ధోనీ ఎవరికీ భయపడడు ఎందుకు?

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ స్పోర్ట్స్ ప్రతినిధి

గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తన సారథ్యంలో గెలిచిన రెండు వరల్డ్ కప్‌లను ఆయన జీవితంలో మరచిపోలేని ఘట్టాలుగా ఆయన చెబుతున్నారు.

వీటిలో మొదటిది 2007లో దక్షిణాఫ్రికాలో గెలిచిన తొలి ఐసీసీ టీ-20 వరల్డ్ కప్. రెండోది భారత గడ్డపై 2011లో గెలిచిన వరల్డ్ కప్.

టీ-20 వరల్డ్ కప్‌ను గెలిచి భారత్‌కు వచ్చినప్పుడు ముంబయిలో విమానాశ్రయం నుంచి రోడ్డుకు రెండు వైపులా మైళ్ల తరబడి జనాలు గుమిగూడటాన్ని ఎప్పటికీ మరచిపోనని ధోనీ చెప్పారు. రెండోది 2011లో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ టైటిల్‌ కైవసం చేసుకునే సమయం దగ్గర పడినప్పుడు.. స్టేడియంలో అందరూ వందే మాతరం అంటూ గట్టిగా నినదించారు. ఆ సమయాన్ని కూడా మరచిపోలేనని ధోనీ అన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆగస్టు 15న గుడ్‌బై చెప్పి ధోనీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

యువరాజ్ సింగ్, ధోనీ

ఫొటో సోర్స్, BCCI

ఆయన సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతేకాదు ఆయన కెప్టెన్సీలోనే భారత క్రికెట్ జట్టు తొలిసారి ఐసీసీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

టెస్టు, వన్ డే, టీ-20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లలో ధోనీ ఎన్నో రికార్డులు సృష్టించారు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఆయన అందరికీ గుర్తుండిపోతారు.

మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్)లోనూ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఆయనకు మంచి పేరుంది. ఆయన సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్.. సూపర్ 4లో చాలాసార్లు చేరింది. మూడుసార్లు టైటిల్ గెలుచుకుంది. 2018లో అయితే, ధోనీనే స్వయంగా జట్టును విజయ తీరాలకు చేర్చారు.

సచిన్

ఫొటో సోర్స్, Reuters

ప్రపంచంలోని ఇతర కెప్టెన్లు, క్రీడాకారుల కంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ, ఆట ఎలా భిన్నమైనది? భారత జట్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా ధోనీ ఎలా మారాడు?

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై చెప్పే టైమింగ్ అద్భుతమైనదని క్రికెట్ విశ్లేషకుడు విజయ్ లోక్‌పల్లి అన్నారు.

‘‘సాధారణంగా ఇలాంటి ప్రకటనలు బీసీసీఐ ద్వారా అందరికీ తెలుస్తాయి. కానీ నేడు ఎవరికీ ఏమీ తెలియలేదు. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లే.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కూ తనే గుడ్‌బై చెప్పారు’’.

ధోనీ కెప్టెన్సీ.. అందరి కంటే భిన్నంగా, ఎలాంటి బెరుకూ లేకుండా ఉండేదని విజయ్ లోక్‌పల్లి అన్నారు. ‘‘ఆయన గెలుపు కోసం ఆడుతుంటారని అందరూ అంటుంటారు.. అది నిజమే. ఓటమి భయం లేకుండా ఆడే ట్రెండ్‌ను ఆయనే మొదలుపెట్టారు’’.

ధోనీ తన కెప్టెన్సీలో చాలా కొత్త ప్రయోగాలు కూడా చేసేవారు. కొత్త క్రీడాకారులకు అవకాశం ఇవ్వడంలో ఆయన వెనక్కి తగ్గేవారు కాదు. టైగర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సౌరవ్ గంగూలీ, ధోనీలలో.. ధోనీకి కెప్టెన్‌గా తనదైన స్థానముందని విజయ్ లోక్‌పల్లి అభిప్రాయం వ్యక్తంచేశారు.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

