అఫ్గానిస్తాన్ రక్షణమంత్రి ఇంటిపై సాయుధుల దాడి, నలుగురు మృతి

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ రక్షణ శాఖ మంత్రి నివాసంపై జరిగిన మిలిటెంట్ల దాడిలో నలుగురు మృతిచెందారు.
మంత్రి కుటుంబ సభ్యులు ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఇంటిపై దాడి చేసిన సాయుధులను పోలీసులు కాల్చిచంపారు. వారి దాడిలో నలుగురు మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
కాబూల్‌లో అత్యంత భద్రత ఉండే గ్రీన్ జోన్ ప్రాంతంలో కారు బాంబు పేల్చిన దుండగులు మంత్రి నివాసంపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మది ఇంట్లో లేరు.
హింసను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుపునిచ్చినప్పటికీ అఫ్గానిస్తాన్‌లోని పలు నగరాల్లో మిలిటెంట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ దాడి కూడా అందులో భాగంగానే జరిగింది.
ఈ దాడిలో నలుగురు మరణించినట్లు భద్రతాధికారులు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
గాయపడిన మరో 11 మందికి కాబూల్‌లో చికిత్స అందిస్తున్నట్లు ఇటాలియన్ మెడికల్ చారిటీ ఎమర్జెన్సీ ధ్రువీకరించింది. గాయపడినవారితో పాటు నలుగురి మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించామని వెల్లడించింది.
"ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా బాగానే ఉంది" అని దాడి అనంతరం మొహమ్మది ట్వీట్ చేశారు.
ఈ దాడి తాలిబన్లు చేసినట్లు అనిపిస్తోందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
మంగళవారం సాయంత్రం, ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కాబూల్ ప్రజలు, తాలిబన్ల తీరును వ్యతిరేకిస్తూ ఇళ్లపైకి, వీధుల్లోకి చేరారు. అల్లాను ప్రార్థిస్తూ నినాదాలు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలల్లో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల యుద్ధ వాతావరణం నెలకొన్న హెరాత్ నగరంలో కూడా సోమవారం ప్రజలు ఇదే విధంగా స్పందించారు.

ఫొటో సోర్స్, ELISE BLANCHARD/AFP VIA GETTY IMAGES
దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏం జరుగుతోంది?
దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని హెల్‌మంద్ ప్రావిన్సు నగరంలో మిలిటెంట్లకు, ప్రభుత్వ దళాలకు మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీనివల్ల లష్కర్ గాహ్‌లో కనీసం 40 మంది మృత్యువాత పడినట్లు మంగళవారం యూఎన్ వెల్లడించింది.
'అక్కడ రోడ్లపైనే శవాలు పడి ఉన్నాయి. మరణించిన వారంతా నగర పౌరులా లేక తాలిబన్లా అనేది మాకు తెలీడం లేదు. చాలా కుటుంబాలు తమ ఇళ్లు వదిలి దగ్గర్లోని హెల్‌మంద్ నదీ తీరంలో ఉంటున్నాయి' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక స్థానికుడు వాట్సాప్ ఇంటర్వ్యూలో బీబీసీకి చెప్పారు.
వీధుల్లో శవాలు పడి ఉండటాన్ని తాము చూసినట్లు స్థానికులు బీబీసీతో అన్నారు.
తాలిబన్ల దాడుల నేపథ్యంలో నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని అఫ్గాన్ ఆర్మీ ప్రజలను కోరింది.
అఫ్గాన్‌లో మానవతా సంక్షోభం గురించి ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
విదేశీ దళాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌లో తమ ప్రాబల్యం చాటుకోవడానికి హెల్‌మంద్ ప్రావిన్సు రాజధాని లష్కర్ గాహ్‌ను స్వాధీనం చేసుకోవడం తిరుగుబాటుదారుల ముందున్న లక్ష్యం. యూఎస్, బ్రిటీష్ ఆర్మీ క్యాంపులకు హెల్‌మండ్ ప్రధాన స్థావరంగా ఉండేది.
'పోరాటంపై మా నియంత్రణ సడలుతోంది' అని హెల్‌మంద్ ప్రావిన్స్ కౌన్సిల్ హెడ్ అట్టావుల్లా అఫ్గాన్ ఒప్పుకున్నారు.
తిరుగుబాటుదారులే లక్ష్యంగా అఫ్గాన్, అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నప్పటికీ, తాలిబన్లు ఈ వారంలో తమ పట్టును కొనసాగించారు.
తాలిబన్లు ప్రజల ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లోకి చొరబడినట్లు స్థానిక వార్త కథనాలు చెబుతున్నాయి.
సాధారణంగా మిలిటెంట్లు ప్రజల్ని బయటకు వెళ్లాల్సిందిగా లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరిస్తారు. ఒక్కోసారి నేరుగా ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తారు. అలాంటప్పుడు వారి ఇళ్లే యుద్ధభూములుగా మారిపోతాయి. అప్పుడు ప్రజలు పారిపోవడానికి కేవలం నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది.
దక్షిణాదిలో తమకు గతంలో పట్టున్న కాందహార్‌ను స్వాధీనం చేసుకోడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ నగరం హెరాత్‌లోనూ ఘర్షణలు తీవ్రమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ సీన్లలో నటీనటులకు ఇబ్బంది లేకుండా చూసే భారత తొలి 'ఇంటిమసీ కోఆర్డినేటర్'
- 'మా జీవితం మీ పోర్న్ సినిమా కాదు' అంటున్న దక్షిణ కొరియా స్పై కెమేరా బాధితులు
- చైనాకు వ్యతిరేకంగా గళమెత్తిన వీగర్లు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు
- తరుణ్ తేజ్‌పాల్ ఎవరు... బీజేపీ నేతలపై ఆయన ఎందుకు ఆరోపణలు చేశారు?
- రైతు నిరసనల్లో పాల్గొన్న యువతిపై అత్యాచారం, ఎవరు ఏం చెబుతున్నారు
- రేప్ చేసిన వారిని ఆమె క్షమించారు... తనలో కన్నీరు ఎప్పుడో ఇంకిపోయిందన్నారు
- ఆదివాసీ బాలిక, యువకుడిని కట్టేసి ఊరేగించారు.. అసలేం జరిగింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









