డిజిహబ్: అంతర్జాలమందు అనుమానించువాడు ధన్యుడు సుమతీ

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండూ అప్పుడప్పుడే ప్రజలకి అందుబాటులోకి వస్తున్న సమయం అది.
తొంభైలలో 'మైన్‍స్వీపర్' అని ఒక గేమ్ ఉండేది. కాస్తో కూస్తో కంప్యూటర్‌తో పరిచయం ఉన్నవాళ్లందరూ ఇది ఆడేవారు. ఆట ప్రారంభంలో గడులన్నీ మూసేసి ఉంటాయి. ఆట గెలవాలంటే బాంబులున్న గడి ఒక్కటి కూడా నొక్కకుండా, అంకెలున్న గడులన్నీ తెరవగలగాలి.
ఈ మైన్‍స్వీపర్ ఆట మొదలుకుని ఇప్పటివరకు అంటే, గత రెండు దశాబ్దాల్లో ఒక ఎండ్ యూజర్‌గా మాత్రమే కాక, నా వృత్తిరీత్యా, అంటే ఒక టెక్నాలజిస్ట్ కోణం నుంచి కూడా టెక్నాలజీ విజృంభించిన వైనాన్ని దగ్గరగా చూస్తున్నాను.
టెక్నాలజీ ఎంత త్వరిత గతిన, ఎంత విస్తృతంగా మన జీవితాలతో పెనవేసుకుపోయిందో గుర్తుచేసుకోడానికి ఉదాహరణగా తెలుగువారి జీవితంలో విడదీయలేని భాగమైన సినిమాలు-సినిమా టికెట్ బుకింగ్‍లనే తీసుకుందాం.
'తొలి ప్రేమ' (1998) నాటికి లైన్‍లో నిల్చునో, నిల్చోబెట్టో టికెట్లు కొనుక్కోవాల్సిందే. 'బాలు', 'బంగారం' (2005-06) విడుదల అయ్యేనాటికి ఒకట్రెండు టెలీబుకింగ్ సైట్లు ఉండేవి. మనం ఫోన్ చేసి టికెట్లు బ్లాక్ చేసుకోవచ్చు, కానీ ఎవరూ పెద్దగా వాడినట్టు లేరు.
'జల్సా' (2008) నాటికి బుక్‍మైషో.కాం లాంటి సైట్ల ద్వారా ఆన్లైన్ టికెట్లు మామూలైపోయాయి. అయితే ఆన్‍లైన్ ద్వారా మనకోసం సీటు కేటాయించినా, అది టికెట్ కాదు కాబట్టి మళ్లీ కౌంటర్ దగ్గర నిల్చుని మెసేజ్ చూపించి కాగితపు టికెట్ తీసుకోవాల్సి వచ్చేది.
కొన్నాళ్లకు వాటికీ కియాస్క్‌లు పుట్టుకొచ్చాయి. మన ఆన్‍లైన్ టికెట్ మీదున్న ఒక ప్రత్యేకమైన నంబరును టైప్ చేస్తే ఆ మెషీన్ పేపరు టికెట్లని ఇస్తుంది.
అంటే మనిషికి, మనిషికి మధ్య వ్యవహారం (హ్యూమన్-హ్యూమన్ ఇంటరాక్షన్), మనిషికి, మెషీన్‌కి మధ్య వ్యవహారం (హ్యూమన్-మెషీన్ ఇంటరాక్షన్)గా మారిపోయింది.
'అజ్ఞాతవాసి' (2018) వచ్చేసరికి ఆ పేపరు టికెట్లు కూడా అవసరం లేకుండా మొబైల్‍లో కనిపించే క్యూఆర్ (QR) కోడ్‍ను స్కానర్‍కి చూపిస్తే, అది గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే లోపలికి వెళ్లిపోవచ్చు. 'వకీల్ సాబ్' (2021) ఓటీటీలలో (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వగైరా) చూసే అవకాశం ఉంది, సినిమా హాళ్లకు వెళ్లలేకపోయినా.
ఇవన్నీ సౌలభ్యాలు. సినిమా చూడ్డానికి ముందు, ఏ థియటర్‍లో చూడబోతున్నామో ఆ థియటర్ దగ్గరే పడిగాపులు పడి, క్యూలో తోసుకుని, రాసుకుని టికెట్లు కొనాల్సిన అవసరం లేని సౌలభ్యాలు.
