అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ను తాలిబాన్లు ఇంత వేగంగా స్వాధీనం చేసుకుంటారని ఆ దేశ ప్రభుత్వమే కాదు బహుషా ఎవరూ ఊహించి ఉండరు.
లేకపోతే అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ వీడియో సందేశం పంపిన మర్నాడే దేశం విడిచివెళ్లి ఉండేవారుకాదు.
అత్యవసర పరిస్థితుల్లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసి, తన సిబ్బందిని హడావుడిగా వెనక్కు రప్పించుకుని ఉండేదికాదు.
ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఒక సందిగ్ధావస్థలో పడిందనే చెప్పవచ్చు.
ఒక పక్క చైనా, పాకిస్తాన్‌లు తాలిబాన్లతో తమ స్నేహం నేపథ్యంలో కాబుల్‌లోని తాజా పరిణామాల పట్ల కాస్త నిబ్బరంగానే కనిపిస్తున్నాయి.
మరోపక్క అఫ్గానిస్తాన్ నుంచి తమ దేశ ప్రజలను అత్యంత వేగంగా తరలించే ప్రయత్నాల్లో భారత్ నిమగ్నమై ఉంది.
భారతదేశం అధికారికంగా తాలిబాన్లను ఎన్నడూ గుర్తించలేదు. కానీ ఈ ఏడాది జూన్‌లో రెండు వర్గాల మధ్య "బ్యాక్ చానెల్ చర్చలు" జరిగినట్లు భారత మీడియాలో వార్తలు వచ్చాయి.
"వివిధ స్టేక్‌హోల్డర్ల"తో చర్చిస్తున్నాం అంటూ అప్పట్లో కేంద్రం ఒక సంజాయిషీ ఇచ్చింది.
అయితే, రెండు నెలల్లో పరిస్థితులు ఇంత త్వరగా తారుమారైపోతాయని ఎవరూ ఊహించి ఉండరు.
కాబుల్‌లో తాజా పరిణామాల మధ్య భారతదేశం ఇప్పటికీ అదే వ్యూహం అవలంబిస్తుందా? అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ పట్ల ఇండియా వైఖరి ఎలా ఉంటుంది? భారత్‌పై తాలిబాన్ల ప్రభావం ఎంతవరకు ఉంటుంది?
తాలిబాన్, భారత్‌ల మధ్య సంబంధాలు
భారత్ ఇప్పటివరకు తాలిబాన్లతో ప్రత్యక్ష చర్చలు జరపకపోవడానికి ప్రధాన కారణం అఫ్గానిస్తాన్‌లో భారత మిషన్లపై దాడిలో తాలిబాన్ల హస్తం ఉందని భావించడమే.
1999లో ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటన, దాన్ని విడిపించడానికి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, అహ్మద్ జర్గర్, షేక్ అహ్మద్ ఉమర్ సయీద్‌లను విడుదల చేయడం భారతదేశంలో ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు.
తాలిబాన్లతో చర్చల వలన చారిత్రకంగా అఫ్గానిస్తాన్‌తో ఉన్న స్నేహ సంబంధాలు దెబ్బతింటాయని భావించడం కూడా మరో కారణం.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తాజా పరిణామాలపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
దీనిపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలలో భారత ప్రభుత్వం అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో సుమారు మూడు బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
పార్లమెంటు భవనంతో మొదలుకొని రోడ్లు, ఆనకట్టల వరకు పలు నిర్మాణ కార్యక్రమాల్లో అనేక మంది భారత నిపుణులు పాలుపంచుకుంటున్నారు.
అఫ్గానిస్తాన్‌లో దాదాపు 1700 మంది భారతీయులు నివసిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అనేకమంది భారతీయులు అఫ్గానిస్తాన్ విడిచి వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాక 130 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం ఆదివారం భారతదేశం చేరుకుంది.

ఫొటో సోర్స్, Prakash singh
మున్ముందు భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది?
ఈ అంశంపై కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ప్రొఫెసర్‌గా ఉన్న శాంతి మారియట్ డిసౌజాతో బీబీసీ మాట్లాడింది.
డిసౌజా అఫ్గానిస్తాన్‌లో చాలాకాలం పని చేయడమే కాక అక్కడి పరిస్థితులపై పీహెచ్‌డీ చేశారు.
"ప్రస్తుతం తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతి త్వరలో అఫ్గానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకుంటారనే వాస్తవాన్ని భారత్ గ్రహించాలి. ఇప్పుడు భారత్‌కు రెండే మార్గాలు ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించడం లేదా అన్ని సంబంధాలు తెంచేసుకుని 90లలో మాదిరి కొనసాగడం. రెండో మార్గాన్ని అవలంబిస్తే, గత 20ఏళ్లలో అక్కడ చేపట్టిన కార్యక్రమాలన్నిటికీ స్వస్తి పలికినట్టే.
