చైనాకు వ్యతిరేకంగా గళమెత్తిన వీగర్లు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు

కెల్బినర్ సెడిక్

ఫొటో సోర్స్, JEREMY MEEK/BBC

ఫొటో క్యాప్షన్, కెల్బినర్ సెడిక్
    • రచయిత, జోయెల్ గుంటెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా నిర్బంధ క్యాంపుల్లో తమపై అత్యాచారం, లైంగిక వేధింపులు జరిగాయని కొందరు మహిళలు గత నెలలో ఆరోపించినప్పటి నుంచి వారికి వేధింపులు మొదలయ్యాయి.

తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారి నోళ్లు మూయించడానికి చైనాలో ఇలాంటి దూకుడు చర్యలు షరా మామూలేనని మానవ హక్కుల బృందాలు చెబుతున్నాయి.

కెల్బినర్ సెడిక్, ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు వీడియో కాల్ వచ్చింది. ఫోన్‌లో సోదరి పేరు కనిపించగానే ఆమె కంగారు పడిపోయారు. ఇద్దరూ మాట్లాడుకుని చాలా నెలలైంది. నిజానికి సెడిక్ తన కుటుంబ సభ్యుల్లో ఎవరితోనైనా మాట్లాడి ఎన్నో నెలలు అయిపోయింది.

సెడిక్ అప్పుడు నెదర్లాండ్స్‌లోని తన తాత్కాలిక ఇంటి వంటగదిలో ఉన్నారు. అక్కడ ఆమె మిగతా శరణార్థులు, ఎక్కువగా ఆఫ్రికా నుంచి వచ్చిన వారితో కలిసి ఒక గదిలో ఉంటున్నారు.

ఇది జరగడానికి రెండు వారాల ముందు షిన్‌జియాంగ్ ప్రాంతంలోని చైనా రహస్య నిర్బంధ శిబిరాల్లో అత్యాచారం, వేధింపుల ఆరోపణలపై ఆమె, మరో ముగ్గురు మహిళలు బీబీసీతో మాట్లాడారు.

సెడిక్ ఆ నిర్బంధ కేంద్రాల్లో టీచర్‌గా పనిచేశారు.

ఇన్నాళ్లకు ఆమె సోదరి నుంచి కాల్ వస్తోంది.

ఆమె దానిని ఆన్సర్ చేశారు. కానీ, అక్కడ స్క్రీన్ మీద ఉన్నది ఆమె సోదరి కాదు. షిన్జియాంగ్‌లోని తమ స్వస్థలానికి చెందిన ఒక పోలీస్ అందులో కనిపించాడు.

ఆయన "ఏం చేస్తున్నావ్ కెల్బినర్, ఎవరితో ఉన్నావ్" అని నవ్వుతూ అడిగాడు.

తన సోదరి ఫోన్ నుంచి ఆ అధికారి అలా వీడియో కాల్ చేయడం అది మొదటిసారి కాదు. కానీ, ఈసారీ సెడిక్ దానిని స్క్రీన్ షాట్ తీశారు.

క్లిక్ చేసిన శబ్దం వినగానే, ఆ అధికారి నంబర్ ఉన్న తన పోలీస్ జాకెట్ తీసేశాడని సెడిక్ చెప్పారు. తర్వాత ఆమె మరో స్క్రీన్ షాట్ తీశారు.

సెడిక్‌తో ఫోన్లో మాట్లాడిన చైనా పోలీస్ అధికారి
ఫొటో క్యాప్షన్, సెడిక్‌తో ఫోన్లో మాట్లాడిన చైనా పోలీస్ అధికారి

నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి

స్వదేశంలో తాము మానవ హక్కుల ఉల్లంఘనగా చెబుతున్న ఎలాంటివి భరించామో, అవి బయటకు చెప్పకుండా అడ్డుకోడానికి తమను ఎలా వేధిస్తున్నారో, బెదిరిస్తున్నారో షిన్జియాంగ్‌ వదిలి విదేశాలకు వెళ్లిపోయిన 22 మంది గత కొన్నివారాలుగా బీబీసీతో జరిగిన సంభాషణల్లో వర్ణించారు.

