ENG vs IND: బుమ్రాపై కసి తీర్చుకోవడానికి ఇంగ్లండ్ జట్టు చేసిన ఆ ఒక్క తప్పే భారత్‌కు ఘన విజయాన్ని ఇచ్చిందా?

ఫొటో సోర్స్, Getty Images
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు భారత్ షాకిచ్చింది. కోహ్లీ సేన సంచలనం సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడిన భారత్.. అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో రెండో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
రెండో టెస్టులో ఆఖరి రోజు ప్రారంభానికి ముందు ఇంగ్లండే ఫేవరేట్‌గా ఉంది. అయితే చివరి రోజు భారత బౌలర్లు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టారు. తిరిగి బౌలింగ్‌లోనూ బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. దీంతో రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన భారత టెయిలెండర్లు మొహమ్మద్ షమీ(56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(34 నాటౌట్) తొమ్మిదో వికెట్ కి 89 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత ఇండియా 298-8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. దీంతో మ్యాచ్ ని గెలవాలంటే 272 పరుగులు లేదా 60 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా ఆడాల్సిన పరిస్థితి ఇంగ్లండ్ కి తలెత్తింది.
అయితే, ఇంగ్లండ్‌లో తొలిసారి పర్యటిస్తున్న మొహమ్మద్ సిరాజ్ బంతితో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఓపెనర్లు రాయ్ బర్న్స్, డామ్ సిబ్లే వెంటవెంటనే డకౌట్‌గా వెనుదిరగడంతో ఒక పరుగుకే ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్ ముగిసిన తర్వాత నాలుగు బంతుల వ్యవధిలోనే జానీ బెయిర్ స్టో, కెప్టెన్ జో రూట్ వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ పై ఆశలు ఆవిరయ్యాయి.
96 బంతులు ఆడిన జోస్ బట్లర్ 25 పరుగులు చేశాడు. మొయిన్ అలీతో కలిసి 16 ఓవర్లు, ఒలీ రాబిన్సన్, శామ్ కరన్తో కలిసి 12 ఓవర్లు ఆడాడు. ఆ తర్వాత రాబిన్సన్, బట్లర్ ఇద్దరు వరుస ఓవర్లలో ఔటయ్యారు. చివరి వికెట్‌గా జేమ్స్ అండర్సన్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
అంతకుముందు 181-6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ క్రీజులో ఉన్న రిషబ్ పంత్‌పై ఆశలు పెట్టుకుంది. పంత్(22)ను రాబిన్సన్ ఔట్ చేయగా, ఇశాంత్ శర్మ(3) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
అనంతరం టెస్టుల్లో 11 సగటు ఉన్న షమీ, 3 సగటు ఉన్న బుమ్రా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ పేలవమైన ఫీల్డింగ్ తో షమీ, బుమ్రాకు చెరో అవకాశం వచ్చింది. షమీ వ్యక్తిగత స్కోరు 31 వద్ద ఇచ్చిన క్యాచ్‌ను బెయిర్ స్టో వదిలేయగా, 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా ఇచ్చిన క్యాచ్‌ను మొయీన్ జార విడిచాడు.
మొయీన్ విసిరిన బంతిని సిక్సర్ గా మలిచిన షమీ, 57 బంతుల్లో టెస్టుల్లో రెండో అర్థ శతకాన్ని పూర్తి చేశాడు.
లంచ్ తర్వాత రెండు ఓవర్లకే ఇండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయగా, అప్పటికే మ్యాచ్ ను శాసించే స్థితికి ఇండియా చేరింది.

ఫొటో సోర్స్, PA Media
భారత్ విజయానికి కారణాలేంటి?
లార్డ్స్ నుంచి బీబీసీ స్పోర్ట్స్ ప్రతినిధి స్టెఫాన్ షెమ్లిట్ విశ్లేషణ
ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ జట్టు చేసిన అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇది కూడా ఒకటి.
ఇంగ్లాండ్ జట్టు ఆడిన చివరి 15 టెస్టు ఇన్నింగ్స్ లలో 10 సార్లు 205 అంతకంటే తక్కువ పరుగులకు అలౌట్ అయింది. వీటిలో ఏడు మ్యాచుల్లో ఓటమిని చవి చూసింది.
భారత బౌలింగ్‌కు లొంగిపోయిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
మరోవైపు సిసలైన భారత టెయిలెండర్లు షమీ, సిరాజ్‌లు ఇంగ్లండ్ బౌలింగ్ తోలు తీశారు. తొమ్మిదో వికెట్ భాగస్వామ్యంలో వీళ్లిద్దరూ ప్రతి ఓవర్‌కూ సగటున 4.5 పరుగులు చేశారు.
టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఇలాంటి నిరాశాజనక ప్రదర్శనలు అలవాటుగా మారుతున్నాయి. ఐర్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై 85 పరుగులకు, 67 పరుగులకు కూడా ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే, ఆ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.
ఈ మ్యాచ్‌లో మాత్రం విజయావకాశాలను ఇంగ్లండ్ చేతులారా వదులుకుందనే చెప్పాలి.
షమీ-బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లండ్ జట్టు అయోమయంగా కనిపించింది. వారి వ్యూహాలు దారుణంగా ఉన్నాయి.
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా బౌన్సర్లు సంధించడం, అప్పుడు నెలకొన్న భావోద్వేగాల నేపథ్యంలో.. బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లండ్ బౌలర్లు స్టంప్స్‌ను కాకుండా అతడినే టార్గెట్ చేసుకుని బంతులు వేసినట్లు కనిపించింది.
ఈ ప్లాన్ మార్చుకునేలోపే.. చాలా ఆలస్యం అయిపోయింది.
అంతే కాదు.. ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల మధ్యా పలుమార్లు క్రీడాకారుల మాటలతో భావోద్వేగాలు తీవ్రమయ్యాయి.
ఈ వాగ్వాదాలు భారత్‌లో కసిని పెంచగా, ఇంగ్లండ్‌పై నీళ్లు చల్లాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘కామెంటేటర్ల విమర్శలే ప్రేరణ..’ - కోహ్లీ
టెలివిజన్ కామెంటేటర్లు చేసిన విమర్శలు తమ టెయిలెండర్లకు ప్రేరణగా నిలిచాయని భారత కెప్టెన్ కోహ్లీ చెప్పాడు.
‘‘కామెంటేటర్లు విమర్శలను ఎవరో మా టెయిలెండర్లకు చెప్పారు. దీంతో వాళ్లు (కామెంటేటర్లు) తప్పు అని వీళ్లు (టెయిలెండర్లు) నిరూపించారు’’ అని కోహ్లీ అన్నాడు.
''మా అత్యత్తమ విజయాల్లో ఈ టెస్టు మ్యాచ్ కూడా ఒకటి'' అని కోహ్లీ వివరించాడు.
ఐదో రోజు.. అది కూడా 60 ఓవర్లలో ఇలాంటి ఫలితాన్ని సాధించడం గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.
బౌలర్లకు సహకరించని పిచ్ పై తొలిసారి ఇంగ్లాండ్ టూర్ కి వచ్చిన మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. రెండో టెస్టులో 128 పరుగులిచ్చి, ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. సిరాజ్‌లో 'నమ్మకం ఉప్పొంగుతోంది' అని కొహ్లీ పేర్కొన్నాడు.
‘‘లార్డ్స్‌లో ఆడటాన్ని అతను ఆస్వాదించాడు. దేశం కోసం ఆడటానికి అతను ఎంత తపన పడతాడో మీరు చూడొచ్చు’’ అని సిరాజ్‌ను ఉద్దేశించి కోహ్లీ అన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో.. మరీ ముఖ్యంగా చివరి రోజు ఆటలో వాగ్వాదాలు, భావోద్వేగాలు తమలో కసిని పెంచాయని, ప్రేరణగా నిలిచాయని కోహ్లీ అన్నాడు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కెఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ‘‘మాలో ఒకరి వెంట మీరు పడితే (రెచ్చగొడితే).. మీరు మా 11 మంది వెంటా పడినట్లే - మా టీంలోని వాళ్లందరం ఇలాగే ఉంటాం’’ అని అన్నాడు.
‘‘అది కారణం కాదు..’’ - జో రూట్
రెండో టెస్టులో ఇండియాపై ఓటమికి తాను బాధ్యత తీసుకుంటానని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పేర్కొన్నాడు.
''నా వ్యుహాలు తప్పిదాలుగా మారాయి. దీనికి బాధ్యుడిని నేనే. అయితే, ఈ ఓటమి నుంచి నేర్చుకుంటాను'' అని చెప్పాడు.
ఒకవేళ తాను కనుక తన వ్యూహాలను మార్చుకుంటే ఆట వేరేగా ఉండేదని అన్నాడు.
షమీ-బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లండ్ జట్టు బౌలర్లు వికెట్లను లక్ష్యంగా చేసుకుని బంతులు వేయలేదు. ఫీల్డర్లను కూడా మైదానంలో దూరంగా మొహరించారు.
తాము ఇలా చేసి ఉండకూడదని, వికెట్లను లక్ష్యంగా చేసుకుని తరచూ బంతులు వేయాల్సిందని రూట్ వివరించాడు.
అయితే, తాము ఇలా చేయడానికి కారణం బుమ్రా-అండర్సన్ ఎపిసోడ్ కారణం కాదని చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
- ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- తాలిబాన్లు ఎవరు?
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