నా ఉద్దేశంలో భారత్ మధ్యేమార్గంగా తాలిబాన్లతో చర్చలు ప్రారంభించాలి. తద్వారా, అఫ్గానిస్తాన్ అభివృద్ధి కార్యక్రమాల్లో తన పాత్రను నామమాత్రంగానైనా కొనసాగించే వీలు ఉంటుంది. అక్కడి నుంచి భారతీయులందరినీ తరలించడం వలన దీర్ఘకాలంలో పెద్ద ప్రయోజనం ఉండదు. ఆదరాబాదరాగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు" అని డిసౌజా అభిప్రాయపడ్డారు.
ఆగస్టు 15 వరకు అఫ్గానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడగలదని అందరూ విశ్వసించారు. కానీ ఆదివారం తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబాన్లకు ఎలాంటి అడ్డంకీ లేకుండా పోయింది.
"1990లలో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తరువాత, భారతదేశం తమ రాయబార కార్యాలయాలను మూసివేసినప్పుడు, కాందహార్ విమానం హైజాక్ అయినప్పుడు, భారత వ్యతిరేక ముఠాలు విస్తరించడం మనం చూశాం.
అదలా ఉంచితే 2011లో భారత్, అఫ్గానిస్తాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం అన్ని విధాలా అఫ్గానిస్తాన్‌కు మద్దతు ఇస్తామని భారతదేశం హామీ ఇచ్చింది. అందుచేత తాజా పరిణామాలపై భారత్ ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది" అని డిసౌజా అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తాలిబాన్ వైఖరిలో మార్పు
ఇటీవలి కాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా తాలిబాన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అఫ్గానిస్తాన్ అభివృద్ధి కార్యక్రమాల్లో భారతదేశం పాత్రను తప్పుపట్టిన సందర్భాలూ లేవు.
తాలిబాన్లలో భారతదేశం పట్ల సుముఖత చూపే ఒక వర్గం కూడా ఉంది. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు పాకిస్తాన్ దాన్ని కశ్మీర్‌తో ముడిపెట్టి చూసింది. కానీ ఈ అంశంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, భారతదేశం కశ్మీర్‌లో ఏం చేస్తుందనే విషయాన్ని తాము పట్టించుకోమని తాలిబాన్లు చెప్పారు.
ఇప్పటివరకు కాబుల్‌లో రక్తపాతం జరిగిన దాఖలాలు లేవు. కానీ అఫ్గానిస్తాన్‌లో మహిళల పరిస్థితి మరింత దిగజారుతుందని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే తాలిబాన్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ మహిళలకు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
కాబట్టి తాలిబాన్ 1.0 కన్నా తాలిబాన్ 2.0 భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
అయితే తాలిబాన్ల ముఖం తీరు మారిందా, లేక అద్దాన్ని మార్చారా అనే అంశంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, REUTERS
'భారత్ తొందరపడదు'
"ప్రస్తుతం భారతదేశం తన పౌరులను అక్కడ నుంచి సురక్షితంగా తరలించడానికే ప్రాధాన్యం ఇస్తుంది. రాబోయే రోజుల్లో తాలిబాన్ల వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ప్రపంచ దేశాలు తాలిబాన్లను ఎలా గుర్తిస్తాయి? అంతర్జాతీయ స్థాయిలో తాలిబాన్లు తమకంటూ ఒక స్థానాన్ని ఎలా ఏర్పరచుకుంటారు? ఇవన్నీ మన ముందున్న సందేహాలు.
చర్చలకు తాలిబాన్లు కూడా అంగీకరిస్తేనే భారతదేశం ఏదైనా చేయగలదు. తాలిబాన్లు మీడియాలో చెప్తున్న మాటలకు, వాస్తవంలో వారు చేస్తున్న పనులకు వ్యత్యాసం ఉండకూడదని ఆశిద్దాం. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరినీ చంపబోమని వారు చెబుతున్నారు. కానీ, ఆదివారానికి ముందువరకు అఫ్గానిస్తాన్‌లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారాన్ని చూస్తుంటే వారి మాటలకు, చేతలకు పొంతన లేదనే అనిపిస్తోంది. అంతకుముందు వారు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నట్లు కనిపిస్తున్నారు" అని అబ్జర్వర్ ఫౌండేషన్‌కు చెందిన పొలిటికల్ సైన్స్ నిపుణులు ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ అభిప్రాయపడ్డారు.
