కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా

వ్యాక్సీన్ తయారీ

ఫొటో సోర్స్, AFP

భారత్‌లో విపరీతంగా పెరిగిన డిమాండ్‌కు సరిపడా వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయడానికి దేశంలోని అతిపెద్ద వ్యాక్సీన్ తయారీ సంస్థ అష్టకష్టాలు పడుతోంది.

ఈ ఏడాది చివరివరకు తాము వ్యాక్సీన్లను వేరే దేశాలకు ఎగుమతి చేయలేమని సంస్థ తెలిపింది.

కరోనా మహమ్మారికి కళ్లెం వేసేందుకు వ్యాక్సీన్ల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య కనీసం రెండు బిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌లో ఏఏ వ్యాక్సీన్లు ఉత్పత్తి చేస్తున్నారు?

ప్రస్తుతం మూడు వ్యాక్సీన్లకు భారత్ ఆమోద ముద్ర వేసింది. వీటిలో కోవీషీల్డ్, కోవాగ్జిన్‌లను భారత్‌లోనే తయారు చేస్తున్నారు.

రష్యా ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్ వీ మూడోది.

ఆస్ట్రాజెనెకా నుంచి లైసెన్స్ తీసుకున్న ద సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కోవీషీల్డ్ వ్యాక్సీన్‌ను తయారు చేస్తుంది. మరోవైపు భారత్‌లో రెండో అతిపెద్ద వ్యాక్సీన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ దేశీయ వ్యాక్సీన్ కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోంది.

ఇప్పటివరకు రెండు వ్యాక్సీన్లు కలిపి 35.6 కోట్ల డోసులను ఉత్పత్తి చేసినట్లు గతవారం భారత ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ డోసులు పూర్తిగా ఇంకా డెలివరీ చేయలేదు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు మరో 116 మిలియన్ల డోసులను ఆర్డరు చేశాయి. అయితే, వీటిలో ఇప్పటివరకు ఎన్ని డోసులు వారికి డెలివరీ చేశారో స్పష్టంగా తెలియడం లేదు.

గత ఏప్రిల్ ఆమోదం పొందిన స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ త్వరలో వ్యాక్సీన్ సెంటర్లలో అందుబాటులోకి రానుంది. రష్యా నుంచి ఇప్పటికే 210,000 డోసులు భారత్‌కు అందాయి.

గ్రాఫిక్

భారత్ ఎంత వేగంగా వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయగలదు?

ఆగస్టు నుంచి 2021 చివరినాటికి 200 కోట్ల డోసుల వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అయితే భారత్‌లోని 130 కోట్ల జనాభాకు వ్యాక్సీన్లు వేయాలంటే ఈ వేగం సరిపోదు.

భారత్‌లో ప్రస్తుతం ఉత్పత్తి దశలోనున్న ఎనిమిది వ్యాక్సీన్లలో కేవలం మూడింటికి మాత్రమే భారత్ ఆమోదం తెలిపింది. మరో రెండు క్లినికల్ ట్రయల్ ప్రాథమిక దశల్లో, మూడు క్లినికల్ ట్రయల్స్ చివరి దశల్లో ఉన్నాయి.

‘‘ఇప్పటివరకు ఆమోదం పొందని వ్యాక్సీన్లను మనం పరిగణలోకి తీసుకోలేం’’అని ప్రజారోగ్య, అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్. చంద్రకాంత్ లహరియా చెప్పారు.

‘‘ఆమోదం పొందిన వ్యాక్సీన్లపైనే ప్రస్తుతం దృష్టిపెట్టాలి’’.

సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రస్తుతం 75 కోట్ల డోసుల కోవీషీల్డ్, 20 కోట్ల డోసుల కోవోవ్యాక్స్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నోవావ్యాక్సీన్ దేశీయ నామమే కోవోవ్యాక్స్. దీనికి ఇంకా భారత్ ఆమోదం తెలపలేదు.

వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వ్యాక్సినేషన్

భారత్ బయోటెక్ కూడా రెండు వ్యాక్సీన్లను తయారు చేస్తోంది. 55 కోట్ల డోసుల కోవాగ్జిన్‌తోపాటు 10 కోట్ల డోసుల ముక్కులో నేరుగా వేసే వ్యాక్సీన్‌ను కూడా సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఈ రెండో వ్యాక్సీన్‌కు భారత్ ఆమోద ముద్ర వేయలేదు.

ఏప్రిల్‌లో వ్యాక్సీన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు 40 కోట్ల డాలర్లు, భారత్ బయోటెక్‌కు 21 కోట్ల డాలర్లు ఇస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఆగస్టు నుంచి నెలకు 10 కోట్ల డోసులు, 8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే స్థాయికి ఈ రెండు సంస్థల సామర్థ్యం పెరుగుతుందని గతవారం భారత ప్రభుత్వం తెలిపింది.