ధోనీ కెప్టెన్సీలో ప్రత్యేకతల గురించి మాట్లాడుతూ.. ''ధోనీ బాధ్యతను తీసుకుంటారు. కష్టమైన సమయాల్లోనూ ఆయన బౌలర్లకు మద్దతు ఇస్తారు. 2007 టీ-20 వరల్డ్ కప్‌ చివరి ఓవర్‌లో జోగీందర్ శర్మకు అవకాశమిచ్చి.. ఏం జరిగినా బాధ్యత నాదేనని ధోనీ చెప్పారు''

‘‘అందరు కెప్టెన్‌లూ ఇలానే అంటారు. కానీ ధోనీ మాత్రం ప్రతి క్షణమూ బాసటగా నిలుస్తారు. తమను ఒత్తిడికి గురిచేయడు, మోసం చేయడు అనే నమ్మకం క్రీడాకారుల్లో ధోనీ కల్పిస్తారు’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

‘‘ధోనీ చాలా చిన్న నగరం నుంచి వచ్చారు. అందుకే ఆయనకు ఆయనకు అన్నీ తెలుసు. కొత్త క్రీడాకారులపై చాలా ఒత్తిడి ఉంటుందని ఆయన అర్థం చేసుకునేవారు’’.

‘‘మొదటి నాలుగు వన్ డే మ్యాచ్‌లలో ఆయన మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అయితే విశాఖపట్నంలో పాకిస్తాన్‌తో ఆడిన ఐదో మ్యాచ్‌లో ఆయన చక్కగా ఆడి.. తానేం చేయగలడో ప్రపంచానికి ఆయన చూపించారు’’.

ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ''ఐపీఎల్ అనేది బీసీసీఐకి సొంత టోర్నమెంట్. అందుకే దానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన రెండు ప్రపంచ కప్‌లను గెలిపించారు. ఇంతకంటే పెద్ద విజయం ఏముంటుంది''అని విజయ్ అన్నారు.

‘‘ఐపీఎల్‌లో కావాలంటే పదిసార్లు అయినా గెలవొచ్చు.. కానీ ప్రపంచ కప్ గెలవడం అంటే ప్రపంచాన్నే జయించినట్లు. 1983 తర్వాత ప్రతిసారీ భారత్ ప్రపంచ కప్ గెలుస్తుందని అందరూ అనుకునేవారు. 2011లో ధోనీ సారథ్యంలోనే అది సాధ్యమైంది. అది కూడా ధోనీ అద్భుతమైన సిక్స్‌లు, షాట్‌లతో ఆ కల నెరవేరింది’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

2007లో జరిగిన టీ-20, 2011లో జరిగిన వరల్డ్ కప్‌లలో ధోనీ పాత్ర చాలా ముఖ్యమైనదని విజయ్ లోక్‌పల్లి అన్నారు. ''ధోనీ మొదట అండర్-19 ఆడారు. ఆ తర్వాత జోనల్ క్రికెట్ ఆడారు. చివరగా భారత క్రికెట్ జట్టులోకి వచ్చారు. ఆయన ఎప్పుడు భారత్ కోసం ఆడినా.. తన మొత్తం సామర్థ్యం, అనుభవాన్ని చూపించేవారు''

‘‘మిగతా క్రీడాకారులు కూడా దేశం కోసం ఆడతారు. కానీ ధోనీ కొంచెం భిన్నమైనవాడు. పోలీసులు, సైన్యంతో సమయం వెచ్చించడం ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు ధైర్యసాహసాలు అంటే కూడా ఇష్టమే. ఈ విషయాలన్నీ అందరూ గుర్తు పెట్టుకుంటారు. క్రికెట్ ఫీల్డ్‌లో ధోనీ ఇక కనిపించరు. ఆయన లోటు ఎప్పటికీ తీరదు. ఐపీఎల్‌లో మాత్రం కనిపిస్తారు’’.

ధోనీని అందరికంటే భిన్నంగా నిలబెట్టేది ఏమిటంటే.. ధోనీ తనకు నచ్చినట్లు ఆడేవారని విజయ్ వివరించారు.

