సెక్స్ సీన్లలో నటీనటులకు ఇబ్బంది లేకుండా చూసే భారత తొలి 'ఇంటిమసీ కోఆర్డినేటర్'

ఫొటో సోర్స్, AASTHA KHANNA
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
1992లో వచ్చిన 'బేసిక్ ఇన్‌స్టింక్ట్' సినిమాలో ఒక సన్నివేశం కోసం అండర్‌వేర్ తీసేలా తనను మోసం చేశారంటూ హాలీవుడ్ నటి షరాన్ స్టోన్ ఇటీవల చెప్పారు.
ఆ సన్నివేశంలో పోలీస్ ఇంటరాగేషన్ జరుగుతున్న సమయంలో షరాన్ స్టోన్ ఒక కాలు మీంచి కాలు తీసి, మరో కాలు మీద వేసుకుని కూర్చుంటారు.
ఇటీవల తన జ్ఞాపకాలను ప్రచురించిన ఆమె అందులో "ఆ సన్నివేశం తీస్తున్నప్పుడు అండర్ వేర్ తీసేయమని, అది తెల్లగా ఉండడం వల్ల లైట్ రిఫ్లెక్ట్ అవుతుందని నాకు చెప్పారు. ప్రేక్షకులకు ఏదీ కనిపించదని అన్నారు" అని రాశారు.
కానీ, ఆమె అలా నటించిన ఆ సన్నివేశంలో ఏం జరిగిందో అందిరికీ తెలిసిన విషయమే.
ఆ సినిమా డైరెక్టర్ పాల్ వెర్హోవెన్ మాత్రం ఆమె ఆరోపణలను ఖండించారు. అప్పుడు ఏం జరుగుతోందో షరాన్‌కు పూర్తిగా తెలుసని, ఆమె అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు.
కానీ, అప్పుడు జరిగిన ఆ ఘటనతో తాను చాలా కుంగిపోయానని, ఏదో ఉల్లంఘించినట్లు అనిపించిందని షరాన్ స్టోన్ చెబుతున్నారు.
అయితే, అలాంటి అవాంఛనీయ ఘటనను ముందే నివారించి ఉండవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
'కచ్చితంగా' అంటారు ఆస్తా ఖన్నా. ఆమె ప్రస్తుతం భారత్‌లో తొలి సర్టిఫైడ్ 'ఇంటిమసీ కోఆర్డినేటర్' (సన్నిహిత సన్నివేశాల్లో నటీనటులకు సహకరించే సమన్వయకర్త)గా పనిచేస్తున్నారు.
"నేను ఆ సమయంలో అక్కడ ఉండుంటే, షరాన్ స్టోన్‌కు చర్మం రంగులో ఉన్న అండర్ వేర్ ఇచ్చేదాన్ని" అంటారు ఆస్తా.
సెక్స్, నగ్న సన్నివేశాల్లో ఇబ్బంది లేకుండా, సహజంగా నటించేలా 'ఇంటమసీ కోఆర్డినేటర్లు' నటీనటులకు సహకరిస్తారు.
కానీ, 1990ల ప్రారంభంలో 'బేసిక్ ఇన్‌స్టింక్ట్' సినిమా తీసే సమయానికి 'ఇంటిమసీ కోఆర్టినేటర్' ఉండడం అనేది ఎక్కడా లేదు.
కానీ, 2017 #MeToo ఉద్యమం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీ వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి వారు ఒకరు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు.
1970లో న్యూయార్క్ పోర్న్, సెక్స్ పరిశ్రమ గురించి తాము తీస్తున్న 'డ్యూస్' అనే ఒక సిరీస్ కోసం, నటి ఎమిలీ మీడ్ కోరిక మేరకు, మొదటిసారి ఒక 'ఇంటిమసీ కోఆర్డినేటర్'ను నియమించినట్లు 2018లో హెచ్‌బీవో ప్రకటించింది.
తాము తీసే అన్ని కార్యక్రమాల్లో చిత్రీకరించే సన్నిహిత సన్నివేశాల కోసం ఒక ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను నియమిస్తున్నట్లు ఈ నెట్‌వర్క్ తర్వాత చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటివి కూడా తర్వాత ఆ బాటలోనే నడిచాయి.
అప్పటినుంచి చాలా స్టూడియోలు, నిర్మాతలు, దర్శకులు తమ సెట్లో ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా భారత్‌లో కూడా ఆ మార్పు కనిపిస్తోంది.
