అఫ్గానిస్తాన్: అపారమైన ఖనిజ సంపద ఉన్న ఈ దేశంలో ఆర్థిక ప్రగతి సాధ్యమేనా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఆండ్రూ వాకర్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్ ఎకనామిక్స్ కరస్పాండెంట్
"అఫ్గానిస్తాన్ ఆర్థికవ్యవస్థ బలహీనంగా, విదేశీ నిధులపై ఆధారపడి ఉంది." తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకోవడానికి అనేక చాలా నెలల ముందే ప్రపంచ బ్యాంకు చెప్పిన మాటలివి.
తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో అఫ్గానిస్తాన్‌కు విదేశీ ఆర్థిక సహాయం అగమ్యగోచరంగా మారింది. దాంతో, అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
అఫ్గానిస్తాన్‌లో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మైనింగ్‌కు అనుకూలంగా లేవు.
ఆ దేశానికి అందే విదేశీ ఆర్థిక సహాయం చాలా ఎక్కువ. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, 2019లో అఫ్గాన్‌కు అందిన ఆర్థిక సహాయం స్థూల జాతీయ ఉత్పత్తిలో 22 శాతం.
ఇది చాలా ఎక్కువే. కానీ, పదేళ్ల క్రితం 49 శాతం ఉండేదని, అది క్రమేపి తగ్గుగూ 22 శాతానికి వచ్చిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ఇప్పుడు ఈ ఆర్థిక సహాయంపై అనిశ్చితి మేఘాలు కమ్ముకొన్నాయి.
జర్మనీ విదేశాంగ మంత్రి హయికే మాస్ గత వారం బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్‌తో మాట్లాడుతూ "తాలిబాన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుని, షరియా చట్టాన్ని తీసుకువస్తే మేము ఒక్క రూపాయి కూడా సహాయం చేయం" అని అన్నారు.
ఆర్థిక సహాయం అందించే ఇతర దేశాలు, సంస్థలు కూడా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, EPA
అవినీతి కష్టాలు
అఫ్గాన్ ఆర్థిక పరిస్థితి దుర్భలంగా ఉందని ప్రపంచ బ్యాంకు వ్యాఖ్యానించడానికి కారణం, దేశ భద్రతపై వారు చేస్తున్న విపరీతమైన ఖర్చు.
రక్షణ వ్యవస్థపై ఆ దేశ వ్యయం స్థూల జాతీయ ఉత్పత్తిలో 29 శాతం. స్వల్పాదాయం కలిగిన ఇతర దేశాల 3 శాతం సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇది కూడా తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందున్న పరిస్థితి.
భద్రతా సమస్యలు, పెచ్చుమీరిన అవినీతి అఫ్గానిస్తాన్‌లో విదేశీ పెట్టుబడులకు అడ్డుకట్ట వేశాయి.
గత రెండేళ్లల్లో కొత్తగా "గ్రీన్‌ఫీల్డ్" పెట్టుబడులు ఏమీ రాలేదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. దీనికి విదేశీ పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. అంటే గత రెండేళ్లల్లో కొత్త పెట్టుబడులేవీ అఫ్ఘానిస్తాన్‌లోకి రాలేదు.
దక్షిణ ఆసియాలో ఇంతకన్నా కొంచెం తక్కువ జనాభా కలిగి ఉన్న నేపాల్, శ్రీలంక దేశాలు అదే సమయంలో వరుసగా పది రెట్లు, యాభై రెట్లు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించగలిగాయి.
అఫ్గానిస్తాన్‌లో ప్రైవేటు రంగం విస్తరణకు అవకాశం లేకుండా పరిమితంగా ఉందని ప్రపంచ బ్యాంకు వివరించింది.
తక్కువ ఉత్పాదకత ఉన్న వ్యవసాయరంగంలో ఉపాధి కేంద్రీకృతమై ఉంది. 60 శాతం కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాయి.
ఆ దేశంలో అక్రమ ఆర్థిక వ్యవస్థ వేళ్లూనుకుని ఉంది. అక్రమ మైనింగ్, నల్లమందు తయారీ, స్మగ్లింగ్, తదితర కార్యక్రమాలు చాలా ఎక్కువ. .
ఖనిజ సంపద
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, 2001లో అమెరికా దాడి చేసి తాలిబాన్లను తుడిచిపెట్టిన తరువాత, అఫ్గానిస్తాన్ వేగంగా అభివృద్ధి చెందింది.
అఫ్గానిస్తాన్ ఆర్థిక పరిస్థితికి సంంబధించిన లెక్కలు నమ్మదగినవి కాకపోవచ్చు. కానీ, ఆ దేశం ప్రపంచ బ్యాంకుకు అందించిన గణాంకాల ప్రకారం, 2003 మొదలుకొని పది సంవత్సరాలలో వార్షిక వృద్ధి రేటు సగటు 9 శాతం కంటే ఎక్కువగా ఉంది.
