అఫ్గానిస్తాన్‌: ఆసుపత్రిలో ప్రసూతి వార్డుపై దాడి.. 24కు చేరిన మృతులు

కాబూల్ దాడిలో గాయపడిన పసిపాప

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాడి జరిగిన ఆసుపత్రిలో గాయపడిన పసిపిల్లల్ని వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఒక ఆసుపత్రిలోని ప్రసూతి వార్డుపై జరిగిన మిలిటెంట్ దాడిలో మృతుల సంఖ్య 24కు చేరింది.

బాధితుల్లో తల్లులు, నవజాత శిశువులు, నర్సులు ఉన్నారు. ఈ దాడిలో మరో 16 మంది వరకూ గాయపడ్డారని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.

మంగళవారం కాబూల్‌లో జరిగిన దాడిని విస్తృతంగా ఖండిస్తున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకూ ఏ సంస్థా ప్రకటించలేదు.

అదే రోజు దేశంలో తూర్పు ప్రాంతంలో మరో ఘటన జరిగింది. నంగార్హర్‌లో అంతక్రియల్లో ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో 32 మంది చనిపోయారు.

దేశంలో తాలిబాన్లు, ఇతర మిలిటెంట్ బృందాలను అడ్డుకునే ఆపరేషన్లను మళ్లీ ప్రారంభించాలని అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆదేశించారు. హింసను తగ్గించాలని పదే పదే పిలుపునిస్తున్నా, వారు దానిని విస్మరిస్తున్నారని ఆరోపించారు.

నంగార్హర్‌లో పోలీస్ కమాండర్ అంత్యక్రియల్లో జరిగిన దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్(ఐస్) హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు.

కాబూల్‌లోని దస్త్-ఎ-బర్చీ ఆసుపత్రిలో ఎవరు దాడి చేశారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందులో తమ ప్రమేయం లేదని తాలిబాన్లు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ఆస్పత్రి నుంచి 19 మంది శిశువులను సురక్షితంగా నగరంలోని ఒక పిల్లల ఆసుత్రికి తరలించారు. కానీ వారి తల్లుల్లో చాలా మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

మంగళవారం అఫ్గానిస్తాన్ అంతటా జరిగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 100 మంది మృతిచెందినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

బలహీనమైన శాంతి ప్రయత్నాలను ఇది బయటపెట్టిందని, దశాబ్దాల యుద్ధానికి ముగింపు పలకాలనే ఆశలు మసకబారాయని చెప్పింది.

బాధితులు

ఫొటో సోర్స్, Reuters

ఆసుపత్రిలో ఏం జరిగింది?

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో దాడి మొదలైందని, రెండు పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు బీబీసీతో చెప్పారు.

ఆ సమయంలో ఆసుపత్రిలో 140 మంది వరకూ ఉన్నారని దాడి నుంచి తప్పించుకున్న ఒక డాక్టర్ అన్నారు.

ఆసుపత్రిలోని ప్రసూతి వార్డును అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ 'మెడిసిన్స్ శాన్స్ ప్రాంటియర్స్'(ఎంఎస్ఎఫ్) నిర్వహిస్తోంది. అక్కడ పనిచేస్తున్నవారిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు.

"దాడి గురించి తెలీడంతో అందరూ వణికిపోయారు" అని మరో డాక్టర్ ఏఎఫ్‌పి న్యూస్‌తో చెప్పారు.

"దాడి చేసిన వారు అకారణంగా ఆసుపత్రిలో ఉన్న వారిపై కాల్పులు జరిపారు" అని దాడి మొదలైనప్పుడు చూసిన రమజాన్ అలీ రాయిటర్స్ తో చెప్పారు.

దాడి జరుగుతున్న సమయంలో ఒక మహిళ ప్రసవించిందని ఎంఎస్ఎఫ్ సిబ్బంది ఏఎఫ్‌పీతో చెప్పారు.

"జైనబ్ అనే మరో మహిళ దాడికి ముందు ప్రసవించింది. చాలా ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడంతో ఆమె తన బిడ్డకు ఒమిడ్(దారీ భాషలో ఆశ) అనే పేరు పెట్టుకుంది" అని రాయిటర్స్ చెప్పింది.