ఈ రెండు వ్యాక్సీన్ తయారీ సంస్థలు కలిసి ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య 90 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలవు. అయితే, ఇది భారత్ నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 36 శాతం తక్కువ.

అయితే, ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర ప్రపంచ వ్యాక్సీన్ తయారీ సంస్థలతోనూ మిగతా వ్యాక్సీన్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు భారత్ తెలిపింది.

వ్యాక్సీన్ల తయారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు భారత ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్ల తయారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు భారత ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు

ముడి పదార్థాల కొరత

అమెరికా వ్యాక్సీన్ తయారీ సంస్థలకు ప్రాధాన్యమిచ్చేలా అమెరికా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ (డీపీఏ)ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమలులోకి తీసుకురావడంతో... భారత్ వ్యాక్సీన్ తయారీ సంస్థలకు ముడి పదార్థాల కొరత ఏర్పడింది.

భారత్‌లో కోవీషీల్డ్ వ్యాక్సీన్ తయారీకి అవసరమైన కొన్ని ముడి పదార్థాలను తాము సరఫరా చేస్తామని అమెరికా గత నెలలో తెలిపింది.

అయితే, అమెరికా నుంచి రావాల్సిన ముడి పదార్థాలు సరిగా రావడంలేదని సీరం ఇన్‌స్టిట్యూట్ చెబుతోంది.

ఔషధ ముడిపదార్థాల సరఫరా గొలుసు చాలా సంక్లిష్టంగా ఉంటుందని వ్యాక్సీన్ తయారీ నిపుణురాలు, లివర్‌పూల్‌లోని జాన్ మూర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. సారా స్కిఫిలింగ్ చెప్పారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగినంత వేగంగా.. సరఫరాదారులు ముడిపదార్థాలను సరఫరా చేయలేరు. ఎందుకంటే వారు వేరే పరిశ్రమలపై ఆధారపడాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే సరఫరాదారులను మనం అంత తేలిగ్గా నమ్మలేం’’.

గ్రాఫ్

వ్యాక్సినేషన్ ఎలా జరుగుతోంది?

జనవరి మధ్యలో వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు 18.5 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చారు.

ఏప్రిల్ మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. రోజుకు 36 లక్షల వ్యాక్సీన్ల వరకు ప్రజలకు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఇది 16 లక్షలకు పడిపోయింది.

‘‘వ్యాక్సీన్ల సరఫరా అనేది ఒక దశ మాత్రమే. చివరగా ప్రజలకు ఈ వ్యాక్సీన్ చేరినప్పుడే మన లక్ష్యం నెరవేరినట్లు’’అని డాక్టర్ లహరియా బీబీసీతో చెప్పారు. ప్రస్తుతం అందుబాటులోనున్న డోసులన్నీ ప్రజలకు ఎలా చేర్చాలనే అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.

ప్రస్తుతమున్న వేగంలో వ్యాక్సినేషన్ కొనసాగితే, భారత్‌లోని 130 కోట్ల మందికి వ్యాక్సీన్లు వేయాలంటే దాదాపు నాలుగేళ్లు పడుతుంది.

వ్యాక్సీన్ల కొరత ఉండటంతో 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసుండే వారికి టీకాలు వేయడం ఆపేస్తున్నట్లు దిల్లీ, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్పష్టంచేశాయి.

వ్యాక్సీన్ల ఎగుమతులను ప్రస్తుతం భారత్ నిలిపివేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్ల ఎగుమతులను ప్రస్తుతం భారత్ నిలిపివేసింది.

ఎగుమతికి వ్యాక్సీన్లు లేవు

భారత ప్రజలకు వీలైనంత త్వరగా వ్యాక్సీన్లు ఇవ్వాలని ఇక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మార్చిలోనే వ్యాక్సీన్ ఎగుమతులను భారత్ నిలిపివేసింది.

అయితే, కొన్ని స్పల్ప మొత్తాల్లో వ్యాక్సీన్ల ఎగుమతికి మాత్రం భారత్ అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి కార్యక్రమం కోవాక్స్‌కు కూడా భారత్ వ్యాక్సీన్లు అందిస్తోంది. అయితే, పెద్ద మొత్తాల్లో వ్యాక్సీన్ల ఎగుమతికి మాత్రం ఇప్పుడప్పుడే అనుమతులు జారీచేసే సంకేతాలు కనిపించడం లేదు.

ఈ ఏడాది చివరివరకు వేరే దేశాలకు వ్యాక్సీన్లను ఎగుమతులు చేయబోమని ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్ స్పష్టంచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)