ఐపీఎల్ షెడ్యూల్: మొదటి మ్యాచ్ ఎవరెవరి మధ్య.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయి

రోహిత్, ధోనీ

ఫొటో సోర్స్, facebook/Chennai Super Kings

ఫొటో క్యాప్షన్, రోహిత్, ధోనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) విడుదల చేసింది.

తొలుత అనుకున్న ప్రకారమే ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.

అబుదాబి వేదికగా జరిగే మొట్టమొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30కి మొదలవుతుంది.

అనంతరం దుబయి వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో దిల్లీ కేపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడతాయి.

మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది.

ఈ ఐపీఎల్‌లో భాగంగా దుబయిలో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఐపీఎల్ షెడ్యూల్

ఫొటో సోర్స్, BBCi

ఐపీఎల్ షెడ్యూల్

ఫొటో సోర్స్, BBCi

ఫైనల్ ఎక్కడ?

యూఏఈలో జరగబోయే ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబరు 19న జరగనుంది.

ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ వేదికలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఆటగాళ్లు, సిబ్బంది, మ్యాచ్ అధికారులు, ప్రసార బృందాలు అందరూ కరోనా ప్రోటోకాల్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించరు.

ఇంతకుముందు 2009లో కూడా ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో కొన్ని మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆ రెండు సందర్భాలలోనూ అలా చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

జట్ల స్వరూపం ఇదీ..

చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, facebook/chennaisuperkings

చెన్నై సూపర్ కింగ్స్(2010, 2011, 2018)

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ ఇది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆయన మూడు సార్లు టైటిల్ అందించారు.

ఇప్పుడు ధోనీ మిగతా క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే)ను గెలిపించడంపైనే ఆయన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించనున్నారు.

మతి పోగొట్టే ఐపీఎల్ రికార్డులున్న సురేశ్ రైనా కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడే. ఆయన కూడా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన గంటలోనే రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, రైనా వివిధ కారణాల వల్ల భారత్‌కు తిరిగొచ్చేయడంలో ఆయన ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ అయినా ఆడుతారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

సీఎస్‌కేను డాడీ ఆర్మీ అంటారు అభిమానులు. ఆ జట్టులో ఆటగాళ్ల సగటు వయసు 32 కావడమే దీనికి కారణం.

అనుభవజ్ఞులైన డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, ఇమ్రాన్ తాహిర్, డ్యుప్లెసిస్ వంటివారు ఈ జట్టుకు నమ్మకమైన ఆటగాళ్లు.

వీరికి తోడు శామ్ కరన్ వంటి ఆల్ రౌండర్, జోష్ హాజెల్‌వుడ్ రూపంలో మాంచి ఫాస్ట్ బౌలర్, సుడులు తిప్పే స్పిన్నర్ పీయూష్ చావ్లా ఉండనే ఉన్నారు. స్లో పిచ్‌లపై సీఎస్‌కే సుదీర్ఘ స్పిన్ దాడి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఫొటో సోర్స్, FACEBOOK/ROYAL CHALLENGERS BANGALORE

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

అండర్-19 క్రికెటర్‌గా ఉన్నప్పటి నుంచి ప్రపంచ అగ్ర శ్రేణి బ్యాట్స్‌మన్‌గా ఎదిగినంత వరకు మొత్తం 12 సీజన్లలోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పటికీ ఈ జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.

కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఈ జట్టుకు మూల స్తంభాలు. వీరికి హార్డ్ హిటర్ అరోన్ ఫించ్, పేస్ బౌలర్ కేన్ రిచర్డ్సన్, దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ వంటి దూకుడు గల ఆటగాళ్ల దన్ను ఉంది.

ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీల రూపంలో బలమైన పేస్ దళమూ ఉంది.

ఇక స్పిన్ పిచ్‌లపై సత్తా చూపడానికి యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి సిద్ధంగా ఉన్నారు. వీరి సమస్యంతా జట్టుగా ఆడడంలోనే. వ్యక్తిగతంగా మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నా సమష్టిగా ఆడి విజయం సాధించడంలో విఫలమవుతుంటారు.

