ధోనీలా హెలికాప్టర్ షాట్ ట్రై చేసి చేయి విరగ్గొట్టుకున్నాను: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్

ఫొటో సోర్స్, Getty Images

'ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'లో టైటిల్ రోల్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆ సినిమా విడుదలకు ముందు 2016 సెప్టెంబరులో ‘బీబీసీ’ ఇంటర్వ్యూ చేసింది.

ఆ సందర్భంగా సుశాంత్ అనేక అంశాలపై మాట్లాడారు. సినిమా కోసం ధోనీలా హెలికాప్టర్ షాట్ ట్రై చేసి తనకు ఏకంగా ఫ్రాక్చర్ అయిందని చెప్పారు.

బీబీసీ: ధోనీ అవడం ఎంత కష్టం అంటారు?

సుశాంత్: చాలా కష్టం.. క్రికెట్ వస్తే చాలు, ఆయనలా ఆడితే ధోనీ అయిపోవచ్చు అనుకుంటారు చాలామంది. కానీ ధోనీని నిర్వచించేవి అతడి ఆలోచనలు, తన ఆలోచనా పద్ధతి. మనం మన జీవితంలో ఎన్నో అనుకున్నా, ఎప్పుడూ చేయం. ఎంఎస్‌లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే.. తను ఎప్పుడెలా ఉండాలో అలా ఉంటారు. ఏదైనా నా చేతి నుంచి జారిపోతుందేమో, ఏదైనా అవుతుందేమో అని అతడిలో భయం ఉండదు. తను ఎంత క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటాడంటే, వాటివల్లే అతడు ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ సన్నద్ధంగా ఉంటారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బీబీసీ: ఎక్కువ కష్టంగా ఏది అనిపించింది. ధోనీలా యాక్టింగ్ చేయడమా? ధోనీలా క్రికెట్ ఆడటమా?

సుశాంత్: ధోనీలా యాక్టింగ్ చేయడమే.. ఎందుకంటే నేను ధోనీలా యాక్టింగ్ చేయాలనుకోలేదు. నేను నా ప్రిపరేషన్‌లో ధోనీ మొత్తం మానరిజమ్స్, ఆలోచించే పద్ధతి, క్రికెట్ షాట్స్ అన్నిటిలో నేను తనలాగే ఉండేలా సిద్ధం కావాలనుకున్నా. మొదటి రోజు, మొదటి షాట్ తీసే ముందు నా మనసులో నేనే ధోనీ అనుకున్నా..

బీబీసీ: మీకు హెలికాప్టర్ షాట్ కష్టం అనిపించిందా, వికెట్ కీపింగ్ చేయడం కష్టమైందా?

సుశాంత్: రెండూ చాలా కష్టం. వికెట్ కీపింగ్ పొజిషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాడీకి అలా ఉండడం సాధ్యం కాదు. వెంటనే దూసుకొచ్చే బాల్ పట్టుకోకపోతే దెబ్బ తగులుతుంది. నాకు కిరణ్ మోరే సర్ డే అండ్ నైట్ నాకు శిక్షణ ఇచ్చారు. రెండు, మూడు బాల్స్ తో నేను కీపింగ్ చేసేవాడ్ని. నడుం నొప్పి కూడా మొదలైంది. దానికి అలవాటుపడ్డానికి కొంతకాలం పట్టింది.

ఇక, హెలికాప్టర్ షాట్ ఎందుకు కష్టం అంటే, నాలుగైదు రోజులు గ్రౌండ్ లో ఆడాక మొదటిసారి హెలికాప్టర్ షాట్ ట్రై చేశా. ఆ షాట్ కొడుతుంటే బాల్ బాగా వెళ్లేసరికి పది, పన్నండు షాట్స్ కొట్టాను. తిరిగి ఇంటికి చేరాక నొప్పి మొదలైంది. తర్వాత ఎక్స్-రేలో ఫ్రాక్చర్ ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే అది ఎంత స్ట్రాంగ్ మూమెంట్ అంటే షాట్‌ అడ్డుకుని ఆడుతాం..అందుకే నాకు ఫ్రాక్చర్ అయ్యింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: ధోనీతో ఏమేం మాట్లాడేవారు?

సుశాంత్: ఆయనతో షూటింగ్‌కు ముందు చాలాసేపు మాట్లాడేవాడిని, ధోనీతో కూర్చుని మాట్లాడుతుంటే, తను బాగా మనసు విప్పి మాట్లాడేవాడు.

