దోహా చర్చలు: ‘నా చిన్నప్పుడు తాలిబన్లు మా అమ్మను కొరడాతో కొట్టారు.. ఇప్పుడు బీబీసీ రిపోర్టర్‌గా ప్రశ్నించా’

ఫొటో సోర్స్, Lyse Doucet
- రచయిత, షాజియా హయా
- హోదా, బీబీసీ పాష్తో ప్రతినిధి
''నేను హంతకుడిని కాను. కానీ, ఇంతకాలం నేను మీకు హంతకుడిగానే పరిచయం. నేను రాజకీయాలు మాట్లడడానికి వెళ్లడం లేదు. సమయం చూసుకుని కలుద్దాం.. టీ తాగుతూ మాట్లాడుకుందాం. అప్పుడు కవిత్వం కూడా చెప్తాను'' మందహాసం, మృదువైన మాటలతో అన్నారాయన.
తాలిబన్‌లలోని ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి నేనిలాంటిది ఏమాత్రం ఊహించలేదు.
తాలిబన్‌లు, అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మధ్య ఖతర్‌లోని దోహాలో జరిగిన చర్చల చివరి రోజున ఆయన ఇంటర్వ్యూ అడిగాను నేను.
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే క్రమంలో లాబీల్లో తాలిబన్ ప్రతినిధులు కొందరు కనిపించారు.. వారి చుట్టూ విలేకరులు ఉన్నారు.
'నేను వెళ్లడం లేదు'
''నాలుగు గోడల మధ్య జరిగే చర్చలను కవర్ చేయడం ఎప్పుడూ సవాలే. ఏదీ ఆశాజనకంగా మొదలవలేదు.
దోహా తీరానికి ఎదురుగా ఉన్న విలాసవంతమైన షెరటాన్ హోటల్‌లో నేను దిగిన తొలిరోజు తాలిబన్ సీనియర్ నేత అక్కడ తిరగడాన్ని చూశాను.
వెంటనే వారిని ఇంటర్వ్యూ కోసం సంప్రదించాను. ఆచితూచి రాసే పత్రికా ప్రకటనలకు మించి ఏదైనా విషయం లాగాలంటే ఇలాంటి ముందు అనుకోని ఇంటర్వ్యూలే సరైన మార్గం.
కానీ, నేను వారిని ఇంటర్వ్యూ అడగ్గా.. ''నేను చర్చలకు వెళ్లడం లేదు'' అని చెప్పారాయన.
ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన వెంటనే 'ఈ ఇంటర్వ్యూ నా కొలీగ్ చేస్తారు.. ఆయన పురుషుడే.. నేను కేవలం కెమేరా పట్టుకుంటాను' అని చెప్పాను.
దోహాలో నేను చేయాల్సిన పని స్థాయి ఏంటో నాకు అర్థమైపోయింది.

చివరికి అయిష్టత ప్రదర్శించిన ఆ నాయకుడితో మాట్లాడడానికి వెళ్లాను. ఆయనతో, అక్కడే ఉన్న మరికొందరితో నేను మాట్లాడుతున్నప్పుడు వారెవరూ నన్ను చూసి మాట్లాడడం లేదని గుర్తించాను. పురుష జర్నలిస్టులతో ఉన్నట్లుగా నాతో లేరని, ఇబ్బంది పడుతున్నారని గుర్తించాను.
పరిచయం లేని మహిళల కళ్లలోకి చూడడం వారిని అగౌరవపరిచినట్లు, పాపం చేసినట్లు భావిస్తారు వారు.
సీనియర్ తాలిబన్ ప్రతినిధి ఒకరిని నేను మూడు నిమిషాలు ఇంటర్వ్యూ చేయగా ఆయన ఒక్కసారి కూడా నా కళ్లలోకి చూడలేదు.
మళ్లీ ఎప్పుడైనా ఆయన నాకు కనిపిస్తే నేను నిజాయితీగా ఆయన్ను నమ్మగలను.. అయితే, గతంలో కలిశామని ఆయనకు గుర్తుండకపోవచ్చు.
అయితే, ఇవేవీ నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నవారు మీ ఎదురుగా ఉండి.. మీరడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడమే అనూహ్యమైన విషయం.
కాబట్టి మరిన్ని అనూహ్య ఘటనలకు, సందర్భాలకు నేను సిద్ధమైపోయాను.

చరిత్రాత్మక సందర్భం
అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్‌ల మధ్య నెలల తరబడి సంప్రదింపుల తరువాత ముఖాముఖి కలిసేందుకు తేదీ, ప్రదేశం అంతా నిర్ణయించారు. ఈ చర్చలను కవర్ చేయడం నాకు, మరెంతో మంది అఫ్గాన్ జర్నలిస్టులకు కీలకం అనిపించింది.
దశాబ్దాల రక్తపాతం, హత్యల తరువాత యుద్ధానికి తెర దించేందుకు రెండు పక్షాలూ చర్చలకు అంగీకరించాయి.
నా కళ్ల ముందు చరిత్రంతా కదలాడుతోంది.
2002 నుంచి నేను ఎన్నో ఘటనలు, పరిణామాలు చూశాను. తాలిబన్ల పాలన తరువాత అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినా వెంటనే మిలిటెంట్లపై పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది.
ఇప్పుడు 18 ఏళ్ల తరువాత సయోధ్య కోసం శత్రుపక్షాలు రెండూ చర్చలకు వచ్చాయి.