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం పది లక్షల మందికి పైగా వీగర్లను, మరికొందరు ముస్లింలను చైనా షిన్జియాంగ్‌లోని శిబిరాల్లో నిర్బంధించింది.

అక్కడ వారితో బలవంతంగా పనిచేయించడం, వేధించడం, అత్యాచారాలు, చంపడం లాంటివి చేస్తున్నారని ఈ రాష్ట్రంపై ఆరోపణలు వస్తున్నాయి.

కానీ, చైనా వాటిని తోసిపుచ్చుతోంది. తమ శిబిరాల్లో తీవ్రవాదాన్ని ఎదుర్కోడానికి మళ్లీ చదువు చెప్పే సౌకర్యాలు ఉన్నాయని అంటోంది.

ఆరోజు ఉదయం సెడిక్‌కు వచ్చినట్లు, షిన్జియాంగ్ నుంచి పారిపోయి, వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడిన కొందరికి, పోలీస్ అధికారులు లేదా ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్ వస్తుంది.

బంధువుల ఇళ్ల నుంచి, లేదంటే కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారు ఫోన్ చేస్తుంటారు.

షిన్జియాంగ్‌లో ఉన్న మీ కుటుంబం క్షేమం గురించి కూడా ఆలోచించమని కొన్నిసార్లు తమ కాల్‌లో చెప్పకనే చెబుతారు.

మరికొన్నిసార్లు మీ బంధువులను అదుపులోకి తీసుకుని, శిక్షిస్తామని డైరెక్టుగా బెదిరిస్తారు.

మిగతావారిపై దేశ మీడియా కథనాల్లో లేదంటే ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా బహిరంగంగా మచ్చ వేస్తారు. లేదంటే నేరుగా వాళ్ల ఫోన్లకు వరుసగా మెసేజులు పంపడం, లేదా వాటిని హ్యాక్ చేయడం లాంటివి చేస్తారు.

(విదేశాల్లో ఉన్న వీగర్ కార్యకర్తల అకౌంట్లు హ్యాక్ చేయడమే లక్ష్యంగా చైనా నుంచి జరుగుతున్న ఒక ఆపరేషన్‌ను తాము గుర్తించామని గత వారం ఫేస్‌బుక్ చెప్పింది.)

షిన్జియాంగ్‌లో ఉన్న ఒక నిర్బంధ కేంద్రం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, షిన్జియాంగ్‌లో ఉన్న ఈ శిబిరానికి 'వృత్తి నైపుణ్యాల విద్యా కేంద్రం' అనే పేరు ఉంది

బీబీసీతో మాట్లాడిన వారిలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, నార్వే, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్, జర్మనీ, టర్కీకి చెందిన కొందరు ఉన్నారు.

వీళ్లందరూ ఫేస్‌బుక్, వీచాట్, వాట్సాప్‌లో తమకు బెదిరిస్తూ వచ్చిన మెసేజిల స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు.

మిగతావారు తమతో ఫోన్లో, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడిన అధికారులు ఏమేం అన్నారో చెప్పారు.

షిన్జియాంగ్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను స్థానిక పోలీసులు లేదా రాష్ట్ర భద్రతా దళాలు నిర్బంధించాయని లేదా వేధిస్తున్నాయని వీరిలో ప్రతి ఒక్కరూ చెప్పారు.

కెల్బినర్ సెడిక్‌కు ఆరోజు ఉదయం తన సోదరి ఫోన్ నుంచి పోలీస్ అధికారి చేసిన వీడియో కాల్‌ను గుర్తు చేసుకోగానే చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేశారు.

