అఫ్గానిస్తాన్ ప్రసూతి వార్డు మీద దాడి చేసిన వారు 'తల్లుల్ని చంపడానికే వచ్చారు'

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, ఫ్లోరా డ్రూరీ
    • హోదా, బీబీసీ న్యూస్

అఫ్గానిస్తాన్ రాజ‌ధానిలో 24 మంది మ‌హిళ‌లు, పిల్ల‌లు, పసికందులను ఊచ‌కోత కోసిన ఘ‌ట‌న భయాందోళనలు రేకెత్తించింది.

బుల్లెట్ల‌తో ద‌ద్ద‌రిల్లిన ఆ ప్ర‌సూతి వార్డులోకి వెళ్లినప్పుడు ఫ్రెడ్రిక్ బోనెట్‌కు కొన్ని విష‌యాలు స్ప‌ష్టంగా అర్థ‌మ‌య్యాయి.

గ‌మ‌నిక: ఈ క‌థ‌నంలోని విష‌యాలు మిమ్మ‌ల్ని క‌లచివేయచ్చు.

కాబూల్‌లోని ద‌ష్తే బార్చి ఆసుప‌త్రిలో దుండ‌గులు.. గేట్‌కు ద‌గ్గ‌ర్లోని వార్డుల‌న్నీ దాటుకుంటూ నేరుగా ప్ర‌సూతి వార్డులోకి వెళ్ళారు.

ఇదేదో పొర‌పాటుగా జ‌రిగిన దాడి కాద‌ని బోనెట్ భావిస్తున్నారు.

ప్ర‌సూతి వార్డులోకి అడుగుపెట్టిన‌ప్పుడు "దుండుగులు కావాల‌నే త‌ల్లులే ల‌క్ష్యంగా కాల్పులు జ‌రిపిన‌ట్టు అర్థ‌మైంది"అని మెడిసిన్ శాన్స్ ఫ్రాంటియ‌ర్స్‌ (ఎంఎస్ఎఫ్‌)లో హెడ్ ఆఫ్ ప్రొగ్రామ్స్ బోనెట్ వివ‌రించారు.

"ప్ర‌సూతి గ‌దుల్లో తిరుగుతూ వారు మంచంపై ఉన్న మ‌హిళ‌ల‌ను షూట్ చేశారు. ఇది ప‌క్కా ప‌థకం ప్ర‌కారం జ‌రిగిన దాడి."

"వారు త‌ల్లుల్ని చంపేందుకే వ‌చ్చారు."

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తుపాకులతో దుండగులు నేరుగా ప్రసూతి వార్డులోకి వెళ్ళారు.

"మాట‌ల‌కు అంద‌నిది"

దాడి మొద‌లైన‌ప్పుడు అమీనా వ‌య‌సు కేవ‌లం రెండు గంట‌లు.

బీబీ న‌జియా, ర‌ఫీవుల్లాల‌కు అమీనా మూడో సంతానం. వారికి అమీనా కంటే ముందే ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

త‌ల్లితో క‌లిసి న‌జియా ఆసుప‌త్రికి వ‌చ్చింది. ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు అమీనా జ‌న్మించింది.

అది ర‌ఫీవుల్లాకు వేడుక‌లు చేసుకొనే స‌మ‌యం. కానీ స‌రిగ్గా ప‌ది గంట‌ల‌కు దాడి మొద‌లైంది. ఆసుప‌త్రి బ‌య‌ట ఉన్న‌వారికి భారీ పేలుడు శ‌బ్దాలు వినిపించాయి. దీంతో ర‌ఫీవుల్లాలా బ‌య‌ట ఎదురుచూస్తున్న వారు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు.

"త‌ను ప‌రిగెత్తుకుంటూ వెళ్లాడు. కానీ ఏమీ చేయ‌లేక‌పోయాడు. అత‌ణ్ని ఎవ‌రూ లోప‌ల‌కు అనుమ‌తించ‌లేదు"అని ర‌ఫీవుల్లా బంధువు హ‌మీదుల్లా హ‌మీది.. బీబీసీ ప‌ష్తోకు తెలిపారు.