‘‘పాకిస్తాన్‌పై సెంచరీ కొట్టాక, జట్టులో చోటు సంపాదించేందుకు ఆయనకు కెప్టెన్ లేదా సెలెక్టర్ల సాయం అవసరం కాలేదు. ప్రతి కెప్టెన్ కూడా ధోనీ తన జట్టులోఉండాలని అనుకునేవారు. సెలెక్టర్లు కూడా ముందు ధోనీ పేరు రాసేవారు. ఆ తర్వాతే మిగతా వారి పేర్లు రాసేవారు. ఇదే ధోనీ ప్రత్యేకత’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లను జట్టు నుంచి తొలగించే వివాదాల గురించి మాట్లాడుతూ.. ''వీటిలో ధోనీ పాత్ర గురించి మాట్లాడటం తప్పే. ఎందుకంటే జట్టును ఎప్పుడూ ఆయన ఒక్కడే ఎంచుకొనేవారు కాదు''అని విజయ్ అన్నారు.

‘‘బీసీసీఐ సెలెక్టర్లు ఈ పని చేసేవారు. రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్.. వారికి వారే ఈ నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు. సెహ్వాగ్ బ్యాటింగ్‌లో రన్‌లు రావడం ఆగిపోయాయి. తెందూల్కర్ అయితే 200 టెస్టు మ్యాచ్‌లు అయ్యాక విరమించుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు’’.

‘‘‘దీనికి భిన్నంగా ధోనీ చాలా మంది క్రీడాకారులకు వెంట నిలిచారు. అందరూ ధోనీ మాకెంతో సాయం చేస్తుంటారని బహిరంగంగానే చెబుతుంటారు’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

ధోనీ విషయంలో అంతా గోడపై రాత రాసినట్లు ఉండేదని మాజీ సెలెక్టర్, మాజీ బ్యాట్స్‌మెన్ అశోక్ మల్హోత్రా అన్నారు.

‘‘ఇదివరకటి ప్రపంచ కప్ తర్వాత ఒక్కసారి కూడా భారత జట్టులో ధోనీ లేరు. ధోనీ లేకుండా టీమ్‌ను తయారుచేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు’’.

‘‘వన్ డే మ్యాచ్‌లలో ధోనీ కంటే గొప్ప కెప్టెన్, ప్లేయర్, వికెట్ కీపర్ లేరని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికీ ఒక సమయం ఉంటుంది’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

ధోనీ లాంటి ప్లేయర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగలరని అశోక్ అన్నారు. ‘‘అయితే గత వరల్డ్ కప్ అయిన వెంటనే గుడ్ బై చెప్పుంటే బావుండేది’’.

‘‘అందరికీ తెలుసు ఐపీఎల్ కోసం ధోనీ ఎదురుచూస్తున్నారని. టీ-20 వరల్డ్ కప్‌లోనూ ఆయన సత్తా చాటుదామని అనుకున్నారు. అయితే కరోనావైరస్ వ్యాప్తితో టీ-20 వాయిదా పడింది.

ధోనీ రిటైర్మెంట్‌తో క్రికెట్‌లో ఒక శకానికి ముగింపు పడింది’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

ఒక కెప్టెన్‌గా ధోనీ పాత్ర గురించి మాట్లాడుతూ.. ''ఆయన ఒక మంచి కెప్టెన్. మొదటిసారి టీ-20, 1983 తర్వాత తొలిసారి ఐసీసీ వరల్డ్‌ కప్‌లను ఆయన సారథ్యంలోనే భారత్ గెలిచింది''అని అశోక్ అన్నారు.

''ఆయనలో ఎలాంటి లోపాలు కనిపించవు. ఆయనకొక అద్భుతమైన కెప్టెన్. శాంత స్వభావం కలిగిన ప్లేయర్ కూడా. ఆయన ఎప్పుడూ భావోద్వేగానికి గురికారు. వివాదాల జోలికీ పోరు''.

‘‘ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన క్రీడాకారులను చాలా అరుదుగా చూస్తాం. చాలా మంది కెప్టెన్లు, ప్లేయర్లు వచ్చిపోయారు. కానీ క్లిష్టమైన సమయాల్లోనూ ధోనీ ప్రశాంతంగా ఉండేవారు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ మంచివే’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. చెన్నై సూపర్‌కింగ్స్ ఆయన హోమ్ టీమ్ లాంటిదని అశోక్ అన్నారు.

‘‘చెన్నైకి చేరుకుంటే తన ఇంటికి వెళ్లినట్లు ఆయన భావిస్తారు. చెన్నై సూపర్‌కింగ్స్ ఆయనకు చాలా ఇష్టం. ఆయన కూడా ఆ జట్టులో బాగా ఆడతారు. ఆ జట్టును విజయవంతంగా నడిపించడం ధోనీకి మాత్రమే సాధ్యం అవుతుంది.’’

