'తాలిబాన్లు కూడా సాధారణ ప్రజలే, కాబుల్ ఇప్పుడు సురక్షిత నగరంగా మారింది' - రష్యా

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పీటర్ కోజ్లోవ్, అన్నా రిండా
- హోదా, బీబీసీ న్యూస్
అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్రమించడంపై ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి.
అమెరికాతోపాటు కొన్ని ఐరోపా దేశాలు వెంటవెంటనే తమ పౌరులను తమ దేశాలకు తీసుకొని వెళ్లిపోయేందుకు కాబుల్‌కు వచ్చాయి.
కానీ తాలిబాన్ల ఆక్రమణపై ఎలాంటి ఆందోళనా వ్యక్తంచేయని చాలాకొన్ని దేశాల్లో రష్యా కూడా ఒకటి.
తాలిబాన్లు కూడా ‘‘సాధారణ ప్రజలే’’అని రష్యా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించారు. అంతేకాదు నేడు కాబుల్ సురక్షితమైన నగరంగా మారిందని వారు చెబుతున్నారు.
తాలిబాన్లు అఫ్గాన్‌ను ఆక్రమించడం అనేది వాస్తవమని, దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం ముందుకు అడుగులు వేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం వ్యాఖ్యానించారు.
1980ల్లో తొమ్మిదేళ్లపాటు కొనసాగిన యుద్ధంతో పోలిస్తే నేడు అఫ్గాన్‌లో పరిస్థితులు చాలా భిన్నమైనవి. ఆనాడు ఇక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్లతో అలా..
కాబుల్‌లోని తమ దౌత్య కార్యాలయాలను చాలా దేశాలు మూసివేశాయి. అయితే తమ దౌత్య కార్యాలయం తెరిచే వుంటుందని రష్యా స్పష్టంచేసింది.
తాలిబాన్ల విషయంలో రష్యా భిన్నంగా ఆలోచిస్తోంది. కొన్నిసార్లు వారిని ప్రోత్సహించేలానూ వ్యవహరిస్తోంది.
కాబుల్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న 48 గంటల్లోనే తాలిబాన్ ప్రతినిధులతో అఫ్గాన్‌లోని రష్యా రాయబారి దిమిత్రీ జిరనోవ్ చర్చలు జరిపారు. సమావేశం అనంతరం వారిపై ప్రతీకారం తీర్చుకొనే ఉద్దేశమేదీ తమకు లేదని జిరనోవ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితిలోని రష్యా రాయబారి వెసిలీ నెబెంజియా స్పందిస్తూ.. ‘‘అఫ్గాన్‌లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. చట్టాలకు అనుగుణంగా పాలనను మళ్లీ పునరుద్ధరించారు. రక్త పాతానికి ముగింపు పలికారు’’అని వ్యాఖ్యానించారు.
‘‘ఇదివరకటి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తోలుబొమ్మ ప్రభుత్వంతో కంటే తాలిబాన్లతో చర్చలు జరపడం తేలిక’’అని అఫ్గాన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక రాయబారి జమీర్ కాబులోవ్ వ్యాఖ్యానించారు.
తాలిబాన్లు కాబుల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే.. నగదు, నాలుగు కార్లు, హెలికాప్టర్‌తో ఘనీ పరారయ్యారని మొదట చెప్పింది రష్యా దౌత్యవేత్తలే. అయితే, ఈ ఆరోపణల్లో నిజంలేదని ఘనీ ఖండించారు.

ఫొటో సోర్స్, Getty Images
మెరుగుపడుతున్న సంబంధాలు
అఫ్గాన్ పాలకులుగా తాలిబాన్లను గుర్తించేందుకు రష్యా సిద్ధమైనట్లు కూడా కనిపించడం లేదు. అయితే, రష్యా ప్రతినిధుల వ్యాఖ్యల్లో మాత్రం తాలిబాన్లపై మెతక వైఖరి స్పష్టం అవుతోంది.
తాలిబాన్ల గురించి వార్తలు ప్రచురించే సమయంలో.. ఉగ్రవాది అనే పదానికి బదులు ‘‘అతివాది’’ అనే పదాన్ని రష్యా వార్తా సంస్థ టాస్ ఉపయోగిస్తోంది.