అనంతరం, 2015, 2020ల మధ్య ఈ సగటు 2.5 శాతానికి పడిపోయింది. దీనికి ముఖ్య కారణం విదేశీ ఆర్థిక సహాయం తగ్గిపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు.
అఫ్గానిస్తాన్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. భద్రతా సమస్యలు, అవినీతి వంటి సమస్యలు తొలగిపోతే విదేశీ వ్యాపారం, పెట్టుబడులను సులువుగా ఆకర్షించవచ్చు.
ఆ దేశంలో, రాగి, కోబాల్ట్, బొగ్గు, ఇనుము మొదలైన ఖనిజ వనరులకు కొదవలేదు. చమురు, గ్యాస్, విలువైన రాళ్లు పుష్కలంగా ఉన్నాయి.
వీటితోపాటు, లీథియం వనరులు కూడా అధికంగా ఉన్నాయి. ఈ లోహాన్ని బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లలో వినియోగిస్తారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లదే హవా కావొచ్చు. వాహన పరిశ్రమ జీరో-కార్బన్ రవాణా మార్గాల వైపు దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.
"అఫ్గానిస్తాన్ ఖనిజ సంపద అనూహ్యమైనది. కానీ, అనేక అడ్డంకులు.." అంటూ 2010లో అమెరికా ఉన్నతాధికారి ఒకరు న్యూయార్క్ టైమ్స్ పత్రికతో వ్యాఖ్యానించారు.
ఆ దేశం "సౌదీ అరేబియా ఆఫ్ లీథియం"గా మారగలదని అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ అంతర్గత మెమోలో నివేదించినట్లు కూడా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఇన్ని వనరులు ఉన్నప్పటికీ, అఫ్గానిస్తాన్ వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. ఇప్పటివరకు లీథియం వనరుల నుంచి అఫ్గాన్ ప్రజలు పొందిన లాభం నామమాత్రమే అని చెప్పుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ పెట్టుబడులు
పశ్చిమ దేశాల కన్నా, చైనాకు తాలిబాన్లతో సత్సంబంధాలు ఉన్నాయి. తాలిబాన్లు అధికారంలోకి వస్తే చైనాకు ప్రయోజకరంగానే ఉండవచ్చు. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా ఉత్సాహం చూపిస్తోందని ఇప్పటికే పలు రిపోర్టులు వచ్చాయి.
అక్కడ రాగి, చమురు మైనింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు చైనాకు కాంట్రాక్టులు లభించాయి. కానీ, ఆ దిశలో పనులేవీ జరగలేదు.
రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దులు చాలా చిన్నవి. అఫ్గానిస్తాన్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, అక్కడి ఆర్థిక కార్యకలాపాల్లో ఆసక్తి చూపిస్తుందని ఆశించవచ్చు.
అయితే, పెట్టుబడి పెట్టిన తరువాత విజయాలు అందుకోవాలనే చైనా సంస్థలూ కోరుకుంటాయి. అఫ్గానిస్తాన్‌లో భద్రతా సమస్యలు, అవినీతి ముప్పు లేదని తెలిస్తేనే మైనింగ్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి.
అలాంటి సురక్షిత వాతావరణాన్ని తాలిబాన్లు కల్పించగలరా? ఇదీ ఇప్పుడు భారీ పెట్టుబడిదారుల ముందున్న చిక్కు ప్రశ్న. చైనా అయినా, మరే దేశమైనాగానీ ఇదే ఆలోచిస్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది బ్యాంకుల నుంచి తమ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. అలాంటప్పుడు, సమీప భవిష్యత్తులో అఫ్గానిస్తాన్ ఆర్థిక స్థిరత్వంపై కూడా అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి.
కాగా, బ్యాంకు యజమానులు, వ్యాపారస్థులు, దుకాణదారుల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పిస్తామని తాలిబాన్ల ప్రతినిధి హామీ ఇచ్చినట్లు పాకిస్తాన్‌లో ఉన్న అఫ్గాన్ ఇస్లామిక్ ప్రెస్ తెలిపింది.
వీరందరి ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుసుకోవడం చాలా షాకింగ్‌గా ఉంది. అయితే, అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే తమ సొమ్ముకు భద్రత ఉంటుందనే నమ్మకం వినియోగదారులకు కలగాలి. అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తమ పాలనలో మహిళల జీవితం ఎలా ఉంటుందో చెప్పిన తాలిబాన్లు
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన 'దళిత బంధు' పథకం ఏంటి? ఇప్పుడే ఎందుకు? రూ.10 లక్షలు ఎలా పొందాలి? ఎలా ఖర్చు చేయాలి?
- అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా పగ్గాలు చేపట్టేది ఎవరు?
- తాలిబాన్లు ఎవరు?
- బుమ్రాపై కసి తీర్చుకోవడానికి ఇంగ్లండ్ జట్టు చేసిన ఆ ఒక్క తప్పే భారత్‌కు ఘన విజయాన్ని ఇచ్చిందా?
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









