బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను తేనెటీగ విషం చంపేస్తుందా... తాజా పరిశోధనలు ఏమంటున్నాయి?

తేనెటీగలు

ఫొటో సోర్స్, Getty Images

తేనెటీగల నుంచి సేకరించిన విషాలు, రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే కఠినమైన కణాలను నాశనం చేయగలవని ప్రయోగాశాల పరిశోధనల్లో తేలినట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ విషాల్లో ఉండే మెలిటిన్ అనే సమ్మేళనాన్ని, చికిత్సకు లొంగని కఠినమైన క్యాన్సర్ రకాలు "ట్రిపుల్-నెగటివ్", హెచ్ఈఆర్2-ఎన్రిచ్డ్‌పై ప్రయోగించారు.

ఈ ఆవిష్కరణ గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తోంది కానీ ఈ అంశంలో మరి కొంత పరిశోధన చెయ్యవలసి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు బెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

ప్రయోగశాలల్లో చేసే అధ్యయనాల్లో అనేక రసాయన సమ్మేళనాలు క్యాన్సర్‌తో పోరాడగలవని ఫలితాలు రావొచ్చు కానీ వాటిల్లో మానవులకు చికిత్సగా అందించగలిగేవి కొన్ని మాత్రమే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

తేనెటీగ విషాల్లో క్యాన్సర్‌ను నిరోధించగల లక్షణాలు ఉన్నాయని ఇంతకుముందు చేసిన అధ్యయనాల్లోనూ వెల్లడైంది.

ప్రస్తుత అధ్యయనం దక్షిణ ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో జరిగింది. ఇది నేచర్ ప్రిసిషన్ అంకాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.

ఈ పరిశోధనకు డాక్టర్ సియారా డఫీ సారథ్యం వహించారు

ఫొటో సోర్స్, HARRY PERKINS INSTITUTE

ఫొటో క్యాప్షన్, ఈ పరిశోధనకు డాక్టర్ సియారా డఫీ సారథ్యం వహించారు

ఈ అధ్యయనం ఏం చెబుతోంది?

దీనికోసం 300 కన్నా ఎక్కువ తేనేటీగల, తుమ్మెదల విషాలను సేకరించి పరిశీలించారు.

"తేనెటీగల నుంచి సేకరించిన ఈ విషం చాలా శక్తిమంతమైనది" అని ప్రస్తుత అధ్యయన పరిశోధకులు సియారా డఫీ తెలిపారు.

తేనెటీగల విషాల్లో ఉండే మెలిటిన్ సమ్మేళనం క్యాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయగలదని ప్రయోగాల్లో తేలింది.

మెలిటిన్ సహజసిద్ధంగా తేనెటీగల్లో దొరుకుతుంది. అయితే దీన్ని కృత్రిమంగా కూడా ఉత్పత్తి చెయ్యొచ్చు.

రొమ్ము క్యాన్సర్ రకాల్లో 10-15 శాతం ఉండే ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కఠినమైనది. దీనికి చికిత్సలో భాగంగా ఆపరేషన్, రేడియోథెరపీ, కీమోథెరపీ కూడా చెయ్యాల్సి ఉంటుంది.

తేనెటీగలు

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్తులో దీన్ని వాడే అవకాశాలున్నాయా?

ఈ పరిశోధనా ఫలితాలు "చాలా ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి" అని దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పీటర్ క్లింకెన్ అన్నారు.

"క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో మెలిటిన్ ప్రభావవంతంగా పనిచేస్తోంది. ప్రకృతిలో లభించే సమ్మేళనాలు మనుషుల్లో రోగాల చికిత్సకు ఉపయోగపడతాయని మరోసారి రుజువయ్యింది" అని ఆయన పేర్కొన్నారు.

అయితే, మెలిటిన్‌ను ప్రయోగశాల బయట, క్యాన్సర్‌తో పోరాడే మందుగా ఉపయోగించాలంటే దీనిపై మరిన్ని పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

"ఈ పరిశోధన ఇంకా ప్రారంభదశలోనే ఉంది" అని సిడ్నీలోని గార్వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌కు చెందిన అసిస్టంట్ ప్రొఫెసర్ అలెక్స్ స్వార్బ్రిక్ చెప్పారు.

"ప్రయోగశాలల్లోనూ లేదా ఎలుకలపై ప్రయోగించినప్పుడు అనేక సమ్మేళనాలు సత్ఫలితాలను ఇవ్వొచ్చు. కానీ అవి మనుషులకు ఇచ్చే మందుగా పరిణామం చెందాలంటే వాటిపై ఇంకా విస్తృతంగా పరిశోధనలు చెయ్యాల్సి ఉంటుంది" అని డాక్టర్ స్వార్బ్రిక్ బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)