"తాలిబాన్లకు ఇప్పుడు ప్రపంచ ఆమోదం అవసరం. గతంలో తాలిబాన్ ప్రతినిధులు చైనా వెళ్లారు. అంతర్జాతీయ వేదికపై ఎలా కనిపించాలనే దానిపై వారికి చైనా నుంచి సలహాలు అందే ఉంటాయి. కానీ అమెరికా, బ్రిటన్ సహా ఇతర పశ్చిమ దేశాల నుంచి వారికి శుభసూచకాలేవీ అందలేదు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో పరిస్థితికి అమెరికా అధ్యక్షుడే కారణం అంటూ వస్తున్న విమర్శలు చూస్తుంటే పశ్చిమ దేశాల నుంచి తాలిబాన్లకు అంత త్వరగా గుర్తింపు, గౌరవం వచ్చే సూచనలేవీ కనిపించట్లేదు.
భారతదేశం విషయానికి వస్తే పొరుగు దేశంలో ప్రభుత్వం మారినప్పుడల్లా వారితో మాట్లాడుతూనే ఉంది. అఫ్గానిస్తాన్‌తో కూడా అదే చేస్తుంది. కానీ సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే. అయితే తాలిబాన్ 1.0 లాగే తాలిబాన్ 2.0 కూడా ఉంటే వారితో ఎంత చర్చించినా భారతదేశానికి ఏమీ లాభం ఉండదు.
భారత్, తాలిబాన్లతో చర్చలు జరపడానికి రష్యా సహాయం తీసుకోవచ్చు. సౌదీ అరేబియా, యూఏఈలలో ఏం జరుగుతుందన్నది కూడా భారత్‌కు ముఖ్యమే. వాటిపై కూడా ఓ కన్నేసి ఉంచుతుంది. 1990లలో పాకిస్తాన్, యూఏఈ, సౌదీ అరేబియాలు తొలుత తాలిబాన్లను గుర్తించాయి" అని ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ అన్నారు.
భారత్ ముందున్న సవాళ్లు
90వ దశకంలో సోవియట్ దళాలు అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగినప్పుడు తాలిబాన్లు విజృభించారు.
మదర్సాల్లో తాలిబాన్ల ఉద్యమం ఉదయించిందని అంటారు. సున్నీ ఇస్లాం మత విశ్వాసాలను వీరు ప్రచారం చేశారు.
తరువాత పష్తూన్ ప్రాంతంలో శాంతిభద్రతలు స్థాపిస్తామని, షరియా చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
పరిపాలించడానికి తాలిబాన్లకు ఒక మోడల్ అంటూ లేదని ప్రొఫెసర్ వి. పంత్ అన్నారు. తమ సొంత మతవాద భావజాలాలనే వారు అమలుచేశారు.
ఇప్పటివరకు అమెరికా దళాలను అఫ్గానిస్తాన్ నుంచి తొలగించడమే వారి లక్ష్యం. అది సాధించారు. దీని తరువాత కూడా తాలిబాన్ వర్గాల్లో ఇలాంటి ఐక్యతే ఉంటుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేం అని వి. పంత్ అభిప్రాయపడ్డారు.
భారతదేశం స్నేహ హస్తం అందించవచ్చు. కానీ తాలిబాన్లకు షరియా చట్టాన్ని అమలుచేయడమే ముఖ్యం. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం వారి అజెండా కాకపోవచ్చు. అలాంటప్పుడు భారత్‌కు, తాలిబాన్లకు మధ్య భావజాల ఘర్షణలు నెలకొనవచ్చు.
ప్రస్తుతం తాలిబాన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడం వలన భారతదేశానికి మూడు స్థాయిలలో సవాళ్లు ఎదురుకావొచ్చని ప్రొఫెసర్ డిసౌజా అన్నారు.
మొదటిది, భద్రతకు సంబంధించినది. తాలిబాన్లతో అనుబంధంగా ఉన్న జైష్, లష్కర్, హక్కానీ లాంటి తీవ్రవాద సంస్థలు భారత్‌పై వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నాయి.
రెండవది, మధ్య ఆసియాలో వాణిజ్యం. అఫ్గానిస్తాన్ భౌగోళిక స్థానం కారణంగా వాణిజ్యం, కనెక్టివిటీ విషయాల్లో భారతదేశానికి ఇబ్బందులు ఎదురుకావొచ్చు.
మూడోది, ఇప్పటికే తాలిబాన్లతో మంచి సంబంధాలు నెరుపుతున్న పాకిస్తాన్, చైనాలతో సమస్యలు తలెత్తవచ్చు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు
- జనవరి 1నే కొత్త సంవత్సర వేడుకలు ఎందుకు జరుపుకొంటాం?
- మనం పుట్టడమే మంచివాళ్లుగా పుడతామా? చెడ్డవాళ్లుగా పుడతామా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









