అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

కొన్నిరోజులుగా అఫ్గానిస్తాన్‌లో భారీగా నగరాలు, పట్టణాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటూ వస్తున్నారు. వారు దేశ రాజధాని కాబూల్‌లోకి కూడా ప్రవేశించారు. ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

అఫ్గానిస్తాన్‌లో పరిణామాలను చుట్టుపక్కల ముస్లిం దేశాలతోపాటు ప్రపంచం మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ సంక్షోభంలో కొన్ని దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి.

అఫ్గాన్‌లో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తెలిపింది.

ఇరు వర్గాలు హింసను పక్కన పెట్టాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఓఐసీ పిలుపునిచ్చింది. అఫ్గాన్‌లో శాంతి స్థాపనలో తాము క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

అయితే, ఈ ప్రకటన మినహా, ఓఐసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రెండు వర్గాల నుంచి సంస్థ వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తోంది.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్..

అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై పొరుగునున్న ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ నుంచి పారిపోతున్న సైనికులు పొరుగునున్న ఇరాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

కాబూల్, హెరాత్‌లలోని తమ దౌత్యవేత్తలు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చూడాలని తాలిబాన్లను ఇరాన్ శుక్రవారం అభ్యర్థించింది. ప్రస్తుతం హెరాత్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. సున్నీల నేతృత్వంలోని తాలిబాన్ల విషయంలో షియా ఆధిక్య దేశమైన ఇరాన్ మొదట్నుంచీ ఆందోళన వ్యక్తంచేస్తోంది.

1988లో మజర్-ఏ-షరీఫ్‌ నగరంలోని ఇరాన్‌కు చెందిన ఒక జర్నలిస్టుతోపాటు ఎనిమిది మంది దౌత్యవేత్తలను తాలిబాన్లు హతమార్చారు. దీనికి స్పందనగా ఇరాన్ దాడి చేయాలని భావించింది.

అయితే, ఆ తర్వాత కాలంలో తాలిబాన్లు, ఇరాన్‌ల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. గత జులైలో ట్రెహాన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రితో తాలిబాన్ల బృందం చర్చలు కూడా జరిపింది.

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, తజికిస్తాన్

ఈ మూడు మధ్య ఆసియా దేశాలు అఫ్గాన్‌తో సరిహద్దులు కలిగి ఉన్నాయి. అఫ్గాన్‌ సంక్షోభం ప్రభావం ఈ దేశాలపై పడుతోంది. ముఖ్యంగా శరణార్థులు ఈ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ తమ సరిహద్దులను కట్టుదిట్టం చేశాయి.

గత జులైలో కొందరు అఫ్గాన్ జవాన్లు ఉజ్బెకిస్తాన్‌కు పారిపోయారు. ఆ తర్వాత అఫ్గాన్‌లోని తమ బలగాలను ఉజ్బెకిస్తాన్ ఉపసంహరించుకొంది. తమ సరిహద్దులను కూడా కట్టుదిట్టం చేసింది.

మరోవైపు తజికిస్తాన్ కూడా సరిహద్దుల వెంబడి నిఘా కోసం దాదాపు 20,000 మంది సైనికుల్ని అదనంగా మోహరించింది.

అఫ్గాన్ సంక్షోభం నడుమ.. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉమ్మడి సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ రెండు దేశాలు సంయుక్త సైనిక ఆపరేషన్లు చేపడుతున్నాయి.

మరోవైపు తుర్క్‌మెనిస్తాన్ తాలిబాన్లతో బంధాలను బలపరుచుకుంటోంది. చర్చల కోసం తాలిబాన్ నాయకులకు ఇప్పటికే తుర్క్‌మెనిస్తాన్ ఆహ్వానం పలికింది.

అయితే, పొరుగు దేశాలకు తమ వల్ల ఎలాంటి ముప్పూ ఉండబోదని ఇప్పటికే తాలిబాన్లు స్పష్టంచేశారు. పొరుగున్న దేశాల్లోని ప్రాంతాలను ఆక్రమించే ఉద్దేశించే తమకు లేదని తెలిపారు.

అయినప్పటికీ, అఫ్గాన్‌లో పరిస్థితులపై ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, తజికిస్తాన్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎర్డోగన్

ఫొటో సోర్స్, Getty Images

టర్కీ

కాబూల్‌పై తాలిబాన్లు పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. నగరంలోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాము ఆధీనంలోకి తీసుకుంటామని టర్కీ ప్రకటించింది.

ఈ విమానాశ్రయం విధులు నిర్వర్తించడం చాలా అవసరమని, అందుకే దీన్ని తాము నియంత్రణలోకి తీసుకుంటామని రెండు రోజుల క్రితం స్పష్టంచేసింది.

అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో టర్కీ ఈ ప్రకటన చేసింది. విమానాశ్రయ భద్రతను తాము చూసుకుంటామని టర్కీ ప్రకటించింది.

అయితే, టర్కీ నిర్ణయంపై తాలిబాన్లు సంతోషంగా లేరు. తమ బలగాలను విమానాశ్రయానికి పంపితే ఊరుకునేది లేదని టర్కీకి ఇప్పటికే తాలిబాన్లు హెచ్చరికలు జారీచేశారు.