"మీ కుటుంబం, మీ బంధువులు అందరూ మాదగ్గరే ఉన్నారనే విషయం నువ్వు గుర్తుంచుకో. ఆ నిజం గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సుంటుంది" అన్నాడని ఆమె చెప్పారు.

ఆ మాటను ఆయన చాలాసార్లు చెప్పారు. తర్వాత "నువ్వు కొంతకాలంగా విదేశాల్లో ఉన్నావు. నీకు కచ్చితంగా చాలా మంది స్నేహితులు ఉంటారు. వాళ్ల పేర్లన్నీ మాకు ఇస్తావా" అన్నాడని తెలిపారు.

ఆమె నేను ఇవ్వనని చెప్పడంతో ఆ అధికారి ఫోన్లో సెడిక్ సోదరిని మాట్లాడమన్నాడు. ఆమె ఫోన్లో గట్టిగా అరుస్తూ "నువ్వు, ఇకనైనా నోరుమూసుకుంటావా".. అంది.. తర్వాత సెడిక్ అవమానాల పరంపర మొదలయ్యింది

ఆ సమయంలో నేను నా ఎమోషన్స్ ఆపుకోలేకపోయాను. నా కన్నీళ్లు ఆగలేదు అని సెడిక్ చెప్పారు.

ఆ అధికారి ఫోన్ కట్ చేసే ముందు.. చైనా ఏంబసీకి వెళ్లాలని, అక్కడున్న సిబ్బంది నువ్వు సురక్షితంగా తిరిగి చైనాకు రావడానికి తగిన ఏర్పాట్లు చేస్తారని చాలాసార్లు చెప్పాడని సెడిక్ చెప్పారు.

అలాంటి కాల్స్ వచ్చినపుడు ఎవరికి వచ్చినా, అందరికీ ఆ అధికారులు అదే చెబుతారు. "ఈ దేశం మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది" అంటారు.

మహిళల పొటోలు పట్టుకుని ఉన్న విదేశాంగ ప్రతినిధి వాంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మహిళల పొటోలు పట్టుకుని ఉన్న విదేశాంగ ప్రతినిధి వాంగ్

బహిరంగంగా స్త్రీ ద్వేషం

చైనా అధికారులు ఇలా భయపెట్టే వార్తలు కొత్త కాదు. కానీ, షిన్జియాంగ్‌లో హక్కుల ఉల్లంఘనపై పెరుగుతున్న ఆగ్రహానికి, స్పందనగా చైనా మరింత దూకుడు చూపిస్తోందని వీగర్ కార్యకర్తలు చెబుతున్నారు.

ఇటీవలి వారాల్లో చైనా ప్రభుత్వం వీరిపై బహిరంగ దాడికి దిగింది. ముఖ్యంగా లైంగిక వేధింపులపై మాట్లాడిన మహిళలపై విద్వేషాన్నిరెచ్చగొట్టే ప్రకటనలు చేసింది.

ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెంబిన్, షిన్జియాంగ్ అధికారి నిర్బంధ శిబిరాల్లో లైంగిక వేధింపుల గురించి మొట్టమొదట చెప్పిన మహిళల పొటోలు పట్టుకుని కనిపించారు.

వారిని అబద్ధాలకోరులుగా వర్ణించారు. వారిలో ఒకరు నైతికంగా దిగజారారని, ఆమెది 'చీప్ కారెక్టర్' అని చెప్పారు.

వారిలో ఒక మహిళ ప్రవర్తన సరిగా లేదని ఆమె మాజీ భర్త ముద్ర వేశాడని చెప్పారు. అదే విషయాన్ని ఆ దేశ టీవీల్లో కూడా చూపించారు. ఇంకొకరిని పిల్లలను వేధించేవారుగా చెప్పారు.

నిర్బంధ కేంద్రంలో ఒక మహిళకు గర్భం రాకుండా బలవంతంగా ఐయూడీ వేశారని వచ్చిన ఆరోపణలను విదేశాంగ ప్రతినిధి వాంగ్ ఖండించారు. అవి ప్రైవేట్ మెడికల్ రికార్డులని చెప్పారు.

