రైతు నిరసనల్లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ యువతిపై అత్యాచారం, ఎవరు ఏం చెబుతున్నారు

దిల్లీలో రైతు నిరసనలు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES/GETTY

    • రచయిత, సత్ సింగ్
    • హోదా, బీబీసీ కోసం, రోహ్తక్ నుంచి

రైతుల నిరనసనల్లో పాల్గొనడానికి దిల్లీ వచ్చిన ఒక పశ్చిమ బెంగాల్ యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను కూడా ఏర్పాటు చేశారు.

ఏప్రిల్ రెండో వారంలో పశ్చిమ బెంగాల్ నుంచి దిల్లీలోని టికరీ బోర్డర్‌ వరకూ జరిగిన రైలు యాత్రలో యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

తర్వాత బాధితురాలికి కరోనా వచ్చింది, చివరికి ఆమె బహదూర్‌గఢ్‌లోని ఒక ఆస్పత్రిలో చనిపోయారు.

ఈ కేసులో తన నేతృత్వంలో ఏర్పడిన సిట్ ఇప్పటివరకూ ఇద్దరిని విచారించినట్లు బహదూర్‌గఢ్ డీఎస్పీ పవన్ కుమార్ బీబీసీకి చెప్పారు.

"ఆరోపణలు వచ్చిన వారిలో కొందరి టెంట్లు టికరీ బోర్డర్‌లో ఉండేవి. వాటిని ఇప్పుడు అక్కడ నుంచి తొలగించారు" అని భారతీయ కిసాన్ యూనియన్ ఉగ్రహాన్ నేత జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ చెప్పారు.

దిల్లీలో రైతు నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

కిసాన్ మోర్చా దీనిపై ఒక అంతర్గత దర్యాప్తు నిర్వహించిన తర్వాత అక్కడ టెంట్లు తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. అయితే దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దాదాపు వారం పట్టింది.

బాధితురాలి వయసు 25 ఏళ్లు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"దిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చిన ఒక బృందం నా కూతురిని కలిసింది. తర్వాత వారు నిరసనల్లో పాల్గొనడానికి ఏప్రిల్ 11న టికరీ బోర్డర్‌కు బయల్దేరారు. రైల్లో ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయి" అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి వీడియో స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆమె తండ్రి ఒక సామాజిక కార్యకర్త.

ఎవరితో కలిసి రైతు నిరసనల్లో పాల్గొనడానికి దిల్లీ వచ్చానో, వాళ్లు 'మంచి వాళ్లు' కాదు" అని తన కూతురు స్వయంగా ఫోన్‌లో చెప్పిందని ఆయన తెలిపారు.

ఆమె తండ్రి ఇచ్చిన వివరాల ప్రకారం... బాధితురాలు చనిపోయే ముందు ఇద్దరి పేర్లు కూడా చెప్పింది.

ఆ తర్వాత ఆయన కొంతమంది రైతు నేతలను కలిసి తనకు సాయం చేయాలని అడిగారు. తర్వాత దిల్లీకి వచ్చారు. కానీ, అప్పటికే ఆమెకు కరోనా సోకింది. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

దిల్లీ సరిహద్దుల్లో గుడారాలు

దిల్లీ రావడానికి ముందు బాధితురాలి తండ్రి కలసిన రైతు సంఘాల నేతల్లో స్వరాజ్ ఇండియా కన్వీనర్ యోగేంద్ర యాదవ్ కూడా ఉన్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మంగళవారం యోగేంద్ర యాదవ్‌ను కూడా విచారించారు.

పోలీసులు తనకు నోటీసులు పంపించారని, ఆ ఘటనకు సంబంధించి తనకు తెలిసిన సమాచారం అంతా వారికి చెప్పానని యోగేంద్ర యాదవ్ తెలిపారు.

యోగేంద్ర యాదవ్‌తో కలిసి ఒక ఆన్‌లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసిన బాధితురాలి తండ్రి, తన ఫిర్యాదులో ఇద్దరిపై మాత్రమే ఆరోపణలు చేశానని.. కానీ, పోలీసులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు.

"పోలీసుల ఎఫ్ఐఆర్‌లో ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిలు నా కూతురికి సాయం చేశారు. ఆమె స్టేట్‌మెంట్ వీడియో రికార్డింగ్‌ను నాకు పంపారు" అని ఆయన చెప్పారు.

ఆ రికార్డింగ్ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు.

దిల్లీలో రైతు నిరసనలు

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES

పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బీబీసీతో మాట్లాడారు.

"అత్యాచార ఘటన జరిగిన వారం రోజుల తర్వాత రైల్లో జరిగిన లైంగిక వేధింపుల గురించి బాధితురాలు మాకు చెప్పింది" అని ఆమె తెలిపారు.

ఆ విషయం పెద్ద రైతు నేతలు ఇద్దరికి చెప్పామని, యువతి ఉండడానికి వేరే టెంట్‌లో ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు.

"అయితే, నేను దాని గురించి ఏ రైతు నేతలకు ఫిర్యాదు చేశానో, వాళ్లే ఆ విషయాన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నించారు" అని ఆమె బీబీసీకి చెప్పారు.

అది సీరియస్ విషయం కావడంతో తాము బాధితురాలి స్టేట్‌మెంట్ వీడియో రికార్డ్ చేసి, దానిని ఆమె తండ్రికి పంపించామన్నారు.

బాధితురాలి గురించి జనవాదీ మహిళా సమితి కూడా మాట్లాడింది.

"మాకు ఆ ఘటన గురించి తెలిసేటప్పటికే యువతి ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సిన అవసరం వచ్చింది" అని జనవాదీ మహిళా సమితి నేత జగమతి సాంగ్వాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)