వీగర్ ముస్లింలు: జాతి నిర్మూలన ఆరోపణలు 'విడ్డూరం' అంటున్న చైనా విదేశాంగ మంత్రి

ఫొటో సోర్స్, EPA
ముస్లింలైన వీగర్ జాతిని నిర్మూలించటానికి తమ ప్రభుత్వం జాతిహననం సాగిస్తోందన్న ఆరోపణలు ‘‘అత్యంత విడ్డూరం’’గా ఉన్నాయని.. అవన్నీ ‘‘పూర్తి అబద్ధం’’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు.
ఆయన శనివారం తన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వీగర్ ప్రజల విషయంలో చైనా వ్యవహారాన్ని వర్ణించటానికి అమెరికా సహా అనేక దేశాలు ‘జాతిహననం’ పదాన్ని ఉపయోగించాయి.
షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ల కోసం చైనా నిర్వహిస్తున్న ‘రీ-ఎడ్యుకేషన్ శిబిరా’ల్లో జరుగుతున్న దురాగతాలకు సంబంధించిన ఆధారాలు బయటపడుతున్న కొద్దీ ఈ ఆరోపణలు వస్తున్నాయి.
వీగర్ మహిళలకు పిల్లలు పుట్టకుండా బలవంతపు శస్త్రచికిత్సలు చేస్తున్నారని, పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని చైనా మీద ఆరోపణలు వస్తున్నాయి.
వీగర్లను బలవంతపు శ్రామికులుగా ఉపయోగిస్తున్నారని బీబీసీ పరిశోధనలు సూచిస్తున్నాయి. వారి మీద ఒక పద్ధతి ప్రకారం అత్యాచారానికి, హింసకు పాల్పడుతున్న విషయాన్ని ఈ పరిశోధనలు బహిర్గతం చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
వీగర్ అంశం మీద, కరోనావైరస్ మహమ్మారి మీద బీబీసీ అందించిన కథనాలకు గాను.. చైనా తమ దేశంలో బీబీసీ వరల్డ్ న్యూస్‌ను నిషేధించింది.
కనీసం పది లక్షల మంది ముస్లిం మైనారిటీ వీగర్లను శిబిరాల్లో నిర్బంధించి ఉంచారని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. అయితే.. ఆ శిబిరాల్లో వీరికి వృత్తిపరమైన శిక్షణను అందిస్తున్నామని, తీవ్రవాదాన్ని నిర్మూలించటానికి ఈ కార్యక్రమం చేపట్టామని చైనా చెప్తోంది.
కానీ.. వీగర్ల విషయంలో చైనా చర్యలు జాతిహననమేనని అమెరికా ప్రస్తుత, మాజీ విదేశాంగ మంత్రులిద్దరూ అభివర్ణించారు. కెనడా, డచ్ పార్లమెంట్లు కూడా ఇదే అభివర్ణించాయి.
జాతిహననం నేర నిరోధం, శిక్షకు సంబంధించి ఐక్యరాజ్యసమితి తీర్మానం.. ఒక జాతి, తెగ, మతపరమైన బృందాన్ని పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ నిర్మూలించే ఉద్దేశంతో చేపట్టే చర్యలను జాతిహననంగా నిర్వచిస్తోంది.
చైనా మీద ఈ ఆరోపణలతో.. 2022 బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని పలు దేశాల్లో పిలుపులు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
వీగర్ల గురించి వాంగ్ ఏం చెప్పారు?
పశ్చిమ దేశాల రాజకీయవేత్తలు.. షిన్‌జియాంగ్‌లో ఏం జరుగుతోందనే అంశం మీద అబద్ధాలను విశ్వసిస్తున్నారని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఎవరైనా ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి రావచ్చునని చెప్పారు.
‘‘షిన్‌జియాంగ్‌లో ‘జాతిహననం’ అనే మాట చాలా విడ్డూరం. అది స్వార్థ చింతనతో వ్యాపింపచేస్తున్న వదంతి. పూర్తిగా అబద్ధం’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఉటంకించింది.
‘‘జాతి హననం’ అనేదాని దగ్గరకు వస్తే.. చాలా మందికి.. 16వ శతాబ్దంలో ఆదివాసీ నార్త్ అమెరికన్ల గురించి, 19వ శతాబ్దంలో ఆఫ్రికా బానిసల గురించి, 20వ శతాబ్దంలో యూదుల గురించి, ఇప్పటికీ పోరాడుతున్న ఆదివాసీ ఆస్ట్రేలియన్లు గుర్తుకొస్తారు’’ అంటూ.. తమ దేశాన్ని విమర్శిస్తున్న పలు దేశాల మానవ హక్కుల చరిత్రను ఉటంకిస్తూ ఆయన ఎద్దేవా చేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన ప్రభుత్వం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లలో.. చైనాతో పెరుగుతున్న వైరం ఒకటని అభివర్ణించారు.
‘‘సీనో-అమెరికా సహకారం మీద విధించిన అసంబద్ధ ఆంక్షలను తొలగించటం కోసం.. అమెరికా, చైనాలు సాధ్యమైనంత త్వరగా మధ్యేమార్గంలో కలుస్తాయని, కృత్రిమంగా కొత్త అవరోధాలను సృష్టించబోవని ఆశిస్తున్నాం’’ అని చైనా మంత్రి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని పక్షాలతో సంప్రదింపులకు చైనా సిద్ధం
బీజింగ్‌లో జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ నేపథ్యంగా విదేశాంగ మంత్రి వార్షిక మీడియా సదస్సులో మాట్లాడారు.
హాంగ్ కాంగ్‌లో ఎన్నికల వ్యవస్థను సంస్కరించటానికి ప్రకటించిన కొత్త ప్రణాళికలను ఆయన సమర్థించుకున్నారు. ఆ మార్పులు రాజ్యాంగ బద్ధమైనవి, న్యాయబద్ధమైనవి అని చెప్పారు.
‘‘గందరగోళం నుంచి పరిపాలన దిశగా హాంగ్ కాంగ్ మార్పుచెందటం అన్ని పక్షాలకూ ప్రయోజనకరం.. ఈ సంస్కరణలు ఆ నగరానికి ఉత్తమ భవిష్యత్తును అందిస్తాయి’’ అని పేర్కొన్నారు.
హాంగ్ కాంగ్‌లో అసమ్మతిని చైనా అణచివేస్తోందని.. బ్రిటన్‌తో చేసుకున్న ‘ఒక దేశం, రెండు వ్యవస్థల’ ఒప్పందం కింద హక్కులను కాలరాస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ఇదిలావుంటే.. గత నెలలో దేశాధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న మియన్మార్‌లో ప్రస్తుత పరిస్థితిని తేలికపరచటం కోసం ‘అన్ని పక్షాల’తో సంప్రదింపులు జరపటానికి చైనా సుముఖంగా ఉందని వాంగ్ చెప్పారు.
అలాగే.. విదేశాల్లో నివసిస్తున్న చైనా పౌరులకు కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇవ్వటానికి ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