కింగ్స్ XI పంజాబ్

ఫొటో సోర్స్, FACEBOOK/KINGS XI PUNJAB

కింగ్స్ XI పంజాబ్

ఈ జట్టుకు ఓపెనర్, కీపర్, కెప్టెన్ అన్నీ కేఎల్ రాహుల్. చాలా బాధ్యతలు కేఎల్ భుజాన ఉన్నాయి.

విధ్వంసకర ఆటగాళ్లు క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్‌వెల్ ఈ జట్టులోనే ఉన్నారు. వీళ్లిద్దరూ కనుక చెలరేగితే పంజాబ్ జట్టును ఆపే దమ్ము ఎవరికీ ఉండదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని కింగ్స్ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

ఆ క్రమంలోనే జేమ్స్ నీషమ్, షెల్డన్ కాట్రెల్, క్రిస్ జోర్డాన్‌లను వేలంలో కొనుక్కుంది. ఈ జట్టు పేస్ అటాక్‌ను టీమిండియా పేసర్ ముందుండి నడిపించనున్నాడు.

మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, మణిదీప్ సింగ్‌ల నుంచి మద్దతు ఉంటుంది. అండర్-19 ఆటగాళ్లయిన రవి బిష్ణోయి, ఇషాన్ పోరెల్‌లు కింగ్స్ తరఫున ఐపీఎల్ వేదికగా తమ సత్తా చూపాలని తహతహలాడుతున్నారు.

యూఏఈలోని స్పిన్ పిచ్‌లపై ఈ జట్టులోని ముజీబుర్ రెహ్మాన్ వంటి స్పిన్నర్లు వికెట్లు కూల్చే అవకాశం ఉంది. ఇండియన్ స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే ఈ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండడంతో టైటిల్ వేటలో ఈ జట్టుపైనా అంచనాలు పెరుగుతున్నాయి.

దిల్లీ కేపిటల్స్

ఫొటో సోర్స్, Delhi Capitals/facebook

దిల్లీ కేపిటల్స్

గత ఏడాది పేరు మార్చుకుని వచ్చిన దిల్లీ జట్టు ఆ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరింది.

శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, పృథ్వి షా, రిషబ్ పంత్ వంటి నమ్మకమైన ఆటగాళ్లున్నారు. ఇప్పుడు అజింక్యా రహానె, షిమ్రాన్ హాత్‌మేయర్, జేసన్ రాయ్ కూడా దిల్లీ దళంలో చేరారు.

వీరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి.. ఎవరిని పక్కనపెట్టాలనేది నిర్ణయించడం పెద్ద సమస్యే. ఇక ఈ జట్టులోని కబిసో రబడ కీలక ఆటగాడు. ఈ జట్టు విజయావకాశాలను పెంచగలిగే సామర్థ్యం ఉన్న స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలున్నారు.

మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కేరీలు ఆడే అవకాశం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్ కూడా ఈ జట్టులో ఉన్నారు.

కోల్ కతా టీం

ఫొటో సోర్స్, KKR.IN

కోల్‌కతా నైట్ రైడర్స్(2012, 2014)

షారుక్ ఖాన్ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఆడుతున్నాడు. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైనది కమిన్సే. కరోనా కారణంగా ఖాళీగా ఉన్న ఈ పేస్ బౌలర్ వికెట్లు తీయడానికి ఆవురావురుమని ఎదురుచూస్తున్నాడు.

దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో కరీబియన్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసెల్ ఉన్నాడు. బ్యాట్, బాల్‌తో భయపెట్టే రసెల్ ఫీల్డింగ్‌లోనూ అత్యంత ప్రమాదకర ఆటగాడని ప్రత్యర్థి జట్లకు తెలుసు.

ఇండియా అండర్-19 కెప్టెన్ శుభమన్ గిల్ కూడా ఈ జట్టులోనే ఉన్నాడు. ఇక సుడులు తిరిగే అరబ్ పిచ్‌లపై సునైల్ నరైన్, కుల్దీప్ యాదవ్ చెలరేగిపోయే అవకాశాలున్నాయి.

ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టు కెప్టెన్ మోర్గాన్, యువ సంచలన టామ్ బాంటమ్‌లనూ కేకేఆర్ సొంతం చేసుకోవడంతో జట్టు బలంగా కనిపిస్తోంది. కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావి, ప్రసిద్ధ్ కృష్ణ, లాకీ ఫెర్గూసన్‌లు పేస్ బాధ్యతలు పంచుకుంటారు.

వార్నర్

ఫొటో సోర్స్, FACEBOOK/SUNRISERSHYDERABAD

సన్‌రైజర్స్ హైదరాబాద్(2016)

ఐపీఎల్ సమరంలో మంచి సమతూకం ఉన్న జట్లలో ఈ ఆరెంజ్ ఆర్మీ ఒకటి. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో రూపంలో వీరికి విధ్వంసకర ఓపెనింగ్ ద్వయం ఉంది. ఇక కేన్ విలియమ్సన్ ఉండనే ఉన్నాడు.

నరాలు తెగే ఉత్కంఠ ఉన్నా కూల్‌గా మ్యాచ్ ఫినిష్ చేసే దమ్మున్న మనీశ్ పాండే వీరికి అదనపు బలం. వీరికి తోడు అఫ్గాన్ బౌలింగ్ ద్వయం రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు ప్రత్యర్థులకు ఎప్పుడూ భయం కలిగిస్తూనే ఉంటారు.

వీరిద్దరికీ గతంలో యూఏఈలో ఆడిన అనుభవం ఉంది. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్‌ల పేస్ దళం ఈ జట్టుకు దన్ను.

ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఉన్నాడు. ఇక అండర్ 19లో బాగా ఆడిన కొందరు యువ ఆటగాళ్లనూ సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.

బుమ్రా, రోహిత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుమ్రా, రోహిత్

ముంబయి ఇండియన్స్(2013, 2015, 2017, 2019)

ఐపీఎల్‌లో మంచి క్రేజ్ ఉన్న టీముల్లో ఇదొకటి. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఉత్సాహంగా ఉంది.

బ్యాట్, బంతితో విజృంభించే హార్దిక్ పాండ్యా, ఆయన సోదరుడు కృణాల్ పాండ్యాలు ఈ జట్టులో కీలక ఆటగాళ్లు.

బంతికి చుక్కలు చూపించే కీరన్ పొలార్డ్ కూడా ఉన్నాడు. లసిత్ మలింగ, ట్రెంట్ బోల్ట్, జస్‌ప్రీత్ బుమ్రాలతో పేస్ అటాక్ కూడా బాగుంది.

వీరికి తోడు ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్, ఆల్ రౌండర్ కోల్టర్ నీల్‌నూ ఈ జట్టు తీసుకుంది.

గత సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన రాహుల్ చాహర్ ఈ జట్టులోనే ఉన్నాడు.

సౌత్ ఆఫ్రికా టీ20 కెప్టెన్ క్వింటన్ డీకాక్, దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద సృష్టించిన సూర్యకుమార్ ముంబయి ఇండియన్స్ అమ్ముల పొదిలోనే ఉన్నారు.

రాజస్తాన్ రాయల్స్

ఫొటో సోర్స్, FACEBOOK/RAJASTAN ROYALS

రాజస్తాన్ రాయల్స్(2008)

ఎక్కువ మంది లో ప్రొఫైల్ ఆటగాళ్లున్న రాజస్థాన్ రాయల్స్‌కు ప్రధాన ఆయుధం ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా గుర్తింపు ఉన్న బెన్ స్టోక్స్.

బ్యాటింగులో దూకుడు, బౌలింగులో వికెట్లు టపాటపా కూల్చడం.. తిరుగులేని ఫీల్డింగుతో అదరగొట్టే స్టోక్స్ పేరు ప్రత్యర్థులను కంగారు పెడుతుంది.

ఎలాంటి బౌలింగ్ అటాక్‌నైనా ఎదుర్కొనే స్టీవెన్ స్మిత్, జాస్ బట్లర్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తోంది. సంజూ శాంసన్ కూడా రాణిస్తే ఈ జట్టును ఆపడం కష్టమే.

అండర్19 వరల్డ్ కప్ ఆడిన యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్‌లూ ఉన్నారు. బౌలింగ్ దళంలో జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కట్‌లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)