ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదు? అసలు ఆ ప్రయత్నాలేమైనా జరిగాయా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ మరాఠీ
ఒక వైపు పెరిగే భావోద్వేగాలు, తాడో పేడో తేల్చుకునే పోటీలు, దేశ ప్రతిష్టను పెంచేందుకు శక్తినంతా కూడగట్టుకొని మైదానంలో తలపడే క్రీడాకారులు... మరో వైపు జీవితంలో కనీసం మైదానం వైపు కన్నెత్తి చూడని కొంతమంది దేశభక్తులు, మ్యాచ్ జరిగే సమయంలో టీవీ చూస్తూ విపరీతమైన దేశభక్తితో వారిచ్చే సలహాలు.
ఇదీ ఒలింపిక్స్ జరుగుతోన్న సమయంలో సాధారణంగా ఉండే వాతావరణం. కానీ, ప్రతీ భారతీయుని మనసులో మాత్రం ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. వెబ్‌లో ఒలింపిక్స్ అని టైప్ చేయగానే వెంటనే భారతీయులు వెతికే కొన్ని ప్రశ్నల జాబితా కింద కనిపిస్తుంటుంది.
అందులో, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చలేదని ప్రశ్న కూడా ఉంటుంది.
ఈ ఏడాది ఒలింపిక్స్‌లో కొన్ని కొత్త క్రీడలను చేర్చారు. దాంతో, ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రాతినిధ్యం లేకపోవడం చర్చకు వచ్చింది.
ఈ ఏడాది ఒలింపిక్స్‌లో కరాటే, స్పోర్ట్స్ క్లైంబింగ్, సర్ఫింగ్ క్రీడలను కొత్తగా చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బేస్ బాల్‌ను కూడా చేర్చారు. ఈ ఏడాది కూడా బేస్‌బాల్ ఒలింపిక్స్‌లో స్థానం దక్కించుకుంది.
ఒలింపిక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఆటలను చేరుస్తూ ఉంటారు. కొన్ని ఆటలను తొలగిస్తూ ఉంటారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను చేర్చనున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
చీర్ లీడింగ్‌ను కూడా ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చాలని కొంత మంది డిమాండ్ కూడా చేశారు. భవిష్యత్తులో ఇది కూడా ఒలింపిక్స్ క్రీడగా మారే అవకాశముండొచ్చు.
చీర్ లీడింగ్, బేస్‌బాల్, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ లాంటి క్రీడలను అన్ని దేశాల్లో ఆడరు. వీటికి అమెరికా క్రీడలనే ముద్ర ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్నలు వస్తున్నాయ్..
కొన్ని దేశాల్లో మాత్రమే ఆడే కొత్త క్రీడలకు ఒలింపిక్స్ లో చోటు లభించినప్పుడు, క్రికెట్ ఎందుకు ఒలింపిక్స్ క్రీడల జాబితాలో లేదు?
క్రికెట్ ఒలింపిక్స్‌లో లేకపోవడం వల్ల కనీసం ఒలింపిక్స్ సమయంలోనైనా భారతీయులు ఇతర క్రీడల పైన ఆసక్తి కనబరుస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరేమో, ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటే, భారతదేశానికి కచ్చితంగా పతకాలు వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతున్నారు.
ఈ రెండు వాదనల్లో ఏది సరైనది అని గుర్తించడం ఇప్పుడు సమస్య కాదు. ఎందుకంటే మనం ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలా? వద్దా అనే అంశంపై చర్చించడం లేదు. అసలు ఒలింపిక్స్ చరిత్రలో క్రికెట్‌కు ఎప్పుడైనా స్థానం దక్కిందా? లేకపోతే ఎందుకు దక్కలేదు? క్రికెట్‌ను ఒలింపిక్స్ లో చేర్చేందుకు ఎప్పుడైనా ప్రయత్నాలు జరిగాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఒకే మ్యాచ్, రెండు జట్లు
1896లో తొలి ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించినప్పుడు, క్రికెట్ కూడా అందులో భాగంగా ఉండాల్సి ఉంది. కానీ, అప్పుడు క్రికెట్ ఆడే జట్లు లేకపోవడంతో క్రికెట్‌ను తప్పించారు.
