'ఇరాన్ మా పర్షియన్ జర్నలిస్టులను వేధిస్తోంది' అంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన బీబీసీ

ఇరాన్ తమ పర్షియన్ సిబ్బందిని వేధిస్తోందంటూ బీబీసీ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. లండన్‌లోని తమ సిబ్బందిని కిడ్నాప్ చేసి ఇరాన్‌కు తీసుకెళ్తామని ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు బెదిరించారని తెలిపింది.
తమ భద్రత గురించి ఆందోళన చెందుతూ బీబీసీ ఐరాసకు ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కాదు.
కాగా, బీబీసీ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తమ ప్రభుత్వాన్ని కూలదోసే దిశగా ప్రజలను ప్రోత్సహిస్తూ, తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని ఆరోపించింది.
ఈ సమస్యపై ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌సీఆర్) తక్షణమే చర్యలు తీసుకోవాలని బీబీసీ తరపు న్యాయవాదులు కోరారు.
సుమారు 1.8 కోట్ల ఇరానియన్లు అంటే ఇరాన్ జనాభాలో నాలుగో వంతు ప్రజలు ఆన్‌లైన్, రేడియో లేదా టీవీ మాధ్యమాల్లో బీబీసీ పర్షియన్ వార్తలు ఫాలో అవుతారని అంచనా.
అయితే, పార్శీ భాష సర్వీసును ఇరాన్‌లో రద్దు చేశారు. బీబీసీతో సంబంధాలున్నాయంటూ గతంలో కొందరిని ఇరాన్ అధికారులు నిర్బంధించారు.
2020 మార్చిలో చేసిన అంతర్గత సర్వేలో 102 మంది బీబీసీ పర్షియన్ సిబ్బందిలో 71 మంది తాము వేధింపులకు గురైనట్లు తెలిపారు.
వీరిలో కొందరి తల్లిదండ్రులకు కూడా ఇరాన్ అధికారుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయని చెప్పారు.
సగానికి పైగా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
గురువారం యూఎన్‌హెచ్‌సీఆర్ సమావేశంతో పాటుగా, బీబీసీ కూడా మరో సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించింది. బీబీసీ పర్షియన్ జర్నలిస్టులు, ఇతర పార్శీ భాష మీడియాపై ఇరాన్ ప్రభుత్వ వేధింపులు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సమావేశంలో బీబీసీ పర్షియన్ రిపోర్టర్ కస్రా నాజీ మాట్లాడుతూ, తన కుటుంబం, తోటి ఉద్యోగులు కూడా బెదిరింపులు, సైబర్ బుల్లీయింగ్ ఎదుర్కొన్నట్లు తెలిపారు.
2020 క్రిస్మస్ సమయంలో ఆరుగురు ఉద్యోగుల కుటుంబాలను ఇరాన్ ఇంటెలిజెంట్ ఏజెంట్లు పిలిచి ప్రశ్నించారని, లండన్‌లో ఉన్న వారి బంధువులకు ప్రాణాపాయం తప్పదని బెదిరించారని నాజీ తెలిపారు.
ప్రతీ ఇంటరాగేషన్‌లోనూ అధికారులు రుహొల్లా జమ్ ప్రస్తావన తీసుకొచ్చేవారని వారంతా చెప్పారు.
రుహోల్లా జమ్ పారిస్‌లోని ప్రతిపక్ష జర్నలిస్ట్. ఆయను 2019లో బాగ్దాద్ వెళ్లేలా ప్రేరేపించి, అక్కడకు చేరుకోగానే అపహరించి ఇరాన్‌కు ఎత్తుకుపోయారు. తన రాతలతో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ రుహొల్లాను గత ఏడాది ఉరితీశారు.
"ఆ అధికారులు ఏ జంకూ లేకుండా మాకు తమ ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం చాలా షాకింగ్‌గా అనిపించింది. వాళ్లు ఏ కొంచెం కూడా భయం లేకుండా స్వేచ్ఛగా ప్రభుత్వం తరపున వ్యవహరిస్తున్నారు.
ఇది మాకు, మా కుటుంబాలకు జీవన్మరణ సమస్య. మేం ఎదుర్కొంటున్న ఈ సమస్యపై దృష్టి పెట్టి మాకు సహాయం చేయమని కోరుతున్నాం" అని నాజీ అన్నారు.
ఇరాన్‌లో 2009 అధ్యక్ష ఎన్నికల తరువాత తమ పర్షియన్ సిబ్బందిపై వేధింపులు మొదలయ్యాయని బీబీసీ తెలిపింది.
ఆ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ లక్షలమంది ఇరానియన్లు రోడ్లపైకి వచ్చారు. దానివలన ఆ దేశంలో కొన్ని నెలలపాటు అశాంతి నెలకొంది. పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, బీబీసీతో సహా అంతర్జాతీయ మీడియా ఈ గొడవలకు కారణమని ఇరాన్ అధికారులు ఆరోపించారు.
అప్పటినుంచి బీబీసీ పర్షియన్ సిబ్బంది వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల సంవత్సరాలలో ఈ వేధింపులు ఎక్కువయ్యాయని, కొన్నిసార్లు బ్రిటన్ పోలీసు సహాయం తీసుకోవాల్సి వచ్చిందని బీబీసీ సిబ్బంది తెలిపారు.
ఒకసారి ఒక మహిళా రిపోర్టర్‌కు స్కైప్‌లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఉద్యోగం వదిలేయమని, లేదా తన తోటి ఉద్యోగులపై నిఘా పెట్టమని బెదిరించారు. అలా చేస్తేనే, ఇరాన్‌లో అరెస్ట్ చేసిన తన సోదరిని విడిచిపెడతామని బెదిరించారు.
2017లో బీబీసీ పర్షియన్ సిబ్బంది ఆస్తులన్ని జప్తు చేయాలని ఇరాన్ న్యాయవ్యవస్థ ఆదేశించింది.
తరువాత 2018లో "జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ" 152 మంది సిబ్బందిపై నేర విచారణ జరపాలని ఆదేశించింది. వీరిలో బీబీసీ మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు.
అదే ఏడాది తొలిసారిగా బీబీసీ, ఐరాసాకు ఫిర్యాదు చేసింది.
2019 మార్చిలో ఐరాసా నిపుణుల బృందం, ఇరాన్ ప్రవర్తనను ఖండిస్తూ అంతర్జాతీయ చట్టాన్ని అతిక్రమిస్తున్నారని, అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నారని మందలించింది.
ఇవి కూడా చదవండి:
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- అఫ్గానిస్తాన్ నుంచి ప్రాణభయంతో పారిపోవడం నుంచి ఒలింపిక్స్‌లో కరాటే పోటీల్లో పాల్గొనే దాకా...
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- ఇరాన్ ఎన్నికలు: ఇబ్రహీం రైసీ ఎన్నిక ప్రమాదకరమని హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- శత్రువు తమపై ప్రయోగించిన మిసైళ్ల శకలాలతోనే రాకెట్లు తయారుచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ కథ
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








