పుణె: నరేంద్ర మోదీకి గుడి.. నాలుగు రోజుల్లోనే మూత.. ఎందుకు? ఏం జరిగింది?

- రచయిత, రాహుల్ గైక్వాడ్
- హోదా, బీబీసీ కోసం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్త మయూర్ ముండే పుణెలోని అవుంధ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఒక గుడి కట్టారు. దీన్ని ఆగస్టు 15, ఆదివారం నాడు ప్రారంభించారు.
అయితే, ఈ గుడి పట్ల ప్రధాని కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేయడంతో బుధవారం రాత్రి అక్కడి నుంచి మోదీ విగ్రహాన్ని తొలగించారు.
మయూర్ ముండే గత ఇరవై ఏళ్లుగా బీజేపీలోనే ఉన్నారు. మోదీపై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో ఆయనకు ఆలయాన్ని నిర్మించారు.
అందులో మోదీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. లక్షా అరవై వేల రూపాయల ఖర్చుతో దీన్ని జైపూర్‌లో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించారు.
మోదీపై ఒక గేయాన్ని రచించి, విగ్రహం పక్కనే ఒక బోర్డుపై రాసి ఉంచారు.
భారతదేశంలో మోదీకి కట్టిన మొదటి గుడి ఇదేనని మయూర్ ముండే పేర్కొన్నారు.
మోదీ ఆలయం గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మోదీకి గుడి కట్టినందుకు ముండేపై విమర్శలు వెల్లువెత్తాయి.

మోదీ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు?
మోదీ ఆలయ నిర్మాణం వెనుక కారణాలను తెలుసుకునేందుకు బీబీసీ, మయూర్ ముండేతో మాట్లాడింది.
"మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆయనొక యుగపురుషుడని భావించాను. ఆయన అనేక వివాదాలను పరిష్కరించి న్యాయం జరిగేలా చూశారు. అలాంటి వ్యక్తి మరొకరు ఉండరు. టీవీల్లో మాత్రమే అలాంటి వ్యక్తిత్వాలను మనం చూస్తుంటాం.
నాకు కలిగిన అనుభవమే ఇక్కడున్న వాళ్లకు కూడా కలగాలనే ఉద్దేశంతో ఆలయాన్ని నిర్మించి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాను. ప్రధాని మోదీ మీద ఒక కవిత కూడా రాయించాం. చాలామంది ఇక్కడకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. నా భక్తి అంతా మోదీ మీదే. అందుకే బీజేపీ నాయకులెవరినీ ఆలయ ప్రారంభోత్సవానికి పిలవలేదు" అని ముండే వివరించారు.
అయితే, పదవులను ఆశించో, బీజేపీలో హోదాల కోసమో ఈ గుడి కట్టలేదని ముండే స్పష్టం చేశారు.

ఆరా తీసిన ప్రధానమంత్రి కార్యాలయం
మోదీ ఆలయ నిర్మాణం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది.
బీజేపీ సీనియర్ నాయకులు కూడా మోదీకి గుడి కట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలయ నిర్మాణంలో బీజేపీ పాత్ర గురించి ఆ పార్టీ పుణె నగర అధ్యక్షుడు జగదీష్ ములిక్‌తో బీబీసీ మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ, ఆయన స్పందించలేదు.
పుణె మేయర్ మురళీధర్ మాహోల్ కూడా ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు.
మోదీ విగ్రహాన్ని తొలగించమని సీనియర్ బీజేపీ నాయకులు ముండేను ఆదేశించారు.
వెంటనే ఆయన ఆ విగ్రహాన్ని తొలగించి గుడిపై టర్పాలిన్ కప్పి ఉంచారు.
విగ్రహాన్ని తొలగించడం గురించి ముండేతో మాట్లేందుకు బీబీసీ ప్రయత్నించిది కానీ ఆయన అందుబాటులో లేరు. ఆయన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- స్మార్ట్ హోమ్: ఈ ఇంట్లో కాఫీ మెషీన్ దానంతట అదే కాఫీ తయారు చేస్తుంది, లైట్ దానంతటదే వెలుగుతుంది
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- తాలిబాన్లోని బలమైన నాయకులు ఎవరు? వారి పాత్ర ఏంటి?
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