వారికి సంతాన సమస్యలు రావడానికి శిబిరాల్లో హింసాత్మక శారీరక వేధింపులకు బదులు, అంతకు ముందే వారికి లైంగికంగా సంక్రమించిన వ్యాధులు కారణమని అధికారులు చెప్పారు.

తమపై ఆరోపణలు చేసినవారు నటిస్తున్నారని చెప్పడానికి వీలుగా ఆధారాలు కూడా సృష్టించారు.

ఇంతకు ముందు ఈ శిబిరాల్లో నిర్బంధంలో ఉన్న తర్సునే జియావుదున్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్సులో అధికారులు తీవ్ర విమర్శలు చేసిన మహిళల్లో ఈమె కూడా ఒకరు. ఆమె అది చూసినప్పుడు వారు తన కుటుంబం గురించి ప్రస్తావించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కానీ, మిగతా ఆరోపణల గురించి చాలా బాధపడ్డారు.

జియావుదున్ 2018లో నిర్బంధంలో ఉన్న సమయంలో తాను అత్యాచారం, వేధింపులు ఎదుర్కున్నానని గతంలో చెప్పారు.

"వాళ్లు నాపై అన్ని దారుణాలకు పాల్పడిన తర్వాత కూడా, బహిరంగంగా నామీద అంత క్రూరంగా, సిగ్గులేకుండా ఎలా విమర్శలు చేయగలరు" అని ప్రెస్ కాన్ఫరెస్ తర్వాత ఫోన్లో మాట్లాడిన ఆమె బీబీసీకి చెప్పారు.

అత్యాచారం, లైంగిక వేధింపులు జరిగనట్లు ఈ మహిళలు అబద్ధాలు చెప్పారనే వాదనకు చైనా కట్టుబడి ఉందని, దానికి సాక్ష్యంగా తమ దగ్గర ఉన్న ప్రైవేట్ మెడికల్ రికార్డులను బయటపెట్టడం సమంజసమేనని లండన్‌లోని చైనా ఏంబసీ బీబీసీకి చెప్పింది.

తుర్సునే జియావుదున్

ఫొటో సోర్స్, HANNAH LONG-HIGGINS/BBC

ఫొటో క్యాప్షన్, అమెరికాలో ఉంటున్న తర్సునే జియావుదున్

బీబీసీతో మాట్లాడిన మరో ఇద్దరు మహిళలను చైనా మీడియా కొన్ని వీడియోల ద్వారా లక్ష్యంగా మార్చుకుంది.

అవి పక్కా వ్యూహం ప్రకారం రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తంది. ఈ వీడియోల్లో కుటుంబ సభ్యులు స్నేహితురాళ్లు వారిని డబ్బులు దొంగిలించిందని, అబద్ధాలు చెబుతోందని తిట్టడం కనిపిస్తుంది.

గత నెలలో అమెరికాకు చెందిన వీగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం చైనా ఇలాంటి 22 వీడియోలు తీయించింది.

వీటిలో కనిపించే వారికి తాము రాసిచ్చిందే చెప్పాలని బలవంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాళ్లందరూ తమ కుటుంబ సభ్యులను అబద్ధాలకోరులుగా, దొంగలుగా వర్ణించారు.

కెల్బినర్ సెడిక్

ఫొటో సోర్స్, JEREMY MEEK/BBC

ఫొటో క్యాప్షన్, కెల్బినర్ సెడిక్

మీరు మాకు సహకరించవచ్చు అంటారు

వీటితోపాటూ అధికారుల నుంచి మరో రకం వేధింపులు రావడం కూడా సర్వ సాధారణం అని బీబీసీతో మాట్లాడిన మరికొందరు చెప్పారు.

