తరుణ్ తేజ్‌పాల్ ఎవరు... బీజేపీ నేతలపై ఆయన ఎందుకు ఆరోపణలు చేశారు?

తరుణ్ తేజ్‌పాల్ ఆధ్వర్యంలోని తెహల్కా జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్లలో 2001లో చేపట్టిన ''ఆపరేషన్ వెస్ట్ ఎండ్'' ప్రముఖమైనది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెహెల్కా అప్పట్లో సంచలనం సృష్టించాయి.
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

లైంగిక వేధింపుల కేసు నుంచి తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు గోవాలోని మపుసా సెషన్సు కోర్టు విముక్తి కల్పించింది.

2013 నవంబరులో తెహల్కా మ్యాగజైన్ గోవాలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమం సందర్భంంగా ఓ స్టార్ హోటల్ ఎలివేటర్‌లో తరుణ్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించారు.

ఆమె ఆరోపణలపై తరుణ్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. దాదాపు ఏడు నెలలు ఆయన జైలులోనే గడిపారు. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను తేజ్‌పాల్ మొదటి నుంచీ ఖండిస్తూనే వచ్చారు. ఈ తీర్పుపై ప్రాసిక్యూషన్ అప్పీలు చేసే అవకాశముంది.

‘‘ఛిద్రమైన మా జీవితాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. దయచేసి మా కుటుంబ గోప్యతా హక్కుల్ని గౌరవించండి’’ అని తరుణ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘గత ఏడున్నరేళ్లలో మా కుటుంబం ఎంతో వేదనను అనుభవించింది. ఈ ఆరోపణలు మా వృత్తి, వ్యక్తిగత, ప్రజా జీవితాలను కుదిపేశాయి.’’

గతవారం కోవిడ్‌తో చనిపోయిన తమ న్యాయవాది రాజీవ్ గోమెస్‌కు కూడా ప్రకటనలో తేజ్‌పాల్ నివాళులు అర్పించారు.

గోవాలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా తరుణ్ తేజ్‌పాల్ తనను లైంగికంగా వేధించారని ఆయన సహోద్యోగిని ఒకరు ఆరోపించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తరుణ్ తేజ్‌పాల్ కు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

కోర్టులో ఏం జరిగింది?

తరుణ్ తేజ్‌పాల్‌పై ఆరోపణలన్నీ కొట్టివేస్తున్నట్లు శుక్రవారం ఉదయం మపుసాలోని ట్రయల్ కోర్టు తెలిపింది.

తరుణ్‌పై పోలీసులు దాదాపు 3000 పేజీల అభియోగ పత్రాలను దాఖలు చేశారు. ‘‘తప్పుడు ఉద్దేశంతో ఎటూ కదలకుండా నిలువరించడం, దాడి, లైంగిక వేధింపులు, అత్యాచారం’’ తదితర ఆరోపణలు ఆయనపై మోపారు.

ఈ ఆరోపణలన్నింటినీ తరుణ్ ఖండించారు. తను నిర్దోషినని ఆయన వాదించారు.

తరుణ్‌కు వ్యతిరేకంగా 156 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టారు. వీరిలో దాదాపు 70 మందిని తరుణ్ తరఫు న్యాయవాదులు కూడా ప్రశ్నించారు.

ఈ కేసు విచారణ ‘‘ఇన్-కెమెరా’’ విధానంలో జరిగింది. అంటే జర్నలిస్టులను విచారణకు అనుమతించలేదు.

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తనపై బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఫొటో సోర్స్, NAREDRA BISHT/OUTLOOK

ఫొటో క్యాప్షన్, తరుణ్ తేజ్‌పాల్‌

తరుణ్ తేజ్‌పాల్ ఎవరు?

భారత్‌లోని ప్రముఖ పాత్రికేయుల్లో తరుణ్ తేజ్‌పాల్ ఒకరు. దశాబ్దాల పాటు దేశంలోని ప్రముఖ పత్రికలు, మ్యాగజైన్‌లలో పనిచేసిన అనంతరం 2000లో తెహల్కాను తరుణ్ ప్రారంభించారు.

