ధోనీకి గంగూలీకి తేడా అదే - ఎడిటర్స్ కామెంట్

టీమిండియా

ఫొటో సోర్స్, BCCI

    • రచయిత, జీఎస్ రామ్మోహన్
    • హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు

అంతర్జాతీయ క్రికెట్ యవనిక నుంచి ఒక తార నిష్క్రమించింది. అది ఆధునిక క్రికెట్‌కు తళుకుబెళుకులద్దిన తార, క్రికెట్‌లోని వినోదపు ఎలిమెంట్‌ను డ్రమెటిక్‌గా పెంచేసిన తార.

తాను కామ్‌గా ఉంటూ టీమ్‌లో అగ్రెసివ్‌నెస్ నింపిన వ్యూహకర్త. ఆగస్టు 15 సంబరాల మధ్యలో సైలెంట్‌గా రెండు లైన్లతో వీడ్కోలు చెప్పేశాడు ధోనీ. టిపికల్ ధోనీ స్టైల్. లెజెండా సెలబ్రిటీయా అనే గొడవ లేదు. ధోనీ ఆ రెండూ. మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ గ్రేటెస్ట్ ఇండియన్ కెప్టెన్, గ్రేట్ ఫినిషర్. మూడు ప్రధానమైన ఐసీసీ ట్రోఫీలూ తెచ్చిపెట్టిన ఏకైక నాయకుడు అనొచ్చు గానీ అవి మాత్రమే కాదు. తనకు పర్యాయపదంగా మారిపోయిన హెలికాప్టర్ షాట్ మాత్రమే కాదు. ధోనీ ప్రాధాన్యం అంతకు మించినది.

భారత్‌లోనూ దూరాన్ని కిలోమీటర్లలో కాకుండా ప్రయాణానికి పట్టే సయమంతో కొలవడం మొదలైన కాలానికి ప్రతినిధి ఎంఎస్ ధోనీ.

వన్డేలకు కూడా ఓపిక లేని, టైం లేని తరం తయావుతున్న కాలంలోనే తయారైన క్రికెటర్. ఓవర్‌కు ఆరుపరుగులు అనే రిక్వైర్డ్ రన్ రేట్ కూడా చిన్నదైపోయిన బ్యాట్స్‌మన్ గేమ్ కాలానికి నాయకుడు.

క్రికెట్ ఫార్మాట్లో మార్పులు అతణ్ని చూసే చేశారా అన్నంత సూటబుల్ బాయ్. మారిన క్రీడకే కాదు, ఈ కాలంలో పెరిగిన క్రీడా మార్కెట్‌కు కూడా.

ధోనీ

ఫొటో సోర్స్, Bcci

ముంబయి నుంచే కాదు రాంచీ నుంచీ హీరోలు వస్తారు

క్రికెట్లో ముంబయి ఆధిపత్యం ఇంకానా? ఇకపై సాగదు.. అని గట్టిగా ప్రపంచానికి చాటి చెప్పిన వాడు ధోనీ.

కేంద్రం అనేది అంచులకు విస్తరిస్తున్నపుడు ఆ అంచుల్లోంచి కమ్ముకొచ్చి ఇదిగో మేమున్నాం భవిష్యత్తు మాదే అని చాటి చెప్పినవాడు, భరోసా నింపిన వాడు ధోనీ. అతను ఈ కోవలో మొదటివాడని కాదు. కానీ ఆ ధోరణికి సమర్థమైన ప్రతినిధి. వ్యక్తి, సమష్టి అని వేరేగా మాట్లాడుకోవచ్చు కానీ ఎదుగుతున్న దేశానికి ఎదుగుతున్న తరానికి ఐకాన్స్ అవసరం. హీరోలవసరం. హీరోలు ఎప్పుడూ పెద్ద పెద్ద నగరాలనుంచే రానక్కర్లేదు అని కొమ్ముబూర ఊది ప్రపంచానికి చాటిన ఝార్ఖండ్ బిడ్డ. ఎవరైనా ఎక్కడినుంచైనా వచ్చి బ్లూ క్యాప్ పెట్టుకోవచ్చు అని నమ్మకాన్ని పెంచాడు.