చాలా ఏళ్ల నుంచీ తాలిబాన్లతో రష్యా చర్చలు జరుపుతోంది. రష్యా నిషేధించిన ఉగ్రవాద సంస్థల జాబితాలో తాలిబాన్ కూడా ఉంది. అయితే, 2018 నుంచి తాలిబాన్లు రష్యాతో చర్చలు జరిపేందుకు మాస్కోకు వెళ్తున్నారు.
రష్యా అధ్యక్షుడి రాయబారి జమీర్.. తాలిబాన్లను ప్రోత్సహిస్తున్నారని ఘనీ ప్రభుత్వం పదేపదే ఆరోపించేది. రష్యా, తాలిబాన్ల మధ్య మూడేళ్లపాటు కొనసాగిన చర్చల్లో ఘనీ ప్రభుత్వానికి ఆహ్వానం కూడా లేదు.
ఈ చర్చలను అమెరికా జాగ్రత్తగా గమనించేది. ఆగస్టు 2017లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిలెర్సన్ అయితే, తాలిబాన్లకు రష్యా ఆయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను రష్యా ఖండించింది.
‘‘ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని మేం అమెరికా మిత్ర దేశాలను అడిగాం. వారు ఎలాంటి ఆధారాలూ చూపించలేదు. మేం తాలిబాన్లకు ఎలాంటి సాయమూ చేయలేదు’’అని రష్యా విదేశాంగ శాఖ అప్పట్లో వ్యాఖ్యనించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తాలిబాన్లను రష్యా అధ్యక్షుడి అఫ్గాన్ రాయబారి జమీర్ ప్రశంసించారు. ‘‘దోహా ఒప్పందానికి అనుగుణంగా తాలిబాన్లు నడుచుకుంటున్నారు. ఘనీ ప్రభుత్వమే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఘనీ ప్రభుత్వం అసహనం వ్యక్తంచేసింది.

ఫొటో సోర్స్, LOS ANGELES TIMES/GETTY
ప్రాంతీయ భద్రత విషయంలో..
తాలిబాన్లతో దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ, పూర్తిగా వారికి ఆహ్వానం పలికేందుకు రష్యా సిద్ధంగా లేదు. కాబుల్‌లో పరిణామాలను రష్యా చాలా నిశితంగా గమనిస్తోంది.
మరోవైపు తాలిబాన్లను ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి కూడా రష్యా తొలగించలేదు. ‘‘శాంతి, భద్రతలను పరిరక్షిస్తామని చెబుతున్న తాలిబాన్లు తమ మాటలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా పొరుగు దేశాల్లోకి ఉగ్రవాదులు చొరబడకుండా అడ్డుకుంటారని భావిస్తున్నాం’’అని పుతిన్ వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతాల్లో సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని రష్యా తన వ్యూహాలను సిద్ధంచేస్తున్నట్లు కనిపిస్తోంది. మధ్య ఆసియాలోని తమ మిత్ర దేశాల్లోకి ఉగ్రవాదులు చొరబడకుండా, మాదకద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా రష్యా ముందుకు వెళ్తోంది.
9/11 దాడుల అనంతరం తాలిబాన్లపై అమెరికా దాడులను మొదట్లో రష్యా స్వాగతించింది. అయితే, క్రమంగా రష్యా తమ వ్యూహాలను మార్చుకుంటూ వచ్చింది.
మధ్య ఆసియాలోని తమ మిత్ర దేశాలైన ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్‌లకు ధైర్యమిచ్చేందుకు ఈ నెల మొదట్లో ఆయా దేశాల్లో రష్యా సైనిక విన్యాసాలు కూడా చేపట్టింది.
మరోవైపు అఫ్గాన్‌లో తాము అధికారంలోకి వచ్చినా, మధ్య ఆసియాలోని రష్యా మిత్ర దేశాలకు ఎలాంటి ముప్పూ ఉండబోదని తాలిబాన్లు గత నెలలోనే హామీ ఇచ్చారు. ఇస్లామిక్ స్టేట్‌పై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
చేదు చరిత్ర...
