అఫ్గానిస్తాన్: కొత్త తాలిబాన్లు నిజంగానే మారారా? లేదా పీఆర్ టీమ్ సలహాతో మారినట్లు నటిస్తున్నారా?

- రచయిత, సరోజ్‌సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది 1996 నాటి కథ.
మరియమ్ సఫీకి అప్పుడు 19ఏళ్లు. మజార్-ఎ-షరీఫ్‌లో ఆమె మెడిసిన్ చదివేవారు. అయితే, ఒక్క రోజులోనే అంతా మారిపోయింది.
మజార్-ఎ-షరీఫ్‌ను తాలిబాన్లు నియంత్రణలోకి తీసుకోవడంతో ఆమె తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల విద్యపై ఆంక్షలు విధించారు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడమూ నిషేధమే. అలా బయటకు వెళ్లేవారిపై దాడులు కూడా చేసేవారు. కేవలం తండ్రి, సోదరుడు లేదా భర్తతో మాత్రమే వారు కలిసి బయటకు వెళ్లాలని నిబంధన ఉండేది.
అప్పట్లో మరణ శిక్షలు అమలుచేసేవారు. కొన్ని నేరాలకు పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. కాళ్లు, చేతులు నరికేయడం కూడా ఇక్కడ సర్వసాధారణంగా ఉండేది.
ఈ భయాందోళనల నడుమ మరియమ్ తన చదువును పక్కన పెట్టేయాల్సి వచ్చింది. దీంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యారు.
అయితే, 2001లో అమెరికా నేతృత్వంలోని నాటో సేనలు తాలిబాన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయి. దీంతో మళ్లీ మరియమ్ కాలేజీకి వెళ్లి తన చదువును పూర్తిచేశారు.
గత ఆదివారం కాబుల్‌ను మళ్లీ తాలిబాన్లు నియంత్రణలోకి తీసుకోవడంతో మరియమ్ ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, HOSHANG HASHIMI/AFP VIA GETTY IMAGES
ఇది నేటి పరిస్థితి...
ఇప్పుడు 17 ఆగస్టు 2021నాటి పరిస్థితిని చూద్దాం.
‘‘కాబుల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకొని రెండు రోజులు అవుతోంది. నేను నగరంలోని ఓ హోటల్‌లో ఉన్నాను. అయితే, అక్కడ సిబ్బంది గెడ్డం గీసుకోవడం మానేశారు. రిసెప్షన్‌తోపాటు ఇతర సేవల్లోని మహిళలు కూడా కనిపించలేదు. హోటల్‌లో వినిపించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పూర్తిగా ఆపేశారు.’’
అసలు ఏం జరిగింది? అని అక్కడున్న వారిని అడగ్గా.. ‘‘తాలిబాన్ కోసం పనిచేస్తున్న తమ స్నేహితులు ఇక్కడే ఉన్నారు’’అని వారు సమాధానం ఇచ్చారు.
ఇవి బీబీసీ ప్రతినిధి మలిక్ ముదస్సిర్ చెప్పిన మాటలు. కాబుల్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం అక్కడి పరిస్థితులను మలిక్ వివరించారు.

తాలిబాన్ 2.0 వర్సెస్ తాలిబాన్ 1.0
పైన చెప్పిన రెండు ఘటనల మధ్య 25ఏళ్ల తేడా ఉంది. ఒక ఘటన మజార్-ఎ-షరీఫ్‌లో మరొక ఘటన కాబుల్‌లో జరిగింది. ఈ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అయితే, మంగళవారం సాయంత్రం ఈ రెండింటికీ అతీతంగా మూడో కోణాన్ని తాలిబాన్లు ప్రపంచం ముందు పెట్టారు.
అఫ్గాన్‌పై పట్టు సాధించిన అనంతరం తాలిబాన్లు నిర్వహించిన తొలి పత్రికా విలేకరుల సమావేశం ఇది.
మరో ఇద్దరు సభ్యులతో కలిసి తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. స్థానిక భాషలో ఆయన మాట్లాడుతూ.. తాము కూడా ‘‘ఉదారవాదులం(లిబరల్స్)’’అని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. ఇది 1996-2001నాటి తాలిబాన్లతో పోలిస్తే, పూర్తి భిన్నమైన కోణం.
‘‘మేం ఎవరిపైనా పక్షపాతం చూపబోమని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్నాం. అఫ్గాన్ ఇకపై యుద్ధ క్షేత్రంగా మారకుండా చూసుకుంటాం. మాతో పోరాడిన అందరినీ క్షమించేస్తున్నాం. ఇకపై మాకు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు. షరియా చట్టంలోని మహిళ హక్కులకు సంబంధించిన లోపాలను సరిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇకపై మాతోపాటే కలిసి మహిళలు కూడా పనిచేస్తారు’’అని జబీహుల్లా అన్నారు.