నేను చేసే పని యాక్షన్ డైరెక్టర్, డాన్స్ కొరియోగ్రాఫర్‌ల పనిలాగే ఉంటుంది. కానీ, నేను రొమాంటిక్ సన్నివేశాలకు ఆ పని చేస్తుంటానని 26 ఏళ్ల ఖన్నా చెప్పారు.
"స్టంట్స్ చేస్తున్నప్పుడు యాక్షన్ డైరెక్టర్ నటీనటుల భద్రతను చూసుకున్నట్లే. ఒక ఇంటిమసీ కోఆర్డినేటర్‌గా సెక్స్, న్యూడిటీ, లైంగిక హింస లాంటి సన్నివేశాలు తీసేటపుడు నేను కూడా వారికి తగిన భద్రత ఉండేలా చూసుకుంటాను" అని ముంబై నుంచి బీబీసీతో ఫోన్లో మాట్లాడిన ఆస్తా చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
దర్శకులు, నటీనటుల మధ్య సంధానకర్త
ఇంటిమసీ కోఆర్డినేటర్‌గా దర్శకుడు నటీనటుల మధ్య తాను ఒక సంధానకర్తలా పనిచేస్తానని ఆమె చెప్పారు.
"నటీనటులు దోపిడీకి గురికాకుండా చూసుకోవడం, స్టూడియోలను కాపాడడం నా పని. అంటే, ఒక ఐదేళ్ల తర్వాత నటీనటులు ఎవరూ నేను అక్కడ ఘోరమైన అనుభవం ఎదుర్కున్నానని చెప్పకూడదు" అన్నారు.
ఖన్నా నటీనటులతో సమ్మివేశం చేయడానికి వారి సమ్మతి, దానికి ఉన్న హద్దుల గురించి చర్చిస్తారు. అవి తీసేటపుడు సెట్స్‌లో అడ్డుగా పెట్టడానికి బోర్డులు, సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా నటీనటులు వేసుకునే బట్టలు లాంటివి తీసుకొస్తారు.
ఖన్నా కిట్‌లో జననాంగాలకు ధరించే గార్డులు, చనుమొనలకు అతికించే పట్టీలు, చర్మం రంగులో కలిసిపోయే టేప్‌లు, సెక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు జననాంగాలు తగలకుండా అడ్డుగా ఉపయోగించే డోనట్ దిండ్లు లాంటివి ఉంటాయి.
నెలసరి గురించి ఆస్కార్ గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ తీసిన నిర్మాత మందాకినీ కాకర్ తను తర్వాత తీయబోయే ఒక ప్రాజెక్ట్ కోసం ఖన్నా సాయం తీసుకుంటున్నానని, అది పూర్తిగా సాన్నిహిత్యం ఆధారంగానే ఉండబోతోందని చెప్పారు.
భారత సంప్రదాయం ప్రకారం దేశంలోని తీసే సినిమాల్లో చాలావరకూ సెక్స్, నగ్న సన్నివేశాలు కనిపించవు. దర్శకులు కూడా కుటుంబ కథాచిత్రాలవైపే మొగ్గు చూపుతుండడంతో ముద్దు సన్నివేశాలను కూడా తప్పుగా భావిస్తారు.
దేశంలో సెన్సార్ బోర్డ్, ప్రభుత్వ ఆంక్షలు ఉండడంతో ఇక్కడ తీసే సినిమాల్లో సెక్స్, ఇంటిమసీ గురించి చెప్పడానికి రెండు పూలు ముద్దాడుకున్నట్లు, స్టవ్ మీద పాలు పొంగినట్లు, దుప్పట్లు నలిగినట్లు సృజనాత్మకంగా చూపిస్తుంటారు.
అయితే, గత ఒకటి రెండు దశాబ్దాలుగా ముద్దు సన్నివేశాలు సినిమాల్లో చోటు సంపాదించాయి. ఇప్పుడు వాటికి డిమాండ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల పాపులారిటీ పెరగడంతో భారత్‌లో కూడా తెరపై సెక్స్, న్యూడ్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
కానీ, నటీనటులకు, ముఖ్యంగా పరిశ్రమలోకి కొత్తగా వచ్చే అమ్మాయిల నుంచి సన్నిహితంగా ఉండే సన్నివేశాలు చేస్తారని ఆశిస్తుంటారు. సెట్లో ఏం జరుగుతోందో కూడా వాళ్లకు సరిగా తెలీదు. అది లైంగిక దోపిడీకి గురయ్యేలా వారిని బలహీనంగా మార్చేస్తోంది.