చైనాపై నిఘా పెట్టిన తోటి వీగర్ సంస్థలపై గూఢచర్యం చేయాలని అధికారులు విదేశాల్లోని వీగర్లపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అలా చేస్తే మీరు మీ కుటుంబాలను తిరిగి కలవనిస్తామని, బంధువులను సురక్షితంగా చూసుకోడానికి భరోసా ఇస్తారు. లేదంటే వీసా లేదా పాస్‌పోర్ట్ తీసుకోడానికి వీలు కల్పిస్తారు.

పేరు బయటపెట్టడం ఇష్టం లేని ఒక వీగర్ బ్రిటిష్ పౌరుడు, తను షిన్జియాంగ్ వెళ్లినప్పుడు, ఆ తర్వాత నిఘా అధికారులు పదే పదే వేధించారని బీబీసీకి చెప్పారు.

"వీగర్ గ్రూపుల మీద, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో వాలంటీర్‌గా చేరి దానిపైన నిఘా పెట్టాలని నాకు చెప్పారు. చేయనని చెప్పడంతో, నా సోదరుడి నుంచి అలా చేయమని చెప్పిస్తూ నాకు పదే పదే కాల్స్ చేయించారు" అని చెప్పాడు.

టర్కీలో చదువుకోడానికి షిన్జియాంగ్ నుంచి వెళ్లిన జెవ్లాన్ షిర్మెమెట్, షిన్జియాంగ్‌లో తన కుటుంబం అరెస్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వారాలకే తనకు వచ్చిన ఒక కాల్ రికార్డింగ్ బీబీసీకి ఇచ్చారు.

జెవ్లాన్ షిర్మెమెట్
ఫొటో క్యాప్షన్, తమ వారిని విడిపించాలని జెవ్లాన్ షిర్మెమెట్ పోరాటం

అంకారాలోని చైనా యాంబసీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన అందులో చెప్పిన కాలర్, ఆయనతో షిన్జియాంగ్ నుంచి నువ్వు వెళ్లిన తర్వాత కాంటాక్ట్‌లో ఉన్న అందరి పేర్లూ ఇవ్వాలని, నీ కార్యకలాపాల గురించి ఒక ఈమెయిల్ పంపాలని చెప్పాడు. అలా చేస్తే, మీ కుటుంబం పరిస్థితి గురించి చైనా మరోసారి ఆలోచిస్తుందని తెలిపాడు.

టర్కీలో ఉన్న మరో వీగర్, తనకు కూడా అదే ఏంబసీ నుంచి ఇలాంటి కాలే వచ్చిందని చెప్పాడు.

అమెరికాలో ఉంటున్న 34 ఏళ్ల ముస్తఫా అక్సు అనే యాక్టివిస్ట్ తన తల్లిదండ్రులను షిన్జియాంగ్‌లో నిర్బంధించారని, ప్రస్తుతం చైనా పోలీసుగా ఉన్న తన స్నేహితుడి నుంచి వచ్చిన వాయిస్ మెసేజులు బీబీసీకి పంపించారు. వీగర్ కార్యకర్తల గురించి సమాచారం ఇవ్వాలని అతడు తనపై ఒత్తిడి తెస్తున్నాడని, సహకరించకపోతే, "నీ తల్లిదండ్రులు నీకు దూరమవుతారేమో" అని బెదిరిస్తున్నాడని చెప్పాడు.

అందరూ తమను అడిగినవి చేయను అని కచ్చితంగా చెప్పే పరిస్థితుల్లో ఉండరు.

"నేను కుదరదని చెప్పగానే, వాళ్లు నాకు కాల్ చేసి అలా చేయమని చెప్పించడానికి నా తమ్ముడు, చెల్లెలిని పట్టుకున్నారు. వాళ్లిద్దరినీ పోలీసులు నిర్బంధ శిబిరానికి పంపించవచ్చు. నాకు వేరే దారి లేకుండాపోయింది" . అని టర్కీలో చదువుతున్న ఒక వీగర్ విద్యార్థి చెప్పారు.