షోకు ఒక అరగంట ముందు దాకా ఎక్కడి నుంచైనా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు, టికెట్ బుక్ చేసుకునే ముందు ఏయే థియటర్లలో ఎన్ని సీట్లు బుక్ అవుతున్నాయి (అంటే, సినిమా హిట్టా, ఫట్టా) కూడా సుమారుగా తెల్సుకునే వీలు, టికెట్ రూపంలో వచ్చే చిన్న కాగితం ముక్కని సినిమా అయ్యేంతవరకూ జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం లేని హాయి.. జీవితం సుఖంగా మారిపోయింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బాంబులుంటాయి జాగ్రత్త..
ఇప్పుడు అంతర్జాలాన్నే 'మైన్‍స్వీపర్' గేమ్ అనుకుంటే, ఈ సౌలభ్యాలన్నీ అంకెలున్న గడులని అనుకోవచ్చు. వీటిపైన చెంగుచెంగుమంటూ అడుగులేసుకుంటూ మనం అంతర్జాల (ఇంటర్నెట్) అంతరిక్షంలో (స్పేస్)లో దూసుకెళిపోవచ్చు. దూసుకెళ్ళిపోతున్నాం కూడా.
అంతటా ఇలా సౌలభ్యాల గడులే ఉంటే ఆటలోనైనా, బతుకులోనైనా మజా ఏముంటుంది? ప్రపంచంలో నేరస్థులు, అపరాధులు ఉన్నప్పుడు సైబర్ స్పేస్‌లో లేకుండా ఎలా పోతారు? కానీ మనకే ఆ స్పృహ తక్కువగా ఉంటుంది. పని తర్వగా అయిపోవడం, సులువుగా అయిపోవడం ఇచ్చే నిశ్చింత కాస్త ఎక్కువైపోయి ఏమరపాటు మొదలవుతుంది. అనాలోచితంగా ఎప్పుడో మందుపాతర మీద అడుగు వేస్తాం. అంతే, ఢాం!
“ఆ… అలా మాకేం కాదులెండి. మేం మర్యాదస్తులం. పాడు సైట్లకి వెళ్ళిన పాపాన పోలేదు ఎప్పుడూ! ఒకర్ని ఒక మాట అని ఎరుగం. మా మీద ఎవరు పగబట్టి ఇలా నష్టం కలిగించాలనుకుంటారూ?” అని సాగదీస్తుంటారు కొందరు.
అడల్ట్ కంటెంట్ చూస్తేనో, రమ్మీలూ లాటరీలూ లాంటివి ఆడితేనో మాత్రమే ఆన్‍లైన్ అపాయాలు కలగవచ్చుననే అపోహలుంటాయి కొందరికి.
అలా ఏం ఉండదు. సినిమాకి టికెట్ బుక్ చేసుకోవడం లాంటి సాధారణ పనిలో కూడా బోలెడు తేడాలు రావచ్చు. మన టికెట్ ఐడి, క్యూఆర్ కోడ్ వేరొకరి చేతిలో పడి, మనకన్నా ముందు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే టికెట్లు మాత్రమే గోవింద!
ప్రాణం ఉసూరుమన్నా, పోయిన డబ్బు వందల్లోనే కాబట్టి కావాలంటే ఇంకో షో చూడవచ్చు. అదే, టికెట్ బుక్ చేస్తున్న క్రమంలో క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ ఇవ్వడంలో అజాగ్రత్తగా ఉంటే బాంక్ బాలెన్స్ అంతా ఇంకెవరో స్వాహా చేసేయచ్చు.
డబ్బు నష్టపోతే అంతో ఇంతో అని లెక్క తేలుతుంది. మనం ఎక్కడ సినిమా చూస్తున్నాం, ఎవరితో చూస్తున్నాం (ఇన్ఫో షేరింగ్), హాలుకు ఏ దారిన, ఎంత వేగంతో చేరుకున్నాం (లొకేషన్ ట్రాకింగ్), సినిమా గురించి సోషల్ మీడియాలో తిట్టుకున్నామా, మెచ్చుకున్నామా (సెంటిమెంట్ అనాలసిస్) లాంటివాటికి కావాల్సిన డేటా ఇప్పటి యాప్స్ ఎటూ సేకరిస్తున్నాయి కాబట్టి, వీటన్నింటిని కలిపి రేపు మనకో ఆన్‍లైన్ వ్యక్తిత్వాన్ని ( ఆన్‍లైన్ పర్సోనా) తయారుచేసి దాన్ని మనకి ప్రతినిధిగా వాడుకుంటే ఎన్ని సమస్యల్లో ఇరుక్కుంటామో మనకి తెలీదు.
