నేటి నుంచి ఐపీఎల్ 2020... ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?

రోహిత్ శర్మ, ధోనీ

ఫొటో సోర్స్, ROBERT CIANFLONE ​​/ GETTY IMAGES

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

దేశవిదేశాల్లోని మేటి క్రికెటర్లందరినీ ఒక్క వేదికపైకి తెచ్చే టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్. ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్‌ను వీక్షించేవారు కోట్ల సంఖ్యలో ఉంటారు.

ఐపీఎల్‌లో ఇదివరకటి 12 సీజన్లూ ఒకదాన్ని మించి ఒకటి విజయవంతమయ్యాయి. కిక్కిరిసిన స్టేడియాలు, అభిమానుల కోలాహలం, చీర్ లీడర్స్ చిందులు... ఇలా ఐపీఎల్‌లో మ్యాచ్‌ల్లో వాతావరణం చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. జట్ల యజమానులు, సెలబ్రెటీలు, సినీ ప్రముఖుల సందడి కూడా కనిపిస్తుంది.

కానీ, ఈసారి ఐపీఎల్‌‌కు ఈ సందడంతా దూరం కానుంది. స్టేడియాలు ప్రేక్షకులు లేకుండా, ఖాళీగా దర్శనమివ్వనున్నాయి.

భారత్‌లో జరగాల్సిన ఈ టోర్నీని కోవిడ్-19 కారణంగా బీసీసీఐ భారత ప్రభుత్వ అనుమతితో యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. అబుధాబీ, షార్జా, దుబయిల్లోని స్టేడియాలు ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వబోతున్నాయి.

ఐపీఎల్ సంప్రదాయం ప్రకారం నిరుడు ఫైనలిస్ట్‌లుగా నిలిచిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య పోరుతో ఈ సీజన్‌ మొదలుకానుంది. నేడు (సెప్టెంబర్ 19న) ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ సీజన్‌లో మ్యాచ్‌లన్నీ ఖాళీ స్టేడియాల్లో, ‘బయో సెక్యూర్’ వాతావరణంలో నిర్వహించనున్నారు.

మొత్తం ఎనిమిది జట్లు యూఏఈలో మ్యాచ్‌లు ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా, వేర్వేరు హోటళ్లలో బస చేయనున్నాయి.

ఈసారి అన్ని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఒక నియమావళిని నిర్దేశించింది. దీని ప్రకారం అన్ని ఫ్రాంఛైజీల్లో ఈసారి వైద్య బృందాలు ఉంటాయి. టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లు, సహాయ సిబ్బంది అందరూ మార్చి నుంచి తమ ఆరోగ్యం, ప్రయాణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. విదేశీ ఆటగాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది.

బయో సెక్యూర్ వాతావరణాన్ని కాపాడేందుకు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది నియమాలన్నింటినీ పాటించాల్సి ఉంటుంది. ఉల్లంఘించినవారిపై ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటారు.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

‘చిన్న పొరపాటు చేసినా...’

బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలితో పాటు ఏ జట్లకా జట్లు కూడా తమ తమ పరిధిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

చిన్న తప్పు కూడా మొత్తం టోర్నీకి ప్రమాదం తేవచ్చని, బయో సెక్యూర్ వాతావరణాన్ని కాపాడేందుకు నియమాలన్నింటినీ పాటించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ జట్టు ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశారు.

ఆటగాళ్లు, సహాయ సిబ్బంది వారి వారి కుటుంబ సభ్యులతోపాటు ఉండొచ్చు. అయితే, వారు కూడా బయో సెక్యూర్ పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది.

డైనింగ్ ఏరియాకు వెళ్లే అవసరం లేకుండా, ఆటగాళ్లకు వారి వారి గదులకే ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేశారు.

శిక్షణ, మ్యాచ్‌ల సమయంలో ఖాళీగా ఉండే స్టాండ్లనే జట్లు డ్రెస్సింగ్ రూమ్‌లుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఇదివరకటిలా కాగితాలపై టీమ్ షీట్లను ఇవ్వకుండా, ఎలక్ట్రానిక్ పద్ధతిని వాడనున్నారు.

ప్రతి సారీ హోటల్‌కు చేరుకున్న వెంటనే స్నానం చేయాలని ఆటగాళ్లకు సూచించారు.

వైద్య బృందంలోని సభ్యులు కూడా పీపీఈ కిట్లు ధరించే ఆటగాళ్ల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది.

జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన ముగ్గురు అధికారులు, ఆరుగురు డోపింగ్ నియంత్రణ అధికారులు ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి నమూనాలు తీసుకునేందుకు యూఏఈ వెళ్తారు.

