స్మార్ట్ హోమ్: ఈ ఇంట్లో కాఫీ మెషీన్ దానంతట అదే కాఫీ తయారు చేస్తుంది, లైట్ దానంతటదే వెలుగుతుంది

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
స్విచ్ వేయకుండానే మన కదలికను బట్టి లైట్ దానంతట అదే వెలిగితే..
పొద్దున్నే అలారం మోగగానే కిచెన్‍లోని కాఫీ మెషీన్ దానంతట అదే మనకోసం కాఫీ తయారు చేస్తే..
కాఫీ మెషీన్ తన పని పూర్తి చేసి, 'టోస్ట్ చేయ్' అని పక్కనే ఉన్న టోస్టర్‍కి పని చెబితే..
ఇంట్లోని ఫ్రిడ్జిలో ఏమేం సరుకులు ఉన్నాయో, వాటి ఎక్స్‌పైరీ డేట్లతో సహా సూపర్ మార్కెట్ నుంచే చూసుకునే అవకాశం ఉంటే..
ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా, మాయా లోకంలా అనిపిస్తోంది కదా.
ఇవేవో సరదా ఊహలు కావు. స్మార్ట్ హోమ్, హోమ్ ఆటోమేషన్‌తో ఇవ్వన్నీ సాధ్యమే.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్మార్ట్ హోమ్స్ అంటే?
ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఆటోమాటిక్‍గా కంట్రోల్ చేయడమే 'హోమ్ ఆటోమేషన్'.
మన ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జిలు, గీజర్లు, బల్బులు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని మనం కంట్రోల్ చేస్తూనే ఉన్నాము. వాటి ఆన్/ఆఫ్ స్విచ్చులు మన ఆధీనంలోనే ఉంటాయి.
మరి ఇప్పుడు కొత్తగా 'స్మార్ట్ హోమ్' ఏంటి? 'హోమ్ ఆటోమేషన్' ఏంటి? వాటిని ఆటోమాటిక్‍గా కంట్రోల్ చేయడమంటే ఏంటి?
ఇదివరకు ఈ పరికరాలు ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేయడానికి మనం అవి ఉన్న చోటుకు వెళ్లాలి. మనం చేయకపోతే పని పూర్తి కాదు.
అలా కాకుండా పరికరాలు వాటంతటవే కంట్రోల్ చేసుకోగలిగినా (self-regulation, auto-operation), లేక మనం ముందుగా ఇచ్చిన సూచనలు బట్టి పని చేయగలిగినా (logic driven operation) అవి స్మార్ట్ అనిపించుకుంటాయి. అలాంటి డివైజులున్న ఇల్లు 'స్మార్ట్ హోమ్' అవుతుంది.
ఒక పరికరం ఇంకో పరికరానికి సూచనలు ఇవ్వగలిగితే (inter-device communication) అప్పుడది 'హోమ్ ఆటోమేషన్' అని చెప్పొచ్చు.
ఇంతకు ముందు సాధ్యం కాని ఈ స్మార్ట్ హోమ్ ఇప్పుడెలా సాధ్యమవుతోందన్న ప్రశ్నకి సమాధానం 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
గత రెండు మూడు దశాబ్దాలుగా మన ఇళ్లల్లో వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంటర్నెట్‍కు కనెక్ట్ కాలేవు. వాటిలో ఆ వెసులుబాటు లేదు.
'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' సాయంతో మామూలు వస్తువుల్లో కూడా సెన్సర్లు, సాఫ్ట్‌వేర్ లాంటివి పెట్టి ఆ వస్తువు నుంచి డేటా పంపించడానికి(సెండ్), స్వీకరించడానికి (రిసీవ్) వీలు కల్పించొచ్చు. వాటిని ఓ మోస్తరు కంప్యుటేషనల్ డివైజుల్లా పని చేయించవచ్చు.
