తాలిబన్: ఏకపత్నీ వ్రతం చేపట్టమని ఆదేశాలు జారీచేసిన మిలిటెంట్ గ్రూప్ చీఫ్.. ఆయనకు మాత్రం ముగ్గురు భార్యలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఖుదాయీ నూర్ నాజర్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
తాలిబన్ కమాండర్లు, ఇతర నాయకులు బహుభార్యత్వానికి దూరంగా ఉండాలని ఆ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ముల్లా హిబతుల్లా ఆదేశాలు జారీ చేశారు.
బహుభార్యత్వం వల్ల శత్రువుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ముస్లింలలో పురుషులు ఒకేసారి నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సహా కొన్ని ముస్లిం దేశాల్లో ఇప్పటికే బహుభార్యత్వం చట్టబద్ధమే.
అయితే, బహుభార్యత్వం కారణంగా సమస్యలు వస్తున్నాయని.. కన్యాశుల్కం చెల్లించడం కోసం తాలిబన్ కమాండర్లు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని తాలిబన్ వర్గాలు 'బీబీసీ'తో చెప్పాయి.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లోని పష్తూన్ తెగలలో పెళ్లి సందర్భంలో కన్యాశుల్కం (వధువు కుటుంబానికి డబ్బు చెల్లించడం) ఇచ్చే పద్ధతి ఉంది.
అఫ్గానిస్తాన్ భవిష్యత్తు కోసం ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
మూణ్నాలుగు కుటుంబాలను నడపడానికి గాను డబ్బు అవసరమైన తమ కమాండర్లు అవినీతికి, వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తుండడంపై తాలిబన్ అగ్ర నాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
తాలిబన్ సీనియర్ లీడర్లలో అత్యధికులకు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్నారు.
అయితే, ఈ కొత్త ఆదేశాలు ఇప్పటికే ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్నవారికి వర్తించవు. ఇకపై ఎవరూ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడరాదన్నది ఈ ఆదేశాల ఉద్దేశం.
ఆదేశాల్లో ఏముంది?
అఫ్గాన్ తాలిబన్ నేత ముల్లా హిబతుల్లా జారీ చేసిన ఈ రెండు పేజీల డిక్రీ ప్రకారం రెండు, మూడు, నాలుగో వివాహాలపై నిషేధం ఏమీ విధించలేదు.
అయితే, పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేయడమనేది వ్యతిరేకులు తమపై విమర్శలు చేయడానికి అవకాశమిస్తుందని అందులో పేర్కొన్నారు.
''నాయకత్వమంతా బహుభార్యత్వానికి దూరంగా ఉంటే అవినీతి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడాల్సిన అవసరమే ఉండదు'' అని అందులో రాశారు.
ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారు?
మునుపటి భార్యలకు సంతానం లేకపోవడం, ఉన్నా మగ సంతానం లేకపోవడం వంటి సందర్భాలలో.. వితంతును వివాహమాడాలనుకుంటున్నవారికి.. నలుగురు భార్యలను పోషించగలిగే స్తోమత ఉన్నవారికి దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.
అయితే, ఇలాంటి మినహాయింపు పొందగోరేవారు కూడా తమ పైస్థాయి నాయకుల నుంచి అనుమతి తీసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని ఆ డిక్రీలో సూచించారు.
అప్గానిస్తాన్, పాకిస్తాన్‌లోని తాలిబన్ వర్గాలకు ఈ ఆదేశాలున్న లేఖను పంపిణీ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బహుభార్యత్వం అంత ఎక్కువా?
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లోని పష్తూన్ సమాజాలలో ఎప్పటి నుంచో బహుభార్యత్వం ఉంది. ఈ సమాజాల్లో ఆడవారికి పెళ్లి విషయంలో తమ అభిప్రాయం చెప్పే అవకాశం చాలా తక్కువ. ఎవరిని పెళ్లాడాలి.. ఏ వయసులో పెళ్లాడాలి వంటి విషయాల్లో వారికి స్వేచ్ఛ లేదు. పెద్దలు సూచించినవారిని మౌనంగా పెళ్లాడడమే వారి విధి.
పిల్లలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా మగపిల్లలు లేకపోవడాన్ని కారణంగా చూపి ఇక్కడి మగవారు మళ్లీ పెళ్లి చేసుకుంటారు.
కొన్ని సందర్భాలలో భర్త చనిపోయిన మహిళలను భర్త సోదరుల్లో ఒకరు పెళ్లి చేసుకుంటారు. ఆమె గౌరవం, కుటుంబ గౌరవం కాపాడే చర్యగా చెబుతుంది ఆ సమాజం.
స్తోమత ఉన్న పురుషులు తమ హోదా ప్రదర్శించుకోవడానికి ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు.
ఇలా పెళ్లి చేసుకున్నప్పుడు వధువు కుటుంబానికి కన్యాశుల్కం చెల్లిస్తారు. దీన్ని వాల్వార్ అంటారు.