భారత జర్నలిజంలో సంచలన పరిశోధనా పాత్రికేయ కథనాలతో తెహల్కా పేరు తెచ్చుకుంది. తెహల్కా రిపోర్టర్లు ఎక్కువగా స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. అవినీతి, కుంభకోణాలను వెలుగులోకి తేవడానికి వారు ప్రయత్నిస్తుంటారు.

తెహల్కా స్ట్రింగ్ ఆపరేషన్లలో 2001లో చేపట్టిన ‘‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’’ ప్రముఖమైనది. తెహల్కా రిపోర్టర్లు ఆయుధాల డీలర్లుగా పరిచయం చేసుకుని సైన్యాధికారుల అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చారు.

అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ముడుపులు తీసుకున్న సంగతిని బయటపెట్టారు.

ఆ కథనంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అదే సమయంలో తరుణ్ తేజ్‌పాల్ పాపులారిటీ కూడా విపరీతంగా పెరిగింది. ఆయన్ను భారత్‌లో అత్యంత ప్రముఖ జర్నలిస్టుగా ‘ది గార్డియన్ ’పత్రిక అభివర్ణించింది.

‘ఇండియా ఇంక్‘ పేరుతో ఒక పబ్లిషింగ్ హౌస్‌ను కూడా తేజ్‌పాల్ స్థాపించారు. బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్, నోబెల్ బహుమతి గ్రహీత వీఎస్ నైపాల్.. తరుణ్‌కు అత్యంత సన్నిహితులు.

తరుణ్ మూడు నవలలు కూడా రాశారు. వీటిలో ‘‘ద ఆల్కెమీ ఆఫ్ డిజైర్’’.. ఫ్రాన్స్ లీ ప్రిక్స్ మిల్లీ పేజెస్ అవార్డు గెలుచుకుంది. 2005 బ్యాడ్ సెక్స్ అవార్డుకు కూడా ఈ నవల నామినేట్ అయ్యింది. సెక్స్‌ మీద అసంబద్ధంగా, నాసిరకంగా రాసిన నవలకు ఈ పురస్కారం ఇస్తారు.

తనపై నమోదైన కేసులను రద్దు చేయాలంటూ తరుణ్ తేజ్ పాల్ గోవా హైకోర్టు, సుప్రీం కోర్టులలో కూడా పిటిషన్ వేశారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2012 దిల్లీ అత్యాచార ఘటన జరిగిన కొన్నాళ్లకే తరుణ్ తేజ్‌పాల్ ‌పై ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో ఏ జరిగింది?

2013లో తరుణ్ సహోద్యోగిని ఒకరు తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. తెహల్కా నిర్వహించిన ఓ కార్యక్రమంలో హోటల్ ఎలివేటర్‌లో తనపై దాడి చేశారని ఆమె ఆరోపణలు చేశారు.

ఈ కేసుపై మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. దీంతో హోటల్ సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని, అప్పుడు నిజమేంటో తేలుతుందని తరుణ్ కోరారు. గోవాలోని బీజేపీ ప్రభుత్వం తనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఈ కేసు పెట్టినట్లు అప్పట్లో తరుణ్ చెప్పారు.

2012 దిల్లీ సామూహిక అత్యాచారం అనంతరం ఈ కేసు వెలుగులోకి రావడంతో దీనిపై పెద్దయెత్తున చర్చలు జరిగాయి.

లింగ సమానత్వంపై కథనాలు రాసే తెహల్కా.. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, మహిళలపై పక్షపాతం చూపుతోందని విమర్శకులు వ్యాఖ్యలు చేశారు. తరుణ్‌కు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, బీజేపీ యువజన విభాగం ఏబీవీపీ సభ్యులు ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

2013 నవంబరు 30న ఆయన అరెస్టు అయ్యారు. ఏడు నెలల తర్వాత జులై నుంచి ఆయన బెయిలుపై విడుదల అయ్యారు. తనపై ఆరోపణలు కొట్టివేయాలని అప్పట్లో గోవా హైకోర్టు, సుప్రీం కోర్టులలో కూడా తరుణ్ పిటిషన్ వేశారు. కానీ ఫలితం లేకపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)