ఇలా వస్తువులన్నింటినీ ఇంటర్నెట్‍కు కనెక్ట్ చేసి, నెట్‌వర్క్‌లో భాగం చేయడమే 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్- ఐఓటీ అని చెప్పుకోవచ్చు.
అంటే ఇంటర్నెట్‍కు కనెక్ట్ అయి సమాచారాన్ని అటూ ఇటూ పంపడానికి పెద్ద పెద్ద కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లే అవసరం లేదు. మామూలుగా మనం వాడే వాలెట్, పర్సులో కూడా సెన్సర్ ఉంటే, వేలి ముద్రలను ఫీడ్ చేయవచ్చు.
మన చేయి తప్ప వేరెవరి చేయి తగిలినా ఫోన్‍లో అలారం మోగేలా కోడ్ రాసుకోవచ్చు. పర్స్ ఎక్కడున్నా దాని లొకేషన్ కో-ఆర్డినేట్స్ మన ఫోన్‍లో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.
చూడ్డానికి మామూలుగా లెదర్‍తోనో, బట్టతోనో చేసినట్టు కనిపించే పర్సును కూడా కంప్యుటేషన్ చేయగలిగే మెషీన్‍గా మార్చేస్తుంది ఐఓటీ.
ఏ పరికరం పేరు ముందైనా 'స్మార్ట్' అని కనిపిస్తే అది చాలా వరకు ఐఓటీ డివైజ్ అనే అనుకోవచ్చు.
'స్మార్ట్' బల్బు అంటే మనిషి కదిలికలను సెన్సార్ చేసి, దాన్ని బట్టి ఆన్/ఆఫ్ అవుతుంది. లేదంటే సూర్యరశ్మి ఎంత ఉందన్న దాని బట్టి వెలుగుతుంది.
'స్మార్ట్' లాక్ అంటే కెమేరాలోంచి ఎవరు అన్‍లాక్ చేస్తున్నారో చూసి, ఇంటి యజమానులైతేనే తెరుచుకుంటుంది. లేదంటే అలారం మోగిస్తుంది.
'స్మార్ట్' ఏసీ అంటే ఇంట్లో ఉండనవసరం లేకుండా వైఫై ద్వారా ఆన్, ఆఫ్ చేయవచ్చు.
'స్మార్ట్' బ్లైండ్స్ అంటే కర్టెన్లు, బ్లైండర్లు మన ప్రమేయం లేకుండా వాటంతట అవే అడ్జస్ట్ అవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇవన్నీ స్మార్ట్ ఎలా అయిపోతున్నాయి?
ఎలక్ట్రానిక్ పరికరాల్లో అవి చేయాల్సిన పనికి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే ఉండేవి నిన్నా మొన్నటి దాకా. అంటే బల్బులో కరెంటును, లైటుగా మార్చడం కోసం కావాల్సినవి, ఫ్రిడ్జి, ఏసీలలో చల్లగా చేయడం కోసం కావాల్సినవి ఇలా.
ఇప్పుడు వీటితో పాటుగా ఇంకొన్ని బాధ్యతలు ఆ పరికరం నెత్తిన పడుతున్నాయి కాబట్టి కొన్ని అదనపు సామాగ్రి చేరుతుంది వీటిలో.
ఉదాహరణగా స్మార్ట్ బల్బునే తీసుకుంటే వెలగడమే కాకుండా ఎవరన్నా వస్తున్నారా అన్నది చూసుకుని వెలగాలి అనేది అదనపు బాధ్యత. దానికోసం ఇంటర్నెట్‍తో కనెక్ట్ అయి డేటా పంపించడానికి ఒక వైఫై యాంటీనా, లాజిక్‍ను రన్ చేయడానికి ఒక మైక్రో కంట్రోలర్ కూడా ఉంటాయి.
అలాగే మనుషులు తిరగడాన్ని బట్టి, సూర్యరశ్మి ఎక్కువ, తక్కువ అవడాన్ని బట్టి పనిచేయడానికి అనువైన సెన్సర్లు కూడా ఆ బల్బులోనే ఉంటాయి.