‘‘తాలిబాన్ల ధోరణి సరిగా లేదు. ఒక ముస్లిం మరో ముస్లింతో ఇలా ప్రవర్తించకూడదు’’అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించగలమని ప్రపంచ దేశాలకు రుజువు చేయాలని తాలిబాన్లకు ఆయన అభ్యర్థించారు. తమ సొంత సోదరుడి స్థలాన్ని ఆక్రమించుకోవడం తగదని ఆయన అన్నారు.

కాబూల్ విమాశ్రయాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామన్న టర్కీ నిర్ణయాన్ని చిరాకు కలిగించే చర్యగా తాలిబాన్లు అభివర్ణించారు. ‘‘తమ దేశంలో ఏ విదేశీ జోక్యం అవసరం లేదు’’అని తాలిబాన్లు వ్యాఖ్యానించారు. దీంతో తాలిబాన్ల ధోరణి సరిగా లేదని మీడియాతో ఎర్డోగన్ అన్నారు.

నాటో సభ్య దేశాల్లో టర్కీ కూడా ఒకటి. అఫ్గాన్‌లో టర్కీ బలగాలు లేకపోయినప్పటికీ, అఫ్గాన్‌లో నాటో సైనిక చర్యలకు టర్కీ మద్దతు ఇస్తోంది.

మరోవైపు తాలిబాన్లతో పోరాడిన కమాండర్ మార్షల్ దోస్తోమ్‌తో టర్కీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓటమి అనంతరం ఉజ్బెకిస్తాన్‌కు దోస్తోమ్ పరారయ్యారు. మజర్-ఏ-షరీఫ్ నగరంలోనూ టర్కీ పెట్టుబడులు పెట్టింది.

పాకిస్తాన్‌కు, టర్కీకి దగ్గర సంబంధాలున్నాయి.. అలాగే, పాకిస్తాన్‌కూ తాలిబాన్లకూ మధ్య కూడా మంచి సంబంధాలున్నాయి. దీంతో అఫ్గాన్‌లో భవిష్యత్‌లో టర్కీ క్రియాశీల పాత్ర పోషించే అవకాశముంది. తాలిబాన్లు, టర్కీలని దగ్గర చేసేందుకు పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్

తాలిబాన్లతో పాకిస్తాన్‌కు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో చర్చలకు ఈ సంబంధాలను పాక్ ఉపయోగించుకుంటోంది. మరోవైపు తమపై పాక్ ప్రభావం ఉందన్న వాదనలను తాలిబాన్లు ఖండిస్తున్నారు. పాకిస్తాన్‌ను తాము మంచి మిత్రదేశంగా చూస్తున్నామని వారు అంటున్నారు.

పాకిస్తాన్‌లో దాదాపు 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. రెండు దేశాల మధ్య 2500 కి.మీ. పొడవైన సరిహద్దులు ఉన్నాయి. దీంతో తాలిబాన్‌లకు పాక్ అత్యంత కీలకమైన పొరుగు దేశంగా మారుతోంది. అయితే, అఫ్గాన్‌ నుంచి తాము ఎలాంటి ప్రయోజనాలనూ ఆశించడంలేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు.

అఫ్గాన్ సంక్షోభంలో మొదట్నుంచీ పాక్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. ఆదివారం ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రభుత్వ ప్రతినిధులతో అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపారు.

అయితే, తాలిబాన్లను పాక్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అఫ్గాన్ ప్రభుత్వం అంటోంది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తోంది.

తాష్కెంట్‌లో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంపై చర్చలు కూడా జరిపారు.

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ అరేబియా, యూఏఈ

ప్రపంచంలో అతిపెద్ద సున్నీ ముస్లింల దేశం సౌదీ అరేబియానే. అఫ్గానిస్తాన్ విషయంలో మాత్రం సౌదీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.

ఇటు అఫ్గాన్, అటు పాక్ రెండు దేశాలతోనూ సౌదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు తాలిబాన్లతోనూ సౌదీకి సంబంధాలున్నాయి. అయితే, 2018లో ఖతర్‌లో అమెరికా, తాలిబాన్ల మధ్య చర్చలు మొదలైన నాటినుంచీ, సౌదీ వ్యూహాత్మక దూరం పాటిస్తోంది.

పాకిస్తాన్ సాయంతో అఫ్గాన్‌లో ఆధిపత్యం చెలాయించాలని సౌదీ అరేబియా భావిస్తోంది. అయితే, అఫ్గాన్ సంక్షోభం విషయంలో సౌదీ బహిరంగంగా స్పందించడం లేదు.

1980-90ల్లో రష్యాకు వ్యతిరేకంగా అఫ్గాన్‌లోని ముజాహిదీన్‌లను సౌదీ ప్రోత్సహించింది. కానీ ప్రస్తుత సంక్షోభంలో మాత్రం ప్రత్యక్షంగా ఎలాంటి జోక్యమూ చేసుకోవడం లేదు.

మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ సంక్షోభం నుంచి వ్యూహాత్మక దూరం పాటిస్తోంది.

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

ఖతర్

చిన్న ముస్లిం దేశాల్లోఖతర్ ఒకటి. అయితే, అఫ్గాన్ సంక్షోభంలో ఇది మొదట్లో క్రియాశీల పాత్ర పోషించింది. తాలిబాన్ల రాజకీయ కార్యాలయం ఖతర్‌లోని దోహాలో ఉంది.

అమెరికా మిత్రదేశమైన ఖతర్.. తాలిబాన్లతో చర్చలకు ఆతిథ్యం వహించింది. రెండు వర్గాలకూ మౌలిక సదుపాయాలను కల్పించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)