''ఆర్థిక ఒత్తిళ్లు, సమాజంలో మారుతున్న ఆలోచన ధోరణుల వల్ల గత కొన్నేళ్లుగా బహుభార్యత్వం తగ్గుతోంది. అయితే, పురుషుల కామం కారణంగా ఆధునిక ప్రపంచంలోనూ ఈ పద్ధతులు ఇంకా ఉన్నాయి'' అన్నారు ఆస్ట్రేలియాలో ఉండే అఫ్గాన్ యాక్టివిస్త్ రీటీ అన్వారీ.
''కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే బహుభార్యత్వానికి ఇస్లాం అనుమతిస్తుంది. మొదటి భార్య పూర్తిగా అనారోగ్యంతో ఉన్నా, పిల్లలను కనే అవకాశం లేకపోయినా ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం పురుషులకు అనుమతిస్తుంది. ఇలాంటి సందర్భాలకు కూడా అనేక జాగ్రత్తలు ఉంటాయి'' అన్నారామె.
''కానీ ప్రస్తుత పురుషులు ఇస్లాం చెప్పినవన్నీ మరిచి తమ కామం కోసం ఎక్కువ మందిని పెళ్లాడుతున్నారు. చిన్నచిన్న సాకులు చెప్పి కొత్త భార్యలను పెళ్లాడుతున్నారు'' అన్నారామె.
''భార్యలందరినీ ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, శారీరకంగా సమానంగా చూడలేనప్పుడు అంతమందిని పెళ్లాడడం పూర్తిగా తప్పు'' అన్నారు అన్వారీ.

ఫొటో సోర్స్, Anadolu
ఇక తాలిబన్ల అగ్ర నేతలను చూస్తే వారిలోనూ చాలామందికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలే ఉన్నారు.
తాలిబన్ ఉద్యమ వ్యవస్థాపకుడు లేటు ముల్లా మొహమ్మద్ ఒమర్, ఆయన తరువాత వచ్చిన ముల్లా అక్తర్ మన్సూర్ ఇద్దిరికీ ముగ్గురేసి భార్యలున్నారు.
ప్రస్తుత తాలిబన్ చీఫ్ ముల్లా హిబతుల్లాకు కూడా ఇద్దరు భార్యలున్నారు.
దోహాలో తాలిబన్ల సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బర్దార్‌కు ముగ్గురు భార్యలో.. పాకిస్తాన్‌లో కస్టడీలో ఉండగా ఆయన మూడో పెళ్లి చేసుకున్నారు.
దోహా కేంద్రంగా పనిచేస్తున్న తాలిబన్ నాయకులందరికీ దాదాపు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలే ఉన్నారు.
తాలిబన్ నేతల్లో ఎవరెవరికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్నారో వివరాలు కావాలని 'బీబీసీ' తాలిబన్ వర్గాలను సంప్రదించగా.. ''ఎవరికి లేరో చెప్పండి'' అంటూ సమాధానం వచ్చింది.
మరి ఇప్పుడెందుకు ఆపాలనుకుంటున్నారు?
తాలిబన్ నాయకులు విలాసవంతమైన జీవితాలు గడుపుతారని.. క్షేత్రస్థాయిలో ఫైటర్లు మాత్రం తినడానికి తిండి కూడా లేకుండా కష్టాలు పడుతుంటారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు చాలాకాలంగా విమర్శలు చేస్తున్నాయి.
గత ఏడాది దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్యానల్ డిస్కషన్‌లో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మాట్లాడుతూ.. ''తాలిబన్ నేతలు నాలుగో భార్యనో, అయిదో భార్యనో పొంది జీవితాన్ని అనుభవించడంలో మునిగితేలుతున్నప్పుడు ఆ గ్రూప్ పోరాటాలకు దూరంగా ఉంటుంది.. ఇది మంచి విషయమే'' అన్నారు.
అంతేకాదు.. తాలిబన్ నేతలు బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటారన్న వార్తలూ ఉన్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సున్నిత సమయంలో ఇలాంటి అవాంఛనీయ ప్రచారం వారికి చేటే.
అంతేకాదు.. పెళ్లి చేసుకునేటప్పుడు ఇవ్వాల్సిన డబ్బు కోసం వారు పాటించే పద్ధతులూ వివాదాస్పదమవుతున్నాయి.
కమాండర్లు, ఫైటర్లు పెళ్లి చేసుకునేటప్పుడు 20 లక్షల నుంచి 80 లక్షల వరకు అఫ్గానీలను చెల్లిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
సంస్థ నిధి నుంచి కొందరు ఈ డబ్బు చెల్లిస్తుండగా మరికొందరు ఆమోద యోగ్యం కాని మార్గాల్లో డబ్బు వసూలు చేసి చెల్లిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇలాంటి అన్ని కారణాల దృష్ట్యా ఈ కీలక చర్చల సమయంలో చెడ్డపేరు రాకుండా ఈ డిక్రీ జారీ చేసినట్లు తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