తెల్లవారితో ఇక్కడున్న రాజులు, నవాబులు జట్టుగా మొదలైన కులీన క్రీడ జన సామాన్యంలోకి కిందకు దిగి అంచులదాకా చేరడమనే ప్రక్రియ ధోనీతో పూర్తయ్యినట్టు లెక్క.

కేంద్రం పట్ల అంచులలో ఉండే భయాన్ని అతను పొగొట్టాడు. అదొక్కటే కాదు, జట్టులో ఛేజింగ్ పట్ల ఉండే భయాన్ని పోగొట్టాడు. అతనొచ్చే టైంకు టీం కూడా అందొచ్చింది.

గంగూలీ నాయకత్వంలో మొదలైన అగ్రెసివ్ ఎలిమెంట్ ధోనీ నాయకత్వంలో మరింత పదునెక్కింది.

అంతకుముందు నాయకుడు చొక్కా విప్పి దూకుడు చాటితే మౌనంతోనూ అగ్రెసివ్ నెస్ చూపించినవాడు ధోనీ. స్టైల్స్ వేరయినా ఫలితమొక్కటే.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

తొణకడు, బెణకడు

గెలిచినపుడు విపరీతంగా పొంగిపోయి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, ఓడినపుడు ముఖం చాటు చేసుకుని ఏమోమో అయిపోవడం లాంటి పోకడలకు భిన్నంగా ఆటలో జయాపజయాలను ఒకింత సంయమనంతో చూడడం నేర్చిన. నేర్పిన నాయకుడు ధోనీ. కప్‌లు గెల్చినపుడు కూడా తాను హడావుడి పడకుండా ఇతరుల చేతుల్లో పెట్టి కెమెరా ఫోకస్ నుంచి పక్కకు తప్పుకోగలిగిన స్థిరచిత్తుడు. అతను జట్టుకు భరోసా. పడవ మునుగుతున్నపుడు కూడా అతనున్నాడు కదా అని ఎన్నిసార్లు ఎన్ని ఇన్నింగ్సుల్లో ఆశలు కలిపించాడో. ఒక్కోసారి మానవాతీతమైన స్థాయిలో కూడా. హీరోయిజంతో ఉండే సమస్య అది. అభిమానుల దృష్టిలో అది సాధారణ బ్యాట్ కాదు. మంత్రదండం. నువ్వు నిరంతరంగా మ్యాజిక్ క్రియేట్ చేయాల్సిందే.

అయితే హీరోకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నీ ప్రైమ్ టైంను మాత్రమే కోరుకుంటుంది. కొంచెం అటూ ఇటయ్యాక అది గుర్తించి తప్పుకోవడం ఉత్తమం.

ఎంతటి హేమాహేమీలకు కూడా అది సులభమైన పని కాదు. పెరిగిన వయసును, తరిగిన శక్తిని అంగీకరించడం కష్టం. అలాగే లైమ్ లైట్‌తో ముడిపడిన అనేకానేక వ్యాపారాలు దాన్ని అనుమతించవు.

ధోనీ

ఫొటో సోర్స్, Bcci

వయసుడిగిన, లేదా శక్తి సన్నగిల్లిన సినీ హీరో ఏవో తిప్పలు పడి ఇతరత్రా విభాగాల అండతో నిలబడొచ్చు. క్రీడల్లో ఆ వెసులుబాటు లేదు. తన సీనియర్లలోని కొందరు ఛాంపియన్ల లాగే ధోనీ కూడా ఎక్స్‌పైరీ డేట్ తర్వాత కూడా కొనసాగే ప్రయత్నం చేశాడు. దాని ఫలితం రుచిచూశాడు.

దేవుడంటే ఇలాగే ఉంటాడు అని పొగిడిన నోళ్లతోనే విపరీతంగా తిట్టించుకోవాల్సి వచ్చిన వరల్డ్ కప్ ఇన్నింగ్స్ దానికి ప్రతీక. తర్వాత సాగిన ఇంగ్లండ్, ఆస్ర్టేలియా టూర్లు కూడా. సోషల్ మీడియా యుగంలో జడ్జిమెంట్ రెండులైన్ల సెటైర్. ప్రజాభిప్రాయం తక్షణత మీద ఆధారపడిన ట్రోలింగ్. క్రీడావిజయాలను దేశభక్తికి సంకేతంగా మార్చుకుని ఆ రకంగా వినోదాన్ని ఎమోషనల్ ఎలిమెంట్ ను పరిధులు దాటి కలిపేసుకున్న వారికి దీర్ఘకాలపు కంట్రిబ్యూషన్‌ను గుర్తించే ఓపిక ఉండదు.