తాలిబాన్లు నేరుగా టీవీ కెమెరాల ముందుకు వచ్చి ఈ హామీలను ఇచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో 1996తో పోలిస్తే నేడు తాలిబాన్లు మారారా? లేక మారినట్లు నటిస్తున్నారా? లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చెబుతున్నారా? లాంటి అంశాలపై చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మారుతున్నారా?
ఈ అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియా విదేశాంగ, దౌత్య వ్యవహారాల ఎడిటర్ ఇంద్రాణీ బాగ్చీ బీబీసీతో మాట్లాడారు.
‘‘ప్రస్తుతానికి తాలిబాన్లు మారారని మనం కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే వారి సిద్ధాంతాలు మారలేదని నేడు మనకు స్పష్టంగా తెలుసు. మంగళవారం కూడా షరియా చట్టాలకు అనుగుణంగానే మహిళలకు హక్కులు ఇస్తామని వారు అన్నారు’’అని ఆమె అన్నారు.
అయితే, తాలిబాన్లు చెబుతున్న హక్కులు, అంశాలపై చాలా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
గత 20ఏళ్లలో అఫ్గాన్‌తోపాటు ప్రపంచ దేశాల్లో మార్పుల వల్లే తాలిబాన్లు మారారా? అనే ప్రశ్న వీటిలో మొదటిది.
మునుపెన్నడూ లేని రీతిలో నేడు అఫ్గాన్‌లో భారీగా బాలికలు చదువుకుంటున్నారు. పెద్దమొత్తంలో మహిళలు ఆఫీసులకు వెళ్తున్నారు. వీరంతా బుర్ఖాలు వేసుకొని మళ్లీ ఇంటికే పరిమితం కావాలని తాలిబాన్లు ఆంక్షలు పెడతారా?
ఇలాంటి ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాలు లేవు. అయితే, మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తాలిబాన్లు చాలా భిన్నంగా మాట్లాడారు.
అయితే, కొంత మంది తాలిబాన్ కమాండర్లు మహిళలను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారని రిపోర్టులు కూడా వస్తున్నాయి.
తాలిబాన్లు తమ చేతుల్లోకి అధికారాన్ని తీసుకొని కేవలం కొన్ని రోజులే గడుస్తోంది. దీంతో ఇప్పుడే వారి విధానాలు ఏమిటో మనం స్పష్టంగా చెప్పలేం. వారు నాయకుల్ని ఎలా ఎంచుకుంటారు? ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తారు? ఆ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? వారు సౌదీ అరేబియాలా మారాలని అనుకుంటున్నారా? లేదా యూఏఈని అనుసరిస్తారా? లేదా వారి సొంత దారిలో వారు ముందుకు వెళ్తారా? ఈ అంశాలన్నీ వారి విధానాలపై ప్రభావం చూపిస్తాయి.
ప్రస్తుతానికి గత 20ఏళ్లలో అఫ్గాన్ మారినట్లే వారు కూడా మారాలని ఆశించాలి.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గాన్‌లో ఏం మారింది?
గత 20ఏళ్లలో అఫ్గాన్‌లో వచ్చిన మార్పులపై ఇంద్రాణీ చెప్పిన అంశాల విషయంలో మేం డేటాను సేకరించాం.
నిజమే గత 20ఏళ్లలో ప్రపంచంతోపాటు అఫ్గానిస్తాన్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం... 2001లో ఇక్కడ బాలికలు ప్రైమరీ స్కూల్‌కు వెళ్లేవారు కాదు. బాలురు సంఖ్య కూడా పది లక్షలు మాత్రమే ఉండేది. అయితే, 2012నాటికి ప్రైమరీ స్కూళ్లకు వెళ్తున్న బాలబాలికల సంఖ్య 80 లక్షలకు పెరిగింది. వీరిలో 30 లక్షల మంది బాలికలు ఉన్నాయి. అయితే, వారిలో చాలా మంది మాధ్యమిక విద్యకు వెళ్లకముందే, బడి మానేస్తున్నారు.
మరోవైపు 2011నాటి యూనిసెఫ్ సమాచారం ప్రకారం, దేశంలోని 52 శాతం మంది బాలికలకు 20ఏళ్లలోపే పెళ్లి చేస్తున్నారు. 15 నుంచి 24 మధ్య వయసున్న బాలికల్లో అక్షరాస్యత రేటు 22 శాతంగా ఉంది. ఇది అంత ఆశాజనంగా లేకప్పటికీ, తాలిబాన్లను గద్దె దించాక ఈ స్థాయికి రావడం విజయంగానే చెప్పుకోవాలి.
