సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?

ఫొటో సోర్స్, SAMANTHA HUIQI YOW
- రచయిత, సమంత హ్యూకి యౌ
- హోదా, బీబీసీ ట్రావెల్
ఈశాన్య సింగపూర్ నుంచి రద్దీగా ఉన్న మార్గాన్ని దాటుకుంటూ, మెలికలు తిరుగుతూ ఉండే 300 మీటర్ల దూరం మట్టి రోడ్డు పై ప్రయాణిస్తే, గతకాలపు జ్ఞాపకం ఒకటి కనిపిస్తుంది..
అక్కడ 3 ఎకరాల విస్తీర్ణంలో ఒక పల్లెటూరు కనిపిస్తుంది. అది సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం. దాని పేరు కాంపొంగ్ లోరాంగ్ బ్యుయంగ్‌కోక్. ఇక్కడ 1960ల నాటి అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి.
ఇక్కడ పాత కాలం పోస్టు కార్డు మీద ఉండే బొమ్మల మాదిరిగా అక్కడక్కడా పేర్చినట్లుగా ఉన్న ఇళ్లు దర్శనమిస్తాయి. మలయా భాషలో కాంపొంగ్ అంటే గ్రామం అని అర్ధం.
ఈ గ్రామంలోని ఒక మసీదు చుట్టూ నివాసాలు కనిపిస్తాయి. చెక్క గోడలు, రేకుల పైకప్పులతో దాదాపు 25 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. స్థానికంగా లభించే కెటాపాంగ్ ఇక్కడ విస్తారంగా పెరుగుతుంది.
ఇక్కడ కనిపించే ఇంటి ముందు కూర్చుని సేద తీరే వృద్ధులు, స్వేచ్ఛగా సంచరించే కోళ్లు, పక్షుల కిలకిలా రావాలు, కోళ్ల అరుపులు లాంటి ఆహ్లాదకరమైన సంగీతం నగరాల్లో వినిపించే రణగొణ ధ్వనుల నుంచి బయట పడేస్తుంది.
సింగపూర్ అనగానే, మెరీనా బే సాండ్స్ టవర్స్, ఆకాశ హర్మ్యాలు, రంగురంగుల పూదోటలు మనసులో మెదులుతాయి.
కానీ, 1970ల వరకు సింగపూర్‌లో ఎక్కడ పడితే అక్కడ గ్రామాలు ఉండేవి. ఈ దీవిలో సుమారు 220 గ్రామాలు ఉండేవని, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.
సింగపూర్ చుట్టు పక్కల దీవుల్లో నేటికీ కొన్ని గ్రామాలు ఉన్నప్పటికీ, ముఖ్య భూభాగంపై మాత్రం మిగిలిన గ్రామం మాత్రం బ్యుయంగ్‌కోక్ ఒక్కటే.
1980ల వరకు వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న సింగపూర్ ఆ తర్వాత పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థగా మారిపోయింది. దీంతో, ఎక్కడ పడితే అక్కడ ఆకాశహర్మ్యాలు వెలిశాయి.
చిన్న చిన్న రోడ్లన్నీ మల్టీ లైన్ హైవేలుగా మారిపోయాయి. భూమి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో, గ్రామాలు కూడా నెమ్మదిగా అంతరించాయి.
ఈ గ్రామాలను నిర్మూలించే ప్రక్రియలో దేశీయ వృక్ష జాతులు కూడా నాశనమయ్యాయి. మట్టి రోడ్లను చదును చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాల్లో భాగంగా ప్రజల జీవన స్థితిగతులు కూడా తారుమారయ్యాయి.
కొంత మంది గ్రామస్థులు మాత్రం తమ విలువైన భూములు అభివృద్ధి కోసం ఇవ్వడానికి నిరాకరించగా, మరి కొంత మంది మాత్రం నిరంతరం వచ్చే నీటి సదుపాయం కోసం, ఆధునిక టాయిలెట్ల కోసం తమ గ్రామాలను ఇవ్వడానికి సన్నద్ధమయ్యారు.