నాలుగు సంవత్సరాల తర్వాత 1900లో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చారు. కానీ, క్రికెట్ తో ఎటువంటి సంబంధం లేని ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ జరిగాయి. ఆ ఒక్కసారి మాత్రమే ఒలింపిక్స్‌లో క్రికెట్ చోటు దక్కించుకుంది.
పారిస్‌లో జరిగిన ఈ రెండో ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చిన 19 క్రీడల్లో క్రికెట్ ఒకటి.
అందులో నెదర్లాండ్స్, బెల్జియం, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ క్రికెట్ జట్లు పాల్గొన్నాయి.
కానీ అనుకోకుండా బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు ఈవెంట్ నుంచి తప్పుకున్నాయి. దీంతో, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో మిగిలాయి. ఇరు జట్ల మధ్య ఒకే మ్యాచ్ నిర్వహించారు. దాన్నే ఫైనల్ మ్యాచ్‌గా ప్రకటించారు. అప్పుడు ప్రతీ జట్టులో 12 మంది క్రికెటర్లు ఉండేవారు. మ్యాచ్‌ను ఇప్పుడు జరుగుతున్నట్లు 5 రోజులుగా కాకుండా కేవలం 2 రోజుల మ్యాచ్‌గానే నిర్వహించారు.
ఒలింపిక్స్‌లో పాల్గొన్న బ్రిటన్ జట్టు కూడా జాతీయ జట్టు కాదు. స్థానిక క్లబ్‌లకు చెందిన టీమ్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఫ్రాన్స్ జట్టులోనూ కొంతమంది బ్రిటన్ క్రీడాకారులే ఉండేవారు.
మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై బ్రిటన్ విజయం సాధించింది. కానీ విజేతలకు బంగారు పతకాన్ని ఇవ్వలేదు. బ్రిటిష్ జట్టుకు వెండి పతకం లభించగా, ఫ్రెంచ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. ఈఫిల్ టవర్ చిత్రాన్ని ఇరుజట్లకు జ్ఞాపికగా అందచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు ఇలా?
అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశమేంటంటే... ఈ రెండు జట్లకూ తాము ఒలింపిక్స్‌లో ఆడుతున్నట్లు తెలియదు. వారు ఫ్రాన్స్‌లో జరుగుతున్న వరల్డ్ ఫెయిర్‌లో భాగంగా క్రికెట్ ఆడుతున్నామని అనుకున్నారు.
ఈ మ్యాచ్‌ను 12 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ రికార్డుల్లో అధికారికంగా ధృవీకరించిన తర్వాత వారికి మ్యాచ్‌లో గెలుపొందిన బ్రిటన్‌కు పసిడి, ఫ్రాన్స్‌కు రజత పతకాలు అందించారు.
ఆ తర్వాత సెయింట్ లూయిస్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చాలని అనుకున్నారు. కానీ సరైన సంఖ్యలో జట్లు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకు క్రికెట్‌ను మళ్లీ ఒలింపిక్స్‌లో చేర్చలేదు.
"ఒలింపిక్ క్రీడలు మొదలైనప్పుడు, ఐదు రోజుల పాటు టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు సమయం కేటాయించలేకపోయి ఉంటారు. ఆ రోజుల్లో క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్‌లే. దాంతో, అన్ని రోజుల పాటు ఆట నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయడం కష్టం. అలాగే, ఆడటానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారా అనే సందేహం కూడా ఉండి ఉంటుంది. దాంతో, క్రికెట్ ఒలింపిక్ క్రీడల్లోకి చేరలేదు" అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ శరద్ కద్రేకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్స్‌లో కొత్త క్రీడల్ని ఎలా చేర్చుతారు?