అఫ్గాన్‌కు సైనిక బలగాలను తాము పంపబోమని ఇప్పటికే రష్యా స్పష్టంచేసింది. చరిత్రను పరిశీలిస్తే దీని వెనుక ఉద్దేశాలు ఇట్టే అర్థం అవుతాయి.
సోవియట్ యూనియన్ మద్దతుతో ఆనాడు అఫ్గాన్‌లో బబ్రక్ కమ్రాల్ నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా తదితర దేశాలు కలిసి ముజాహిదీన్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందించాయి.
అఫ్గాన్ ప్రభుత్వానికి మద్దతుగా 1979లో రష్యా ఇక్కడి యుద్ధంలోకి అడుగుపెట్టింది. దీన్ని ఎందుకూ కొరగాని యుద్ధంగా అంతర్జాతీయ నిపుణులు అభివర్ణించేవారు.
దాదాపు తొమ్మిదేళ్లపాటు ఈ యుద్ధం కొనసాగింది. దాదాపు 15,000 మంది రష్యన్లు దీనిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయంగా రష్యా అపఖ్యాతి పాలైంది. దీనికి నిరసనగా 1980 మాస్కో ఒలింపిక్స్‌ను కూడా చాలా దేశాలు బహిష్కరించాయి. ఈ యుద్ధం ప్రభావం సోవియట్ యూనియన్ ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది.
ఈ యుద్ధంలో మరణించిన వారిలో సోవియట్ యూనియన్‌కు చెందిన యువ సైనికులు చాలా మంది ఉన్నారు. వీరి ప్రాణాలకు సోవియట్ యూనియన్ ఎలాంటి విలువ ఇవ్వడం లేదని రష్యా ప్రజలు భావించేవారు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంలోనూ ఈ యుద్ధం ప్రముఖ పాత్ర పోషించిందని విదేశాంగ నిపుణులు చెబుతారు.
1989లో ఈ యుద్ధం ముగిసింది. ఓటమి, అపఖ్యాతులను మూటకట్టుకున్న సోవియట్ యూనియన్.. అఫ్గాన్ నుంచి నిష్క్రమించింది.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్ కోసం..
అఫ్గాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి రాబోతున్నారని ముందే రష్యా సంకేతాలు ఇచ్చింది. అయితే, ఇక్కడ తాలిబాన్లు ఇంత వేగంగా అధికారాన్ని చేపట్టడంపై మిగతా దేశాల్లానే రష్యా కూడా ఆశ్చర్యానికి గురైంది.
‘‘తాలిబాన్ ప్రభుత్వం కంటే.. ప్రాంతీయ సుస్థిరతకే రష్యా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది’’అని రష్యన్ సెంటర్ ఫర్ కాంటెంపరరీ అఫ్గాన్ స్టడీకి చెందిన ఆండ్రే సెరెంకో వ్యాఖ్యానించారు.
‘‘అదే సమయంలో తాలిబాన్లు ఎలాంటి మార్పులు తీసుకొస్తారా అని రష్యా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.’’
‘‘ఉత్తర అఫ్గాన్‌లో జరిగే పరిణామాలు రష్యాతోపాటు రష్యా మిత్రదేశాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే పరిస్థితులను వీలైనంత వేగంగా అదుపులోకి వచ్చేలా చూసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది’’అని మేధోమథన సంస్థ రష్యా ఇంటర్నేషనల్ అఫైర్స్ అధిపతి ఆండ్రేయీ కోర్టునోవ్ వ్యాఖ్యానించారు.
‘‘ఇక్కడ హింస చెలరేగితే, అల్‌ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్ మళ్లీ విజృంభించే అవకాశముంది. దీంతో మధ్య ఆసియా దేశాలు ప్రభావితం అవుతాయి. మరోవైపు అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా పతనం కానుందని అంచనాలు వస్తున్నాయి. ఈ పరిణామాలు కూడా ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తాయని రష్యా ఆందోళన చెందుతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- హాజీ మస్తాన్, వరదరాజన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?








