చైనా, అమెరికా వివాదం: దక్షిణ చైనా సముద్రంపై చైనా వైఖరి చట్టవిరుద్ధం - మైక్ పాంపియో

దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మాణాలు

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ చైనా సముద్రంలో పాగా వేసేందుకు చైనా పట్టు విడవకుండా సాగిస్తున్న ప్రయత్నాలు పూర్తిగా చట్ట విరుద్ధమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు.

“వివాదాస్పద జలభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోడానికి చైనా దూకుడుగా వ్యవహరించడం తప్పు” అని స్పష్టం చేయాలనుకుంటున్నామని పాంపియో చెప్పారు.

దక్షిణ సముద్రంలో ఒక పెద్ద భాగం తమదని చైనా చెబుతోంది. అది అక్కడ మానవ నిర్మిత ద్వీపాలపై సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తోంది.

కానీ, ఈ ద్వీపాలు, సముద్ర శిలలు మావంటూ తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేసియా, వియత్నాం కూడా వాదిస్తున్నాయి.

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఈ దేశాల మధ్య శతాబ్దాలుగా వివాదం నడుస్తోంది. కానీ, ఇటీవల ఆ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

'నైన్-డాష్ లైన్' పేరుతో గుర్తించిన ఈ ప్రాంతం తమదేనని చైనా చెబుతోంది. తమ వాదనలకు బలం చేకూర్చుకోవడానికి ఆ ప్రాంతంలో కృత్రిమ ద్వీపాలు నిర్మిస్తోంది. నావికా దళాన్ని మోహరించిన చైనా అక్కడ గస్తీ కూడా పెంచింది.

సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిన పాంపియో దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద స్పార్ట్ లీ ద్వీపంపై చైనా వాదనలను వ్యతిరేకించారు.

ప్రాంతీయ వివాదాల్లో మేం ఎవరి పక్షం కాదని అమెరికా చెబుతూ వస్తోందని.. వియత్నాం, మలేసియా, ఇండోనేసియాలకు దగ్గరగా ఉన్న జలాలపై చైనా వాదనలను ఖండిస్తున్నామని పాంపియో చెప్పారు.

షీ జిన్‌పింగ్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, షీ జిన్‌పింగ్, డోనల్డ్ ట్రంప్

“ఈ జలాల్లో వేరే దేశాలు చేపల వేట, హైడ్రోకార్బన్ అభివృద్ధికి సంబంధిచిన కార్యకాలాపాలకు భంగం కలిగించే చర్యలు, ఏకపక్షంగా జరిగే కార్యకలాపాలు చట్టవిరుద్ధం” అని కూడా పాంపియో ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

“దక్షిణ చైనా సముద్రాన్ని కేవలం చైనా సముద్ర సామ్రాజ్యంగా మారడాన్ని ఈ ప్రపంచం అంగీకరించదు” అన్నారు.

ఆగ్నేయాసియాలో సహచర దేశాల హక్కులను, సముద్ర తీరానికి దూరంగా ఉన్న వారి వనరులను పరిరక్షించడానికి అమెరికా కట్టుబడి ఉందని పాంపియో చెప్పారు.

"అంతర్జాతీయ చట్టాలు, బాధ్యతల ప్రకారం అమెరికా వాదన సబబే"నన్నారాయన.

దక్షిణ చైనా సముద్రంలో నావికా దళం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, దక్షిణ చైనా సముద్రంలో నావికా దళం

చైనా ఎలా స్పందించింది

వాషింగ్టన్ డీసీలోని చైనా రాయబార కార్యాలయం పాంపియో ప్రకటనపై ట్విటర్‌లో స్పందించింది.

“సముద్ర చట్టాలపై జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సుతోపాటు, అంతర్జాతీయ చట్టాలను, వాస్తవాలను అమెరికా ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తోంది” అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

అమెరికా ఆ ప్రాంతంలో పరిస్థితిని పెద్దదిగా చూపించడానికి, చైనా, దాని తీరంలో ఉన్న దేశాల మధ్య విద్వేష బీజాలు నాటేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

“అమెరికా ఆరోపణ పూర్తిగా న్యాయవిరుద్ధం. చైనా దీనిని గట్టిగా వ్యతిరేకిస్తోంది” అని తెలిపింది.