100 కోట్లకు మందికి పైగా ప్రజలు క్రికెట్‌ను అభిమానిస్తున్నప్పటికీ, కొన్ని దేశాల్లో మాత్రమే ఇది పాపులర్ క్రీడగా పరిగణించబడుతోంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ను విపరీతంగా ఆరాధిస్తారు.
భారతదేశంలో క్రికెట్ ఒక మతం లాంటిది. కానీ, అంతర్జాతీయ స్థాయిలో కేవలం 10-11 దేశాలు మాత్రమే టెస్టు క్రికెట్ హోదా పొందాయి. కాబట్టి ఈ కొద్ది దేశాలే క్రికెట్ ఎక్కువగా ఆడుతుంటాయి.
భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమవుతుందా లేదా అని తెలుసుకునే ముందు, ఒలింపిక్స్‌లో ఒక కొత్త క్రీడను ఎలా చేర్చుతారో తెలుసుకోవాలి.
ఇటీవలే బేస్‌బాల్, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ లాంటి క్రీడలు ఒలింపిక్స్ క్రీడల స్థాయిని పొందాయి.
ఒలింపిక్స్ లో ఏయే క్రీడలు చేర్చాలనే అంశాన్ని గతంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయించేది. కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశానికి చెందిన ఒలింపిక్ నిర్వాహక కమిటీకి వదిలేసింది.

ఫొటో సోర్స్, Getty Images
'ఒలింపిక్ 2020 ఎజెండా' కార్యక్రమంలో భాగంగా ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది. యువతను ఎక్కువగా క్రీడల వైపు ఆకర్షించడమే ఈ కార్యక్రమం మొదటి లక్ష్యం.
టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా 3 క్రీడలను చేర్చాలని నిర్వాహక కమిటీ 2015లో ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనను ఐఓసీ 2016లో ఆమోదించింది. " క్రీడల్నియువతకు దగ్గర చేయాలన్నదే మా ఆకాంక్ష. ఇప్పుడు వారి ముందు ఎంతో అవకాశాలున్నాయి. వాటిని వదులుకొని వారంతట వారుగా యువత క్రీడల వైపు వచ్చేయడం కష్టమే. అందుకే మేం క్రీడల్ని వారికి దగ్గర చేయడానికి కొత్త మార్పులు చేస్తున్నాం. జపాన్ యువతలో ప్రాముఖ్యం పొందిన ఐదు క్రీడలను వినూత్నమైన మేళవింపుతో ఒలింపిక్స్‌లో చేర్చాం. ఇవి టోక్యో క్రీడలకు వారసత్వంగా నిలుస్థాయి" అని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ చెప్పారు.
ఆయా దేశాల నిర్వాహక కమిటీలు ఏయే క్రీడలను చేర్చాలో తెలిపేందుకు నియమావళి ఉంటుంది. ఆ ఆట నిర్వహణకు ఆ దేశంలో కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. అలాగే, ఆ దేశంలో ఆ క్రీడా సంస్కృతి కూడా ఉండాలి.
అందుకే, ఒక్కోసారి ఒలింపిక్ క్రీడల్లో చోటు సంపాదించిన క్రీడకు తర్వాత జరిగే ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్‌కు మరో అవకాశం దక్కుతుందా?
2024లో పారిస్ వేదికగా, 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా ఒలింపిక్స్ జరుగనున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో క్రికెట్‌కు ఆదరణ తక్కువే . కాబట్టి ఈ రెండు దేశాలు ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చడాన్ని నామినేట్ చేయకపోవచ్చు.
ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చొరవ తీసుకోవాలి. దీనికి క్రికెట్ ఆడే దేశాల బోర్డుల మద్దతు కూడా అవసరం. ఈ బోర్డులన్నీ కలిసి నిధులు సేకరించే ఒలింపిక్స్ ఆతిథ్య దేశాలకు అందించాలి. ఈ నిధుల కోసం ఆయా దేశాల బోర్డులు వారి ప్రభుత్వాలను నుంచి పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా కష్టతరమైన మార్గమే అవుతుంది.