బేబీ అమీనా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అమీనా అనే పాప కాలును కాపాడడానికి శస్త్రచికిత్స చేశారు.

2014 నుంచీ ఎంఎస్ఎఫ్ న‌డుపుతున్న ఈ 55 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిలో ముగ్గురు సాయుధులు అటూఇటూ తిరుగుతూ కాల్పులు జ‌రుపుతూ విధ్వంసం సృష్టించారు.

ఆ స‌మ‌యంలో త‌ల్లులు, త‌ల్లి కాబోతున్న‌వారు క‌లిపి మొత్తంగా 26 మంది ఉన్నారు. వీరిలో ప‌ది మంది సుర‌క్షిత‌మైన ఇత‌ర గ‌దుల్లోకి వెళ్లి దాక్కున్నారు. అయితే 16ఏళ్ల బీబీ న‌జియా, అమీనా లాంటివారికి మాత్రం ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు.

16 మంది త‌ల్లుల్లో ముగ్గురిని క‌డుపులో బిడ్డ ఉండ‌గానే ప్ర‌సూతి గ‌దుల్లో కాల్చి చంపారు.

అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించిన మ‌రో ఎనిమిది మంది త‌ల్లుల్లో న‌జియా ఒక‌రు. చిన్నారి అమీనా కాళ్ల‌పై దుండ‌గులు కాల్చారు. మ‌రో ఐదుగురు ప‌రికందుల‌నూ తూపాకుల‌తో కాల్చి గాయాల పాలుచేశారు. ఊయ‌లలో ప‌డుకున్న ఇద్ద‌రు బాబుల‌నూ కాల్చి చంపారు. మ‌ర‌ణించిన‌వారిలో ఓ ఆసుప‌త్రి సిబ్బందీ ఉన్నారు.

ఇద్ద‌నిని కాల్చి చంపే ముందుగా ఓ సాయుధుడు త‌న‌వైపు తుపాకీ ఎలా గురిపెట్టాడో రాయిట‌ర్స్ వార్తా సంస్థ‌కు ఖాదిజా వివ‌రించారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, EPA

సాయుధులు, అఫ్గాన్ భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య పోరాటం దాదాపు నాలుగు గంట‌లు సాగింది. చివ‌ర‌గా సాయుధుల్ని భ‌ద్ర‌తా సిబ్బంది హ‌త‌మార్చారు.

కాల్పులు జ‌రుగుతున్న‌ప్పుడే ఆసుపత్రిలో ఓ బాలుడు జ‌న్మించాడు. ఓ సుర‌క్షిత‌మైన గ‌దిలో ఎలాంటి శ‌బ్దాలు చేయ‌కుండా ప్ర‌య‌త్నిస్తూ ఓ మ‌హిళ ఎలా బిడ్డ‌కు జ‌న్మనిచ్చిందో ఓ న‌ర్సు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ‌కు తెలిపారు.

"ఆమెకు సాయం చేసేందుకు మా ద‌గ్గ‌ర ఏమీ లేవు. చేతిలో స్కార్ఫ్‌లు, టాయిలెట్ పేప‌ర్లు మాత్ర‌మే ఉన్నాయి"అని న‌ర్స్ వివ‌రించారు.

"బాబు పుట్ట‌న త‌ర్వాత బొడ్డు తాడును చేతుల‌తోనే క‌త్తిరించాను. బాబు, త‌ల్లిని చుట్టేందుకు త‌ల‌కు క‌ట్టుకొనే స్కార్ఫ్‌ల‌ను ఉప‌యోగించా"

సుర‌క్షిత‌మైన గ‌దుల్లో ఉండేవారికి పేలుడు శ‌బ్దాలు ఎలా వినిపించాయి? కాల్పుల‌తో ఆసుప‌త్రి ప్రాంగాణం ఎలా ద‌ద్ద‌రిల్లింది? లాంటి అంశాల‌ను బోనట్ వివ‌రించారు.