ఫొటో సోర్స్, Afghan delegation
ఏం ధరించాలి?
కాబూల్ నుంచి దోహా వెళ్లే విమానం గాల్లోకి ఎగిరినప్పటి నుంచి నేను చర్చలకు సంబంధించి ప్రతి కోణాన్నీ ఆలోచిస్తున్నాను. మహిళల హక్కులు, స్వేచ్ఛ, రాజ్యాంగం, రెండు పక్షాలకు సంబంధించిన ఇతర అజెండాలు అన్నీ ఆలోచిస్తున్నాను.
ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి.. ఏమేం ప్రశ్నలు అడగాలి వంటివన్నీ ఆలోచిస్తున్న సమయంలో నా బుర్రలో ఒక సందేహం వచ్చింది.. అది దుస్తుల గురించి. నేనెలాంటి దుస్తులు వేసుకోవాలని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.
మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు.. అలాగే పురుష జర్నలిస్టులకూ ఇదేమంతా ఆలోచించాల్సిన సంగతీ కాదు. కానీ, నాకు మాత్రం ఇది ఆలోచించాల్సిన విషయమే.
మహిళల స్వేచ్ఛ, హక్కులకు సంబంధించిన కఠిన నిబంధనలు విధించే తాలిబన్లను కలవడానికి వెళ్తున్నప్పుడు ఇది కీలకమే. తల నుంచి కాలి వేళ్ల వరకు మొత్తం కప్పుకొనేలా దుస్తులు ధరించినా మరోసారి నాకు ఈ ఆలోచన వచ్చింది.
ఇప్పుడు నేను వేసుకున్న దుస్తులతో పద్దెనిమిదేళ్ల కిందట వీధుల్లో తిరగలేని పరిస్థితి.
అప్పట్లో తాలిబన్లు మహిళలకు డ్రెస్ కోడ్ విధించారు. తల నుంచి కాలి వేళ్ల వరకు మొత్తం కప్పి ఉంచేలా నీలం రంగు చాదరీ ధరించాల్సి ఉండేది.
మరి ఇప్పుడు వారిలో ఎలాంటి మార్పు వచ్చిందో.. నేనీ దుస్తులతో వెళ్తే వారు నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో అన్న అనుమానాలున్నాయి.

తప్పులు సహజం
వారు కొంత మారారు అనుకోవడానికి కారణాలున్నాయి.
నేను నాలుగేళ్ల వయసులో మా అమ్మతో కలిసి అత్తవాళ్లింటికి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన చెబుతాను. అప్పుడు మా అమ్మ నీలం రంగు చాదరీ ధరించారు. అయితే, అత్తవాళ్లింటికి చేరుకుంటున్న సమయంలో అమ్మ తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని పైకెత్తారు. అంతే.. ఒక తాలిబన్ కొరఢాతో గట్టిగా కొట్టి ముఖం కప్పుకోమని హెచ్చరించాడు.
ఆ ఘటన నా మనసులో ఉండిపోయింది. ఆ రోజు అత్తవాళ్లింటికి చేరుకున్న తరువాత నేను కిటికీలోంచి పదేపదే బయటకు చూస్తూ అతను ఇంకా మన వెనుకే వస్తున్నాడా.. మనల్నే గమనిస్తున్నాడా అని అమ్మను అడిగాను.
దోహాలో ఒక తాలిబన్ ప్రతినిధితో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఈ ఘటన గురించి చెప్పి ఆయన స్పందన అడిగాను.
దానికి ఆయన ''గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అవి పునరావృతం కావు'' అని ప్రశాంతంగా సమాధానం చెప్పారు.
తాలిబన్ ప్రతినిధి బృందం కనుక ఇప్పుడు కాబూల్ వెళ్తే వారు ఎన్నో మార్పులు చూస్తారు. మహిళలు ఎంతో పురోగతి సాధించారు. పార్లమెంటులో 25 శాతం మహిళలున్నారు. మీడియా, వినోద రంగంలోనూ ప్రముఖంగా కనిపిస్తున్నారు. అధికారుల్లోనూ యువతులున్నారు.

