనికులు, వందలమంది ఇతర దేశాల సైనికులు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో అఫ్గానిస్తాన్ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆ దేశ సైన్యానికి చెందిన సుమారు 6 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు.
2009లో ఐక్య రాజ్య సమితి ఇక్కడ జరిగిన మారణ హోమాన్ని అంచనా వేసింది. ఐరాస లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో లక్షా 11 వేలమంది సామాన్య పౌరులు మరణించడమో, గాయపడటమో జరిగింది.
అమెరికా ఈ యుద్ధం కోసం 1 ట్రిలియన్ డాలర్లను ఖర్చు పెట్టినట్లు అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
7. తాలిబన్లతో అమెరికా ఒప్పందం
అఫ్గానిస్తాన్‌లో శాంతి కోసం ఫిబ్రవరి 2020న, అమెరికా, తాలిబన్‌ల మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం
అమెరికా, నాటో మిత్రదేశాలు తమ బలగాలను పూర్తిగా ఈ ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవాలి.
ఇందుకు బదులుగా అల్-ఖైదా లేదా మరే ఇతర ఉగ్రవాద సంస్థను తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో పని చేయకుండా చేసేందుకు తాలిబన్‌లు అంగీకరించారు.
గత సంవత్సరం జరిగిన చర్చల్లో భాగంగా, తాలిబన్‌లు, అఫ్గానిస్తాన్ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న ఖైదీలను విడుదల చేశాయి. దీంతో సుమారు 5 వేల మంది తాలిబన్ ఉగ్రవాదులు విడుదలయ్యారు.
తాలిబన్‌లపై ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు, మరికొన్ని ఆంక్షలపై ఐక్య రాజ్య సమితితో కలిసి పని చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
అఫ్గానిస్తాన్ ప్రభుత్వం లేకుండా అమెరికా నేరుగా తాలిబన్‌లతో చర్చలు జరిపింది. నాటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ''ఇన్నేళ్ల తర్వాత మా సైనికులను ఇంటికి చేర్చడానికి సమయం వచ్చింది'' అన్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
8. అమెరికా సైన్యం వెళ్లిపోతే ఏమవుతుంది?
అమెరికా, నాటో దళాలు బగ్రామ్ వైమానిక స్థావరం నుంచి పూర్తిగా వైదొలిగాయి. ఇప్పుడు దేశ భద్రత బాధ్యత పూర్తిగా అఫ్గాన్ ప్రభుత్వంపై పడింది.
అయితే, సుమారు 650 మంది అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్‌లో కొనసాగుతారని అమెరికాకు చెందిన అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వెల్లడించింది.
ఈ సైనికులను దౌత్యవేత్తలు, కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రత కోసం కొనసాగిస్తున్నారు.
9. ఇప్పుడేం జరుగుతోంది?
అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్‌లు, నగరాల మీద, భద్రతా బలగాల మీదా దాడి చేయకుండా, ప్రజలను భయకంపితులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
విదేశీ సైనికులు వెళ్లిపోవడంతో తాలిబన్‌లు తమ ప్రతాపం చూపించడం ప్రారంభించారు. అఫ్గానిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
మరో వైపు తాలిబన్ మిత్రపక్షం అల్-ఖైదా కూడా రంగంలోకి దిగగా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు కూడా అఫ్గానిస్తాన్‌లో ప్రవేశించారు.
ఈ ఘటనల నేపథ్యంలో అఫ్గానిస్తాన్ భవితవ్యంపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాము మిలిటెంట్లను అణచి వేయగలమని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, POOL
10. ఇరవై ఏళ్ల యుద్ధం విజయవంతమైందా?
''దీనికి సమాధానం మీరు వేసే అంచనాను బట్టి ఉంటుంది''అన్నారు బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డ్‌నర్.
యుద్ధం మొదలైన తర్వాత అఫ్గానిస్తాన్ నుంచి ఒక్క ఉగ్రవాద దాడి కుట్ర కూడా జరగలేదని భద్రతా వ్యవహారాలు చూసే సీనియర్ అధికారులు బీబీసీతో అన్నారు.
''అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించే కోణంలో చూస్తే అక్కడ అమెరికా సైన్యాలు విజయం సాధించినట్లే'' అన్నారు గార్డ్‌నర్.
కానీ, 20 సంవత్సరాల తరువాత కూడా తాలిబన్‌లు ఇంకా అక్కడ ప్రభావ వంతంగానే ఉన్నారు. వారిని పూర్తిగా ఓడించడం కష్టమని రుజువైంది.
కొన్ని రిపోర్టుల ప్రకారం విదేశీ సైన్యాల రాక తర్వాత, ఈ ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లో అత్యంత ఘోరమైన హింస జరిగింది. వందలమంది మరణించారు.
అదే సమయంలో సంవత్సరాల కృషితో సాధించిన పురోగతి కూడా ప్రమాదంలో ఉంది. చాలా పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలను తాలిబన్‌లు కూల్చేశారు.
''అల్-ఖైదా, ఐఎస్, ఇస్లామిక్ స్టేట్ ఇంకా ఇతర ఉగ్రవాద గ్రూపులు పూర్తిగా పోలేదు. అవి మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశీ సైన్యాలు వైదొలగడంతో అవి ముందుకు సాగుతున్నాయి'' అన్నారు గార్డ్‌నర్.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