2028లో లాస్ ఏంజెల్స్ క్రీడల్లో క్రికెట్ చేర్చడానికి ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఐసీసీ ఒలింపిక్ కమిటీని కూడా నియమించింది.
క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడల్లో చేర్చేందుకు తమ ప్రభుత్వాల నుంచి ఎంత ఆర్థిక మద్దతును కూడగట్టగలవో తెలపాల్సిందిగా ఐసీసీ తమ సభ్య బోర్డులను గతేడాది అక్టోబరులో కోరింది.
ఈ మేరకు క్రికెట్ బోర్డులకు ఐసీసీ ప్రశ్నావళి కూడా పంపింది.
గతంలో కూడా ఐసీసీ ఇలాంటి ప్రయత్నాలను చేసింది. కానీ, విజయవంతం కాలేదు. కానీ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడమే లక్ష్యంగా ఐసీసీ పోరాడుతోంది. క్రికెట్‌ను ఒలింపిక్స్ లో చేర్చడం ద్వారా క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా మరింత ఖ్యాతి లభిస్తుందని భావిస్తోంది.
ముఖ్యంగా క్రికెట్ వీక్షకులు కూడా పెరుగుతారని ఆశిస్తోంది. భారత ఉపఖండంలో అత్యధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులున్నట్లు ఐసీసీ చెబుతోంది.
ప్రపంచంలో 100 కోట్లకు పైగా క్రికెట్ అభిమానులుంటే.... అందులో 92 శాతం మంది భారత ఉపఖండంలోనే ఉన్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ ఆదరణ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి సహాయపడుతుందని ఐసీసీ భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒలింపిక్స్‌లో ఆడటం చూస్తామా?
బీసీసీఐకి ఒలింపిక్స్ పట్ల ఆసక్తి లేదా? అలాంటిదేమీ లేదని, శరద్ కద్రేకర్ అన్నారు.
క్రికెట్‌లో పతకాల కంటే కూడా, ఆర్థిక సమీకరణలు ప్రథమ పాత్ర పోషిస్తాయి.
క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం అయితే, క్రికెట్ బోర్డులు తమ అధికారాలను కోల్పోతాయి.
ఉదాహరణకు, ఒలింపిక్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు క్రికెట్ బోర్డుల పరిధిలో ఉండవు. దాంతో బోర్డుల ఆదాయం తగ్గిపోతుంది.
అలాగే, క్రికెట్ మ్యాచ్‌లలో పెట్టే పెట్టుబడిని కూడా వదులుకోవాల్సి వస్తుంది.
ఒకవేళ క్రికెట్ ఒలింపిక్స్ కు చేరిన పక్షంలో బిసిసిఐ, కేవలం, బి, సి, డి జట్టులను మాత్రమే ఒలింపిక్స్ లో ఆడేందుకు పంపిస్తుంది. మరీ ముఖ్యంగా ఒలింపిక్స్ షెడ్యూల్‌తో క్రికెట్ టోర్నీల షెడ్యూల్ కుదరదు. ఒకవేళ ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరినా.... వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని బీసీసీఐ బి, సి లేదా డి జట్లకు ఒలింపిక్స్‌కు పంపుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
"క్రికెట్‌కి తమకంటూ ఒక షెడ్యూల్, స్పాన్సర్లు, ప్రసార హక్కులు, నిర్వాహకుల వ్యవస్థ ఉంటుంది. కేవలం ఒలింపిక్స్‌లో పాల్గొనడం కోసం వీటన్నింటినీ వదులుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండదు'
బీసీసీఐ మాత్రమే కాకుండా, ప్రపంచంలో అతి పెద్ద బోర్డులైన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ కూడా ఎప్పుడూ క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలని ప్రయత్నించలేదు. బీసీసీఐ తరహాలోనే ఈ బోర్డులు కూడా ఆర్థిక ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాయి. కానీ ఈ పరిస్థితి మారవచ్చని కద్రేకర్ అన్నారు. 'ఈ దేశాలు ఒలింపిక్ పతకాల పట్ల అధిక ఆసక్తి కలిగి ఉండవచ్చు. అందుకే, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేరిస్తే బాగుంటుందనే భావన ఈ దేశాల్లోకూడా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలు ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని భావిస్తే ఐసీసీ ప్రయత్నాలకు ఊతమిచ్చినట్లవుతుంది. అలా జరిగిన పక్షంలో బీసీసై మరో మార్గాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది' అని వివరించారు.