ఫొటో సోర్స్, ANJALI SIVARAMAN
నటిగా మారిన మోడల్ అంజలీ శివరామన్ ఇటీవల 'ఎలైట్' అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో నటించారు.
సెట్‌లో ఖన్నా ఉండడం వల్ల తనకు చాలా సౌకర్యంగా అనిపించిందని. అక్కడ నన్ను చూసుకోడానికి ఒకరు ఉన్నారు అనేది చాలా సంతోషం ఇచ్చిందని ఆమె చెప్పారు.
"ముందు ఎప్పుడూ చేయని విధంగా, నాకు తెలీని ఒక నటుడితో నేను ఒక సెక్స్ సీన్ చేయాల్సొచ్చింది. నేను స్పోర్ట్స్ బ్రా, అండర్‌వర్‌తో ఉండాలి. అలా, నాకు దాదాపు నగ్నంగా ఉన్నట్లు అనిపించింది. నాకు చాలా కంగారుగా అనిపించింది".
"నాకు అసలు తెలీని నా సహనటుడిని ముద్దు పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది అక్కడ వాళ్లకు, ముఖ్యంగా ఒక మగ డైరెక్టర్‌కు చెప్పడం అంత సులభం కాదు. కానీ, ఆస్తా వల్ల నాకు అది ఈజీ అయ్యింది. నా ఆందోళన గురించి, ఆమె డైరెక్టర్‌కు చెప్పారు. తర్వాత ఆ ముద్దు సన్నివేశాన్నే తీసేశారు" అన్నారు అంజలి.
"సెక్స్ సన్నివేశం చేస్తున్నప్పుడు మా జననాంగాలు తగలకుండా ఆమె మా ఇద్దరి మధ్యా ఒక డోనట్ కుషన్ ఉంచారు. అది కాస్త వింతగా ఉంది. కానీ, అలాంటిది ఉన్నందుకు సంతోషించా" అని ఆమె నవ్వేశారు.
నిర్మాతగా మారిన బాలీవుడ్ నటి పూజా భట్ కూడా, తను నటించిన రోజులు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో హీరోయిన్లు తమ తల్లులు, మేనేజర్లతో కలిసి సెట్స్‌కు వెళ్లేవారని, వాళ్లను అప్పటి అనధికారిక ఇంటిమసీ కోఆర్డినేటర్లుగా అనుకోవచ్చని చెప్పారు.
తనకు ఎదురైన సొంత అనుభవాలతో ఆమె ఇప్పుడు డైరెక్టర్‌గా, నిర్మాతగా మారిన తర్వాత ఇంటిమసీ కోఆర్డినేటర్‌గా కూడా మరో పాత్ర పోషిస్తున్నారు.
"ఇంటిమేట్ సీన్స్ తీస్తున్నప్పుడు నేను నటికి ఇబ్బంది లేకుండా సెట్లో కొంతమందే ఉండేలా చూసుకుంటా. ఎందుకంటే సీన్ సరిగా రావాలంటే అది చాలా ముఖ్యం. 2002లో 'జిస్మ్' తీస్తున్నప్పుడు నేను బిపాశా బసుతో ఒక నటిగా, ఒక మహిళగా నీకు అసౌకర్యంగా అనిపించేదేదీ చేయమని నిన్ను అడగను అని చెప్పాను".
"ఆ సినిమాలో నగ్న సన్నివేశాలేవీ ఉండవు. కానీ, హీరో జాన్ అబ్రహాంను ఆకట్టుకోడానికి ఒక సీన్ చేయాలి. అది సహజంగా ఉండాలని, నీకు ఇబ్బందిగా, సంకోచంగా ఉంటే చేయద్దని తనకు చెప్పాను. కానీ, ఎంతవరకూ చేయగలవు అనేది నువ్వే నిర్ణయించుకోవాలని అన్నాను" అని పూజా భట్ చెప్పారు.

ఫొటో సోర్స్, HITESH MULAN
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ 'బాంబే బేగమ్స్'లో నటించిన పూజా భట్, ఆ సెట్‌లో 'ఇంటిమసీ కోఆర్డినేటర్' ఎవరూ లేరని చెప్పారు. కానీ, ఆ సిరీస్ డైరెక్టర్ అలంక్రితా శ్రీవాస్తవ తనకు చాలా సౌకర్యంగా ఉండేలా షూట్ చేశారని తెలిపారు.