మనమెంత సదాశయంతో అంతర్జాలంలోకి అడుగిడినా, ఎంత సత్ప్రర్తనతో మెలిగినా మన ప్రతి అడుగు కోసం చుట్టూరా బాంబులు కాచుకునుంటాయని మర్చిపోతే ఎప్పుడో తప్పటడుగు పడుతుంది, అంతా మటాష్ అయిపోతుంది.
ఇలాంటి దుర్ఘటనలు (ఆన్‍లైన్‍లో డబ్బు పోయిందనో, ఫోటోలు మార్ఫ్ చేసి వాడుకుంటున్నారనో) ఏవైనా, ఎవరికైనా జరిగాయని తెలియగానే, వార్తల్లో చదవగానే గాబరా పడిపోతూ, “పాడు, ఇంటర్నెట్ అండీ! అందరూ దొంగ వెధవలే!”, “హేమిటో, టెక్ టెక్ అని ఊగిపోతారు ఈ కుర్రకారు, ముళ్ళదారి అని తెల్సుకోరు” అని సన్నాయి నొక్కులు నొక్కే అవకాశం ఉండేది పెద్దవాళ్ళకి, కనీసం ఓ ఏడెనిదేళ్ళ క్రితం వరకూ.
కానీ, ఇప్పుడు ఎవరికీ “ఆఫ్‌లైన్” లైఫ్ ఉండే లగ్జరీ లేదు. పెద్దవాళ్ళు పిల్లలతో కుబుర్లాడాలి అన్నా, కాల్స్ చేయాలన్నా వాట్సాప్ లాంటివి కావాలి. పిల్లలకి ఆన్‍లైన్ క్లాసులైతే జూమ్ లాంటి వీడియో కాన్ఫరెన్స్ టూల్స్, సరదాకి పద్యాలో, రైమ్సో నేర్చుకోవాలంటే యూట్యూబ్ వీడియోలు తప్పనిసరి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వర్చువల్ జీవితాన్ని కూడా గమనిస్తున్నారు
పదేళ్ళ క్రితం ఉద్యోగవేటలో ఈమెయిల్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు, దానితో పాటు లింక్డిన్ (ఉద్యోగస్తుల కోసం సోషల్ మీడియా) తో పాటు మన ఫేస్‍బుక్/ట్విట్టర్/ఇంకేమన్నా ఉంటే అవీ, అన్నీ కావాలి. మనం ఉద్యోగానికి పనికొస్తానని నమ్మితే 'బాక్‍గ్రౌండ్ చెక్స్' చేయిస్తారు, ఏ కంపెనీ అయినా.
కొన్నేళ్ళ క్రితం వరకూ మనం అంతకు ముందు ఉద్యోగాలు చేసిన కంపెనీలో అధికారులని, సహోద్యోగుల(కొలీగ్స్)ని మాత్రమే అడిగేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనమేం పంచుకుంటున్నాం, మనకెంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, మనం ఎవరిని ఫాలో అవుతున్నాం లాంటి విషయాలన్నీ కూడా కీలకమైపోయాయి. అంటే, నిజ జీవితపు మనిషికి (రియల్) ఎంత ప్రాధాన్యం ఉందో అంతర్జాలంలోని (వర్చువల్) మనిషికీ అంతే ప్రాధాన్యం ఉంది. ఒక రకంగా రెండూ విడదీయలేనివి అయిపోయాయి.
సామాజికంగా, రాజకీయంగా ఏదైనా సున్నితమైన విషయం మీద సమన్వయం కోల్పోయి ట్వీట్ చేసినందుకో, ఫేస్‍బుక్‍లో షేర్ చేసినందుకో ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. అంతే కాదు, ఏ ఉద్యోగంలోని వివాదాలు/వివక్షలు ఆ ఉద్యోగం వరకే పరిమితమయేవి. ఒకసారి అక్కడ ఉద్యోగం మానేశాక ఇంకేం చేసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కులవివక్ష, మీటూ లాంటి సమస్యలను ఎప్పుడన్నా సోషల్ మీడియాలో లేవదీయవచ్చు. అది అధికారుల కంటిలో పడిందంటే, నిందింపబడినవారు విచారణ, శిక్ష తప్పించుకోవడం కష్టం.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎలా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి? ఇవి మంచికా, చెడుకా? ఆ మంచిచెడుల, లాభనష్టాల బేరీజు ఎలా వేసుకోవాలి? ఇవ న్నీ ఆలోచించుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన విషయాలు.