కొంతమంది మెల్లమెల్లగా సంబంధాలు కట్ చేసుకుంటూ తమను తాము కాపాడుకుంటున్నారు.

"మనం ఫోన్ విసిరికొట్టి, ఆ నంబర్ కాన్సిల్ చేసుకోవచ్చు. కానీ నంబర్ లేకపోతే, వాళ్లు ఫేస్‌బుక్‌లో కాంటాక్ట్ అవుతారు, ఆ అకౌంట్ డెలిట్ చేస్తే, ఈమెయిల్లో సంప్రదిస్తారు" అని నార్వేలో ఉన్న వీగర్ బాషావేత్త అబ్దుల్వేలి అయూప్ అన్నారు.

ఇంటర్వ్యూల ద్వారా అందిన ఈ కాల్స్, మెసేజిల వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది బీబీసీ స్వతంత్రంగా పరిశీలించలేకపోయింది.

కానీ, చైనా కోసం నిఘాచర్యలకు పాల్పడేలా వీగర్లను బలవంతపెట్టడం అనేది చాలా సాధారణ విషయమేనని వీగర్ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

"మొదట అది ఒక ఆఫర్‌తో మొదలవుతుంది. మీకు ఎలాంటి వీసా సమస్యలు రాకుండా చూసుకుంటాం లేదా మీ కుటుంబానికి సాయం చేస్తాం లాంటి హామీలు ఇస్తారు. తర్వాత అవి బెదిరింపులుగా మారుతాయి" అని బ్రిటన్‌లోని వీగర్ కార్యకర్త రహిమా మహ్ముత్ చెప్పారు.

ఇస్తాంబుల్‌లో వీగర్ ముస్లింల నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇస్తాంబుల్‌లో వీగర్ ముస్లింల నిరసన ప్రదర్శనలు

బ్రిటన్‌లోని వీగర్లను చైనా అదికారుల వేధించినట్లు వస్తున్న రిపోర్టులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ చెప్పింది.

షిన్జియాంగ్‌లో వేధింపుల ఆరోపణలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతున్నప్పటికీ, నిర్బంధంలో ఉన్న వారి సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ మంది మాత్రమే బహిరంగంగా వాటి గురించి మాట్లాడుతున్నారు.

"భయపెట్టి వారి నోళ్లు మూయించడంలో చైనా విజయవంతం అవుతోంది" అని అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ కమిషనర్ నూరీ టర్కెల్ అన్నారు.

అమెరికాలో ఉంటున్న ఒక ప్రముఖ వీగర్ కార్యకర్త ఫెర్కత్ జవ్‌దత్ తన తల్లి నిర్బంధం నుంచి విడుదలయ్యేలా బహిరంగ ఉద్యమం చేశారు.

ఆయన ఇప్పుడు తన తల్లితో తరచూ మాట్లాడగలుగుతున్నారు. కానీ, ఆమె ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు. వాళ్ల కాల్స్ మీద నిరంతరం నిఘా ఉంటుంది.

తన తల్లిని మళ్లీ చూసే అవకాశాలు తక్కువే అని జావ్‌దత్‌కు తెలుసు. అందుకే వాళ్లు ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతారు.

"కొడుకు చేసిన పనికి సిగ్గుపడుతున్నానని" ఆమె అంటున్న ఒక వీడియోను చైనా మీడియా ప్రసారం చేసిందని ఆయన ఒకసారి తల్లిని అడిగారు.

కొన్ని రోజులు ముందు వచ్చిన వాళ్లు అలా అనమని చెప్పి వీడియో తీసుకెళ్లారని ఆమె చెప్పారు.

"దాన్లో నేను బాగున్నానా" అని కొడుకుతో జోక్ చేశారు.

నా కొడుకును చూసి ఎప్పటికీ గర్వపడుతుంటానని ఆయనకు చెప్పారు.

"అది స్క్రిప్టులో లేని వర్షన్" అంటారు జావ్‌దత్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)