కోవిడ్ వేళ బాల్య వివాహాలు, చిన్నారుల అక్రమ రవాణా పెరిగాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో కరోనావైరస్ లాక్‌డౌన్ కౌమార దశలో ఉన్నవారిపై ప్రతికూల ప్రభావం చూపిందని, ఈ సమయంలో బాల్య వివాహాలు పెరిగాయని.. బాల కార్మికులూ పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి.
పదమూడేళ్ల రాణి(అసలు పేరు కాదు)కి తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. వేసవిలో పెళ్లి చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఇతరుల సహాయంతో ఆ బలవంతపు పెళ్లి నుంచి బయపడింది.
మార్చ్‌లో భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించేనాటికి రాణి ఎనిమిదో తరగతి చదువుతోంది. అక్కడికి నెల రోజుల్లనే రాణి తండ్రి ఆమెకు ఒక సంబంధం చూశారు.
కానీ, రాణికి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ''ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలని ఎందుకంత తొందరపడతారో నాకు అర్థం కాదు'' అన్నారామె.
''స్కూలుకు వెళ్లడం, సంపాదించడం, తన కాళ్లపై తను నిలబడడం ముఖ్యమని వారు అర్థం చేసుకోరు'' అంటారామె.

మూడో వంతు బాల్య వివాహాలు భారత్‌లోనే
భారత్‌లో 18 ఏళ్ల లోపు బాలికలకు పెళ్లి చేయడం నేరం. కానీ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల్య వివాహాలు ఇక్కడే జరుగుతున్నాయి. యూనిసెఫ్ లెక్కల ప్రకారం ప్రపంచంలోని మూడో వంతు బాల్య వివాహాలు ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయి. ఏటా 15 లక్షల మంది పద్దెనిమిదేళ్ల లోపు బాలికలకు వివాహమవుతోంది యూనిసెఫ్ చెబుతోంది.
భారత్‌లో ఈ ఏడాది పరిస్థితి మరింత ఘోరంగా ఉందని 'చైల్డ్ లైన్' చెబుతోంది. ఈ ఏడాది జూన్, జులైల్లో అంతకుముందు ఏడాది అదే నెలలతో పోల్చితే బాల్య వివాహం నుంచి తమను రక్షించాలంటూ సహాయం కోసం 17 శాతం ఎక్కువ కాల్స్ వచ్చాయని చైల్డ్ లైన్ చెబుతోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి సుమారు కోటి మంది తమ సొంతూళ్లకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌లో పనుల్లేక పేదరికంలో చిక్కుకున్నారు. కష్టాల్లో చిక్కుకున్న చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెల భద్రత కోసం వారికి పెళ్లి చేసి పంపించేయాలని అనుకున్నారు. ఆ ఫలితమే ఈ బాల్యవివాహాలు.
భారత్‌లో పాఠశాలలు మార్పునకు కారకాలు.. ముఖ్యంగా దేశంలోని ఒడిశా వంటి పేద రాష్ట్రాల్లో మరీనూ. రాణిది కూడా ఒడిశాయే. ఇంట్లోవాళ్లు పెళ్లి చేసేస్తమన్నప్పుడు బాలికలు స్కూళ్లో స్నేహితులు, ఉపాధ్యాయులకు చెప్పుకొని సహాయం కోరుతారు.
కానీ, లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు మూతపడడంతో అనేక మంది బాలికలకు సహాయ అవకాశం పోయినట్లయింది.
''తీవ్ర పేదరికంలో ఉన్న వర్గాల్లో బాలికలను చదివించడం బాగా తక్కువ. ఒకసారి వారు స్కూలు మానేయాల్సి వస్తే మళ్లీ స్కూలుకు వెళ్లడం దుర్లభమే. అందుకు తల్లిదండ్రులను ఒప్పించడం అంత తేలిక కాదు'' అన్నారు యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థకు చెందిన స్మిత ఖాన్‌జో.
ఈ సంస్థ దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో యూనిసెఫ్ ప్రత్యేక కార్యక్రమం కోసం పనిచేస్తోంది.
రాణి స్నేహితురాలికి ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. అయితే, రాణి మాత్రం పిల్లల కోసం ఏర్పాటైన నేషనల్ హెల్డ్ లైన్‌కు ఫోన్ చేయడంతో స్థానికంగా ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ, పోలీసులు చేరుకుని ఆమె పెళ్లిని ఆపగలిగారు.
కానీ, రాణి కష్టాలు అక్కడితో తీరిపోలేదు. క్షయతో బాధపడుతున్న ఆమె తండ్రి ఆ తరువాత కొద్దిరోజులకే మరణించారు.
''మా నాన్న చనిపోయాడు కాబట్టి నేను ఏదో ఒక పనిచేసి సంపాదించాలి. ఇంటిని నడిపించడానికి అమ్మకు సాయం చేయడం నా బాధ్యత. స్కూల్స్ మళ్లీ తెరిచాక నేను వెళ్తాన''ని రాణి చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలలను కార్మికులుగా మార్చేసిన లాక్‌డౌన్
లాక్‌డౌన్ తరువాత బాలికల పరిస్థితే కాదు బాలుర పరిస్థితీ దుర్భరంగానే ఉందని యాక్షన్ ఎయిడ్‌కు చెందిన స్మిత చెబుతున్నారు.