కరోనా సీనియర్లను ఎంత మాత్రం కనికరించడం లేదు. కనీసం ఆస్ర్టేలియాలో టీ20 ఆడాలన్న ధోనీ ఆశలపై నీళ్లు చల్లింది కరోనానే.

ఏ వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టిన సిక్స్‌తో ప్రపంచం దృష్టిని అందరి ముఖాలను తనవైపే తిప్పుకున్నాడో అదే ప్రపంచకప్ టోర్నీలో వాళ్లు ముఖాలు తిప్పేసుకునేలా చేసుకున్నాడు. అది ఒకానొక ఇన్నింగ్స్, బ్యాడ్ డే అనుకోవడానికి వీల్లేదు. అప్పటికే సాగుతూ ఉన్న కెరీర్‌కు ఇక చాలు అనిపించిన ఉదంతం.

అంతకుముందు రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగినా బీపీ పెరక్కుండా ఉండేలా అతని ఆట ఉండేది. కొద్ది సందర్భాల్లో విఫలమైనా ఎక్కువ సార్లు అతని మ్యాజిక్ పనిచేసేది. ఇపుడిట్లా ఆడతాడు కానీ మావాడు లేస్తాడు చూడూ అని అభిమానులు ఎదురుచూసేట్టు ఉండేది.

పాత సినిమాల్లో హీరో ముందు దెబ్బలుతిని తర్వాత నెత్తుటిని తుడుచుకుంటూ ఎదుటివారిని చిత్తుచిత్తుగా కొట్టేస్తాడు చూడూ, అట్లాంటి ఆనందం ఉండేది.

శ్రీనివాసన్‌తో ధోనీ

ఫొటో సోర్స్, Pti

రెండు మూడేళ్లుగా బండి రివర్సులో నడుస్తోంది. దాని లాజికల్ ఎండ్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ మీద ఆడిన మ్యాచ్. నా తర్వాత డిపెండబుల్ బ్యాట్స్‌మన్ లేరు అనే లాజిక్ కొంతవరకే పనిచేస్తుంది.

ఆస్కింగ్ రన్ రేట్ 20 దాకా పోయినా ఏమో అనుకోవచ్చేమో కానీ ఆస్కింగ్ రన్ రేట్ 40 దాకా తీసికెళ్లడం ఏ లాజిక్‌కూ అందనిది. అయిపోయింది. ఖేల్ ఖతమ్. ఆ తర్వాత వెలుగు కాదు, కొనసాగింది పాత వెలుగు తాలూకు నీడే. అయితే ఈ వెలుగు నీడల మధ్య రేఖను చూడలేకపోయినవాడు ధోనీ ఒక్కడే కాదు. సచిన్ దగ్గర్నుంచి దిగ్గజాల లిస్ట్ ఉంది ఆయన వెనుక. అదేమీ ధోనీ ఘన కీర్తిని మసకబార్చేంత పెద్దది కాదు. వివాదాస్పదుడైన శ్రీనివాసన్‌తో సాన్నిహత్యం గొడవ ఉంది కానీ దాని మంచిచెడ్డలేమిటో పూర్తిగా బయటకు రాలేదు.

ఓవరాల్‌గా ధోనీ సుదీర్ఘ కెరీర్ చూసినపుడు అతని కంట్రిబ్యూషన్ కొండలాగా ఉంటుంది, జట్టుకు కొండంత అండలాగా ఉంటుంది.

యువరక్తం నిబ్బరంగా తమ ఆట తాము ఆడేలా భూమిక ఏర్పాటు చేసిన నాయకత్వ సామర్థ్యం ఆధునిక క్రికెట్ చరిత్రలో నిలిచిఉంటుంది. స్టీరియోటైపుని ధిక్కరించి సొంత బాట వేసుకుని దాన్ని హైవేగా మార్చిన క్రీడా దారిదీపం ధోనీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)