అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా పగ్గాలు చేపట్టేది ఎవరు? అబ్దుల్ ఘనీ బరాదర్, హీబాతుల్లా అఖండ్ జాదా ఎలాంటి వారు.. వీరి చరిత్ర ఏంటి?

తాలిబాన్లు దాదాపు మొత్తం అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఉపాధ్యక్షుడు అమీరుల్లా సాలేహ్ దేశం వదిలిపెట్టారు.
దాంతో, ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానంగా రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, హీబాతుల్లా అఖండ్ జాదా.
ఈ ఇద్దరూ ఎవరు, తాలిబాన్లలో వీరికి ఎలాంటి పాత్ర ఉంది?

ఫొటో సోర్స్, SEFA KARACAN/ANADOLU AGENCY VIA GETTY IMAGES
ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్
1994లో తాలిబాన్లను ఏర్పాటు చేసిన నలుగురిలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఒకరు.
2001లో అమెరికా నేతృత్వంలో అఫ్గానిస్తాన్ మీద దాడులు జరిగి, తాలిబాన్లు అధికారం కోల్పోయినపుడు నాటో బలగాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వం వహించారు.
తర్వాత, 2010లో జరిగిన అమెరికా, పాకిస్తాన్ సంయుక్త ఆపరేషన్‌లో ఆయనను కరాచీలో అరెస్ట్ చేశారు. 2012 వరకూ ముల్లా బరాదర్ గురించి పెద్దగా సమాచారం లేదు.
శాంతి చర్చలను ప్రోత్సహించడానికి అప్పటి అఫ్గానిస్తాన్ ప్రభుత్వం కొంతమంది బందీల విడుదలకు సంబంధించి ఒక జాబితాను ప్రచురించింది. వారిలో బరాదర్ పేరు కూడా ఉంది.
2013 సెప్టెంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం బరాదర్‌ను విడుదల చేసింది. కానీ, తర్వాత ఆయన పాకిస్తాన్‌లోనే ఉండిపోయారా లేక వేరే ఎక్కడికైనా వెళ్లిపోయారా అనేది స్పష్టంగా తెలీదు.
ముల్లా బరాదర్ తాలిబాన్ నేత ముల్లా మొహమ్మద్ ఉమర్‌కు అత్యంత నమ్మకస్తుడు. డిప్యూటీగా కూడా ఉన్నారు.
ముల్లా ఉమర్ అరెస్ట్ అయినపుడు, ముల్లా బరాదర్ తాలిబాన్ల రెండో అతిపెద్ద నేతగా మారారు.
బరాదర్ స్థాయి నేతను శాంతి చర్చల కోసం ఒప్పించవచ్చని అఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో సీనియర్ అధికారులకు ఎప్పుడూ అనిపించేది.
2018లో అమెరికాతో చర్చలు జరపడానికి తాలిబాన్లు ఖతార్‌లో కార్యాలయం ప్రారంభించినప్పుడు బరాదర్‌ను తాలిబాన్ రాజకీయ పార్టీకి చీఫ్‌గా చేశారు. అమెరికాతో చర్చలను ముల్లా బరాదర్ ఎప్పుడూ సమర్థించేవారు.
1994లో తాలిబాన్ల ఏర్పాటు తర్వాత ఆయన ఒక కమాండర్‌గా, వ్యూహకర్తగా కీలక పాత్రలు పోషించారు.
ముల్లా ఉమర్ సజీవంగా ఉన్న సమయంలోనే ఆయన తాలిబాన్ల నిధుల సేకరణ, రోజువారీ కార్యకలాపాలకు బాధ్యులుగా ఉన్నారు.
అప్గానిస్తాన్‌లో జరిగిన అన్ని యుద్ధాల్లో తాలిబాన్ల తరఫున బరాదర్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ముఖ్యంగా హెరాత్, కాబూల్ ప్రాంతంలో ఆయన చురుగ్గా ఉండేవారు.
తాలిబాన్లు అధికారం కోల్పోయిన సమయంలో తాలిబాన్ల ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ ఉప మంత్రిగా ఉన్నారు.
"ఆయన భార్య ముల్లా ఉమర్ సోదరి. తాలిబాన్ల ఖర్చుల చిట్టా మొత్తం ఆయనే చూసుకుంటారు. అఫ్గాన్ దళాలకు వ్యతిరేకంగా అత్యంత భీకర దాడులకు బరాదర్ నేతృత్వం వహించారు" అని ఆయన్ను అరెస్ట్ చేసిన సమయంలో ఒక అఫ్గానిస్తాన్ అధికారి బీబీసీకి చెప్పారు.
తాలిబాన్ల మిగతా నేతల్లాగే ముల్లా బరాదర్ మీద కూడా ఐక్యరాజ్యసమితి నిషేధం ఉంది. ప్రయాణాలు చేయకుండా, ఆయుధాలు కొనకుండా ఆయనపై నిషేధం విధించారు.
2010లో అరెస్ట్ అవడానికి ముందు ఆయన ఒక బహిరంగ ప్రకటన చేశారు. 2009లో ఆయన ఈ-మెయిల్ ద్వారా న్యూస్‌వీక్ పత్రిక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అఫ్గానిస్తాన్‌లో అమెరికా దళాల ఉనికి పెరగడంపై మాట్లాడిన ఆయన.. అమెరికాకు భారీ నష్టాన్ని కలిగించాలని తాలిబాన్లు భావిస్తున్నట్లు చెప్పారు.
"మా నేలపై శత్రువులను అంతం చేసేవరకూ మా జిహాద్ కొనసాగుతూనే ఉంటుంది" అన్నారు.
ఇంటర్‌పోల్ వివరాల ప్రకారం ముల్లా బరాదర్.. ఉరుజ్‌గాన్ ప్రావిన్స్, దేహరావుడ్ జిల్లాలోని వీట్‌మాక్ గ్రామంలో పుట్టారు.
బరాదర్‌ను దురానీ తెగకు చెందినవారని భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా దురానీ తెగకు చెందినవారే.