అలా అని మనకి తెలిసిన బల్బుల కన్నా ఇవేవీ పెద్ద సైజులో, భారీగా ఉండవు. ఈ సర్క్యూట్లు, సెన్సర్లు ఏవైనా ఆ చిన్న పరికరాల్లో ఇమిడిపోయేంత చిన్న సైజులోనే ఉంటాయి.
అంత చిన్నగా ఉంటాయి కాబట్టే వాటికి మెమరీ, పవర్ అన్నీ తక్కువే. కేవలం ఒక పరిమితమైన లాజిక్‍కి కావాల్సినంత పవర్ సప్లై , మెమరీ ఉంటాయంతే.
వీటితో భారీ కంప్యుటేషన్లు చేయడం వీలు కాదు కనుకనే ఐఒటి డివైజ్‌కు వీలైనంత తక్కువ పని అప్పజెప్పి తక్కిన తతంగాన్ని క్లౌడ్‍లో (ఇంటర్నెట్‌పై ఇంకెక్కడో ఉన్న సర్వర్లలో) నడిపిస్తారు.
ఆ సర్వర్లకు ఈ డివైజ్‌ల మధ్య సంభాషణ జరగాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. ఎక్కువగా వైఫై వాడుతుంటారు. ఒకే చోటున్న పరికరాలు మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ టెక్నాలజీ కూడా పనికొస్తుంది.

ఫొటో సోర్స్, Amazon
ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవడం ఎలా?
స్మార్ట్ హోమ్ కోసం కావాల్సినవి:
- బాగా పనిజేసే వైఫై సిగ్నల్: ఇదిప్పుడు మన దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో లభ్యమవుతోంది. ఇబ్బంది పడకుండా మంచి సిగ్నల్ అందుతోంది. డివైజ్‌లు దీనికే కనెక్ట్ అవుతాయి కనుక ఇది స్టేబుల్‍గా ఉండడం అవసరం. ఇళ్లలో వాడే వైఫై రౌటర్లు ఐ.ఒ.టి డివైజులు కనెక్ట్ అవ్వడానికి సరిపోతాయి.
- స్మార్ట్ హోమ్ డివైజ్‌లు: బల్బులు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, గీజర్లు, ఏసీల లాంటివి ఏవైనా.
- కంట్రోల్ చేయడానికి స్మార్ట్ ఫోన్ లేక స్మార్ట్ స్పీకర్: దాదాపుగా అన్ని స్మార్ట్ డివైజ్‌లు మొబైల్ యాప్స్‌తో వస్తాయి. మన ఫోనులో వాటిని డౌన్‌లోడ్ చేసుకుని కంట్రోల్ చేయవచ్చు. కానీ అలా ఫోన్ అవసరం కూడా లేకుండా స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్స్‌తో (అలెక్సా, గూగుల్ హోమ్ లాంటివి) కనెక్ట్ చేస్తే చేతులతో పని లేకుండా కేవలం వాయిస్ ద్వారా కమాండ్స్ ఇచ్చి పని చేయించవచ్చు.
“ఐ యామ్ ఫీలింగ్ హాట్” అనగానే ఈ అసిస్టెంట్లు ఏసీలో టెంపరేచర్ అడ్జస్ట్ చేయడమో, కర్టెన్లు పక్కకు తీసి విండోలు తెరవడమో చేయగలవు.