"మనం ఇంటిమేట్ సీన్స్ ఎలా తీయబోతున్నాం అనేది ఆలంక్రిత చాలా వివరంగా చెబుతారు. మేం ఒకరినొకరం నమ్మాం. మేం దర్శకుడిని, సహ నటులను నమ్మాం. నేను ఏదో చేయరానిది చేశాను అనే ఫీలింగ్‌తో ఇంటికి వెళ్లలేదు" అంటారు పూజా.
కానీ, సెట్‌లో ఒక 'ఇంటిమసీ కోఆర్డినేటర్' ఉండడం అనేది చాలా సహకరిస్తుందని పూజా భట్ అంగీకరించారు.
"ఇది స్వాగతించే మార్పు.. సెట్లో 'ఇంటిమసీ కోఆర్డినేటర్' ఉండాలని నెట్‌వర్క్స్ గట్టిగా చెబుతున్నాయి. పరిస్థితులు చాలా మారాయి. మనకు ఏదైనా ఇబ్బందిగా, లేక వివక్ష చూపుతున్నట్లు, లేదా లైంగిక వేధింపులు ఉన్నట్లు అనిపిస్తే, దాని గురించి ఫిర్యాదు చేసే ఆప్షన్ ఉంది. ఇది నిజంగా అద్భుతమే. గతంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు" అన్నారు.
అయితే, సెట్లో ఉన్న అందరూ ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను ఆహ్వానించే పరిస్థితులు లేవని ఆస్తా ఖన్నా చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణం ఒకటే. ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను పెట్టుకోవడం అంటే, అది ఒక అదనపు ఖర్చు.
అక్కడ ప్రతికూలతలను గుర్తించడం చాలా కష్టం. నటీనటులు ఆమెను నమ్మాల్సిన అవసరం లేకపోవచ్చు. దర్శకులు, నిర్మాతలు కొన్నిసార్లు ఆమె తమ పనిలో జోక్యం చేసుకుంటోందని చిరాకు పడచ్చు.
"ఒక దర్శకుడు నాతో 'నాకు నా నటీనటుల గురించి చాలా బాగా తెలుసు. వాళ్లంతా నాకు మంచి స్నేహితులే. నేను వాళ్లతో మాట్లాడాను, వాళ్ల కుటుంబం నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నా' అని చెప్పాడు. నన్ను సెట్‌కు దూరంగా ఉంచడానికే అలా చేశాడు"
"ఆయన సెట్లో నేను ఉండకూడదని చెప్పలేదు. ఎందుకంటే స్టూడియో నన్ను రెకమండ్ చేసింది. నిర్మాతలు నన్ను పెట్టుకున్నారు. దాంతో, ఆయన షూట్ కోసం నన్ను కూడా లొకేషన్‌కు తీసుకెల్లారు. కానీ, షూటింగ్ జరిగినన్ని రోజలూ, నన్ను వ్యాన్‌లోనే కూచోపెట్టారు".
"వాళ్లు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు సెట్లో ఒక కత్తితో సీన్ తీస్తున్నప్పుడు, మీకు స్టంట్ డైరెక్టర్ అవసరం ఉంటుంది. అలాగే మీ స్క్రిప్టులో ఇంటిమసీ సీన్లు ఉన్నప్పుడు మీకు నేను కావాలి" అంటారు ఆస్తా.
భారత్‌లో చాలా మంది నిర్మాతలు తమదైన దారిలో వెళ్లడంలో ఆశ్చర్యమేమీ లేదని, కానీ, పరిస్థితులకు తగ్గట్టు వారు కూడా మారాలని పూజా భట్ చెబుతున్నారు.
"మార్పు జరుగుతోంది. కానీ అది మెల్లగా వస్తోంది. పరిశ్రమలో కొందరు దద్దమ్మలు, చికాకు కలిగించేవారు, వెనకబడినవారు మారాలని అనుకోవడం లేదు. కానీ, మనం ఒకరికోసం ఒకరు నిలబడాలి. ఒకరికొకరు అండగా నిలవాలి. అది బలమైనవారిని అప్‌సెట్ చేసినా.." అంటారు పూజా.
ఇవి కూడా చదవండి:
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








