అఫ్గానిస్తాన్: ‘తాలిబాన్లు చూస్తే నన్ను అక్కడికక్కడే చంపేస్తారు, చాలా భయమేస్తోంది’ - బీబీసీతో కాబుల్‌ మహిళ

తాలిబాన్లు

ఫొటో సోర్స్, AFP

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్రమించిన అనంతరం కాబుల్‌లో నివసించే ఓ మహిళ బీబీసీతో మాట్లాడారు. ఆమె దాదాపు రెండేళ్లపాటు అఫ్గాన్ ప్రభుత్వం కోసం పనిచేశారు.

కాబుల్‌ను తాలిబాన్లు నియంత్రణలోకి తీసుకోవడంతో భవిష్యత్‌పై తమలో గూడుకట్టుకున్న భయాందోళనలు గురించి ఆమె మాట్లాడారు.

గత ఆదివారం తన జీవితంలో అత్యంత భయానకమైన రోజని ఆమె అన్నారు.

‘‘నేను ఉదయం ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఒకే ఒక మహిళ కనిపించారు. ఆమె ఆఫీస్ బయట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. లోపల చాలా తక్కువ మందే ఉన్నారు. ఇలా తక్కువ మంది కనిపించడం చాలా అరుదు. మరోవైపు కాబుల్ ప్రవేశ ద్వారాల దగ్గరకు తాలిబాన్లు వచ్చేశారని వార్తలు వచ్చాయి. అవి చూసిన తర్వాత నాకు మరింత భయంగా అనిపించింది. తాలిబాన్లు నగరంలోకి ప్రవేశించలేరని మొదట నేను అనుకున్నాను.’’

అఫ్గానిస్తాన్ మహిళలు

ఫొటో సోర్స్, HOSHANG HASHIMI via Getty Images

‘‘మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. నాతోపాటు మొబైల్, చార్జర్, కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని వచ్చాను. అందరూ వీలైనంత ఎక్కువ డబ్బులు బ్యాంకుల నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నేను కూడా డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాను. అక్కడ లైన్ చాలా పెద్దగా ఉంది. పరిస్థితులు కూడా చాలా ఉద్రిక్తంగా కనిపించాయి.’’

‘‘నేను బ్యాంక్‌లోకి అడుగుపెట్టినప్పుడు, మా అమ్మ, ఇతర కుటుంబ సభ్యుల మిస్డ్‌కాల్స్ ఫోన్‌లో కనిపించాయి. దీంతో ఏం జరిగిందోనని చాలా భయం వేసింది. వెంటనే నేను మా అమ్మకు ఫోన్ చేశాను. దీంతో ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? అని మా అమ్మ గందరగోళంగా అడిగింది. ‘పశ్చిమం వైపు నుంచి తాలిబాన్లు కాబుల్‌లోకి ప్రవేశించారు. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయ్’అని అమ్మ చెప్పింది.’’

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

చాలా భయంగా అనిపించింది

‘‘నాకు చాలా గందరగోళంగా అనిపించింది. చాలా భయం వేసింది.’’

‘‘అందరూ పరిగెడుతున్నారు. దుకాణాల తలుపులు మూసేస్తున్నారు. అందరూ త్వరత్వరగా ఇంటికి వెళ్లిపోతున్నారు. నన్ను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తానని మా తమ్ముడు ఫోన్ చేశాడు. కానీ, వాహనాల రద్దీతో రోడ్లు స్తంభించిపోయాయి.’’

‘‘దీంతో నేనే ట్యాక్సీ తీసుకొని ఇంటికి బయలుదేరాను. దారిలో ప్రజలు పరిగెడుతూ కనిపించారు. నాకు చాలా భయంగా అనిపించింది. తాలిబాన్లు నన్ను చూస్తే కచ్చితంగా చంపేస్తారు. ఎందుకంటే నేను ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాను. పైగా యూనిఫాంలో ఉన్నాను.’’

‘‘రెండు గంటల తర్వాత ఎట్టకేలకు నేను ఇంటికి చేరుకున్నాను. భయం వల్ల నేను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేకపోయాను. ఈ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. రాత్రంతా భయంతో నాకు నిద్ర పట్టలేదు. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు వచ్చి తలుపు కొడతారని భయం వేసింది.’’

‘‘ఆ సమయంలో అందరూ దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మా బంధువుల ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాను. అయితే, ఒకవేళ దారిలో దొరికిపోతే..? అందుకే ధైర్యం చేయలేకపోయాను.’’

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘వారిని నమ్మలేం’’

‘‘నాకు ఇంటిలోనే కాస్త భద్రంగా అనిపిస్తోంది. ఒకవేళ వారు ఇంటికి వచ్చి తలుపుకొట్టినా, నేను ప్రభుత్వం కోసం పనిచేయలేదని చెప్పొచ్చు. ప్రజల ఇళ్లలోకి వెళ్లబోమని తాలిబాన్లు చెప్పారు. కానీ వారిని నమ్మలేం. వారిని టీవీలో చూసినప్పుడల్లా చాలా భయం వేస్తోంది. చాలా బాధగానూ అనిపిస్తోంది.’’

‘‘వారి క్రూరత్వాన్ని మేం కళ్లారా చూశాం. ఇప్పుడు భయంతో నిద్ర కూడా పట్టడం లేదు.’’

‘‘దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు వీసా కోసం చూస్తున్నాను. అయితే, అది జరుగుతుందని కచ్చితంగా చెప్పలేను. ఇక్కడ ఉంటే ఉద్యోగం చేసుకోవడానికి తాలిబాన్లు అనుమతిస్తారా? కచ్చితంగా అనుమతించరు. ఇక్కడ నా భవిష్యత్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అంతా ముగిసిపోయిందని అనిపిస్తోంది.’’

‘‘భవిష్యత్‌పై నా ఆశలన్నీ చచ్చిపోయాయి.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)