ఈ సీజన్ పూర్తయ్యేటప్పటికి నాడా కనీసం 50 నమూనాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైతే యూఏఈ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ సాయం కూడా నాడా తీసుకుంటుంది.

జోఫ్రా ఆర్చర్

ఫొటో సోర్స్, Getty Images

‘పండుగ వాతావరణం ఉండదు’

ఈసారి ఐపీఎల్‌లో పండుగ వాతావరణం కనిపించదని... కానీ, ఆటతీరులో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని క్రికెట్ సమీక్షకుడు అయాజ్ మెమెన్ అంటున్నారు.

‘‘ఈ నిబంధనలన్నింటి ఫలితంగా ఆటగాళ్లు ఒకరినొకరు పెద్దగా కలుసుకోలేరు. స్టేడియాల్లో జనాలు ఉండరు. ఐపీఎల్‌కు ఎప్పుడూ ఉండే ఫ్లేవర్ ఈసారి దూరమవుతుంది. ఈ సీజన్ పండుగ వాతావరణాన్ని తలపించదు’’ అని ఆయన అన్నారు.

ప్రేక్షకులు లేకపోవడం వల్ల ఆటగాళ్లలో కొంత ఉత్సాహం తగ్గవచ్చని... కానీ, వాళ్లు తమ ప్రతిభను చాటుకునేందుకు వంద శాతం ప్రయత్నిస్తారని మెమెన్ చెప్పారు.

‘‘ఇంగ్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇంకోవైపు కరీబియన్ ప్రిమియర్ లీగ్ కూడా జరిగింది. వాటిలో రసవత్తర పోటీలు కనిపించాయి. ఆటగాళ్లు తమ పూర్తి స్థాయి సామర్థ్యంతో ఆడటం లేదని ఎప్పుడూ అనిపించలేదు. క్రికెట్‌‌ను మళ్లీ అందరికీ చేరువ చేయాలంటే శాయశక్తులా కష్టపడాల్సిందేనని ఆటగాళ్లకు అర్థమైందనుకుంటా. స్టేడియాల్లో జనం లేకున్నా, టీవీల్లో మ్యాచ్‌లను చూస్తారుగా. ఒకవేళ ఆటగాళ్లు పూర్తి సామర్థ్యం పెట్టి ఆడటం లేదని వారికి అనిపిస్తే, వాళ్లు నిరాశ చెందుతారు’’ అని అన్నారు.

స్టేడియంలో ప్రేక్షకులు చేసే కోలాహలంతో మ్యాచ్‌ల్లో కనిపించే ఉత్సాహమే వేరు.

కానీ, ఇలా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?

‘‘ఇప్పుడు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఇది తప్పని పరిస్థితి. అందరూ ఏదో ఒక విధంగా రాజీపడాల్సి వస్తోంది. కొన్ని కొన్ని వదులుకోవాల్సి వస్తోంది. మ్యాచ్‌లు సురక్షిత వాతావరణంలో జరగాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించడం అవసరం. ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారైనా కప్ గెలుస్తుందా? ధోనీ ఇంకా ఫామ్‌లోనే ఉన్నాడా? చెన్నైని ఇంకా గెలిపించగలడా?’ ఇలా టోర్నీపై జనాలకు ఆసక్తి కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి’’ అని అయాజ్ మెమెన్ అన్నారు.

గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌ ఎన్నో వివాదాలు ఎదుర్కొందని, ఈసారి ఎలాంటి వివాదం లేకుండా టోర్నీ జరిగితే విజయంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

‘‘స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి జరిగే ముప్పు ఎప్పుడూ ఉంటుంది. బయో సెక్యూర్ వాతావరణం నిబంధనలతో అలాంటివి జరగవని అనుకుంటే పొరపాటే. స్థానిక పోలీసు శాఖలోని అవినీతి నిరోధక విభాగం ఈ విషయమై నిఘా పెడుతుందని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది’’ అని మెమెన్ చెప్పారు.

మొత్తానికి కోవిడ్ నేపథ్యంలో వచ్చిన అనేక మార్పులతో ఈసారి ఐపీఎల్ భిన్నంగా ఉండబోతుంది.

ఎంతో మంది టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి ఈ మ్యాచ్‌లను వీక్షించనున్నారు. వారికి ఇదివరకటి స్థాయిలోనే, ఏ లోటూ లేకుండా ఈ లీగ్ వినోదాన్ని పంచుతుందా అన్నది నేటి నుంచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)