టెక్నాలజీలో పనిచేసేవాళ్ళో, ఆ వ్యాపారంలో ఉన్నవాళ్ళో, ఏదో కొంత కుతూహలం ఉన్నవారో మాత్రమే కాదు, మన అందరం తప్పనిసరిగా ఆలోచించుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన సంగతులివి.
వైద్యం, విద్య, రాజకీయం, ఆర్థికం, ఆహారం.. అసలు ఒకటని ఏమిటి, అన్నింటిపైన టెక్ ప్రభావం తిరుగులేకుండా ఉంది. మన జీవితాలను, మన పరిస్థితులను అనూహ్యంగా మార్చుకుంటూ పోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
'ఫైండింగ్ మెథడ్ టు ది మేడ్‌నెస్'
మళ్ళీ, మన మైన్‍స్వీపర్ గేమ్‍తో పోల్చుకుంటే, మనం మన ఇష్టాయిష్టాలకి సంబంధం లేకుండా ఆడుతున్న ఈ ఆటలో నియామాలేంటో మనకి తెలీవు. ఏది ఓటమో, ఏది గెలుపో తెలీదు. మైన్‍స్వీపర్‍లో ఆట మొదలయ్యేటప్పటికి ఎన్ని గడులుంటాయో, ముగిసేటప్పటికీ అన్నే ఉంటాయి. ఒక గడి వెనుక 1 ఉంటే దానర్థం ఆ గడి చుట్టూ ఉన్న గడులలో ఒక బాంబు ఉందని. ఆ అర్థం మారదు. కానీ మనం ఆడుతున్న ఈ ఆటలో గడులు ఎటు వైపైనా, ఎంతైనా పెరుగుతూ పోవచ్చు. ఇవాళ అంకె అనిపించింది రేపు బాంబుగా మారవచ్చు. (సరదాగా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్ తో కబుర్లాడుకోడానికి, ఫోటోలు షేర్ చేయడానికి మొదలైన ఫేస్‍బుక్ మీద ఇవ్వాళ ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా రాజకీయాలని నిర్దేశిస్తుందనే పూర్తిగా కొట్టిపారేయలేని ఆరోపణలున్నాయి కదా)
అలా అని ఆటని 'క్విట్' చేయనూ లేం. మరెలా?

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటివాటికే నా మొట్టమొదటి మానేజర్ చెప్పిన చిట్కా ఒకటి ఉంది.. 'ఫైండింగ్ మెథడ్ టు ది మేడ్‌నెస్'. అంటే, వెర్రెక్కించేంత అతలాకుతలంగా పరిస్థితులు తయారైనప్పుడు వాటిని లొంగదీసుకోడానికి ఏదో విధంగా చిన్న చిన్న మొత్తాలలోనైనా ఉపాయాలో, చిట్కాలో వెతుక్కుని, చిన్నచిన్నగా నరుక్కుంటూ వస్తే అదృష్టం పండి సమస్య చేతికి చిక్కే అవకాశం ఉంటుంది. ఇన్ని మాటలెందుకు గానీ, పవన్ కళ్యాణ్ మాటలనే కాస్త అటు ఇటు సర్దితే.. "తిక్కుంటే, దానికో లెక్క కనుక్కోవాలి".
మనం వాడుతున్న టెక్నాలజిలో లోటుపాట్లు మనకి తెలుసు (ఉదా: ఇంట్లో కూర్చుని కాళ్ళు కదపకుండా షాపింగ్ చేయచ్చు. క్రెడిట్ కార్డ్ నంబర్, ఓటీపీలు మన అంతట మనమే వేరేవాళ్ళకి ఇచ్చేస్తే మనల్ని ఎవరూ కాపాడలేరు.)
మనం వాడుతున్న టెక్నాలజీ వల్ల మనకేం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు, లేక ఎప్పటికో గానీ తెలీదు. (ఉదా: మనిషి ఎప్పుడూ ఊహించలేనంత సమాచారం ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఉంది. అలా అందుబాటులో ఉన్న సమాచారం కోసం ఒక లింక్ నుంచి ఇంకో లింక్‍కు దూకడం అలవాటైపోయి, ఏ పని మీదా ఏకాగ్రత నిలవని పరిస్థితి (అటెన్షన్ డెఫిషియన్సీ) ఏర్పడుతుందని ఇప్పుడిప్పుడే పరిశోధనలు చెప్తున్నాయి. ఇది ముందు తరాల్లో ఎలాంటి బిహేవియరల్ ఎనామలీస్ తీసుకొస్తుందో చెప్పలేం.)