వారి పాత ఇళ్ల స్థానంలో ప్రభుత్వం నిర్మించిన ఫ్లాట్‌లు వెలిశాయి. నేడు 80 శాతం సింగపూర్ ప్రజలు ఈ భవనాల్లోనే నిర్మిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆత్మలోపించింది
గ్రామీణ ప్రాంతాల నిర్మూలనతో నగర దేశంగా ప్రఖ్యాతి పొందిన సింగపూర్‌లో పల్లె ఆత్మ కనుమరుగైంది.
ఒకప్పుడు గ్రామాల్లో ప్రజలు వాళ్ళ ఇళ్ల తలుపులకు తాళాలు కూడా వేసుకునేవారు కాదు. ఇరుగు పొరుగు మధ్యా వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం చాలా సాధారణంగా జరిగిపోతూ ఉండేది.
అయితే, ప్రభుత్వం ఇదే విధమైన సాంఘిక జీవనాన్ని అపార్టుమెంటు బ్లాక్‌లలో కూడా సృష్టించాలని ప్రయత్నం చేసింది.
నగరాల్లో గ్రామీణ ప్రాంతాన్ని తలపించే లాంటి భవన సముదాయాలు నిర్మించేందుకు 2017లో సింగపూర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇందులో ఇరుగుపొరుగు మధ్య సుహృద్భావం పెంపొందించేందుకు హై టెక్ మోషన్ సెన్సార్లు, వైఫై ను కూడా వాడుతున్నారు.
"అపార్ట్‌మెంట్లలో కూడా ఇరుగు పొరుగు మధ్య స్నేహ వాతావరణాన్ని నెలకొల్పడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం’’ అని అప్పటి సింగపూర్ జాతీయ అభివృద్ధి మంత్రి లారెన్స్ వాంగ్ చెప్పారు.
ఈ స్నేహ భావాలు పెంపొందించేందుకు సామూహిక జీవనం ఒక్కటే సరిపోదు, చుట్టుపక్కల నెలకొన్న వాతావరణం కూడా పాత్ర పోషిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
లోరాంగ్ బ్యుయంగ్ కోక్ చుట్టు పక్కలనున్న ప్రాంతం వ్యాపారాభివృద్ధికి, పారిశ్రామికీకరణకు, గృహ సమూహాల అభివృద్ధికి అనువుగా ఉండక పోవడంతో దాని అస్తిత్వానికి భంగం కలగలేదు. కానీ, ఈ గ్రామం కూడా నెమ్మదిగా మారుతోంది.
ఒక్కప్పుడు దట్టమైన అడవులు, పంట భూములతో చుట్టుకుని ఉన్న గ్రామం ఇప్పుడు ప్రైవేటు గేటెడ్ కమ్యూనిటీ గృహాలతో, చిన్న చిన్న ఫ్లాట్‌లతో నిండిపోయింది.
నేనొకసారి ఈ గ్రామానికి యజమానిగా ఉన్న 70 సంవత్సరాల మహిళ సీన్గ్ ముయి హాంగ్‌ను కలిశాను. ఆమె ఆ గ్రామాన్ని పరిరక్షించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.
ఆమె జీవితమంతా ఈ గ్రామంలోనే గడిపారు. నలుగురు తోబుట్టువుల్లో ఆమె అందరికంటే చిన్నవారు. ఆమె తండ్రి చైనా మందులు అమ్మేవారు. ఆయన ఈ భూమిని 1956లో కొన్నారు. అదే సంవత్సరంలో, అంటే సింగపూర్‌కు స్వతంత్రం రావడానికి 9 సంవత్సరాల ముందు ఆయన ఆ గ్రామాన్ని నిర్మించారు.