బడి బాట
అఫ్గానిస్తాన్‌లో బాలికలు చదువుకు చేరువవుతుండడాన్ని గమనించొచ్చు.
మా కుటుంబం కొద్ది నెలలు పాకిస్తాన్‌లో ఉండేది. అమెరికా అఫ్గాన్‌పై దాడి చేసి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్లీ అఫ్గానిస్తాన్ వచ్చేశాం.
అప్పట్లో కాబూల్‌లో ఎటు చూసినా ఒక ప్రకటన కనిపించేది. అందులో నవ్వుతున్న ఒక బాలిక, బాలుడు కలిసి స్కూలుకు వెళ్తున్న చిత్రం ఉండేది.. పదండి చదువుకుందాం అని దానిపై రాసి ఉండేది.
తాలిబన్ల పాలన ఉన్నప్పుడు మా పెద్దక్కకు చదువుకునే అవకాశం రాలేదు. కానీ, ఆ తరువాత పరిస్థితులు మారడంతో స్కూలుకు వెళ్లొచ్చా అని నేను మా నాన్నను అడిగాను.
ఇప్పుడు సుమారు కోటి మంది అఫ్గాన్ విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు. అందులో బాలికలూ పెద్ద సంఖ్యలో ఉన్నారు.
శాంతి ఒప్పందం కుదిరి మళ్లీ మీరు కాబూల్ వెళ్తే ఇది కొనసాగుతుందా అని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్‌ను అడిగాను. దానికి ఆయన... మీరు చదువుకోవచ్చు కానీ ఇస్లామిక్ హిజాబ్ ధరించాల్సి ఉంటుందని చెప్పారు.

స్వేచ్ఛను పణంగా పెట్టి..
హోటల్ కారిడార్లలో విదేశీ మహిళలు రకరకాల దుస్తులు ధరించి తిరుగుతుంటే వారి మధ్య తాలిబన్లు రిలాక్స్‌డ్‌గా ఉండడాన్ని చూశాను. అఫ్గానిస్తాన్‌లో మహిళలు ఇలా ఉంటే తాలిబన్లు సహిస్తారా అనుకున్నాను.
రెండు పక్షాల మధ్య చర్చల్లో మహిళల హక్కులు, స్వేచ్ఛ కీలక అంశాలు.
ఈ సమావేశంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చర్చల బృందంలోని ఐదుగురు సభ్యులు మహిళలు.. వారు పూర్తిగా పురుషులే ఉన్న తాలిబన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. వారు ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం మహిళలను చూడాలని పట్టుబడుతున్నారు
తాలిబన్ల ప్రతినిధి బృందంలోని ఒకరితో మాట్లాడుతూ నేను.. మీ బృందంలో మహిళలు ఎందుకు లేరు అని అడిగాను.
‘'తాలిబన్లలో బాగా చదువుకున్న మహిళలు ఉన్నారు. వారు తెర వెనుక పనిచేస్తారు. ఇప్పుడిక్కడికి రావడానికి వారికి సమయం లేదు'' అని చెప్పారాయన.
‘మహిళలు చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం అంటే మాకేమీ అభ్యంతరం లేదు కానీ వారు ఇంట్లో సౌకర్యవంతంగా ఉంటూ గౌరవం అందుకోవాలని మేం కోరుకుంటాం.’
అంతేకాదు.. 'నువ్వు చూడు ఇక్కడ తిరుగుతూ అలసిపోయావు. నీలా ఉండకూడదనుకుంటున్నాం'' అన్నారాయన.
తాలిబన్లలోనూ తరం మారుతోంది
దోహాలో తాలిబన్‌లలో రెండు తరాలవారు కనిపించారు. కరడుగట్టిన, సీనియర్ తాలిబన్ నేతలతో పాటు విషయాలను తేలిగ్గా తీసుకునే కొత్తతరం యువ తాలిబన్లూ ఉన్నారు.
తాలిబన్ల ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న ముల్లా బరదార్ హాల్‌లోకి రాగానే వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోతుంది. కానీ, ఆయన వెళ్లిపోగానే అంతా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తుంది.
తాలిబన్ల ప్రతినిధుల బృందంలో 9 మందితో మాట్లాడాను నేను. వారిలో యువత చాలా బాగా మాట్లాడుతున్నారు. నేను మహిళలననే పట్టింపేమీ వారిలో కనిపించలేదు.
మొత్తానికి నేను దోహాలో చూసినదాన్ని బట్టి కొన్ని సూచనలు ఆశాజనకంగా అనిపించాయి. అదే సమయంలో ఇంకా ఛాందస వర్గమూ కనిపించింది.
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక యాత్ర 'ఆజాదీ మార్చ్'లో మహిళలు ఎందుకు లేరు
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- జంతువుల్లో సూపర్ డాడ్స్: మగ జంతువుల్లో సంతానోత్పత్తిని పెంచుతున్న జన్యు సవరణలు
- ఆస్ట్రా జెనెకా క్లినికల్ ట్రయల్స్ ఎందుకు ఆగిపోయాయి ?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- కరోనావైరస్-రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- నేటి నుంచి ఐపీఎల్ 2020... ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?
- అనారోగ్యమే ఆమెకు అంతర్జాతీయ వ్యాపార సంస్థను స్థాపించేందుకు స్ఫూర్తినిచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