ఇప్పుడు వీటితో కుస్తీ పట్టాలంటే, మొదటిదాని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంటే, అపరిచిత మనిషిని ఇంట్లోకి రానివ్వడానికో, ఇంట్లోకి రమ్మనాల్సి వచ్చాకో ఎంత అప్రమత్తంగా, ఎలా కనిపెట్టుకుని ఉంటామో, ఎలా అనుమానంతో ఒక కన్ను వేసి ఉంచుతామో, అలా టెక్నాలజీని కనిపెట్టుకుని ఉండాలి.
“క్లిక్ హియర్” అని కనిపించిన చోటల్లా నొక్కకుండా, “మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ వెనుక సీవీవీ అని ఒకటుంటుంది సార్, మూడు అంకెలు, అవి చెప్పగానే మీకు గిఫ్ట్ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది సార్, గంటలో” అని అడగ్గానే ఊరిపోయి నంబర్ చెప్పేయకుండా ఉండడం లాంటివి తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. అలవాటుగా మార్చుకోవాలి.
అలానే, పర్యవసానాలు మనకింకా తెలీని టెక్నాలజీలపై ఓ కన్నేసి ఉంచితే, అవి మనలో, మనం మసులుకుంటున్న తీరులో కలిగిస్తున్న మార్పులపై మనకు కొంత అవగాహన కలగవచ్చు. మన ముందు తరాల వారికి కనీసం ఓ హెచ్చరిక అందించే అవకాశం ఉంటుంది.
దీని వల్ల ఏం తెలుస్తుంది మనకి? టెక్నాలజీ లోటుపాట్లు మనకి తెలిసినా, తెలియకపోయినా మనం దాన్ని “అనుమానిస్తూ” ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయనిపిస్తుంది. అందుకే, “అంతర్జాలమందు అనుమానించువారు ధన్యులు, సుమతీ” అని నాకు నేను చెప్పుకుంటుంటాను.

ఫొటో సోర్స్, Getty Images
అనుమానమే రక్ష
కానీ ఒకటా, అరా, పొద్దస్తమానూ ఆన్‍లైన్‍లోనే ఉంటామే, ఇలా అనుమానిస్తూ కూర్చుంటే అదో జబ్బులా తయారవ్వదా? అని అడిగేవారుంటారు. నేనూ ఆలోచించాను.
అనుమానంకు బదులుగా “అప్రమత్తంగా ఉండువారు ధన్యులు” అని అందాం అనుకున్నాను. కానీ వర్చువల్ ప్రపంచాన్ని పక్కనపెట్టేసి కాసేపు వాస్తవ ప్రపంచంలోకి వస్తే, (కోవిడ్ పుణ్యమా అని) మనం అచ్చంగా ఇరవై నాలుగు గంటలూ ఇళ్ళల్లో ఉంటున్నాం. అందుకని అజాగ్రత్తగానీ, అశ్రద్ధగానీ చేస్తామా? గేట్లకి, తలుపులకీ తాళాలూ, గొళ్ళాలు పకడ్బందీగా వేసుకోవడం లేదూ? ఎందుకని? ఏ మాత్రం అటూ ఇటూ చేసినా ఆస్తి నష్టమో, ప్రాణ నష్టమో జరుగుతుందని భయం, ఆందోళన. అంతకన్నా ఎక్కువ అనుమానం.
అనుమానమే లేకపోతే ఆటోవాడో, కొట్టువాడో చిల్లర ఇవ్వగానే ఒకసారన్నా చూసుకుంటామా? టూరిస్ట్ ప్లేసుల్లో బ్యాక్‌ప్యాక్‌ను కూడా ముందుకేసుకుని చంటిపిల్లాడిలా జాగ్రత్తగా హత్తుకుంటామా? కొంచెం రద్దీగా ఉందనిపిస్తే చాలు పదేపదే జేబుల మీద చేతులుపెట్టో, హాండ్ బ్యాగ్ మొత్తం చంకలో దూర్చేసే నడుస్తామా? ఇవన్నీ ఎందుకు చేస్తాం? అనుమానం, యువర్ ఆనర్, అనుమానం.