కుటుంబాలకు ఆసరాగా ఉండడం కోసం టీనేజ్ అబ్బాయిలను బలవంతంగా కర్మాగారాల్లో పనికి కుదుర్చుతున్న కేసులు అనేకం వస్తున్నాయని ఆమె చెప్పారు.
భారత్‌లో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం నేరం. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 26 కోట్ల చిన్నారుల్లో కోటి మంది బాల కార్మికులున్నారు.
పంకజ్ లాల్ అనే రిక్షా కార్మికుడికి అయిదుగురు పిల్లలు లాక్‌డౌన్ కారణంగా నాలుగు నెలల పాటు ఉపాధి పోవడంతో పిల్లలకు తిండికూడా పెట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఓ వ్యక్తి పంకజ్ లాల్ 13 ఏళ్ల కుమారుడిని పనికి పంపించమని సూచించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పంకజ్ అందుకు అంగీకరించి తన సొంత రాష్ట్రం నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని బిహార్‌లో ఒక గాజుల పరిశ్రమలో పనికి పంపించాడు. అక్కడ పంకజ్ కుమారుడికి ఇచ్చే జీతం నెలకు రూ. 5 వేలు.
అంతదూరం కొడుకును పంపించినందుకు బాధపడుతూ పంకజ్ లాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
''నా పిల్లలకు రెండు రోజుల పాటు తిండి లేదు. దాంతో దళారిని కలిసి రాజస్థాన్ వెళ్లడానికి నేను వస్తానన్నాను. కానీ, గాజుల తయారీ పనికి చురుకైన వేళ్లు కావాలని.. నేను పనికిరానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నా కుమారుడిని పంపించాల్సి వచ్చింద''ని పంకజ్ ఏడుస్తూ చెప్పాడు.

రవాణాపై ఆంక్షలు ఉన్నా..
లాక్‌డౌన్ సమయంలో రవాణాపై ఆంక్షలున్నా కూడా పిల్లల అక్రమ రవాణాదారులు ఫ్యాక్టరీలు, ఇతర చోట్ల పనుల కోసం పిల్లలను మాట్లాడుకుని కొత్త మార్గాలు, లగ్జరీ బస్సుల్లో రాష్ట్రాలు దాటించారు.
ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న సురేశ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తుల్లో భారీ సంక్షోభం తలెత్తనుందన్నారు. ఆయన గత పాతికేళ్లుగా బాల కార్మికులను విముక్తి చేస్తున్నారు.
''గత ఏడాదితో పోల్చితే మేం కాపాడిన బాలకార్మికుల సంఖ్య రెట్టింపైంద''ని చెప్పారు సురేశ్.
అయితే, బాలకార్మికులకు సంబంధించి హెల్ప్‌లైన్లకు వచ్చే కాల్స్ సంఖ్య మాత్రం తగ్గిందని.. పిల్లలు తమను పనికి పంపొద్దని తల్లిదండ్రుల వద్ద ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నారని అన్నారు.
అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది... ఇందుకోసం మరింత కఠినమైన చట్టాన్నీ ఆమోదించింది. చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టే వ్యవస్థను విస్తరించాలని రాష్ట్రాలనూ కోరింది.
దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలోనూ చిన్నారులు, మహిళల కోసం షెల్టర్లు కొనసాగించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
అయితే బాలల అక్రమ రవాణాలో ఉన్నవారికి శక్తిమంతమైన వ్యక్తులతో సంబంధాలు ఉండడంతో వారు ఇలాంటి కేసుల నుంచి జరిమానాలతో బయటపడుతున్నారని యాక్టివిస్టులు చెబుతున్నారు.
పిల్లల అక్రమ రవాణా గురించి తల్లిదండ్రులు పెద్దగా ఫిర్యాదు చేయవని.. పోలీసులకు ఫిర్యాదు చేసినవారికి బెదిరింపులు కూడా వస్తుంటాయని సురేశ్ కుమార్ అన్నారు.
పంకజ్ లాల్ పదమూడేళ్ల కొడుకు వెళ్తున్న బస్సును అధికారులు తనిఖీ చేయడంతో అందులోని పిల్లలంతా బయటపడ్డారు. ప్రస్తుతం పంకజ్ కొడుకు రాజస్థాన్‌లోని ఒక క్వారంటీన్ సెంటర్లో ఉన్నాడు. క్వారంటీన్ పూర్తయిన తరువాత ఆయన్ను ఇంటికి పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
''ఒక బలహీన క్షణంలో నా కొడుకును పనికి పంపించాను. ఎంతుంటే అంత తిని బతుకుతాం కానీ మళ్లీ నా కొడుకును ఎక్కడికో పనికి పంపించను'' అంటున్నారు పంకజ్.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి సమస్యకు ఎవరి దగ్గరకు వెళ్లాలి? మీ భూమి మీదేనని అధికారికంగా ఎవరు చెప్తారు?
- ఆస్ట్రా జెనెకా క్లినికల్ ట్రయల్స్ ఎందుకు ఆగిపోయాయి ?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- కరోనావైరస్-రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- కోవిడ్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








