జంతువుల్లో సూపర్ డాడ్స్: మగ జంతువుల్లో సంతానోత్పత్తిని పెంచుతున్న జన్యు సవరణలు

మేకలు / Goats /Animals

ఫొటో సోర్స్, JONOATLEY

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్మెంటల్ కరస్పాండెంట్

వీర్య కణాలు లోపించిన మగ జంతువుల్లోకి, సంతాన యోగ్యత ఉన్న జంతువుల వీర్యాన్ని ఎక్కించడం ద్వారా వాటిని సంతానోత్పత్తికి సిద్ధం చేయొచ్చని తాజా పరిశోధనల్లో తేలింది.

అత్యాధునిక టెక్నాలజీ సాయంతో సేకరించిన వీర్యాన్ని వంధ్య జంతువుల్లో ప్రవేశపెట్టాక… వాటిల్లో వీర్య కణాల ఉత్పత్తి పెరిగిందని ప్రయోగ ఫలితాల్లో వెల్లడైంది.

ఇలా ఉత్పత్తైన వీర్య కణాల ద్వారా ఇవి, ఆడ జంతువులతో కలిసి పిల్లల్ని పుట్టించగలుగుతాయి. 'సూపర్ డాడ్స్' కాగలవు. వీటిని 'సరొగేట్ సైర్స్' అని అంటారు.

అయితే, పుట్టే పిల్లలు వీర్యాన్ని దానం చేసిన జంతువు లక్షణాలను కలిగి ఉండడం ఇందులో విశేషం.

ఈ విధానంతో ఆహార ఉత్పత్తి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధకులు అంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న జనాభా దృష్ట్యా మాంసాహార కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిశోధనలు విజయవంతమైతే మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది.

"ఈ పరిశోధనా ఫలితాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార భద్రతా సమస్యలపై ప్రభావాన్ని చూపగలవు. ఆహార కొరతను జన్యుపరంగా పరిష్కరించగలిగితే నీరు, పోషణ, యాంటీబయాటిక్స్‌ లాంటి వాటి ఖర్చు తగ్గుతుంది" అని వాషింగ్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ జాన్ ఓట్లే అన్నారు.

cows ఆవు

ఫొటో సోర్స్, ROBERT HUBNER, WSU

ఈ ప్రయోగ ఫలితాలెలా ఉన్నాయి?

వీర్యాన్ని ఎక్కించిన జంతువులో వీర్య కణాల ఉత్పత్తి పెరిగిందని ప్రయోగాల్లో తేలింది.

ఎలుకల మీద చేసిన ఈ ప్రయోగంలో వీర్యాన్ని పొందిన మగ ఎలుకలు పిల్లలను పుట్టించాయి. అలా పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని తేలింది.

ఇంతకన్నా పెద్ద జంతువులకు కూడా వీర్యాన్ని ఎక్కించారు, కానీ ఇంకా వాటిని సంపర్కంలో పాల్గొననివ్వలేదు.

ఎలుకల మీద చేసిన ప్రయోగాలు విజయవంతమవడంతో పెద్ద జంతువుల్లోనూ ఈ ప్రయోగాలు సత్ఫలితాలిస్తాయనే నమ్మకం ఏర్పడిందని ప్రొఫెసర్ బ్రూచ్ వైట్‌లా అన్నారు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్‌లోని రోస్లిన్ ఇన్స్టిట్యూట్‌లో పని చేస్తున్నారు.

"ఈ విధానం ఆచరణ సాధ్యమేనని రుజువైంది. దీనితో జనాభాకు అనుగుణంగా ఎంత సమర్థవంతంగా ఆహార ఉత్పత్తిని పెంచొచ్చనే విషయంపై దృష్టి పెట్టాలి" అని ప్రొఫెసర్ బ్రూస్ వైట్‌లా అన్నారు.

వీడియో క్యాప్షన్, గుడిసెలో పిల్లల్ని ప్రసవించి, అడవిలోకి తీసుకెళ్తున్న చిరుత పులి

అంతరించిపోతున్న జీవుల ఉత్పత్తి

ఈ టెక్నాలజీ ద్వారా అంతరించిపోతున్న జాతులను కూడా పరిరక్షించొచ్చని పరిశోధకులు అంటున్నారు.

ఉదాహరణకు నీటి ఏనుగుల వీర్యాన్ని భద్రపరచి వేరే మగ జంతువులోకి ప్రవేశపెట్టడం ద్వారా నీటి ఏనుగులను పుట్టించొచ్చు.

అయితే, జన్యు సవరణలు చేసిన జంతువుల వినియోగానికి ఇంకా అనుమతి లభించలేదు. వీటిని వినియోగించడం ఎంతవరకు సురక్షితం? జంతు సంరక్షణ, నైతిక విలువలు మొదలైన విషయాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మేక / Goats /Animals

ఫొటో సోర్స్, ROBERT HUBNER, WSU

జన్యు-సవరణలు అంటే ఏమిటి?

పిండాల్లో ఉన్న జన్యువులో మార్పులు చేయడం. సీఆర్ఐఎస్‌పీఆర్ (CRISPR) అనే పద్ధతిని ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీకి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీన్ని 2012లో కనుగొన్నారు. డీఎన్ఏలో మార్పులు చేసేందుకు ఈ టెక్నాలజీని వాడతారు.

ఈ పద్ధతిలో అవసరమైన జన్యువును స్కాన్ చేసి, 'మాలిక్యులర్ సిజర్స్' ఉపయోగించి దాన్నుంచి డీఎన్ఏను సేకరిస్తారు.

అయితే ఈ టెక్నాలజీ ప్రయోగశాలల్లో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది గానీ కొన్నిసార్లు కావలసినదానికన్నా ఎక్కువ డీఎన్ఏను కత్తిరించే అవకాశం ఉంది. దీనివలన ఇతర ముఖ్యమైన జన్యువుల్లో మార్పులు రావొచ్చు.

వీడియో క్యాప్షన్, చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు

నైతిక విలువల సమస్య

జన్యు-సవరణలు చేసిన జంతువుల విషయంలో ఉత్పన్నమయ్యే నైతిక విలువల సమస్యను 'ద నఫ్ఫిల్డ్ కౌన్సిల్ ఆఫ్ బయోఎథిక్స్' పరిశీలిస్తోంది.

జన్యు-సవరణల ద్వారా కొమ్ములు లేని ఆవులు పుట్టొచ్చు. వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్న పందులు, కోళ్లు జన్మించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలా జన్మించే జంతువులను ఆహారంగా వినియోగించడం ఎంతవరకు సురక్షితమో కూడా తెలీదు.

"ఈ పరిశోధనలు ప్రయోగశాల బయట ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయి, సాంఘిక విలువలు, నైతికతకు భంగం కలిగించకుండా ఉంటాయి? అనేవి ఇప్పుడప్పుడే నిర్ధరించలేము. ఈ దిశలో మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలన్నిటినీ పరిశీలిస్తున్నాం" అని కౌన్సిల్ డైరెక్టర్ హగ్ విటల్ బీబీసీకి తెలిపారు.

ప్రస్తుత పరిశోధన వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు సంబంధించిన జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)