అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఏ దేశానికి పారిపోయారు?

ఫొటో సోర్స్, Reuters
అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయారు. తొలుత ఆయన తజకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని వార్తా సంస్థ అల్ జజీరా పేర్కొంది.
అధ్యక్షుడు వ్యక్తిగత బాడీగార్డు ఒకరు ఈ విషయాన్ని చెప్పారని వెల్లడించింది. అయితే, దీన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.
రక్తపాతాన్ని నివారించేందుకే తాను రాజధాని నగరాన్ని వీడుతున్నట్లు అఫ్గానిస్తాన్ పౌరులను ఉద్దేశించి ఘనీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు చేశారు.
కాబుల్ ఎయిర్‌పోర్టులో గందరగోళం
విదేశీయులు, అఫ్గాన్ అధికారులు, ఇతరులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడానికి కాబుల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది.
అన్ని రకాల వాణిజ్య విమాన సర్వీసులను రద్దు చేశారు.
యూకే, జర్మనీ, కెనడా, అమెరికా లాంటి దేశాలు మిలటరీ విమానాల ద్వారా వారి పౌరులను, బలగాలతో కలిసి పని చేసిన అఫ్గాన్లను దేశం దాటిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'శాంతియుతంగా అధికార మార్పిడి'
తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఫోన్లో బీబీసీతో లైవ్లో మాట్లాడారు. గతంలో కూడా ఓ తాలిబాన్ అధికార ప్రతినిధి బీబీసీ ప్రెజెంటర్ యాల్దా హకీంతో లైవ్‌లో మాట్లాడారు.
వచ్చే కొద్ది రోజుల్లో 'శాంతియుతంగా అధికార మార్పిడి' జరగాలని తాలిబాన్లు కోరుకుంటున్నట్లు సుహైల్ షాహీన్ ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.
'ప్రజలందరికీ, ముఖ్యంగా కాబుల్ నగరంలో నివసిస్తున్న వారికి.. వారి ఆస్తులు, ప్రాణాలు భద్రమేనని హామీ ఇస్తున్నాం' అని ఆయన హకీంతో తెలిపారు.
శారీరక దండన, బాలికలు పాఠశాలకు వెళ్లడంపై నిషేధం సహా షరియా చట్టం అమలు చేస్తారనే ఆందోళనల నేపథ్యంలో దేశం కోసం తాలిబాన్లు వేసుకున్న ప్రణాళికలను ఆయన ఇంటర్వ్యూలో నొక్కి చెప్పారు.
‘అఫ్గాన్ ఆర్మీ కుప్పకూలింది’
అఫ్గానిస్తాన్ ఆర్మీ 'ఊహించిన దాని కంటే త్వరగా' కుప్పకూలిందని అమెరికా పేర్కొంది.
తాము 20 ఏళ్లుగా శిక్షణనిచ్చిన అఫ్గాన్ ఆర్మీ శక్తియుక్తులను తప్పుగా అంచనా వేశామని అమెరికా నాయకులు అంగీకరిస్తున్నారు.
'ఆర్మీ దేశాన్ని రక్షించలేకపోయింది. ఇది మేం ఊహించిన దాని కంటే త్వరగా జరిగింది' అని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ సీఎన్ఎన్‌తో అన్నారు.
మూడు లక్షల మందితో కూడిన బలమైన అఫ్గానిస్తాన్ సైన్యం దేశాన్ని రక్షించుకోగలదనే నమ్మకం తనకు ఉందని గత వారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పేర్కొన్నారు. తాలిబాన్ల సంఖ్య ఒక అంచనా ప్రకారం 50 వేల నుంచి లక్ష మధ్య మాత్రమే ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
క్షేత్రస్థాయిలో అమెరికా మద్దతు లేని ఆఫ్గాన్ ప్రభుత్వ సేనలు.. జిల్లా కేంద్రాలు, నగరాల్లో త్వరగా తాలిబాన్లకు లొంగిపోయాయి. అధికారులు చెక్ పాయింట్ల నుంచి కనుమరుగయ్యారు. కొన్ని చోట్ల సైనికులు పారిపోయారు.
ఆగస్టు 6న జరంజ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రకటించింది. పది రోజుల్లో వారు దేశ రాజధాని కాబుల్ సహా అన్ని ప్రావిన్సుల రాజధానుల్లోకి చొచ్చుకు వచ్చారు.
'యుద్ధం ముగిసింది'
అఫ్గానిస్తాన్‌లో 'యుద్ధం ముగిసింది' అని తాలిబాన్ ప్రకటించింది.
తాలిబాన్‌కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు 'అఫ్గానిస్తాన్‌లో యుద్ధం ముగిసింది' అని అల్ జజీరాతో చెప్పారు.
'మేం ఏదైతే కోరుకున్నామో, దాన్ని చేరుకున్నాం. మా దేశానికి స్వతంత్రం వచ్చింది. మా ప్రజలకూ స్వతంత్రం లభించింది' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
విదేశీ బలగాలు 'అఫ్గానిస్తాన్‌లో విఫల అనుభవాలను మరోసారి రుచి చూడాలని' అనుకోవని తాలిబాన్ భావిస్తున్నట్లు వివరించారు.
అధ్యక్షుడి భవనంలోకి తాము చేరుకున్న ఫొటోలను తాలిబాన్ ఆదివారం విడుదల చేసింది. రాజధానిలో ఉన్న 11 జిల్లా కేంద్రాలను అదుపులోకి తెచ్చుకున్నట్లు వారు ప్రకటన చేశారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: రాజధాని కాబుల్‌ను చుట్టుముట్టిన తాలిబాన్లు
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