దక్షిణ చైనా సముద్రం మ్యాప్

చైనాను వ్యతిరేకించడంలో అమెరికా ఉద్దేశం

బీబీసీ చైనీస్ సేవల ప్రతినిధి ఝావోయిన్ ఫెంగ్ విశ్లేషణ

దక్షిణ చైనా సముద్రం వివాదంలో అమెరికా ఇప్పటివరకూ ఎవరి పక్షానా లేదని వాషింగ్టన్‌లో బీబీసీ చైనీస్ సేవల ప్రతినిధి ఝావోయిన్ ఫెంగ్ అన్నారు.

హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలు చట్టపరంగా నిరాధారమని చెప్పిన అమెరికా, ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఆ ప్రాంత వివాదంలో అధికారికంగా తన వైఖరిని స్పష్టం చేసింది.

కానీ, అమెరికా ఇన్నాళ్లకు ఇప్పుడు ఇలా ఎందుకు చెబుతోంది అనేదే ప్రశ్న.

గత వారం దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనా నావికా దళాలు ఒకే సమయంలో యుద్ధ విన్యాసాలు చేశాయి. ఇది చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చెప్పడానికి స్పష్టమైన ఉదాహరణ.

కానీ దీనిని నిశితంగా గమనిస్తే, గత నాలుగు దశాబ్దాలుగా చైనా విషయంలో ఉన్న అమెరికా విధానాలను ట్రంప్ ప్రభుత్వం మార్చబోతోంది. చైనా పట్ల అమెరికా విధానం విఫలమైందని ట్రంప్ సర్కారు భావిస్తోంది.

ఇటీవల అమెరికా చాలా అంశాల్లో చైనాను బాహాటంగా విమర్శించింది. వీటిలో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో చైనా ప్రయత్నాలు, మైనారిటీ వీగర్ ముస్లింల మానవ హక్కుల ఉల్లంఘన, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరగుతున్న ప్రదర్శనల పట్ల చైనా వైఖరి కూడా ఉన్నాయి.

దక్షిణ చైనా సముద్రంలో చైనా కృత్రిమ ద్వీపాలు నిర్మించడం ఆ దేశం లక్ష్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రపంచానికి మరో అవకాశం ఇచ్చింది.

ఇప్పుడు ఈ జలాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల చాలా ప్రమాదం ఉంది. సాధారణంగా, ఈ సముద్ర శిలలు, ద్వీపాలకు అంత ప్రాధాన్యం ఉన్నట్టు అనిపించదు. కానీ ఇప్పుడు వీటి గురించి ప్రపంచంలో రెండు బలమైన దేశాల సైన్యం తలపడే ప్రమాదం ఉంది.

ఇండోనేసియా, వియత్నాం మధ్య ఉన్న ఈ సముద్ర భాగం సుమారు 35 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, తైవాన్, బ్రూనై దీనిని మాదంటే మాదంటున్నాయి. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఇక్కడ కొన్ని వందల జాతుల సముద్ర జీవులు కూడా ఉన్నాయి.

ఈ ప్రాంతం గురించి ఇప్పుడున్నంత ఉద్రిక్తతలు దశాబ్దం క్రితం లేవు. తర్వాత, చైనా సముద్రంలో తవ్వకాలు జరిపే ఒక నౌకతో, ఇటుకలు, ఇసుక, కంకర భారీగా తీసుకుని దక్షిణ చైనా సముద్రంలోకి చేరుకుంది. ఒక చిన్న సముద్రం పాయ చుట్టూ పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభించింది.

చైనా మొదట ఓడ రేవును, తర్వాత విమానాలు దిగడానికి రన్‌వేను నిర్మించింది. చూస్తూచూస్తూనే దక్షిణ చైనా సముద్రంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని సృష్టించింది..దానిపై సైనిక స్థావరం ఏర్పాటుచేసింది.

ఈ చిన్న సముద్ర పాయపై యాజమాన్య హక్కుల విషయంలో విదేశాల మధ్యవర్తిత్వాన్ని చైనా నిరాకరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)