ఒలింపిక్స్ విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలనే ప్రతిపాదనను తిరస్కరించలేదు. కానీ ఈ అంశానికి అధికారికంగా ఆమోదం తెలపలేదు. ఒకవేళ లాస్ ఏంజిల్స్ క్రీడల్లో క్రికెట్ భాగమైతే తమ పురుషుల, మహిళల జట్లను పంపిస్తామని బీసీసీఐ సూచనప్రాయంగా పేర్కొంది.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం భారత ఒలింపిక్ కమిటీకి బీసీసీఐ రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చింది.
'ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు సహకరించేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నం చేస్తుంది. భారత ఒలింపిక్ సంఘం, క్రీడా మంత్రిత్వ శాఖ కోరిక మేరకు బీసీసీఐ రూ. 10 కోట్లు ఆర్థిక సహాయం అందజేసింది" అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విశ్వ క్రీడల్లాంటి ప్రపంచ సంగ్రామాల్లో క్రికెట్ ఎప్పుడైనా పాల్గొందా?
2022లో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో ఆడేందుకు మహిళల క్రికెట్ జట్టును పంపించేందుకు బీసీసీఐ అంగీకరించింది.
కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ లాంటి ఈవెంట్‌లు విశ్వ క్రీడా సంగ్రామానికి వేదికలు. ఇవి వరల్డ్ కప్ లాంటి టోర్నీల కంటే చాలా భిన్నంగా ఉంటాయి.
క్రికెట్ ను 1998లో కౌలాలంపూర్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో ఆడారు.
ఇలాంటి మల్టీ ఈవెంట్ టోర్నీల్లో క్రికెట్ ఎప్పుడైనా పాల్గొందా అంటే అవుననే చెప్పాలి. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ చోటు దక్కించుకుంది. ఆ టోర్నీలో భారత్ నుంచి అజయ్ జడేజా, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. అదే సమయంలో మరో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది.
కానీ ఈ రెండు ఈవెంట్‌లలోనూ భారత్ అంచనాల మేరకు రాణించలేకపోయింది. కామన్వెల్త్‌లో క్వార్టర్స్‌లోనే భారత్ వెనుదిరిగింది. ఆ క్రీడల్లో దక్షిణాఫ్రికా జట్టు పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మరోసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కనబడలేదు.
2010, 2014 ఆసియా క్రీడల్లోనూ క్రికెట్‌ను చేర్చారు. కానీ అందులో భారత్ ప్రాతినిధ్యం వహించలేదు. 2010 ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ ఫార్మాట్ అయితే ఉత్తమంగా ఉంటుంది?
క్రికెట్‌లో ప్రస్తుతం టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్లు ఉన్నాయి. "ఒలింపిక్స్‌లోట టెస్టు మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యం. అలాంటి పెద్ద టోర్నల్లో వన్డేల నిర్వహణ కూడా కష్టమే అవుతుంది' అని కద్రేకర్ అన్నారు.