ఫొటో సోర్స్, AFGHAN ISLAMIC PRESS
హీబాతుల్లా అఖండ్ జాదా
హీబాతుల్లా అఖండ్ జాదా అఫ్గాన్ తాలిబాన్ల నేత. ఆయన ఇస్లాం పండితుడు. కాందహార్‌కు చెందినవారు. తాలిబాన్ల దిశను మార్చి, వారిని ప్రస్తుత స్థితికి చేర్చింది ఆయనేనని భావిస్తున్నారు.
తాలిబాన్లకు కంచుకోటగా ఉన్న కాందహార్‌తో ఆయనకున్న బంధం తాలిబాన్లలో బలమైన పట్టు సాధించడానికి హీబాతుల్లాకు సహకరించింది.
1980వ దశకంలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్ చేసిన తిరుగుబాటులో ఆయన కమాండర్ పాత్ర పోషించారు. కానీ ఆయనకు సైనిక కమాండర్ కంటే ఎక్కువగా ఇస్లాం పండితుడుగానే గుర్తింపు ఉంది.
అఫ్గాన్ తాలిబాన్ల చీఫ్ అవడానికి ముందు కూడా ఆయన తాలిబాన్ అగ్రనేతల్లో ఒకరుగా ఉండేవారు. తాలిబాన్లకు మతానికి సంబంధించిన ఆదేశాలను ఆయనే ఇచ్చేవారు.
దోషులుగా తేలిన హంతకులకు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవారికి మరణదండన, దొంగతనం చేసేవారికి చేతులు నరకాలని ఆదేశాలు జారీ చేశారు.
తాలిబాన్ల మాజీ చీఫ్ అఖ్తర్ మొహమ్మద్ మన్సూర్‌కు హీబాతుల్లా డిప్యూటీగా కూడా ఉన్నారు. 2016లో జరిగిన అమెరికా డ్రోన్ దాడుల్లో మన్సూర్ చనిపోయారు. ఆయన తన వీలునామాలో హీబాతుల్లాను తన వారసుడుగా ప్రకటించారు.
తర్వాత హీబాతుల్లా పాకిస్తాన్ క్వెట్టాలో తాలిబాన్ అగ్రనేతలను కలిశారని, వారే ఆయన్ను తాలిబాన్ చీఫ్‌గా చేశారని భావిస్తున్నారు. ఆయన నియామకానికి చట్టబద్ధత ఇవ్వడానికే వీలునామా రాశారని వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీ చెప్పింది.
అయితే, ఆయన ఎంపిక ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అని తాలిబాన్లు చెప్పారు.
దాదాపు 60 ఏళ్ల వయసున్న ముల్లా హీబాతుల్లా తన జీవితంలో ఎక్కువ భాగం అఫ్గానిస్తాన్‌లోనే గడిపారు. క్వెట్టాలోని తాలిబాన్ల షురాతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
హీబాతుల్లా అనే పేరుకు 'అల్లా నుంచి లభించిన బహుమతి' అని అర్థం. ఆయన నూర్జాయ్ తెగకు చెందినవారు.
ఇవి కూడా చదవండి:
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