"బాత్రూంకు వెళ్తున్న ఆమె దాడి గురించి తెలీడంతో, వెనక్కు వచ్చి తన బిడ్డ కోసం నాలుగు గంటలు వెతికింది. కానీ ఏడేళ్ల తర్వాత పుట్టిన ఆమె బిడ్డ చనిపోయాడు" అని తెలిపింది.

"బిడ్డను క్షేమంగా కాపాడుకోవాలని నేను నా కోడలిని కాబూల్‌కు తీసుకొచ్చాను. ఈరోజు మేం ఆ బిడ్డ మృతదేహాన్ని బమియాన్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది" అని జైనబ్ అత్త జహ్రా ముహమ్మదీ కన్నీళ్లతో చెప్పారు.

అఫ్గాన్ ప్రత్యేక దళాలు 100 మంది పిల్లలను, ముగ్గురు విదేశీయులను కాపాడాయని ఒక అధికారి బీబీసీకి చెప్పారు. పోలీసు అధికారుల యూనిఫాంలో ఆసుపత్రిలోకి ప్రవేశించారని చెబుతున్న ముగ్గురు మిలిటెంట్లను భద్రతాదళాలు కాల్చిచంపాయి.

నవజాత శిశువులను కాపాడ్డానికి సైనికులు వారిని రక్తపు మరకలు ఉన్న దుప్పట్లలో చుట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

మంగళవారం ఉదయం ఆసుపత్రిపై దాడి జరిగింది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మంగళవారం ఉదయం ఆసుపత్రిపై దాడి జరిగింది
Presentational grey line

సున్నితమైన ఆశలు ఛిద్రమయ్యాయి

బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లీజ్ డోసెట్ విశ్లేషణ

దేశం అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నా, నవజాత శిశువులు, వారి తల్లులపై జరిగిన ఈ క్రూరమైన దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది.

అఫ్గానిస్తాన్ చివరికి ఈ ఏడాది శాంతి దిశగా కదలడం ప్రారంభించిందనే ఆశలను ఇది ఛిద్రం చేసింది.

ముఖ్యంగా అఫ్గాన్ కోవిడ్-19 అనే మరో శత్రువుతో పోరాడుతున్న సమయంలో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన ప్రత్యేక దళాలు శిశువులను సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యాలు కాల్పుల విరమణకు పదే పదే పిలుపునిస్తున్న వారి జ్ఞాపకాల్లో సుదీర్ఘకాలం నిలిచిపోతాయి.

ఈ భయనక దాడి తమ పని కాదని తాలిబన్లు చెబుతున్నప్పటికీ, అధ్యక్షుడు ఘనీ నిందారోపణలు చాలా మంది ఆగ్రహాన్ని, నైరాశ్యాన్ని ప్రతిబంబిస్తున్నాయి.

ఇస్లామిక్ స్టేట్ లాంటి సంస్థలు తాలిబన్లు, ప్రభుత్వం మధ్య మరింత చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, శాంతి చర్చల వైపు నెమ్మదిగా పడుతున్న అడుగులకు కూడా ఇప్పుడు అంతం పలికారని ఆందోళనలు కూడా ఉన్నాయి.

తాలిబన్ల నిబద్ధతను ఎప్పుడూ విశ్వసించని వారిలో ఈ తాజా దాడి తమ పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పాన్ని పటిష్టం చేసింది.

Presentational grey line
పసి పిల్లలతో పాటు, 12 మంది తల్లులు, వైద్య సిబ్బంది కూడా ఈ దాడిలో చనిపోయారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పసి పిల్లలతో పాటు, 12 మంది తల్లులు, వైద్య సిబ్బంది కూడా ఈ దాడిలో చనిపోయారు

దాడిపై అంతర్జాతీయ స్పందన

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, మానవ హక్కుల సంఘాలు మంగళవారం జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి. "ఈరోజు అఫ్గానిస్తాన్‌లోన అన్యాయమైన యుద్ధ నేరాలు, పౌరులు ఎదుర్కొంటున్న భయానక స్థితి ప్రపంచాన్ని కచ్చితంగా మేల్కొల్పాలి" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది.

"నవజాత శిశువులు, వారి తల్లులపై ఎవరు దాడి చేయగలరు, ఇది ఎవరు చేశారు?" అని అఫ్గానిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల చీఫ్ డెబ్రా లియాన్స్ ట్వీట్ చేశారు.