‘‘చెన్నై సూపర్‌కింగ్స్‌ను ధోనీ సూపర్‌కింగ్స్‌గా కూడా పిలుస్తుంటారు. ధోనీకి 50ఏళ్లు వచ్చేవరకూ తమతోనే ఉండాలని ఆ టీమ్ కోరుకుంటోంది’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

ధోనీని ఎలా భారత్ గుర్తించుకుంటుందో అనే విషయంపై అశోక్ మాట్లాడుతూ.. సునిల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, అనిల్ కుంబ్లేలను ఆయన ఉదహరించారు.

''ధోనీ ఆ స్థాయిలో కనిపించకపోవచ్చు. కానీ ఆయనలో ఉండే పట్టుదల, ఆయన సాధించిన విజయాలను చూస్తే.. భారత్‌లోని టాప్ 4 ప్లేయర్లలో ఆయనకు చోటు దక్కుతుంది''

ధోనీ కెరియర్ అద్భుతంగా సాగిందని మాజీ సెలక్టర్, మాజీ క్రికెటర్ మదన్ లాల్ వ్యాఖ్యానించారు. భారత జట్టు అత్యత్తుమ కెప్టెన్ ధోనీనే అని ఆయన చెప్పారు.

‘‘భారత్‌కు ఎన్నో వన్ డేలు, టెస్టులను ధోనీ గెలిపించారు. అంతా మౌనంగా పనిచేసుకు పోవడమే ధోనీ ప్రత్యేకత. అందుకే ఆయన్ను కెప్టెన్ కూల్‌గా అభివర్ణిస్తారు’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట అని మదన్ వ్యాఖ్యానించారు. ''జట్టును నడిపించడంలో ఆయనకు సాటిలేరు. యువ క్రికెటర్లతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. మీడియాను ఎలా చూడాలో ఆయనకు బాగా తెలుసు''

‘‘ఐపీఎల్ కెప్టెన్సీ విషయానికి వస్తే.. టీ-20లో టీమ్‌ను ఎలా నిర్మించాలో ధోనీకి తెలుసు. చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఆయన అలానే నడిపించారు. అందుకే ఆ టీమ్.. ఆయన్ను వదులుకోలేకపోతోంది’’.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

మిగతా కెప్టెన్ల కంటే ధోనీ ఎలా భిన్నమైన వాడంటే.. ''ఏ దేశానికైనా నిరంతరంగా మంచి ప్రదర్శనలు ఇవ్వడం చాలా ముఖ్యం. ధోనీ దీనిలో దిట్ట''అని మదన్ అన్నారు.

‘‘1983 ప్రపంచ కప్ తర్వాత గెలుపు మనకు చాలా ముఖ్యం. ధోనీ మొదట టీ-20 వరల్డ్ కప్ గెలిచారు. ఆతర్వాత 2011 వరల్డ్ కప్ కూడా తెచ్చిపెట్టారు’’.

‘‘నేడు అంతర్జాతీయ స్థాయిలో చూస్తే.. క్రికెట్‌లో భారత్ మంచి స్థానంలో ఉంది. ఈ క్రెడిట్ మొత్తం సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీలకే వెళ్తుంది. వీరు భారత్‌కు గెలవడం నేర్పించారు. ఎవరికీ ఓడిపోయే జట్టు ఇష్టం ఉండదు’’.

ధోనీని ఒక కెప్టెన్‌గా, ఒక గొప్ప బ్యాట్స్‌మన్, మ్యాచ్‌లను గెలిపించే ప్లేయర్‌గా అందరూ గుర్తుంచుకుంటారని మదన్ చెప్పారు.

महेंद्र सिंह धोनी

ఫొటో సోర్స్, BCCI

ధోనిని చూసినప్పుడుల్లా 2011 వరల్డ్ కప్‌లో సిక్స్‌తో ధోనీ భారత జట్టును గెలిపించిన ఘట్టమే తనకు పదేపదే గుర్తుకు వస్తుందని భారత జట్టు మాజీ కెప్టెన్ సునిల్ గవాస్కర్ చెబుతుంటారు.

ఓ ప్లేయర్‌కు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)