ఇంటర్నెట్ మనకి తెలిసిన ప్రపంచానికన్నా పెద్దగా వేరు కాదు. మనుషులు, మమతలు, భావావేశాలూ, కక్షలూ కుట్రలూ, అన్నీ అవే. నిరాకారమైన, నిర్గుణమైన ఒక ’ఐడి’ వెనుక కూర్చుని ఏమైనా చేయొచ్చు, ఏమన్నా అనొచ్చు. పట్టుబడేవరకూ అందరూ దొరలే.
అయితే, నిజజీవితంలో అనుమానం మనలో భాగమైనంతగా ఆన్‍లైన్‍లో కాలేదంతే. సెకండ్ నేచర్‍గా మారలేదు. అందుకే చెప్తున్నా, ఆన్‍లైన్‍లో అప్రమత్తతంగా ఉండాలంటే ముందు ప్రతీది అనుమానించాలని మనం మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవాలి.
ఇది ఇంటర్నెట్ కాబట్టి, కంప్యూటేషన్ మీద నడుస్తుంది కాబట్టి, దీని తిక్కకీ ఓ లెక్కనెలా కనిపెట్టాలో, ఏ లాజిక్‍తో కొట్టాలో, వేటిని ఏ ఆధారంగా అనుమానించాలో ఇకపై క్రమంగా రాబోతున్న ఈ శీర్షికలో నాకు తెల్సినంత మేరలో పంచుకుంటుంటాను.
పుస్తకాలు, సినిమాలు, వెబ్ సీరీస్‍లు, స్పోర్ట్స్ - మనం కబుర్లాడుకోవడానికి, వాటిల్లోని టెక్ సంగతులను గమనించుకోడానికి కావేవీ అనర్హం.
మన మైన్‍స్వీపర్ గేమ్‍లానే ఒక వారం బాంబు ఉన్న గడినీ, మరో వారం “సేఫ్” గడినీ అలా అలా తొక్కుడు బిళ్లలా ఆడుకుంటూ పోదాం. పరిష్కారాలున్న చోట చెప్పుకుందాం, వాటిని మన ఆన్‍లైన్ వ్యవహారాల్లో ఎలా భాగం చేసుకోవాలో మాట్లాడుకుందాం. లేనివాటికి రిసెర్చర్లు, ఇంజనీర్లు, కార్పరేట్లూ, లీగల్-పోలీస్ విభాగాలు కలిసినా ఎలాంటి సవాళ్ళ వల్ల కొన్ని నేరాలను, దుష్ప్రయోజనాలను ఆపలేకపోతున్నారో తెల్సుకుందాం. (ఊరికే రావండీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కళ్ళద్దాలు, ఊరికే ఊడిపోదండీ వాళ్ళ జుట్టు)
అంతవరకూ, మీరీ కింది గడుల్లో ఏది మంచిదో, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో గమనించండి. ఏ గడినైతే సేఫ్ అనుకుంటారో, ఏ గడిని డేంజర్ అనుకుంటారో ఆలోచించండి.
(రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఫొటో సోర్స్, Purnima.T
ఇవి కూడా చదవండి:
- రెండు వేల ఏళ్ల కిందటి ‘పురాతన కంప్యూటర్'.. యాంటీకిథెరా గుట్టు విప్పుతున్నారా?
- ఆంధ్రప్రదేశ్: అధికార పార్టీ నేతలపై ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- డిజిటల్ ఫోటో ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో మీ ఫోటోల సీక్రెట్ డేటా తెలిసిపోతుందని మీకు తెలుసా?
- చేతన్ సకారియా: టెంపో డ్రైవర్ కుమారుడు ఇండియన్ క్రికెట్ టీమ్ దాకా ఎలా వచ్చాడు?
- జార్జ్ ఫ్లాయిడ్ హంతకునికి 22 ఏళ్ల జైలు శిక్ష
- బ్రెజిల్ అధ్యక్షుడే బంగారం స్మగ్లర్లకు సహకరిస్తున్నారా? అమెజాన్ అడవుల్లో గోల్డ్ మైనర్లు ఎందుకు రెచ్చిపోతున్నారు?
- ఫోన్ చూస్తూ నడుస్తుంటే తల పైకెత్తమని హెచ్చరించే యాప్
- కరోనా వ్యాక్సీన్ వేసుకుంటే పత్యం చేయాలా... డాక్టర్లు, ప్రభుత్వాలు చెప్పని మాట యాడ్స్‌లో ఎందుకొచ్చింది?
- 'ఇరాన్ మా పర్షియన్ జర్నలిస్టులను వేధిస్తోంది' అంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన బీబీసీ
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