ఇక్కడకు దగ్గరగా ఉన్న ఒక ఆసుపత్రిలో పని చేసే సిబ్బందికి, రబ్బర్ తోటల పెంపకం కోసం ఇక్కడ చాలా భూములను లీజుకు ఇచ్చారని స్థానిక టూరిస్ట్ గైడ్ క్యాంతయాప్ చెప్పారు. ప్రస్తుతం వాళ్ళ అనువంశీకులు ఇక్కడ ఉన్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, Alamy
కొత్తవారు రాలేదు
ఒకప్పుడు ఇక్కడ ఇంటి అద్దె నెలకు 4. 50 - 30 సింగపూర్ డాలర్లు (సుమారు 250 - 1657 రూపాయిలు) ఉండేది. కానీ, సీన్గ్ మాత్రం ఇప్పటికీ అక్కడున్న 25 కుటుంబాల నుంచీ అటూ ఇటుగా అదే మొత్తంలో అద్దె వసూలు చేస్తున్నారు.
దీనికి విరుద్ధంగా, గ్రామం పక్కనే ఉండే ప్రభుత్వ బ్లాకులో మాత్రం గ్రామంలో ఉన్న ఇంటి విస్తీర్ణంలో 10వ వంతు ఉండే చిన్న గదికి 20 రెట్లు పైగా అద్దె చెల్లించాల్సి వస్తోంది. గ్రామాన్ని నగరంతో విభజించే కాలువ దగ్గర నిర్మించిన ఇళ్ల ఖరీదు కొన్ని కోట్ల సింగపూర్ డాలర్ల ఖరీదు చేస్తాయి.
ఇక్కడ ఇంటద్దె ఖర్చులు భరించగలిగే రీతిలో ఉన్నప్పటికీ కూడా, 1990ల తర్వాత ఇక్కడ నివసించడానికి ఎవరూ కొత్తవారు రాలేదు.
భవిష్యత్తులో కూడా ఎవరైనా వస్తారనే ఆశ కూడా లేదు.
అయితే, ఈ గ్రామానికి వచ్చి ఉండాలనుకునే వారికి ఆ గ్రామంతో నివసించిన వారితో గతంలో కానీ, ప్రస్తుతం కానీ, ఏదైనా సంబంధం ఉండి తీరాలనే నియమం ఉందని యాప్ చెప్పారు.
సింగపూర్‌లో లాక్ డౌన్ సడలించినప్పటి నుంచీ, ఈ ప్రాంతానికి వారాంతంలో వచ్చే వారి సంఖ్య పెరిగిందని యాప్ చెప్పారు.
"ప్రయాణ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో ఈ ప్రాంతం పై ఆసక్తి చూపడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు" అని అన్నారు. ఇక్కడ గ్రామీణ వాతావరణంలో కొంత సేపు గడిపి, ఫోటోలు తీసుకుని వెళుతూ ఉంటారని చెప్పారు.
ప్రపంచంలోనే అధికంగా నగర జీవనం, దట్టమైన జనాభా సాంద్రత ఉన్న దేశంలో ఈ ప్రాంతం ఒక ఆకుపచ్చని దీవి లాంటిది.
సీన్గ్‌కు మాత్రం ఈ భూమితో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఆమె చిన్నప్పుడు తండ్రి భూమిని చూసుకుంటుంటే, ఆమె ఆయనను అనుసరిస్తుండేవారు. ఆయన నుంచే ఆమె సంప్రదాయ చైనా వైద్యాన్ని నేర్చుకున్నారు. ఉదాహరణకు ఇక్కడ గోరింటాకు ముద్దను కాలిన గాయాలకు పూస్తారు. పేగుల్లో వచ్చే అల్సర్‌కు కూడా దీనిని వాడుతారని చెబుతారు.
సీన్గ్ నివసిస్తున్న భూమికి చాలా డిమాండు ఉందని ఆమెకు తెలుసు. ఆ గ్రామాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న భవన నిర్మాణ డెవలపర్లకు కూడా కొరత లేదు. కానీ, ప్రాణం ఉన్నంత వరకూ ఈ స్థలాన్ని అమ్మకుండా చూడాలని ఆమె పట్టుదలతో ఉన్నారు.

ఫొటో సోర్స్, SAMANTHA HYUQI YOW
2014లో ఈ గ్రామాన్ని నిర్మూలించి ఒక హైవే, రెండు పాఠశాలలు, ఒక పబ్లిక్ పార్కు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ, జాతీయ అభివృద్ధి మంత్రి డెస్మండ్ లీ మాత్రం ఇప్పట్లో ఈ ప్రతిపాదనలను అమలు చేసే ఆలోచన లేదని చెప్పారు.