అమాయకులు, పిల్లలు, ప్రసవిస్తున్న మహిళలపై జరిగే ఏ దాడి అయినా క్షమించరానిదే, అది అత్యంత హేయమైన చర్య అని అమెరికా విగేశాంగ మంత్రి మైక్ పాంపేయో అన్నారు.

"అంత్యక్రియల్లో ప్రార్థనలు చేసేందుకు వరుసలో నిలుచున్నవారిపై దాడి చేసిన మిలిటెంట్లు, కుటుంబాలను, సమాజాలను కలిపి ఉంచే బంధాలను ముక్కలు చేయాలని చూశారు. కానీ అందులో వారు ఎప్పటికీ విజయం సాధించలేరు" అని ఆయన అన్నారు.

నంగార్హర్‌లో జరిగిన అంత్యక్రియల్లో వేలాది మంది గుమిగూడిన, కాసేపటి తర్వాత బాంబు పేల్చారని, ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడినవారు చెప్పారు. బాంబు పేలగానే, మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. మరో 133 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు.

ఇటు, ఉత్తర బాలఖ్ ప్రావిన్సులో అమెరికా దళాల వైమానిక దాడుల్లో మరో పది మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. అక్కడ బాధితులందరూ పౌరులేనని స్థానికులు, తాలిబాన్లు చెప్పారు. కానీ అఫ్గాన్ రక్షణ శాఖ మాత్రం చనిపోయినవారందరూ మిలిటెంట్లేనని అంటోంది.

ఓ పోలీసు అంత్యక్రియల కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని మరో దాడి జరిగింది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఓ పోలీసు అంత్యక్రియల కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని మరో దాడి జరిగింది

ఇస్లామిక్ స్టేట్ సౌత్ ఏసియా అండ్ ఫార్ ఈస్ట్ నాయకుడు, ఆ సంస్థలోని మరో ఇద్దరు కీలక సభ్యులు మంగళవారం కాబూల్‌లో అరెస్టైనట్లు అఫ్గాన్ నిఘా విభాగం తెలిపింది.

2017లో ఇస్లామిక్ స్టేట్ సభ్యులు కొందరు వైద్య సిబ్బందిలో వేషం వేసుకుని కాబూల్‌లో ప్రధాన సైనిక ఆసుపత్రిపై దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో 50 మంది చనిపోయారు.

తాలిబన్లు కూడా ఇదివరకు ఆసుపత్రులపై దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయి. గత సెప్టెంబర్‌లో జబూల్ ప్రావిన్సులో విధ్వంసక పదార్థాలు నింపిన ఓ ట్రక్కుతో ఓ ఆసుపత్రి బయట తాలిబన్లు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు పోయాయి.

ఇటు తాజాగా పోలీసు అంత్యక్రియలపై దాడి ఘటన నంగర్హర్ ప్రావిన్సులో జరిగింది. ఈ ఘటనలో చనిపోయినవారిలో ప్రావిన్సు మండలి సభ్యుడు కూడా ఉన్నారు. అంత్యక్రియల కార్యక్రమానికి వేలమంది హాజరయ్యారని, కార్యక్రమం మధ్యలో ఉండగా బాంబు పేలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

మరోవైపు బల్ఖ్ ప్రావిన్సులో అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో పది మంది చనిపోయారని, మరో పది మంది దాకా గాయపడ్డారని కథనాలు వచ్చాయి. ఈ దాడిలో బాధితులంతా సాధారణ పౌరులని అక్కడి స్థానికులు, తాలిబన్లు అంటున్నారు. అఫ్గాన్ రక్షణ మంత్రిత్వశాఖ మాత్రం చనిపోయినవారంతా మిలిటెంట్లని చెబుతోంది.

ఫిబ్రవరి శాంతి ఒప్పందం తర్వాత పరస్పర ఖైదీల అప్పగింతపై అంగీకారం కుదరకపోవడంతో అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలు ఆగిపోయాయి. ఆ తర్వాత నుంచి హింస కొనసాగుతోంది. ఈ చర్చల్లో ఇస్లామిక్ స్టేట్ భాగం కాలేదు.

9/11 దాడుల అనంతరం అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను అమెరికా దళాలు గద్దె దింపినప్పటి నుంచి, అఫ్గాన్‌లో 18 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా ఆ ఒప్పందం తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)