స్మార్ట్ హోమ్‍గా మారడానికి కొంత ఖర్చు అవుతుంది. ఉన్న పాత పరికరాలన్నింటినీ తీసేసి కొత్తవి కొనడం అన్ని వేళలా సాధ్యపడే పని కాదు. అయితే ఇవి స్మార్ట్‌గా పనిచేస్తాయి కాబట్టి కరెంటు బిల్లులు ఆదా కావొచ్చు. సమయం, డబ్బు ఆదా చేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్ హోమ్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అన్నింటిలాగానే ఈ టెక్నాలజీ వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా సెక్యూరిటీ సమస్యలు ఎక్కువ. పరిమితమైన కంప్యూటింగ్ రిసోర్సెస్ ఉన్న చిన్న పరికరాలే అయినా హ్యాకర్లు వీటిని కబ్జా చేసుకుని చాకచక్యంగా తమ అవసరాలకి వాడుకోవచ్చు.
హ్యాకర్లు ఒక పరికరాన్ని తమ అదుపులోకి తీసుకున్నాక ఇంటిలో మిగితా పరికరాలను కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అది చాలా దారుణమైన పరిణామాలకు దారి తీయవచ్చు.
ఉదాహరణకు డోర్ లాక్ హ్యాక్ చేయగలిగితే ఇంట్లో చొరబడినట్టే.
అందుకని మనం లాప్‍టాప్, పీసీలు, ఫోన్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో ఈ స్మార్ట్ డివైజుల విషయంలోనూ అంతే శ్రద్ధ చూపించాలి. ఒక ఐ.ఒ.టి డివైస్ ఇంట్లో కనెక్ట్ చేశాక, ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
- డీఫాల్ట్ పాస్‍వర్డ్ మార్చడం: ఈ డివైజులకి కంపెనీ డిఫాల్ట్‌గా ఇచ్చే పాస్‍వర్డ్‌లు చాలా ఈజీగా ఉంటాయి. హ్యాకర్లు తేలిగ్గా క్రాక్ చేయగలరు వాటిని. అందుకని కొన్న వెంటనే వీటిని మార్చడం ఉత్తమం.
- రికమెండెడ్ సెట్టింగ్స్ మార్చకపోవడం: కంపెనీవాళ్ళు ఏ సెట్టింగ్స్‌లో పరికరాలను నడిపించాలని చెప్తే అవే ఉంచడం మేలు. యాప్స్‌లో వీటిని మార్చే ఆప్షన్ ఇచ్చినా కూడా ఎందుకు మారుస్తున్నామో, మార్చడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలిస్తేనే మార్చాలి. లేదంటే వాళ్ల టెక్నీషియన్స్ సహాయం తీసుకోవచ్చు.
- ఫర్మ్వేర్ అప్‍డేట్ చేస్తుండడం: పరికరాల మీద కొంత కోడ్, లాజిక్ నడుస్తుందని చెప్పుకున్నాం కదా. ఏవైనా సెక్యూరిటీ సమస్యలు వస్తే కంపెనీ వాళ్లు వాటిని ఫిక్స్ చేసి, అప్‌డేట్స్ రిలీజ్ చేస్తుంటారు. అలాంటివేవో అప్‍డేట్స్ వచ్చాయని తెలిసినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే ఇన్‍స్టాల్ చేయాలి.
- స్మార్ట్ హోమ్ యాప్స్ వాడడం: మన కంటికి కనిపించకుండా ఎక్కడో మూల నుంచి పనిజేసే ఈ పరికరాల తీరు తెన్నులు కనిపెట్టుకుని ఉండడం కష్టమే. ఆ పనిని చేసిపెట్టే కొన్ని యాప్స్ వస్తున్నాయి ఇప్పుడు. వాటిని వాడటం వల్ల ఈ పరికరాల్లో ఏం జరుగుతుందో కొంత ఐడియా వస్తుంది.
(ఈ కథనం టెక్నాలజీ మీద అవగాహన కోసం మాత్రమే. ఇందులో రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడండి ఇలా..
- మీ డేటాతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చా?
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్‌బుక్ సహకరించిందా?
- ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- ఇంటర్నెట్ ప్రకటనలు: ఎలా మొదలయ్యాయి? ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? ఇకపై ఏమవుతాయి?
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