2009నాటి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం, ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020నాటికి మహిళల్లో 40 శాతం మంది ఏదో ఒక పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
9/11 తర్వాత ప్రపంచం మారింది..
తాలిబాన్ల ధోరణిలో మార్పుకు ప్రపంచంలో మార్పులు కూడా ఒక కారణమని దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన స్ట్రాటజిక్ స్టడీస్ విభాగం అధిపతి, ప్రొఫెసర్ హర్ష్ వీ పంత్ చెప్పారు.
‘‘అమెరికాలో 9/11 ఉగ్రదాడి తర్వాత, ఉగ్రవాదంపై ప్రపంచ ధోరణిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రపంచ దేశాలు తెగేసి చెప్పాయి. తాలిబాన్లలో మార్పుల గురించి మాట్లాడుకునేటప్పుడు, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.’’
1996 నుంచి 2001 మధ్య అఫ్గాన్‌లో పరిస్థితులపైనా పంత్ మాట్లాడారు. ‘‘అప్పట్లో తాలిబాన్ల పరిపాలనకు ఎలాంటి విధానమూ లేదు. అమెరికాలోని పశ్చిమ దేశాలు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని గుర్తించేవి కాదు. దీంతో షరియా చట్టాన్ని తాలిబాన్లు అమలుచేశారు. మైనారిటీలపై కూడా దాడులు జరిగాయి.’’
‘‘అయితే, 9/11 దాడుల తర్వాత అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రపంచం మొత్తం చూస్తోంది. నేడు అమెరికా నిధులను కూడా నిలిపివేసింది. కాబుల్ విమాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ సైన్యాన్ని పంపి తమ పౌరులను కూడా అమెరికా వెనక్కి తీసుకెళ్లిపోయింది. అయితే, తాలిబాన్లు అమెరికా శక్తిని అంత తక్కువగా అంచనా వేయరు. అఫ్గాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని అమెరికా ఏకతాటిపైకి తీసుకురాగలదని వారికి బాగా తెలుసు.’’
‘‘ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్లు తమ ప్రభుత్వాన్ని నడిపించేందుకు అంతర్జాతీ సమాజం గుర్తింపు అవసరం.’’
‘‘ఈ దిశగా తాలిబాన్లను ప్రోత్సహించేలా చైనా, పాకిస్తాన్‌లు వ్యాఖ్యలు చేశాయి. అయితే, రష్యా మాత్రం బహిరంగంగా తాలిబాన్లకు మద్దుతు ప్రకటించలేదు. అందుకే ఇంగ్లిష్ మాట్లడగలిగే తమ అధికార ప్రతినిధి సాయంతో అంతర్జాతీయ దృష్టిని తమవైపు పడేలా తాలిబాన్లు చూసుకుంటున్నారు.’’

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్లు ఎందుకు మారాలి?
తాలిబాన్లు మారాల్సిన అవసరంపై ఇంద్రాణీ రెండు ప్రధానమైన పాయింట్లు చెప్పారు.
‘‘గత మంగళవారం తాలిబాన్లకు వ్యతిరేకంగా పోస్టర్‌లు పట్టుకున్న మహిళల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల కింద మహిళ ధైర్యాన్ని ప్రజలు కొనియాడుతున్నారు.
ఈ పరిస్థితుల్లోనూ మహిళలకు తుపాకీ గురిపెట్టి ఇంటికే పరిమితం కావాలని తాలిబాన్లు చెప్పగలరా?
ఇక రెండో విషయం ఏమిటంటే, నేటి 21వ శతాబ్దంలో మానవ హక్కులు, మహిళల హక్కులు, లింగ సమానత్వం లాంటి అంశాలను పశ్చిమ దేశాలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి.
తాలిబాన్లు అధికారంలో కొనసాగాలి అనుకుంటే పశ్చిమ దేశాల ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే ఆర్థిక, సాంకేతిక పరమైన సాయం వారికి అవసరం.
ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్లు తాము మారినట్లు ప్రపంచ దేశాలకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు’’అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ శరణార్థులు రాకుండా సరిహద్దుల్లో కంచె వేసిన పాకిస్తాన్
- అష్రఫ్ ఘనీ: ‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’
- తాలిబాన్‌లోని బలమైన నాయకులు ఎవరు? వారి పాత్ర ఏంటి?
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