టీ20 ఫార్మాట్ అయితే ఒలింపిక్స్‌కు అనువుగా ఉంటుంది. ఐసీసీ కూడా దీనికోసం ప్రయత్నిస్తోంది. కానీ 'ది హండ్రెడ్' అనే ఫార్మాట్ కూడా ఈ మధ్య చర్యల్లో నిలుస్తోంది'
ఈ హండ్రెడ్ ఫార్మాట్ ఇంగ్లాండ్ లో పుట్టింది. అంటే ఇందులో ఇన్నింగ్స్‌లో కేవలం 100 బంతులు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. టీ20 ఫార్మాట్‌లో ఇన్నింగ్స్‌లో 120 బంతులు ఆడాల్సి ఉంటుంది.
యువతను ఆకర్షించేందుకు ఈ విధానాన్ని కనిపెట్టినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. ఇంగ్లండ్‌లోని 8 నగరాలకు చెందిన 8 పురుషుల జట్లు, 8 మహిళల జట్లతో ఈ టోర్నీని నిర్వహించారు. ఇందులో భారత్ నుంచి యువ బ్యాటర్ షఫాలీ వర్మ కూడా పాల్గొన్నారు.
ఈ ఫార్మాట్‌లో మహిళల జట్లకు కూడా పురుషుల జట్లతో సమానంగా ప్రైజ్‌మనీ అందజేస్తారు. పురుషులతో సమానంగా ప్రాధాన్యత లభిస్తుంది.
ఇప్పటికే క్రికెట్‌లో 3 ఫార్మాట్‌లు ఉండగా, కొత్తగా ఈ నాలుగో ఫార్మాట్ ఎందుకో అర్థం కావట్లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
"క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన టీ20 ఫార్మాట్ నుంచి 20 బంతులను తగ్గించి ఈ కొత్త విధానం ద్వారా ఏమి సాధిస్తారో, నాకు అర్థం కావడం లేదు" అని కద్రేకర్ అన్నారు.
బీసీసీఐతో పాటు ఇతర బోర్డులు టీ20 విధానాన్నే సమర్థిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్రీడాకారులు ఏమనుకుంటున్నారు?
ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చాలా వద్దా అనే అంశంపై ప్రస్తుత క్రీడాకారులెవరూ పెద్దగా మాట్లాడరు. కానీ మాజీ క్రీడాకారులు మాత్రం దీనిపై మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేరిస్తే, దాని ప్రాధాన్యత మరింత పెరుగుతుందని, మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బీబీసీ కార్యక్రమంలో అన్నారు.
"టీ20 ఫార్మాట్ అత్యధిక ఆదరణ పొందింది. క్రికెట్ అంటే అర్థం కాని వారు కూడా ఈ విధానాన్ని అర్థం చేసుకోగలరు" అని అన్నారు. .
కానీ, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మాత్రం క్రికెట్‌ను ఒలింపిక్స్ లో చేర్చేందుకు ఎందుకని ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని అన్నారు.
"క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలనడం అయోమయంగా ఉంది. ఎందుకు అంత ఒత్తిడి తెస్తున్నారు? ప్రపంచానికి క్రికెట్ గురించి తెలియదా? కొందరు 10 ఓవర్ల మ్యాచ్‌ల గురించి మాట్లాడుతున్నారు, మరి కొందరు హండ్రెడ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఎందుకు? వేరే క్రీడల కోసం ప్రయత్నాలు చేయవచ్చు కదా" అని ఆయన యూ ట్యూబ్ ఛానెల్ లో అన్నారు.
క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలా వద్దా అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ చర్చల పట్ల ఉత్సాహం, చురుకుదనం తగ్గిపోతాయి.
కానీ, క్రికెట్ అభిమానులు మాత్రం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత క్రికెటర్లు విరాట్, రోహిత్ శర్మ జాతీయ జెండా పట్టుకొని పరేడ్ నిర్వహించే రోజు కోసం ఎదురు చూస్తున్నారు.
Please wait...
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. కాంస్యం కైవసం చేసుకున్న బ్రిటన్
- టోక్యో ఒలింపిక్స్: భారత్ గెలిచిన, తృటిలో చేజారిన పతకాలు ఇవే
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