"కాల్పులు పూర్తైన త‌ర్వాత‌.. ప్ర‌సూతి వార్డులోని గోడ‌లు బుల్లెట్ల‌తో ధ్వంస‌మ‌య్యాయి. నేల‌పై ర‌క్తం ప్ర‌వ‌హించింది. వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. కిటికీల‌పైనా కాల్పులు జ‌రిపారు"

"ఇది నిజంగా విస్మ‌యం క‌లిగించే వార్త‌. గ‌తంలోనూ ఇక్క‌డ దాడులు జ‌రిగాయి. కానీ ఇలా ప్ర‌సూతి వార్డుపైనా దాడి జ‌రుగుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు"

"ఈ దేశంలో భ‌యాన‌క‌మైన ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. కానీ మంగ‌ళ‌వారం నాటి ఘ‌ట‌న మాట‌ల‌కు అంద‌నిది.

ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా క‌నీసం ఊహించ‌ని స్థాయిలో అఫ్గానిస్తాన్‌లో విధ్వంస‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. గ‌త ఏడాది ఆగ‌స్టులో రోజుకు స‌గ‌టున 74 మంది ఇక్క‌డ చ‌నిపోయిన‌ట్లు బీబీసీ ప‌రిశోధ‌న‌లో తేలింది."

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కన్నీటిలో మునిగిన బాధితుల బంధువులు

ఈ మ‌ర‌ణాల్లో ఐదో వంతు సామాన్య పౌరుల‌వే

ద‌ష్తే బార్చి ఆసుప‌త్రి దాడి జ‌రిగిన కొన్ని గంట్లోనే తూర్పు ప్రాంతంలోని నంగ‌ర్హ‌ర్ ప్రావిన్స్‌లో ఓ పోలీసు అంత్య‌క్రియలకు హాజ‌రైన‌ వారిపై దాడి జ‌రిగింది. ఇక్క‌డ 32 మంది మ‌ర‌ణించారు. మ‌రోవైపు ఉత్త‌ర బాల్ఖ్ ప్రావిన్స్‌లో అమెరికా వైమానిక దాడులు చేప‌ట్టింది. ఇక్క‌డ 10 మ‌ది మ‌ర‌ణించారు. ఇక్క‌డ మ‌ర‌ణించిన వారంద‌రూ పౌరులేన‌ని స్థానికులు, తాలిబాన్లు చెబుతున్నారు. అయితే తాము మిలిటెంట్ల‌నే హ‌త‌మార్చామ‌ని ర‌క్ష‌ణ సిబ్బంది వివ‌రిస్తున్నారు.

రెండు రోజుల త‌ర్వాత ప‌క్తియా ప్రావిన్స్ రాజ‌ధాని గార్దెజ్‌లోనూ సాయుధులు దాడిచేసి ఐదుగురు పౌరుల్ని హ‌త‌మార్చారు. శాంతి చ‌ర్చ‌ల‌వైపు అడుగులు ప‌డుతున్న స‌మ‌యంలో ఇలాంటి దాడులు జ‌రుగుతున్నాయి.

18 ఏళ్ల విధ్వంస‌క ఘ‌ర్ష‌ణ‌ల‌కు ముగింపు ప‌ల‌క‌డ‌మే ల‌క్ష్యంగా గ‌త ఫిబ్ర‌వ‌రిలో తాలిబాన్ మిలిటెంట్ల‌తో అమెరికా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్ర‌కారం.. అఫ్గాన్ ప్ర‌భుత్వంతో ఇప్ప‌టివ‌ర‌కూ వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన‌ చ‌ర్చ‌ల‌కు తాలిబాన్లు అంగీకారం తెలిపారు.

అయితే, దేశంలో విధ్వంసం చెల‌రేగుతున్న స‌మ‌యంలో శాంతి ఒప్పందం కుదిరే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. ప్ర‌సూతి వార్డుపై దాడి అనంత‌రం తాలిబాన్లు స‌హా ఇత‌ర సంస్థ‌ల‌పై తీవ్ర‌మైన చ‌ర్య‌ల‌కు దేశ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌ని ఆదేశించారు.

హింస‌ను వీడాల‌ని ప‌దేప‌దే చెబుతున్నా మిలిటెంట్లు వినిపించుకోవ‌డంలేద‌ని ఆయ‌న వివ‌రించారు.