ఈ ప్రతిపాదనలకు చాలా మంది సింగపూర్ పౌరులు అభ్యంతరం తెలిపారు. ఈ గ్రామాన్ని యునెస్కో సాంస్కృతిక ప్రదేశాల్లో ఒకదానిగా చేర్చాలని కొంత మంది కోరుతున్నారు.
ఒకప్పుడు సింగపూర్ ప్రభుత్వం గ్రామాలను పురోగతి లేని ప్రదేశాలుగా చూసినప్పటికీ, ప్రస్తుతం ఈ గ్రామీణ అవశేషాలు, సంస్కృతి పట్ల కొత్తగా అభిమానాన్ని కురిపిస్తున్నారు.
"ఈ గ్రామాన్ని విద్యార్థుల అవుట్ డోర్ కార్యకలాపాలకు, లేదా భవిష్యత్తులో ఆట స్థలాలకు గాని, పార్కులకు గానీ కేటాయించి ఉంచవచ్చు" అని మాజీ రాజకీయ నాయకుడు, సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పాలసీ అండ్ లీడర్ షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇంతాన్ మోక్తర్ చెప్పారు.
"ఇక్కడ ఉండే ప్రజలు వారి జీవితాల్లో సగానికి పైగా ఇక్కడే గడిపారు. ఇక్కడ వీరంతా ఒకరినొకరు తమ సొంత కుటుంబంలానే చూస్తారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
ప్రభుత్వ హామీ
ఈ గ్రామం గురించి జాగ్రత్తగా ఆలోచిస్తామని సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అయితే ఉంది. "ఆ ప్రాంతం కోసం మా ప్రణాళికలు తుదిరూపానికి వచ్చేటప్పటికి, అక్కడ అభివృద్ధి సమన్వయంతో జరగడానికి ప్రభుత్వం సంబంధిత వర్గాల వారితో కలిసి పని చేయాలి" అని లీ అన్నారు.
ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలతో సన్నిహితంగా మెలిగి వారి అవసరాలు, ఆసక్తులను అర్ధం చేసుకుని ప్రవర్తించాల్సి ఉంటుందని చెప్పారు.
"ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాల ప్రాముఖ్యాన్ని గుర్తించడం మంచి విషయం" అని స్థానికుడు నసీం అన్నారు. "ఈ దేశం ఎలా ఏర్పడిందో భావితరాలకు చెప్పడానికి కొంత భాగాన్ని వదిలిపెట్టాలి. మేమీ పూరిళ్ల నుంచే వచ్చాం ఒకప్పుడు ఎవరినీ దరిదాపులకు కూడా రానీయని సీన్గ్ ఇప్పుడు బయట వారిని ఊరిలోకి అడుగుపెట్టనివ్వడం కూడా మంచి విషయమే. దాని వల్ల వారు మమ్మల్ని, మేము వాళ్ళను అర్ధం చేసుకుని, లోరాంగ్ బ్యుయంగ్‌కోక్ ను పరిరక్షించాల్సిన అవసరాన్ని అర్ధం చేసుకునే వీలు కలుగుతుంది’’ అన్నారాయన.
సింగపూర్‌లో భూమి చాలా విలువైన వస్తువు
పురాతన సంపదను పరిరక్షించే వారు, ఆధునిక నిర్మాణాలు చేపట్టాలనుకునే వారి మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
అయితే, లోరాంగ్ బ్యుయంగ్‌కోక్ భవిష్యత్తు అనిశ్చితిలోనే ఉన్నప్పటికీ , దానిని పరిరక్షించడం మాత్రం దేశ పునాదులను, సంస్కృతిని, వారసత్వ సంపదను భావితరాల కోసం జాగ్రత్తగా భద్రపరచడమే అవుతుంది. ఇది సింగపూర్ లాంటి యువ దేశాలకు కూడా అవసరమే.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