బీబీసీ: ధోనీకి సంబంధించి ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పండి?

సుశాంత్: గూగుల్లో అన్నీ ఉన్నాయి. కానీ, నేను నా అనుభవం ఒకటి చెప్పాలనుకుంటున్నా. మొదటిసారి కలిసినప్పుడు..కాసేపు మాట్లాడుకుని బ్రేక్ తీసుకున్నప్పుడు 'మీరు బ్యాట్ ఎలా పట్టుకుంటారు' అని అడిగా. నేను ఆయనకు పది పన్నెండేళ్లుగా పెద్ద అభిమానిని. అక్కడ నా కళ్ల ముందు ఎంఎస్ ధోనీ.. బ్యాట్ ఇలా పట్టుకోవాలి, ఇలా కొట్టాలి అని చెబుతుంటే.. నేను అలా చూస్తుండిపోయా.. ఇది నిజమేనా అనుకున్నా..

బీబీసీ: ఈ సినిమాలో మీకు నవ్వు తెప్పించిన విషయాలు ఏవైనా ఉన్నాయా?

సుశాంత్: ఆ.. సినిమాలో ఒక సీన్ ఉంది. రంజీ ఫైనల్ మ్యాచ్. ఎంఎస్ ధోనీ, యువరాజ్ టీమ్స్ మధ్య జరుగుతుంది. దానిని చాలా బాగా చూపించారు. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఒక్కడే, ధోనీ టీమ్ చేసిన స్కోర్ కంటే రెండు పరుగులు ఎక్కువ చేస్తాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బీబీసీ: అప్పటి జార్ఖండ్ ధోనీలా, ఇప్పటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించడం ఎంత కష్టంగా అనిపించింది?

సుశాంత్: అదేం కష్టం కాదు, మనం ఫిగరౌట్ చేస్తూనే ఉంటాం. ఆ పాత్ర చేయడానికి ఎక్సైట్ అవుతాం. మనకు అర్థంకాని వాటిలో పర్ఫెక్షన్ తీసుకురావడాన్ని ఫిగరౌట్ చేయడంలో, ప్రిపరేషన్, షూట్‌లో రోజులు గడిచిపోతాయి. అలాంటి వ్యక్తిగత అనుభవం మనకు రాత్రి నిద్రకూడా పట్టనీకుండా చేస్తుంది. బయటివారికి ఎన్ని రోజులుగా కష్టపడ్డాడేమో అనిపిస్తుంది. కానీ మనకు కష్టపడినట్లే తెలీదు.

బీబీసీ: ఈ సినిమా ద్వారా ఒక క్రికెటర్ జీవితం గురించి మీకు తెలిసన కొత్త విషయం ఏంటి?

సుశాంత్: ఈ గేమ్ ఎంత కష్టమో తెలిసింది. వచ్చే ప్రతి బాల్ అంతకు ముందు కంటే భిన్నంగా ఉంటుంది. వాంఖడేలో వరల్డ్ కప్ ఫైనల్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు చుట్టూ భారీగా జనం ఉన్నారు. వారందరినీ చూడగానే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

నిజంగా వరల్డ్ కప్ ఫైనల్ నడుస్తుంటే.. 0.10 సెకన్లలో బాల్ రాగానే, పాయంట్ 0.10 సెకన్లలో మనం నిర్ణయం తీసుకుని, దాన్ని కొట్టాల్సుంటుంది. కానీ, మనం మాత్రం హాయిగా ఇంట్లో కూచుని, అబ్బా అలా ఆడుండాల్సింది, అదేంటి అలా కొట్టాడు అంటూ ఉంటాం. నాకు ఇప్పుడు క్రికెటర్స్ అంటే గౌరవం పెరిగింది.

బీబీసీ: ఎంఎస్.ధోనీ, డైరెక్టర్ నీరజ్ పాండేలకు కోపం ఎక్కువ. వాళ్లతో పనిచేయడం కష్టంగా అనిపించలేదా?

సుశాంత్: నేను కూడా అలాంటి వాడినే కదా. నేనేం కోపిష్టిని కాదు కానీ, సీరియస్‌గా ఉంటాను. సీరియస్‌గా ఉండేవాళ్లు చాలా తక్కువగా మాట్లాడతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)