ఆసుప‌త్రిలో దాడి తామే చేప‌ట్టామ‌ని ఏ సంస్థా ప్ర‌క‌టించుకోలేదు. అయితే గార్దెజ్ న‌గ‌రంలో దాడిని తాలిబాన్లు, పోలీసు అంత్య‌క్రియ‌ల్లో దాడిని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌) తామే చేసిన‌ట్లు వెల్ల‌డించాయి.

ఆసుప‌త్రిపై దాడిని ఇస్లామిక్ స్టేట్ చేప‌ట్టింద‌ని అమెరికా రాయ‌బారి జ‌ల్మాయ్ ఖలీల్‌జాద్ ఆరోపించారు. శాంతి చ‌ర్చ‌ల‌కు విఘాతం క‌లిగించాల‌ని ఐఎస్ చూస్తున్న‌ట్లు ఆయ‌న వ్యాఖ్యానించారు.

కాబూల్

ఫొటో సోర్స్, AFP

తీవ్రంగా గాయాల‌పాలైన న‌వ‌జాత శిశువుతో మిగిలిన బామ్మ‌, ఆరేళ్ల‌పాటు ఎంఎస్ఎఫ్ కోసం ప‌నిచేసి దారుణ హ‌త్య‌కు గురైన న‌ర్స్‌, కాల్పులు జ‌రుగుతుంటే నేల‌పై అచేత‌నంగా ప‌డిన బాధితుల‌కు.. ఆయ‌న వ్యాఖ్య‌లు ఎలాంటి సాంత్వ‌న చేకూర్చ‌లేక‌పోయాయి.

కాల్పుల అనంత‌రం న‌వ‌జాత శిశువుల్ని కాబూల్‌లోని అటాతుర్క్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన శివువుల జాబితాలో త‌మ చిన్నారి పేరు వినిపిస్తుందేమోన‌ని అక్క‌డ వారి త‌ల్లిదండ్రులు ఎంతో వేద‌న‌తో ఎదురుచూస్తున్నారు.

గంద‌ర‌గోళంలో ఓ మ‌హిళ ఓ శిశువును ద‌త్త‌త ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఆమెపై ఓ వృద్ధుడు వాగ్వాదానికి దిగిన‌ట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. త్వ‌ర‌లోనే పిల్ల‌లంద‌రినీ వారి త‌ల్లిదండ్రుల చెంత‌కు చేరుస్తామ‌ని ఆసుప‌త్రి సిబ్బంది వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం చిన్నారి అమీనా వేరే ఆసుప‌త్రిలో కోలుకుంటోంది. ఇప్ప‌టికే ఆమెకు ఒక ద‌శ శ‌స్త్ర‌చికిత్స‌లు జ‌రిగాయి. మ‌రో రెండు ద‌శల్లో కూడా చికిత్స‌లు జ‌ర‌గాల్సి ఉంది. తూటాతో తీవ్ర గాయ‌మైన కాలును కాపాడ‌గ‌ల‌మ‌ని వైద్యులు ఆశాభావం వ్య‌క్తంచేశారు.

త‌ను వైక‌ల్యంతో మిగిలిపోతుందేమోన‌ని ఆమె కుటుంబం భ‌య‌ప‌డుతోంది. అఫ్గాన్‌లో ఓ విక‌లాంగురాలిగా బ‌త‌క‌డం అంత తేలిక‌కాదు. శాంతి వైపుగా అడుగులు ప‌డుతున్న త‌రుణంలో ఇలాంటి ఘ‌ట‌నలు ఎందుకు జ‌రుగుతున్నాయో తెలుసుకునేందుకు అఫ్గాన్ ప్ర‌య‌త్నిస్తోంది.

"ఇలాంటి దాడులు చేప‌ట్టొద్ద‌ని గ‌త 20 ఏళ్ల నుంచీ అభ్య‌ర్థిస్తున్నాం. కానీ దాడులు ఆగ‌ట్లేదు. జ‌రుగుతూనే ఉన్నాయి"అని హ‌మీదుల్లా హ‌మీది వివ‌రించారు.

(నూర్ షఫాఖ్, బీబీసీ పష్తో అందించిన అదనపు సమాచారంతో)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)